Pithoragarh
-
జైలు గోడ దూకి నేపాలీ యువతి పరార్..!.. ఆచూకీ చెబితే..
ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్ జిల్లా జైలులో ఎన్డీపీఎస్ యాక్ట్ సంబంధిత ఆరోపణలతో బందీగా ఉంటున్న నేపాలీ యువతి జైలు గోడ దూకి పారిపోయింది. దుస్తులతో తాడు తయారు చేసుకుని, దాని సాయంతో ఆ యువతి గోడ దూకి పారిపోయిందని పోలీసులు చెబుతున్నారు. ఆమెను పట్టుకునేందుకు 12 పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఆమె నేపాల్ పారిపోయే అవకాశం ఉన్నందున సహస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ)సాయంతో పోలీసులు నేపాల్ సరిహద్దుల్లో చెకింగ్ కట్టుదిట్టం చేశారు. ఆచూకీ చెబితే రూ. 10 వేలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పిథోర్‌గఢ్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గల సీసీటీవీ ఫుటేజ్‌ల సాయంతో ఆ యువతిని వెదికిపట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ యువతి ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 వేలు అందజేస్తామని తెలిపారు. పరారైన యువతిని పట్టుకునేందుకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. మాదకద్రవ్యం తరలిస్తుండగా.. నేపాల్‌లోని దుమలింగ్ గ్రామానికి చెందిన అనుష్క ఉరఫ్ ఆకృతి(25)ని రెండున్నరేళ్ల క్రితం ధార్చులాలో రెండున్నర కిలోల చరస్ (మాదకద్రవ్యం)తరలిస్తుండగా ఎస్ఎస్బీ పట్టుకుంది. ఆమె విచారణలో ఉన్నందున ఆమెను పిథోర్‌గఢ్ జిల్లా జైలులో బందీగా ఉంచారు. ఆమె పరారైన నేపధ్యంలో జైలుతో పాటు మొత్తం పోలీసు శాఖలో కలకలం చెలరేగింది. దీంతో పోలీసు బృందాలు ఆమె కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం పరారైన యువతి లింక్ రోడ్డు పరిధిలోని సీసీటీవీలో కనిపించింది. అక్కడి నుంచి ఆమె పాండే గ్రామం మీదుగా పరారవుతూ కనిపించింది. ఇది కూడా చదవండి: తెలుగు పోలీసు అధికారికి గుజరాత్లో అరుదైన గౌరవం -
కొండచరియల బీభత్సం చిక్కుకుపోయిన 300 మంది ప్రయాణికులు..!
-
మంత్రి ఫోన్‌కాల్.. గ్యాంగ్‌రేప్‌ను అడ్డుకుంది!
డెహ్రాడూన్: ఓ మంత్రికి చేసిన ఫోన్ కాల్ మహిళపై లైంగిక దాడిని అడ్డుకుంది. ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రకాశ్ పంత్ సత్వరమే స్పందించి ఓ మహిళను గ్యాంగ్ రేప్ నుంచి తప్పించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. సోమవారం ఆర్టీఐ కేసు విచారణ నిమిత్తం ఓ జంట( భార్యభర్తలు) ఆదివారం రాత్రి డెహ్రాడూన్ లోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసుకి వచ్చింది. రాత్రి ఇక్కడే ఉండిపొమ్మని డైరెక్టరేట్ ఆఫీసు ఉద్యోగులు వారికి చెప్పారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆ దంపతులు డిన్నర్ చేసి నిద్ర పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆఫీసు స్టాఫ్ కాల్ చేయగానే మరో ఇద్దరు అక్కడికి వచ్చారు. ఆపై నలుగురు కలిసి వివాహితతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆపై గ్యాంగ్ రేప్ చేసేందుకు యత్నించారు. వివాహిత ప్రతిఘటించడంతో దంపతులిద్దరిపై నిందితులు బౌతిక దాడికి పాల్పడ్డారు. మహిళ భర్త వెంటనే ఎమ్మెల్యే, మంత్రి ప్రకాశ్ పంత్‌కు కాల్ చేసి తమను రక్షించాలని కోరాడు. మంత్రి ప్రకాశ్ పంత్ ఎస్ఎస్పీ స్వీటీ అగర్వాల్‌కు కాల్ చేసి మహిళపై దురాగతాన్ని అడ్డుకుని నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. సిబ్బందితో సహా డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసుకి వెళ్లిన అగర్వాల్.. నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వారిపై 354(ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందుతులలో జగ్మోహన్ సింగ్ చౌహాన్, అనిల్ రావత్, హరి సింగ్ పెత్వాల్ లు డైరెక్టరేట్ ఉద్యోగులని, జగదీశ్ సింగ్ అనే వ్యక్తి టీ స్టాల్ నడుపుతంటాడని స్టేషన్ ఆఫీసర్ వివరించారు. బాధితులకు సాయం చేసేందుకు ఫోన్లో తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మంత్రి ప్రకాశ్ పంత్ తెలిపారు. -
మళ్లీ ఉత్తరాఖండ్ లో ప్రకృతి విలయం
కుంభవృష్టి, వరదలతో చమోలి జిల్లా అస్తవ్యస్తం 30 మంది మృతి..రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు నెలవైన ఉత్తరాఖండ్ మళ్లీ ప్రకృతి విలయంతో అల్లాడుతోంది. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతోంది. ఈ బీభత్సం ధాటికి చమోలి జిల్లాలో కనీసం 30 మంది మృత్యువాత పడ్డారు. పరిస్థితి అంతకంతకు చేజారుతుండటంతో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెంటనే స్పందించి జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను రాష్ట్రానికి పంపింది. ఉరుముతున్న అలకనంద నది గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అలకనంద నది ప్రమాదస్థాయిని ధాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ముంపు ముప్పును ఎదుర్కొంటున్నాయి. గడిచిన 24 గంటల్లో 54 మిల్లీమీటర్ల వర్షం కురువడంతో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు. మృతుల కుటుంబాలకు 2లక్షల పరిహారం రాష్ట్రంలోని వరద బీభత్సంపై సమీక్ష నిర్వహించిన సీఎం హరీశ్ రావత్ ఈ విలయంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. పిత్తరగఢ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చిక్కుకుపోయిన ప్రజలను కాపాడేందుకు సహాయక బృందాలను పంపినట్టు ఆయన తెలిపారు. మరోవైపు థాల్-మున్సియారి రోడ్డు వరదల ధాటికి తెగిపోవడంతో ఇరుపక్కల పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. వానలు, వరదల తాకిడికి పెద్ద ఎత్తున పంటపొలాలు ధ్వంసమయ్యాయి. వర్షం ఎంతకూ నిలువకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇంటికి పరిమితమయ్యారు. దీంతో చాలా జిల్లాల్లో ప్రజాజీవితం స్తంభించిపోయింది. -
మన దేశంలోనే... మరో కాశ్మీరం
టూర్‌దర్శన్ - సమ్మర్ స్పెషల్ - పితోరాగఢ్ ఉదయం వేళ హిమగిరుల ధవళకాంతుల ధగధగలు కనువిందు చేస్తాయి. చుట్టూ కనుచూపు మేరలో అంతా విస్తరించుకున్న ఆకుపచ్చదనం ఆనంద పరవశులను చేస్తుంది. ఘనచరిత్రకు సాక్షీభూతంగా నిలిచి ఉన్న కోట... వీర సైనికులకు నివాళిగా వెలసిన తోట... ఎన్నెన్నో గాథలు చెబుతాయి. పరిసర ప్రాంతాల్లో పురాతన దేవాలయాలు, మందిరాలు వాతావరణానికి పవిత్రతను అద్దుతూ ఉంటాయి. ఇలాంటి చాలా వింతలు, విశేషాలు గల ప్రదేశం పితోరాగఢ్. పర్వతశిఖరాల నడుమ వెలసిన ఈ పట్టణం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. వేసవి యాత్రలో విహార, వినోదాలతో పాటు కొంత విజ్ఞానం, కొంత పరమార్థం కూడా కావాలనుకుంటే పితోరాగఢ్‌కు వెళ్లాల్సిందే! హిమాలయాల దిగువన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చందక్, ధ్వజ్, కుమ్దార్, తల్ కేదార్ కొండల నడుమ వెలసిన పట్టణం పితోరాగఢ్. ఉదయం వేళ ఇక్కడి నుంచి చూస్తే హిమాలయాల్లోని పంచ్‌చులి, నందాదేవి, నంద కోట్ శిఖరాలు తెల్లగా తళతళలాడుతూ కనువిందు చేస్తాయి. ఈ మూడు శిఖరాల నడుమనున్న లోయను స్థానికంగా ‘సోర్’లోయ అంటారు. అంటే చల్లని లోయ అని అర్థం. ఈ లోయ పరిసరాలన్నీ కశ్మీర్ లోయను తలపిస్తాయి. అందుకే ఈ లోయలో కాళీనది ఒడ్డున వెలసిన పితోరాగఢ్‌ను ‘మినీ కశ్మీర్’గా అభివర్ణిస్తారు. ట్రెక్కింగ్ చేసే యాత్రికులు ఇక్కడి నుంచి కైలాస పర్వతానికి, మానస సరోవరానికి చేరుకోవచ్చు. అందుకే దీనిని ‘హిమాలయాలకు ప్రవేశమార్గం’గా కూడా అభివర్ణిస్తారు. ఏం చూడాలి? చారిత్రక పట్టణమైన పితోరాగఢ్ రాజపుత్ర వీరుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఏలుబడిలో రాజధానిగా ఉండేది. పద్నాలుగో శతాబ్దంలో ఇదే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పాల్ వంశపు రాజులు మూడు తరాల పాటు పరిపాలించారు. వారి తర్వాత నేపాల్‌కు చెందిన బ్రహ్మ వంశపు రాజులు, చాంద్ వంశపు రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. పాత కోట నాశనమైపోవడంతో చాంద్ వంశపు రాజులు 1790లో ఇక్కడ కొత్తగా కోటను నిర్మించారు. శిథిలావస్థలో ఉన్న ఆ కోటను పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించుకుంటారు. * చాంద్ వంశీకులు ఎక్కువకాలం పరిపాలించిన పితోరాగఢ్‌లో ఇప్పటికీ పలు చిన్నా చితకా కోటలు, పురాతన మందిరాలు సందర్శకులను ఆకర్షిస్తాయి. అప్పటి కోటల్లో ఒకదాంట్లో ప్రస్తుతం ట్రెజరీ, తహశిల్ కార్యాలయాలు పనిచేస్తుండగా, మరో కోటను పడగొట్టి, ఆ స్థలంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను నిర్మించారు. * కశ్మీర్లో మరణించిన వీర సైనికుల జ్ఞాపకార్థం ఇండియన్ ఆర్మీ ఈ పట్టణంలో నిర్మించిన మహారాజా పార్కు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అరుదైన మొక్కలతో, పచ్చని పరిసరాలతో కనువిందు చేస్తుంది. * పితోరాగఢ్‌కు 54 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 5412 అడుగుల ఎత్తున కుమావోన్ హిమాలయాల్లో ఏర్పాటు చేసిన ‘అస్కోట్ అభయారణ్యం’ మరో ప్రత్యేక ఆకర్షణ. మంచు చిరుతలు, హిమాలయన్ నల్ల ఎలుగులు, కస్తూరి మృగాలు, మంచు కాకులు, జింకలు వంటి అరుదైన వన్యప్రాణులను ఇక్కడ చూసి ఆనందించవచ్చు. * పితోర్‌గఢ్‌కు 112 కిలోమీటర్ల దూరంలో ఉన్న చకోరీ హిల్‌స్టేషన్ ట్రెక్కర్లకు స్వర్గధామంలా