సాక్షి, హైదరాబాద్, యాదాద్రి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి ఎంఎంటీఎస్ అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ మొదలైంది. ఘట్‌కేసర్ నుంచి రాయగిరి వరకు ఉన్న 33 కిలోమీటర్ల మార్గంలో ఇప్పుడున్న రెండు లైన్‌లతో పాటు ఎంఎంటీఎస్ కోసం మరోలైన్ అదనంగా నిర్మించనున్నారు. వాస్తవానికి ఎంఎంటీఎస్ రెండోదశ కింద 2016లోనే ఈ ప్రాజెక్టు చేపట్టారు.
కానీ రాష్ట్రప్రభుత్వం తన వాటాగా నిధులు కేటాయించకపోవడంతో తీవ్ర జాప్యం నెలకొంది. రూ.330 కోట్లతో అప్పట్లో అంచనాలు రూపొందించారు. పెరిగిన ధరల దృష్ట్యా ప్రాజెక్టు వ్యయం ఇప్పుడు రూ.430 కోట్లకు చేరింది. రైల్వేశాఖ వందశాతం నిధులతో ఈ ప్రాజెక్టు నిర్మించనుంది. రైల్ వికాస్‌నిగమ్ లిమిటెడ్ (ఆర్‌వీఎన్‌ఎల్) ఆధ్వర్యంలో త్వరలో పనులు ప్రారంభమవుతాయి.
జీఎం సమీక్ష
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్, ఆర్‌వీఎన్‌ఎల్ చీఫ్‌ప్రాజెక్ట్ మేనేజర్ మున్నాకుమార్, సికింద్రాబాద్ డీఆర్‌ఎం ఏకే గుప్తాలతో కూడిన ఉన్నతాధికారుల బృందం గురువారం యాదాద్రి రైల్వేస్టేషన్‌ను సందర్శించింది. రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సదుపాయాలు, స్టేషన్ అభివృద్ధి ప్రణాళికలు, కొత్తగా నిర్మించాల్సిన ఎంఎంటీఎస్–2 లైన్, తదితర పనులపైన జీఎం సమీక్షించారు.
ప్రాజెక్ట్‌లో భాగంగా ఘట్‌కేసర్, బీబీనగర్, భువనగిరి, యాదాద్రి స్టేషన్లు, యార్డులలో అదనపు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతమున్న రైల్వేస్టేషన్‌లో నూతనంగా నిర్మించిన ప్లాట్‌ఫాం, స్టేషన్ ఇతర వసతుల కోసం స్థలాన్ని జీఎం పరిశీలించారు. ప్రస్తుతం గుట్టవైపు ఉన్న స్టేషన్‌కు ఎదురుగా నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం చేపట్టడానికి అనువుగా ఉన్నట్టు గుర్తించారు.
యాదాద్రి క్షేత్ర ఆలయ నమూనాతో రైల్వేస్టేషన్ ముఖ ద్వారం నిర్మించనున్నారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆపేందుకు చర్యలు తీసుకోవాలని, రైల్వేస్టేషన్‌ను ఆధునీకరించాలని, రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి రాసిన వినతిపత్రాన్ని జీఎంకు భువనగిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అందజేశారు. జీఎం ముందుగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని సుదర్శన నారసింహ హోమంలో పాల్గొన్నారు.
యాదాద్రి పునరాభివృద్ధి
అమృత్‌భారత్ స్టేషన్ పథకం కింద యాదాద్రి రైల్వేస్టేషన్‌ను పునరాభివృద్ధి చేయనున్నట్టు జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. ఎంఎంటీఎస్ –2 లైన్ కోసం స్టేషన్ తూర్పు వైపున విస్తరించాల్సి ఉందన్నారు.
ఇప్పటికే ఈ స్టేషన్ అభివృద్ధికి రైల్వేశాఖ నిధులు కేటాయించిన దృష్ట్యా అమృత్‌భారత్ పథకం కింద పడమర వైపున కూడా స్టేషన్ అభివృద్ధి చేస్తామని, టెండర్లు కూడా పిలుస్తామని చెప్పారు. ప్లాట్ ఫామ్‌ల పైకప్పు నిర్మాణం, ప్రధాన ముఖద్వార అభివృద్ధితో పాటు స్టేషన్ భవనాన్ని మెరుగుపరచనున్నట్టు తెలిపారు. ఎంఎంటీఎస్‌తోపాటు, స్టేషన్ అభివృద్ధి వల్ల యాదాద్రికి భక్తులు అతి తక్కువ చార్జీల్లోనే వెళ్లవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment