సాక్షి, అమరావతి: రాష్ట్ర నూతన రాజధాని అమరావతికి రైలు మార్గం ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. సర్క్యులర్ సబర్బన్ లైన్‌గా అమరావతి రైల్వే లైన్‌ను గతేడాది బడ్జెట్‌లో ఈ మార్గానికి అనుమతి ఇచ్చి కేంద్రం రూ. 2,680 కోట్లు మంజూరు చేసింది. అయితే ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు రైల్వే బోర్డు నుంచి అనుమతులు రాలేదు. అమరావతి రైల్వే లైన్ కోసం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) ఆర్నెల్ల క్రితమే సర్వే చేసింది. 3 మార్గాల్లో ప్రతిపాదిత అలైన్‌మెంట్ ఖరారు చేసింది. అమరావతికి వెళ్లాలంటే గుంటూరు, విజయవాడ వరకు మాత్రమే రైలు మార్గం ఉంది. అక్కడ నుంచి సచివాలయం, రాజధాని ప్రాంతం అమరావతికి వెళ్లాలంటే రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సిందే.
అమరావతికి రైల్వే లైన్‌కు మొత్తం 106 కిలోమీటర్ల ట్రాక్ వేయాలి. అనుమతులు వచ్చి టెండర్లు పిలిచి రైల్వే లైన్ ప్రారంభిస్తే నాలుగేళ్లలో ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుంది. అయితే ఈ సర్వే విషయంలో ఇంతవరకు రైల్వే బోర్డు నుంచి అనుమతులు రాకపోవడం, జాయింట్ వెంచర్ కంపెనీ కింద ఈ రైల్వే ప్రాజెక్టును చేర్చినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ మార్గం ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదని రైల్వే వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
ప్రతిపాదించిన మూడు రైల్వే లైన్లు
- నంబూరు–అమరావతి–ఎర్రుపాలెం రైల్వే లైన్ 56.8 కిలోమీటర్లు. డబుల్ లైన్ ట్రాక్ వేయాలంటే రూ. 2,063 కోట్లు అవసరం. ఈ రైల్వే లైన్ నిర్మిస్తే విజయవాడ–గుంటూరు మధ్యలో ఉన్న నంబూరు నుంచి రాజధాని గ్రామాలైన వడ్డమాను, తుళ్లూరు, అమరావతి వరకు ట్రాక్ వేయాలి. అటు విజయవాడ నుంచి కృష్ణా కెనాల్ మీదుగా ఉండవల్లి, వెంకటపాలెం, మందడం, వెలగపూడి, అమరావతి వరకు ట్రాక్ నిర్మించాలి.
- అమరావతి–పెదకూరపాడు రైల్వే లైన్ నిర్మాణం 24.5 కిలోమీటర్లు ఉంటుంది. సింగిల్ లైన్ ట్రాక్‌తో వేయాలంటే రూ. 300 కోట్లు అవసరం.
- సత్తెనపల్లి–నరసరావుపేట మార్గానికి 25 కి.మీ. మేర సింగిల్ లైన్ వేయాలంటే రూ. 310 కోట్లు ఖర్చవుతుంది.
భూ సేకరణపై నాన్చివేత వైఖరి
అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి భూ సేకరణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. ఈ రైల్వే లైన్ వేయాలంటే ముందుగా భూమిని రైల్వే శాఖకు అప్పగించాలి. కానీ ఇంతవరకు భూ సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం నాన్చివేత వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైల్వే జోన్ సాధించలేకపోయిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి అయినా రైలు మార్గం సాధిస్తుందో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment