Ice Sheet
-
Viral Video: ప్రమాద ఘంటికలు.. అంటార్కిటికాలో విరిగిపడ్డ హిమానీనదం
గ్లోబల్ వార్మింగ్ తాలూకు ప్రమాద ఘంటికలు నానాటికీ తీవ్రస్థాయికి పెరుగుతున్నాయి. మంచు ఖండం అంటార్కిటికాలో వేడి దెబ్బకు విలియం అనే భారీ హిమానీ నదం వేలాది ముక్కలుగా విడిపోయింది. దాంతో మొత్తంగా 10 ఫుట్‌బాల్ మైదానాలంత పరిమాణంలో మంచు పలకలు విరిగిపడ్డాయి. ఆ ధాటికి సముద్రపు లోతుల్లో ఏకంగా సునామీ చెలరేగిందట! ఆ సమయంలో యాదృచ్ఛికంగా అక్కడున్న బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే నౌక ఆర్ఆర్ఎస్ జేమ్స్ క్లార్క్ రాస్కు చెందిన పరిశోధకులు దీన్ని కళ్లారా చూసి వీడియో తీశారు. అదిప్పుడు వైరల్‌గా మారింది. ఈ హిమానీ నదం ముందుభాగం సముద్ర మట్టానికి ఏకంగా 40 మీటర్ల ఎత్తుంటుంది. అది విసురుగా విడిపోవడంతో 78 వేల చదరపు మీటర్ల పరిమాణంలో మంచు సముద్రంలోకి చెల్లాచెదురుగా కొట్టుకుపోయింది. ఆ దెబ్బకు సముద్రంలో లోలోతుల దాకా నీరు గోరువెచ్చగా మారిపోయిందట. అప్పటిదాకా 50 నుంచి 100 మీటర్ల లోతు దాకా చల్లని నీరు, ఆ దిగువన గోరువెచ్చని నీటి పొర ఉండేదట. ‘‘హిమానీ నదాలు ఇలా విరిగిపడటం వల్ల సముద్రపు ఉపరితలాల్లో పెను అలలు రావడం పరిపాటి. కానీ అవి అంతర్గత సునామీకీ దారి తీయడం ఆసక్తికరం. ఇలాంటి సునామీలు సముద్ర ఉష్ణోగ్రతలు, అందులోని జీవ వ్యవస్థ తదితరాలపై పెను ప్రభావం చూపుతాయి. లోతుగా పరిశోధన జరగాల్సిన అంశమిది’’ అని సైంటిస్టులు చెప్పుకొచ్చారు. ఈ పరిశోధన ఫలితాలను జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించారు. కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా హిమానీ నదాలు శరవేగంగా చిక్కిపోతున్న వైనం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. -
హిమ ఫలకం కింద నగరమంత సరస్సు
ప్రపంచంలోనే అతి పెద్ద ఐస్ షీట్ అని రికార్డు ఉండగానే మరో రికార్డును తూర్పు అంటార్కిటికా హిమ ఫలకం సొంతం చేసుకుంది. దీని కింద ఓ నగరమంత వైశాల్యంలో ఓ పెద్ద సరస్సు ఉందని తేలింది. హిమ ఫలకం మీద దాదాపు మూడేళ్లు ఏరియల్ సర్వే చేసిన చైనా శాస్త్రవేత్తలు.. దీనికి దాదాపు 3.2 కిలోమీటర్ల కింద సరస్సు ఉన్నట్టు గుర్తించారు. ఈ సరస్సుకు ‘స్నో ఈగల్’అని పేరు పెట్టారు. దీని వైశాల్యం 370 చదరపు కిలోమీటర్లు, పొడవు 48 కిలోమీటర్లు, వెడల్పు 14.5 కిలోమీటర్లు, లోతు 198 మీటర్లు. ఈ సరస్సులో 3.4 కోట్ల ఏళ్ల నాటి నది అవక్షేపాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదే గనక తెలిస్తే అంటార్కిటికా మంచుమయం కాకముందు ఎలా ఉండేదో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలకు వీలుకానుంది. చదవండి👉చేపా చేపా.. వాకింగ్‌కు వస్తావా?