
శరవేగంగా కరిగిపోతున్న వైనం
తక్షణం మేలుకోకుంటే ముప్పే
వాతావరణంలో తీవ్ర మార్పులు
వరదలు, కరువులు, నీటి కొరత
8.2 లక్షల కోట్ల టన్నులు!
ఇదేమిటో తెలుసా? కేవలం గత 50 ఏళ్లలో భూమిపై ఉన్న గ్లేసియర్లన్నింట్లో కలిపి కరిగిపోయిన మంచు పరిమాణం! నమ్మశక్యంగా లేకున్నా నిజమిది. పర్యావరణంతో మనిషి చెలగాటం తాలూకు విపరిణామమిది. పారిశ్రామికీకరణకు గ్లోబల్ వార్మింగ్ తదితరాలు తోడై గ్లేసియర్ల ఉసురు తీస్తున్నాయి. ఏటా రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు భూమ్మీద మంచు నిల్వలు శరవేగంగా కరిగి నీరైపోతున్నాయి.
ఫలితంగా 1976 నుంచి 8,200 గిగా టన్నుల మంచు మాయమైపోయినట్టు కోపర్నికస్ వాతావరణ సేవల విభాగం (సీ3ఎస్) తేల్చింది. ‘‘కేవలం 2000 నుంచి 2023 మధ్యే ఏకంగా 6,000 గిగాటన్నులు ఆవిరైపోయింది. 2010 నుంచి ఈ ధోరణి మరీ వేగం పుంజుకుంది. ఏటా 370 గిగాటన్నుల చొప్పున మంచు కరిగిపోతోంది’’ అని వివరించింది.
శనివారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా సీ3ఎస్ ఈ గణాంకాలను వెల్లడించింది. ఆర్కిటిక్ నుంచి హిమాలయాల దాకా ప్రపంచవ్యాప్తంగా గ్లేసియర్ల ఉనికి నానాటికీ ప్రశ్నార్థకంగా మారుతోందని హెచ్చరించింది. అందుకే ఈ ఏడాది గ్లేసియర్ల పరిరక్షణపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ఐరాస కూడా పిలుపునిచ్చింది.
అన్నిచోట్లా..
గత 50 ఏళ్లలో గ్లేసియర్లు అతి ప్రమాదకర వేగంతో చిక్కిపోతున్న ప్రాంతాల్లో పశ్చిమ కెనడా, అమెరికా, మధ్య యూరప్ టాప్‌లో ఉన్నాయి. నైరుతీ ఆసియాతో పాటు రష్యా, కెనడాల పరిధిలోని ఆర్కిటిక్ ప్రాంతంలో ఈ వేగం కాస్త తక్కువగా, అంటార్కిటికాలో ఇంకా తక్కువగా ఉంది.
భారత్‌లోనూ ఆందోళనే
భారత్ ఏకంగా 9,000 పైచిలుకు గ్లేసియర్లకు నిలయం. భారత్‌కే గాక పాకిస్తాన్ తదితర పరిసర దేశాలకు కూడా ప్రాణాధారమైన గంగ, బ్రహ్మపుత్ర, సింధు వంటి ప్రధాన జీవనదీ వ్యవస్థలకు ఈ గ్లేసియర్లే జన్మస్థానాలు. దక్షిణాసియాలో 60 కోట్ల మంది ప్రజలకు ఇవి జీవనాధారం. గ్లేసియర్ల కరుగుదలతో ఈ కీలక నదీ వ్యవస్థల భవితవ్యం నానాటికీ ప్రమాదంలో పడుతోంది. కోటా షిగ్రీ గ్లేసియర్ గత 50 ఏళ్లలో సగానికి పైగా చిక్కిపోయింది.
గ్లోబల్ వార్మింగ్ తదితర విపత్తులు ఇలాగే కొనసాగితే 2100 నాటికి సగానికి పైగా హిమాలయ గ్లేసియర్లు మాయమైపోతాయని పలు అధ్యయనాలు ఇప్పటికే హెచ్చరించాయి. హిమాలయాల్లోని కనీసం 10 హెక్టార్ల కంటే పెద్దవైన 2,431 గ్లేసియర్ సరస్సుల పరిమాణం 1984 నుంచి 2023 దాకా నానాటికీ పెరుగుతూ వస్తున్నట్టు ఇస్రో ఉపగ్రహాలు తేల్చాయి.
వీటిలో 676 సరస్సుల సైజు రెట్టింపునకు పైగా పెరిగినట్టు తేలడం గ్లేసియర్ల కరుగుదల వేగానికి అద్దం పడుతోంది. ఈ పరిణామం ఆకస్మిక వరదల ముప్పును కూడా నానాటికీ పెంచుతోంది. అంతేగాక దీనివల్ల దీర్ఘకాలంలో మంచినీటి లభ్యత పూర్తిగా తగ్గిపోతుంది. వీటిలో 130కి పైగా సరస్సులు భారత్‌లోనే గంగ, సింధు, బ్రహ్మపుత్ర బేసిన్ల పరిధిలో ఉన్నాయి.
⇒ హిమాచల్‌ప్రదేశ్‌లో 4,068 మీటర్ల ఎత్తులో ఉన్న గెపాంగ్ ఘాట్ గ్లేసియల్ సరస్సు గత 30 ఏళ్లలో మూడు రెట్లకు పైగా పెరిగి 36 హెక్టార్ల నుంచి 101 హెక్టార్లకు చేరింది. ఇప్పుడు కూడా ఏటా 2 హెక్టార్ల చొప్పున విస్తరిస్తోంది.
⇒ ప్రపంచంలో రెండో అతి పెద్ద ధ్రువేతర గ్లేసియర్ అయిన సియాచిన్ కూడా కుంచించుకుపోతున్నట్టు పలు అధ్యయనాలు తేల్చాయి.
గ్లేసియర్లు కరగడం వల్ల...
⇒ పరిసర ప్రాంతాలకు నిత్యం ముంపు భయం పొంచి ఉంటుంది.
⇒ సముద్రమట్టం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది.
⇒ దీనివల్ల తీర ప్రాంత మహానగరాలన్నీ నీటమునుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 250 కోట్ల మందికి పైగా నిర్వాసితులవుతారు.
⇒ సముద్ర జలాల సంతులనం పూర్తిగా కట్టు తప్పుతోంది.
⇒ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను కాపాడే కీలక సముద్ర ప్రవాహాలు నెమ్మదిస్తున్నాయి. ఇది వాతావరణంలో తీవ్ర హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. ఫలితంగా ఆకస్మిక వరదలు, కరువు కాటకాలు పరిపాటిగా మారతాయి.
⇒ మంచు నిల్వలు 200 కోట్ల మందికి తాగునీటికి ఆధారంగా నిలుస్తున్నాయి. వాటినుంచి జాలువారే నీటి వనరులు పెద్ద నదులుగా మారి ప్రజల తాగు, సాగుతో పాటు రవాణా తదితర అవసరాలను సుష్టుగా తీరుస్తూ వస్తున్నాయి. అలాంటి కీలక నీటి వనరులు ప్రమాదకర వేగంతో కుంచించుకుపోతుండటంతో కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా నీటి కొరత నానాటికీ పెరిగిపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment