RVNL project
-
యాదాద్రికి ఎంఎంటీఎస్
సాక్షి, హైదరాబాద్, యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఎంఎంటీఎస్ అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ మొదలైంది. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు ఉన్న 33 కిలోమీటర్ల మార్గంలో ఇప్పుడున్న రెండు లైన్లతో పాటు ఎంఎంటీఎస్ కోసం మరోలైన్ అదనంగా నిర్మించనున్నారు. వాస్తవానికి ఎంఎంటీఎస్ రెండోదశ కింద 2016లోనే ఈ ప్రాజెక్టు చేపట్టారు. కానీ రాష్ట్రప్రభుత్వం తన వాటాగా నిధులు కేటాయించకపోవడంతో తీవ్ర జాప్యం నెలకొంది. రూ.330 కోట్లతో అప్పట్లో అంచనాలు రూపొందించారు. పెరిగిన ధరల దృష్ట్యా ప్రాజెక్టు వ్యయం ఇప్పుడు రూ.430 కోట్లకు చేరింది. రైల్వేశాఖ వందశాతం నిధులతో ఈ ప్రాజెక్టు నిర్మించనుంది. రైల్ వికాస్‌నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) ఆధ్వర్యంలో త్వరలో పనులు ప్రారంభమవుతాయి. జీఎం సమీక్ష దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్, ఆర్వీఎన్ఎల్ చీఫ్‌ప్రాజెక్ట్ మేనేజర్ మున్నాకుమార్, సికింద్రాబాద్ డీఆర్ఎం ఏకే గుప్తాలతో కూడిన ఉన్నతాధికారుల బృందం గురువారం యాదాద్రి రైల్వేస్టేషన్‌ను సందర్శించింది. రైల్వేస్టేషన్లో ప్రయాణికుల సదుపాయాలు, స్టేషన్ అభివృద్ధి ప్రణాళికలు, కొత్తగా నిర్మించాల్సిన ఎంఎంటీఎస్–2 లైన్, తదితర పనులపైన జీఎం సమీక్షించారు. ప్రాజెక్ట్‌లో భాగంగా ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, యాదాద్రి స్టేషన్లు, యార్డులలో అదనపు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతమున్న రైల్వేస్టేషన్లో నూతనంగా నిర్మించిన ప్లాట్‌ఫాం, స్టేషన్ ఇతర వసతుల కోసం స్థలాన్ని జీఎం పరిశీలించారు. ప్రస్తుతం గుట్టవైపు ఉన్న స్టేషన్‌కు ఎదురుగా నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టడానికి అనువుగా ఉన్నట్టు గుర్తించారు. యాదాద్రి క్షేత్ర ఆలయ నమూనాతో రైల్వేస్టేషన్ ముఖ ద్వారం నిర్మించనున్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపేందుకు చర్యలు తీసుకోవాలని, రైల్వేస్టేషన్‌ను ఆధునీకరించాలని, రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రాసిన వినతిపత్రాన్ని జీఎంకు భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అందజేశారు. జీఎం ముందుగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నారు. యాదాద్రి పునరాభివృద్ధి అమృత్‌భారత్ స్టేషన్ పథకం కింద యాదాద్రి రైల్వేస్టేషన్‌ను పునరాభివృద్ధి చేయనున్నట్టు జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. ఎంఎంటీఎస్ –2 లైన్ కోసం స్టేషన్ తూర్పు వైపున విస్తరించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఈ స్టేషన్ అభివృద్ధికి రైల్వేశాఖ నిధులు కేటాయించిన దృష్ట్యా అమృత్‌భారత్ పథకం కింద పడమర వైపున కూడా స్టేషన్ అభివృద్ధి చేస్తామని, టెండర్లు కూడా పిలుస్తామని చెప్పారు. ప్లాట్ ఫామ్‌ల పైకప్పు నిర్మాణం, ప్రధాన ముఖద్వార అభివృద్ధితో పాటు స్టేషన్ భవనాన్ని మెరుగుపరచనున్నట్టు తెలిపారు. ఎంఎంటీఎస్‌తోపాటు, స్టేషన్ అభివృద్ధి వల్ల యాదాద్రికి భక్తులు అతి తక్కువ చార్జీల్లోనే వెళ్లవచ్చన్నారు. -
నవరత్న హోదా పొందిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ - పూర్తి వివరాలు
ప్రభుత్వ రంగ సంస్థ 'రైల్ వికాస్ నిగమ్'కు నవరత్న హోదా కల్పిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ కారణంగా రైల్ వికాస్ నిగమ్ ఇప్పుడు 13వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా నవరత్న హోదా పొందింది. ఇప్పటివరకు మినీ రత్న హోదాలో ఉన్న రైల్ వికాస్ నిగమ్ నవరత్న హోదా కైవసం చేసుకుంది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అనేది రైల్వే శాఖ నిర్వహణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ. దీని టర్నోవర్ సంవత్సరానికి రూ. 19,381 కోట్లు. అంతే కాకుండా గత 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఆదాయం రూ. 1,087 కోట్లు. కావున ఈ సంస్థకు నవరత్న హోదా కల్పించాలనే యోచన గతం నుంచి ఉన్నప్పటికీ ఇది ఇప్పటికి సాధ్యమైంది. నవరత్న హోదా పొందటం వల్ల సంస్థ చాలా విషయాల్లో సొంత నిర్ణయాలను తీసుకోవచ్చు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడం, ఇతర సంస్థలతో జాయింట్ వెంచర్స్ ఏర్పాటు చేయడం వంటి విషయాల్లో స్వతంత్య్రం ఉంటుంది. ఇది సంస్థ వేగవంతమైన అభివృద్ధికి ఉపయోగపడుతుంది. (ఇదీ చదవండి: పోర్షేకు షాక్.. కస్టమర్ దెబ్బకు రూ. 18 లక్షలు ఫైన్ - కారణం ఇదే..!) రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌కి నవరత్న హోదా కల్పించే ప్రాతి పదికను కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ ఆమోదం తెలిపారని, ఈ ఆమోదం ప్రకారం ఇకపైన కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నవరత్న హోదా పొందిన సంస్థగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కొనసాగుతుందని డిపిఈ (Department of Public Enterprises) ట్విటర్ ద్వారా తెలిపింది. (ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత ఖరీదైన కార్లు వీరి దగ్గరే ఉన్నాయి - ధరలు తెలిస్తే దిమ్మతిరిగాల్సిందే!) Hon'ble Finance Minister has approved the upgradation of RVNL to Navratna CPSE. RVNL will be the 13th Navratna amongst the CPSEs. RVNL is a Ministry of Railways CPSE with an annual turnover of Rs 19381 crores and net profit of Rs 1087 crores for the years 2021-22. @RailVikas — Department of Public Enterprises (@DPE_GoI) April 26, 2023 ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేశాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.. -
అమరావతికి రైల్వే లైన్ ఎప్పుడో?
సాక్షి, అమరావతి: రాష్ట్ర నూతన రాజధాని అమరావతికి రైలు మార్గం ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదు. సర్క్యులర్ సబర్బన్ లైన్‌గా అమరావతి రైల్వే లైన్‌ను గతేడాది బడ్జెట్లో ఈ మార్గానికి అనుమతి ఇచ్చి కేంద్రం రూ. 2,680 కోట్లు మంజూరు చేసింది. అయితే ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు రైల్వే బోర్డు నుంచి అనుమతులు రాలేదు. అమరావతి రైల్వే లైన్ కోసం రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) ఆర్నెల్ల క్రితమే సర్వే చేసింది. 3 మార్గాల్లో ప్రతిపాదిత అలైన్మెంట్ ఖరారు చేసింది. అమరావతికి వెళ్లాలంటే గుంటూరు, విజయవాడ వరకు మాత్రమే రైలు మార్గం ఉంది. అక్కడ నుంచి సచివాలయం, రాజధాని ప్రాంతం అమరావతికి వెళ్లాలంటే రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సిందే. అమరావతికి రైల్వే లైన్‌కు మొత్తం 106 కిలోమీటర్ల ట్రాక్ వేయాలి. అనుమతులు వచ్చి టెండర్లు పిలిచి రైల్వే లైన్ ప్రారంభిస్తే నాలుగేళ్లలో ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తుంది. అయితే ఈ సర్వే విషయంలో ఇంతవరకు రైల్వే బోర్డు నుంచి అనుమతులు రాకపోవడం, జాయింట్ వెంచర్ కంపెనీ కింద ఈ రైల్వే ప్రాజెక్టును చేర్చినా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ మార్గం ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదని రైల్వే వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రతిపాదించిన మూడు రైల్వే లైన్లు నంబూరు–అమరావతి–ఎర్రుపాలెం రైల్వే లైన్ 56.8 కిలోమీటర్లు. డబుల్ లైన్ ట్రాక్ వేయాలంటే రూ. 2,063 కోట్లు అవసరం. ఈ రైల్వే లైన్ నిర్మిస్తే విజయవాడ–గుంటూరు మధ్యలో ఉన్న నంబూరు నుంచి రాజధాని గ్రామాలైన వడ్డమాను, తుళ్లూరు, అమరావతి వరకు ట్రాక్ వేయాలి. అటు విజయవాడ నుంచి కృష్ణా కెనాల్ మీదుగా ఉండవల్లి, వెంకటపాలెం, మందడం, వెలగపూడి, అమరావతి వరకు ట్రాక్ నిర్మించాలి. అమరావతి–పెదకూరపాడు రైల్వే లైన్ నిర్మాణం 24.5 కిలోమీటర్లు ఉంటుంది. సింగిల్ లైన్ ట్రాక్‌తో వేయాలంటే రూ. 300 కోట్లు అవసరం. సత్తెనపల్లి–నరసరావుపేట మార్గానికి 25 కి.మీ. మేర సింగిల్ లైన్ వేయాలంటే రూ. 310 కోట్లు ఖర్చవుతుంది. భూ సేకరణపై నాన్చివేత వైఖరి అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి భూ సేకరణ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. ఈ రైల్వే లైన్ వేయాలంటే ముందుగా భూమిని రైల్వే శాఖకు అప్పగించాలి. కానీ ఇంతవరకు భూ సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం నాన్చివేత వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైల్వే జోన్ సాధించలేకపోయిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి అయినా రైలు మార్గం సాధిస్తుందో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
రైల్వే బడ్జెట్.. అన్నింటికీ కలిపి రూ.473.28 కోట్లే..
కొత్త లైన్లు, డబ్లింగ్, గేజ్ మార్పిడి.. తదితర పనుల కోసం ప్రణాళికా వ్యయం కింద సుమారు రూ. 473.28 కోట్లు మాత్రమే కేటాయించారు. అందులో స్వర్ణ చతుర్భుజి, పోర్టుల అనుసంధానం ప్రాజెక్టుల అమలుకు ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) అయిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) అమలు చేస్తున్న ప్రాజెక్టులనూ చూపించారు. ఆర్వీఎన్ఎల్ నిధులు సమకూర్చుకోవడంలో రైల్వే శాఖ అన్ని రకాలుగా సహకరిస్తుంది. కానీ ప్రాజెక్టుల వారీగా నేరుగా నిధులు కేటాయించదు. ఆర్వీఎన్ఎల్ ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను మినహాయిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో పనుల కోసం రైల్వే కేటాయించిన నిధులు సుమారు రూ.152.28 కోట్లే. 142 కిలోమీటర్ల పొడవైన కంభం-ప్రొద్దుటూరు కొత్త లైన్‌కు కేవలం రూ. 