112 ఏళ్లకు రైల్వే లైన్‌ సర్వే పూర్తి.. సాకారమైతే చైనా, నేపాల్‌ చెంతకు.. | Pithoragarh: Tanakpur-Bageshwar Rail Line Final Survey Completed | Sakshi
Sakshi News home page

112 ఏళ్లకు రైల్వే లైన్‌ సర్వే పూర్తి.. సాకారమైతే చైనా, నేపాల్‌ చెంతకు..

Published Wed, Nov 27 2024 12:00 PM | Last Updated on Wed, Nov 27 2024 12:07 PM

Pithoragarh: Tanakpur-Bageshwar Rail Line Final Survey Completed

పితోర్‌గఢ్‌(ఉత్తరాఖండ్‌): బ్రిటీష్‌ హయాంలో 112 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఒక రైల్వే లైన్‌ సర్వే ఎట్టకేలకు పూర్తయ్యింది. ఉత్తరాఖండ్‌లోని తనక్‌పూర్-బాగేశ్వర్ రైలు మార్గానికి సంబంధించిన సర్వే పూర్తయింది. ఈ సర్వే ప్రకారం 170 కి.మీ పొడవైన రైలు మార్గాన్ని నిర్మించడానికి రూ.49 వేల కోట్లు ఖర్చుకానుంది. ఈ రైలు మార్గం ఉనికిలోకి వస్తే భారతీయ రైల్వే అటు చైనా  ఇటు నేపాల్ సరిహద్దులను చేరుకోగలుగుతుంది.  

ఉత్తరాఖండ్‌లోని కుమావోన్‌లోని నాలుగు పర్వతప్రాంత జిల్లాలు తనక్‌పూర్-బాగేశ్వర్ రైలు మార్గం కోసం దశాబ్దాలుగా కలలు కంటున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం 1882లో తొలిసారిగా ఈ రైలు మార్గం కోసం రూపకల్పన చేసింది. ఈ రైల్వే లైన్ కోసం మొదటి సర్వే 1912లో జరిగింది. నాటి నుంచి నేటి వరకు మ్తొతం ఏడు సర్వేలు జరిగాయి. రెండేళ్లపాటు సాగిన సర్వేలో తుది నివేదికను స్కై లై ఇంజినీరింగ్ డిజైనింగ్ సంస్థ తాజాగా రైల్వేశాఖకు అందజేసింది.

ఈ తుది సర్వే ప్రకారం తనక్‌పూర్- బాగేశ్వర్ మధ్య రైలు మార్గం ఏర్పడితే మొత్తం 12 రైల్వే స్టేషన్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ స్టేషన్లు 170 కిలోమీటర్ల రైల్వే లైన్  మార్గంలో నిర్మించాల్సి ఉంటుంది.  అలాగే ఈ రైల్వే లైన్ కోసం 452 హెక్టార్ల భూమిని కూడా సేకరించాల్సి ఉంది. దీనిలో 27 హెక్టార్ల భూమి ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఉంది.

తనక్‌పూర్-బాగేశ్వర్ రైలు మార్గాన్ని 2012లో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్ట్‌గా పరిగణించింది. అప్పట్లో ఈ రైల్వే లైన్‌లో 54 కిలోమీటర్ల మేర 72 సొరంగాలను ప్రతిపాదించారు. కాళీ నది ఒడ్డున తనక్‌పూర్ నుండి పంచేశ్వర్ వరకు ఈ రైలు మార్గాన్ని నిర్మించాల్సి ఉంటుంది. అల్మోరా, పితోర్‌గఢ్, చంపావత్ , బాగేశ్వర్ జిల్లాలకు ఈ రైల్వే లైన్ నిర్మాణం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

అంతే కాదు పర్వతప్రాంతాలకు వెళ్లే మార్గం సులభతరం కావడంతో పాటు, పర్యాటక రంగానికి కూడా విపరీతమైన ఆదరణ లభిస్తుంది. చైనా, నేపాల్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న ఈ రైలు మార్గానికి వ్యూహాత్మక ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ మార్గంపై తుది సర్వే నివేదికను అందుకున్న రైల్వే మంత్రిత్వ శాఖ ఈ రైలు మార్గాన్ని ఎప్పుడు నిర్మిస్తుందో వేచి చూడాలి. 

ఇది కూడా చదవండి: ఆకాశానికి నిచ్చెన 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement