Rail line
-
112 ఏళ్లకు రైల్వే లైన్ సర్వే పూర్తి.. సాకారమైతే చైనా, నేపాల్ చెంతకు..
పితోర్‌గఢ్(ఉత్తరాఖండ్): బ్రిటీష్ హయాంలో 112 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఒక రైల్వే లైన్ సర్వే ఎట్టకేలకు పూర్తయ్యింది. ఉత్తరాఖండ్‌లోని తనక్‌పూర్-బాగేశ్వర్ రైలు మార్గానికి సంబంధించిన సర్వే పూర్తయింది. ఈ సర్వే ప్రకారం 170 కి.మీ పొడవైన రైలు మార్గాన్ని నిర్మించడానికి రూ.49 వేల కోట్లు ఖర్చుకానుంది. ఈ రైలు మార్గం ఉనికిలోకి వస్తే భారతీయ రైల్వే అటు చైనా ఇటు నేపాల్ సరిహద్దులను చేరుకోగలుగుతుంది. ఉత్తరాఖండ్‌లోని కుమావోన్‌లోని నాలుగు పర్వతప్రాంత జిల్లాలు తనక్‌పూర్-బాగేశ్వర్ రైలు మార్గం కోసం దశాబ్దాలుగా కలలు కంటున్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం 1882లో తొలిసారిగా ఈ రైలు మార్గం కోసం రూపకల్పన చేసింది. ఈ రైల్వే లైన్ కోసం మొదటి సర్వే 1912లో జరిగింది. నాటి నుంచి నేటి వరకు మ్తొతం ఏడు సర్వేలు జరిగాయి. రెండేళ్లపాటు సాగిన సర్వేలో తుది నివేదికను స్కై లై ఇంజినీరింగ్ డిజైనింగ్ సంస్థ తాజాగా రైల్వేశాఖకు అందజేసింది.ఈ తుది సర్వే ప్రకారం తనక్‌పూర్- బాగేశ్వర్ మధ్య రైలు మార్గం ఏర్పడితే మొత్తం 12 రైల్వే స్టేషన్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ స్టేషన్లు 170 కిలోమీటర్ల రైల్వే లైన్ మార్గంలో నిర్మించాల్సి ఉంటుంది. అలాగే ఈ రైల్వే లైన్ కోసం 452 హెక్టార్ల భూమిని కూడా సేకరించాల్సి ఉంది. దీనిలో 27 హెక్టార్ల భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది.తనక్‌పూర్-బాగేశ్వర్ రైలు మార్గాన్ని 2012లో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్ట్‌గా పరిగణించింది. అప్పట్లో ఈ రైల్వే లైన్లో 54 కిలోమీటర్ల మేర 72 సొరంగాలను ప్రతిపాదించారు. కాళీ నది ఒడ్డున తనక్‌పూర్ నుండి పంచేశ్వర్ వరకు ఈ రైలు మార్గాన్ని నిర్మించాల్సి ఉంటుంది. అల్మోరా, పితోర్‌గఢ్, చంపావత్ , బాగేశ్వర్ జిల్లాలకు ఈ రైల్వే లైన్ నిర్మాణం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.అంతే కాదు పర్వతప్రాంతాలకు వెళ్లే మార్గం సులభతరం కావడంతో పాటు, పర్యాటక రంగానికి కూడా విపరీతమైన ఆదరణ లభిస్తుంది. చైనా, నేపాల్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న ఈ రైలు మార్గానికి వ్యూహాత్మక ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ మార్గంపై తుది సర్వే నివేదికను అందుకున్న రైల్వే మంత్రిత్వ శాఖ ఈ రైలు మార్గాన్ని ఎప్పుడు నిర్మిస్తుందో వేచి చూడాలి. ఇది కూడా చదవండి: ఆకాశానికి నిచ్చెన -
అమరావతికి రైల్వే లైన్ ఎప్పుడో?
