రైల్వే బడ్జెట్.. అన్నింటికీ కలిపి రూ.473.28 కోట్లే..
కొత్త లైన్లు, డబ్లింగ్, గేజ్ మార్పిడి.. తదితర పనుల కోసం ప్రణాళికా వ్యయం కింద సుమారు రూ. 473.28 కోట్లు మాత్రమే కేటాయించారు. అందులో స్వర్ణ చతుర్భుజి, పోర్టుల అనుసంధానం ప్రాజెక్టుల అమలుకు ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) అయిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్‌ఎల్) అమలు చేస్తున్న ప్రాజెక్టులనూ చూపించారు. ఆర్వీఎన్‌ఎల్ నిధులు సమకూర్చుకోవడంలో రైల్వే శాఖ అన్ని రకాలుగా సహకరిస్తుంది. కానీ ప్రాజెక్టుల వారీగా నేరుగా నిధులు కేటాయించదు. ఆర్వీఎన్‌ఎల్ ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను మినహాయిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో పనుల కోసం రైల్వే కేటాయించిన నిధులు సుమారు రూ.152.28 కోట్లే. 142 కిలోమీటర్ల పొడవైన కంభం-ప్రొద్దుటూరు కొత్త లైన్‌కు కేవలం రూ. 10 లక్షలు కేటాయించారు. మరీ కంటితుడుపు కేటాయింపులకు ఇదో ఉదాహరణ. మరికొన్ని కేటాయింపులు ఇలా ఉన్నాయి..
* కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సొంత మండలం వెంకటాచలం మీదు గా కృష్ణపట్నం వరకు కొత్త రైల్వే లైన్ (ఆర్వీఎన్‌ఎల్ ప్రాజెక్టు)కు బడ్జెట్‌లో రూ. 208 కోట్లు కేటాయించారు. ఓబుళవారిపల్లె - వెంకటాచలం మీదుగా కృష్ణపట్నం పోర్టు వరకు ఈ లైన్ నిర్మిస్తారు.
* కడప - బెంగళూరు రైల్వే లైన్ (255.4 కిలోమీటర్లు)లో పెండ్లిమర్రి వరకు నిర్మాణం పూర్తయింది. ఇందుకు రూ.210 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టుకు ఈసారి బడ్జెట్‌లో కేవలం రూ.30 కోట్లు కేటాయించారు. రాయలసీమలో సరకు రవాణాకు, ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడే ఈ ప్రాజెక్టును అప్రాధాన్య కోటాలో వేశారు.
* కదిరి- పుట్టపర్తి, కాకినాడ - నిజాంపట్నం ఓడరేవు క్తొత రైల్వే మార్గాలకు నిధుల కేటాయింపులు లేవు.
* కొండపల్లి - కొత్తగూడెం రైల్వే లైన్ నిర్మాణానికి రూ.611 కోట్లు అవసరమైతే రూ.5 కోట్లు మాత్రమే కేటాయించారు.
* 2006లో ఆమోదముద్ర వేసిన జగ్గయ్యపేట - మల్లెలచెరువు లైను నిర్మాణానికి రూ.60 కోట్లే కేటాయించారు. ఇంకా రూ.100 కోట్లు అవసరం.
* కొవ్వూరు- భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 912 కోట్లు అవసరం కాగా రూ.10 కోట్లు కేటాయించారు.
* గూడూరు-దుగరాజపట్నం రైల్వే లైను (41.55కిలోమీటర్లు)కు రూ. 272 కోట్లు అవసరం కాగా రూ. 5 కోట్లతో సరిపెట్టారు
* నంద్యాల -ఎర్రగుంట్ల మార్గానికి (126 కిలోమీటర్లు) రూ.80 కోట్లు ఇచ్చారు.
* కాకినాడ - పిఠాపురం లైనుకు (21.5 కిలోమీటర్లు) రూ.కోటి ఇచ్చారు.
* కోటిపల్లి - నర్సాపూర్ మార్గానికి (57.21 కి.మీ) రూ.10 కోట్లు.
* నడికుడి - శ్రీకాళహస్తి లైనుకు (309 కిలోమీటర్లు) రూ.10 కోట్లు ఇచ్చారు.
* విజయవాడ- గుడివాడ- మచిలీపట్నం- భీమవరం- నర్సాపురం- నిడదవోలు లైను డబ్లింగ్, విద్యుదీకరణకు రూ.712 కోట్లు అవసరమైతే గత బడ్జెట్‌లో రూ 40 కోట్లు కేటాయించగా, ఈసారి రూపాయీ కేటాయించలేదు.
* గూడూరు-రేణిగుంట-తిరుపతి (92.34 కిలోమీటర్లు) డబ్లింగ్‌కు రూ.5 కోట్లు ఇచ్చారు.
* ఆర్వీఎన్‌ఎల్ చేపట్టే గుత్తి-రేణిగుంట డబ్లింగ్‌కు రూ.4.18 కోట్లు, వెంకటాచలం - కృష్ణపట్నం డబ్లింగ్‌కు రూ.15 కోట్లు, గుంటూరు - తెనాలి డబ్లింగ్‌కు రూ.58 కోట్లు, విజయవాడ- గుడివాడ- భీమవరం డబ్లింగ్‌కు రూ.20 కోట్లు, గుంతకల్-రాయచూర్ డబ్లింగ్‌కు రూ.20 కోట్లు కేటాయించారు.
* గుంటూరు - గుంతకల్ - కల్లూరు మార్గం గేజ్ మార్పిడికి (76 కిలోమీటర్లు) రూ.7 కోట్లు కేటాయించారు.
* బీబీ నగర్ - గుడివాడ డబ్లింగ్, విద్యుదీకరణ, తిరుపతి-కాట్పాడి డబ్లింగ్, పాకాల - ధర్మవరం విద్యుదీకరణ పనులకు మోక్షం కలగలేదు.
* గూడూరు - విజయవాడ మధ్య మూడో లైను, మంత్రాలయం రోడ్ - కర్నూలు, బిట్రగుంట - దొనకొండ, పిడుగురాళ్ల - నర్సరావుపేట, మార్కాపురం రోడ్డు - శ్రీశైలం, బాపట్ల - నిజాంపట్నం - రేపల్లె, గిద్దలూరు - బాకర్‌పూర్, నంద్యాల - ఆత్మకూరు, మచిలీపట్నం - రేపల్లె, విశాఖ - భద్రాచలం కొత్త రైల్వే లైన్లకు, గుంటూరు - గుంతకల్, తెనాలి - రేపల్లె డబ్లింగ్, విద్యుదీకరణ పనుల సర్వేలకు ఈ బడ్జెట్‌లో చోటు దక్కలేదు.