10 లక్షలు కేటాయించారు. మరీ కంటితుడుపు కేటాయింపులకు ఇదో ఉదాహరణ. మరికొన్ని కేటాయింపులు ఇలా ఉన్నాయి.. * కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సొంత మండలం వెంకటాచలం మీదు గా కృష్ణపట్నం వరకు కొత్త రైల్వే లైన్ (ఆర్వీఎన్ఎల్ ప్రాజెక్టు)కు బడ్జెట్లో రూ. 208 కోట్లు కేటాయించారు. ఓబుళవారిపల్లె - వెంకటాచలం మీదుగా కృష్ణపట్నం పోర్టు వరకు ఈ లైన్ నిర్మిస్తారు. * కడప - బెంగళూరు రైల్వే లైన్ (255.4 కిలోమీటర్లు)లో పెండ్లిమర్రి వరకు నిర్మాణం పూర్తయింది. ఇందుకు రూ.210 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టుకు ఈసారి బడ్జెట్లో కేవలం రూ.30 కోట్లు కేటాయించారు. రాయలసీమలో సరకు రవాణాకు, ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడే ఈ ప్రాజెక్టును అప్రాధాన్య కోటాలో వేశారు. * కదిరి- పుట్టపర్తి, కాకినాడ - నిజాంపట్నం ఓడరేవు క్తొత రైల్వే మార్గాలకు నిధుల కేటాయింపులు లేవు. * కొండపల్లి - కొత్తగూడెం రైల్వే లైన్ నిర్మాణానికి రూ.611 కోట్లు అవసరమైతే రూ.5 కోట్లు మాత్రమే కేటాయించారు. * 2006లో ఆమోదముద్ర వేసిన జగ్గయ్యపేట - మల్లెలచెరువు లైను నిర్మాణానికి రూ.60 కోట్లే కేటాయించారు. ఇంకా రూ.100 కోట్లు అవసరం. * కొవ్వూరు- భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 912 కోట్లు అవసరం కాగా రూ.10 కోట్లు కేటాయించారు. * గూడూరు-దుగరాజపట్నం రైల్వే లైను (41.55కిలోమీటర్లు)కు రూ. 272 కోట్లు అవసరం కాగా రూ. 5 కోట్లతో సరిపెట్టారు * నంద్యాల -ఎర్రగుంట్ల మార్గానికి (126 కిలోమీటర్లు) రూ.80 కోట్లు ఇచ్చారు. * కాకినాడ - పిఠాపురం లైనుకు (21.5 కిలోమీటర్లు) రూ.కోటి ఇచ్చారు. * కోటిపల్లి - నర్సాపూర్ మార్గానికి (57.21 కి.మీ) రూ.10 కోట్లు. * నడికుడి - శ్రీకాళహస్తి లైనుకు (309 కిలోమీటర్లు) రూ.10 కోట్లు ఇచ్చారు. * విజయవాడ- గుడివాడ- మచిలీపట్నం- భీమవరం- నర్సాపురం- నిడదవోలు లైను డబ్లింగ్, విద్యుదీకరణకు రూ.712 కోట్లు అవసరమైతే గత బడ్జెట్లో రూ 40 కోట్లు కేటాయించగా, ఈసారి రూపాయీ కేటాయించలేదు. * గూడూరు-రేణిగుంట-తిరుపతి (92.34 కిలోమీటర్లు) డబ్లింగ్‌కు రూ.5 కోట్లు ఇచ్చారు. * ఆర్వీఎన్ఎల్ చేపట్టే గుత్తి-రేణిగుంట డబ్లింగ్‌కు రూ.4.18 కోట్లు, వెంకటాచలం - కృష్ణపట్నం డబ్లింగ్‌కు రూ.15 కోట్లు, గుంటూరు - తెనాలి డబ్లింగ్‌కు రూ.58 కోట్లు, విజయవాడ- గుడివాడ- భీమవరం డబ్లింగ్‌కు రూ.20 కోట్లు, గుంతకల్-రాయచూర్ డబ్లింగ్‌కు రూ.20 కోట్లు కేటాయించారు. * గుంటూరు - గుంతకల్ - కల్లూరు మార్గం గేజ్ మార్పిడికి (76 కిలోమీటర్లు) రూ.7 కోట్లు కేటాయించారు. * బీబీ నగర్ - గుడివాడ డబ్లింగ్, విద్యుదీకరణ, తిరుపతి-కాట్పాడి డబ్లింగ్, పాకాల - ధర్మవరం విద్యుదీకరణ పనులకు మోక్షం కలగలేదు. * గూడూరు - విజయవాడ మధ్య మూడో లైను, మంత్రాలయం రోడ్ - కర్నూలు, బిట్రగుంట - దొనకొండ, పిడుగురాళ్ల - నర్సరావుపేట, మార్కాపురం రోడ్డు - శ్రీశైలం, బాపట్ల - నిజాంపట్నం - రేపల్లె, గిద్దలూరు - బాకర్‌పూర్, నంద్యాల - ఆత్మకూరు, మచిలీపట్నం - రేపల్లె, విశాఖ - భద్రాచలం కొత్త రైల్వే లైన్లకు, గుంటూరు - గుంతకల్, తెనాలి - రేపల్లె డబ్లింగ్, విద్యుదీకరణ పనుల సర్వేలకు ఈ బడ్జెట్లో చోటు దక్కలేదు.