ఉంటుంది. మంచుకొండలు, కొండల దిగువన తేయాకు తోటలతో కనువిందు చేసే చకోరీ నుంచి మూడు ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి. * వేసవి వినోదంతో పాటు పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించుకోవాలనుకునే పర్యాటకులకు పితోరాగఢ్ చాలా అనువైన ప్రదేశం. ఇక్కడకు చేరువలోనే శైవ క్షేత్రాలైన పాతాళ భువనేశ్వర్, తల్ కేదార్, నకుల సహదేవులు నిర్మించారనే ప్రతీతి గల నకులేశ్వర ఆలయం, పురాతన ధ్వజ ఆలయం, కాళీ మందిరం వంటి పురాతన ఆలయాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. * పితోరాగఢ్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని ఝులాఘాట్ పట్టణం షాపింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ పట్టణంలో కాళీ నదిపై నిర్మించిన వేలాడే కలప వంతెన నేపాల్‌ను కలుపుతుంది. ఈ వంతెన మీదుగా ఇక్కడి ప్రజలు నేపాల్‌కు, నేపాలీలు ఇక్కడకు రాకపోకలు సాగిస్తుంటారు. ఏం కొనాలి? * పితోరాగఢ్‌లో స్థానికంగా తయారయ్యే సంప్రదాయ హస్తకళా వస్తువులు చౌకగా దొరుకుతాయి. * ఇక్కడి బజారులో దొరికే ఉన్ని శాలువలు, కంబళ్లు, స్వెట్టర్లు, మఫ్లర్లు వంటివి కొనుక్కోవచ్చు. * ఉద్యాన ఉత్పత్తులకు పితోరాగఢ్ పెట్టింది పేరు. ఇక్కడ స్థానికంగా పండే నారింజలు, ద్రాక్షలు, యాపిల్స్ రుచికరంగా ఉంటాయి. ఇక్కడ పండే భారీ దోసకాయలు నీటి శాతంలో పుచ్చకాయలను తలపిస్తాయి. ఏం చేయాలి? * సముద్ర మట్టానికి చాలా ఎత్తున ఉండే పితోరాగఢ్ పరిసర ప్రదేశాలన్నీ పర్వతారోహణకు అనువుగా ఉంటాయి. వేసవిలో ట్రెక్కింగ్ ఇక్కడ చాలా బాగుంటుంది. * చరిత్ర, వారసత్వ సంపద గురించి ఆసక్తి గల వారు ఇక్కడి పురాతన కోటలను, ఇతర కట్టడాలను సందర్శించుకోవచ్చు. * తీర్థయాత్రలపై ఆసక్తి గల వారు పితోరాగఢ్ పరిసరాల్లోని ప్రాచీన ఆలయాలను సందర్శించుకోవచ్చు. ఎలా చేరుకోవాలి? ఇతర ప్రాంతాల వారు దేశ రాజధాని ఢిల్లీ లేదా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ వరకు విమాన మార్గంలో లేదా రైలు మార్గంలో చేరుకోవచ్చు. ఢిల్లీ లేదా డెహ్రాడూన్ నుంచి మరో రైలులో హల్ద్వానీ లేదా తనక్‌పూర్ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. హల్ద్వానీ నుంచి, తనక్‌పూర్ నుంచి పితోరాగఢ్ వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులు తరచుగా తిరుగుతూ ఉంటాయి. ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. -
లోయలో పడ్డ వాహనం: 16 మంది మృతి
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్‌గఢ్ సమీపంలోని దొబట్ వద్ద బుధవారం ఉదయం బొలెరో వాహనం అదుపు తప్పి ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఆ ఘటనలో 16 మంది ప్రయాణికులు అక్కికక్కడే మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి ఆరుగురుని రక్షించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. మొత్తం 22 మందితో వెళ్తున్న బొలెరో వాహనం పితోర్‌గఢ్ సమీపంలోని దర్చులా - దొబట్ రహదారిపై వెళ్తు అదుపు తప్పి లోయలో పడిందని పోలీసులు వెల్లడించారు.