సాక్షి, అమరావతి: రాష్ట్ర నూతన రాజధాని అమరావతికి రైలు మార్గం ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. సర్క్యులర్ సబర్బన్ లైన్‌గా అమరావతి రైల్వే లైన్‌ను గతేడాది బడ్జెట్లో ఈ మార్గానికి అనుమతి ఇచ్చి కేంద్రం రూ. 2,680 కోట్లు మంజూరు చేసింది. అయితే ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు రైల్వే బోర్డు నుంచి అనుమతులు రాలేదు. అమరావతి రైల్వే లైన్ కోసం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) ఆర్నెల్ల క్రితమే సర్వే చేసింది. 3 మార్గాల్లో ప్రతిపాదిత అలైన్మెంట్ ఖరారు చేసింది. అమరావతికి వెళ్లాలంటే గుంటూరు, విజయవాడ వరకు మాత్రమే రైలు మార్గం ఉంది. అక్కడ నుంచి సచివాలయం, రాజధాని ప్రాంతం అమరావతికి వెళ్లాలంటే రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సిందే. అమరావతికి రైల్వే లైన్‌కు మొత్తం 106 కిలోమీటర్ల ట్రాక్ వేయాలి. అనుమతులు వచ్చి టెండర్లు పిలిచి రైల్వే లైన్ ప్రారంభిస్తే నాలుగేళ్లలో ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుంది. అయితే ఈ సర్వే విషయంలో ఇంతవరకు రైల్వే బోర్డు నుంచి అనుమతులు రాకపోవడం, జాయింట్ వెంచర్ కంపెనీ కింద ఈ రైల్వే ప్రాజెక్టును చేర్చినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ మార్గం ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదని రైల్వే వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రతిపాదించిన మూడు రైల్వే లైన్లు నంబూరు–అమరావతి–ఎర్రుపాలెం రైల్వే లైన్ 56.8 కిలోమీటర్లు. డబుల్ లైన్ ట్రాక్ వేయాలంటే రూ. 2,063 కోట్లు అవసరం. ఈ రైల్వే లైన్ నిర్మిస్తే విజయవాడ–గుంటూరు మధ్యలో ఉన్న నంబూరు నుంచి రాజధాని గ్రామాలైన వడ్డమాను, తుళ్లూరు, అమరావతి వరకు ట్రాక్ వేయాలి. అటు విజయవాడ నుంచి కృష్ణా కెనాల్ మీదుగా ఉండవల్లి, వెంకటపాలెం, మందడం, వెలగపూడి, అమరావతి వరకు ట్రాక్ నిర్మించాలి. అమరావతి–పెదకూరపాడు రైల్వే లైన్ నిర్మాణం 24.5 కిలోమీటర్లు ఉంటుంది. సింగిల్ లైన్ ట్రాక్‌తో వేయాలంటే రూ. 300 కోట్లు అవసరం. సత్తెనపల్లి–నరసరావుపేట మార్గానికి 25 కి.మీ. మేర సింగిల్ లైన్ వేయాలంటే రూ. 310 కోట్లు ఖర్చవుతుంది. భూ సేకరణపై నాన్చివేత వైఖరి అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి భూ సేకరణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. ఈ రైల్వే లైన్ వేయాలంటే ముందుగా భూమిని రైల్వే శాఖకు అప్పగించాలి. కానీ ఇంతవరకు భూ సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం నాన్చివేత వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైల్వే జోన్ సాధించలేకపోయిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి అయినా రైలు మార్గం సాధిస్తుందో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
మెదక్ రైలు మార్గం.. సాధించి తీరుతాం
మెదక్: మెదక్‌కు రైలు మార్గం సాధించి తీరుతామని, ఇది తమకు ప్రతిష్టాత్మకమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా మెదక్ పట్టణానికి వచ్చిన ఆయనకు టీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి, డిప్యూటీ స్పీకర్ కు, మంత్రికి, ఇద్దరు ఎంపీలకు సొంత జిల్లా కావడంతో రాష్ట్రంలోనే మోడల్ జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. మెదక్ ప్రజల చిరకాల స్వప్నమైన రైలు మార్గాన్ని సాధించితీరుమన్నారు. మెదక్-అక్కన్నపేట రైల్వే లైను, మనోహరాబాద్-కొత్తపల్లి మార్గాలు పూర్తయ్యేందుకు కేంద్రం నిధులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా చెల్లించడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల పథకం ద్వారా జిల్లాలోని చెరువులు, కుంటలకు జలకళ తెస్తామన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ రుణపడి ఉంటూ, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాను అభివృద్ధి చేసేందుకు సైనికునిలా పనిచేస్తాన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర టీఆర్ఎస్ కార్యదర్శి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు, ఎంపీకి వారధిగా పనిచేసి మెదక్‌ను కడిగిన ముత్యంలా మారుస్తామన్నారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మన్ రాగి అశోక్, జెడ్పీటీసీ లావణ్యారెడ్డితో పాటు కార్యకర్తలు ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని, దేవేందర్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు.