Rail Vikas Nigam Limited
-
ఐపీఓ ఆరంభం అదుర్స్!
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో ఈ ఏడాది కొత్తగా లిస్టయిన కంపెనీలు ఇన్వెస్టర్లకు మంచి రాబడులే ఇచ్చాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆరు కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాగా... ఐదు కంపెనీలు ఇష్యూ ధర కంటే అధిక ధరకే ట్రేడవుతున్నాయి. ఈ కంపెనీలన్నింట్లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అధిక లాభాలనిచ్చింది. ఈ నెల 11న స్టాక్ మార్కెట్లో లిస్టైన ఈ కంపెనీ ఇష్యూ ధర కంటే 26 శాతం అధిక ధర వద్ద ట్రేడవుతోంది. వైర్లు, కేబుళ్లు తయారు చేసే పాలీక్యాబ్ ఇండియా షేర్ ఈ నెల 16న స్టాక్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. ఇష్యూ ధరతో పోల్చితే 19 శాతం లాభపడింది. ఇక ఛాలెట్ హోటల్స్ లిమిటెడ్ 17 శాతం, క్సెల్ప్మ్యాక్ డిజైన్ అండ్ టెక్ షేర్ 9 శాతం చొప్పున పెరిగాయి. ఈ రెండు షేర్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. ఇక ఈ నెల 15న స్టాక్ మార్కెట్లో లిస్టైన మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ షేర్ 7 శాతం లాభపడింది. కలసివచ్చిన మార్కెట్ ట్రెండ్... ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో కొత్తగా లిస్టైన ఈ ఆరు కంపెనీలు తమ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రైస్‌బ్యాండ్‌ను ఆకర్షణీయంగా నిర్ణయించాయని విశ్లేషకులంటున్నారు. అంతేకాకుండా మార్కెట్ ట్రెండ్ పాజిటివ్‌గా ఉండటం కూడా కలసిరావడంతో ఈ కొత్త కంపెనీలు మంచి లాభాల్లో ట్రేడవుతున్నాయని వారు పేర్కొన్నారు. ఒక్క కంపెనీయే కిందకు.. ఈ ఏడాది లిస్టైన కంపెనీల్లో ఒక్క కంపెనీయే ఇన్వెస్టర్లకు నష్టాలను మిగిల్చింది. ఈ ఏడాది మార్చి 29న స్టాక్ మార్కెట్లో లిస్టైన ఎమ్‌ఎస్‌టీసీ షేర్ 18 శాతం పతనమైంది. ఇన్వెస్టర్ల నుంచి స్పందన సరిగ్గా లేకపోవడంతో ఈ ఐపీఓను పొడిగించారు. అంతేకాకుండా ప్రైస్‌బ్యాండ్‌ను కూడా సవరించారు. కాగా నియోజెన్ కెమికల్స్ ఐపీఓ గత శుక్రవారమే పూర్తయింది. ఈ షేర్ ఈ నెల 8న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నది. -
రైల్వే బడ్జెట్.. అన్నింటికీ కలిపి రూ.473.28 కోట్లే..
కొత్త లైన్లు, డబ్లింగ్, గేజ్ మార్పిడి.. తదితర పనుల కోసం ప్రణాళికా వ్యయం కింద సుమారు రూ. 473.28 కోట్లు మాత్రమే కేటాయించారు. అందులో స్వర్ణ చతుర్భుజి, పోర్టుల అనుసంధానం ప్రాజెక్టుల అమలుకు ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) అయిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) అమలు చేస్తున్న ప్రాజెక్టులనూ చూపించారు. ఆర్వీఎన్ఎల్ నిధులు సమకూర్చుకోవడంలో రైల్వే శాఖ అన్ని రకాలుగా సహకరిస్తుంది. కానీ ప్రాజెక్టుల వారీగా నేరుగా నిధులు కేటాయించదు. ఆర్వీఎన్ఎల్ ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను మినహాయిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో పనుల కోసం రైల్వే కేటాయించిన నిధులు సుమారు రూ.152.28 కోట్లే. 142 కిలోమీటర్ల పొడవైన కంభం-ప్రొద్దుటూరు కొత్త లైన్‌కు కేవలం రూ. 10 లక్షలు కేటాయించారు. మరీ కంటితుడుపు కేటాయింపులకు ఇదో ఉదాహరణ. మరికొన్ని కేటాయింపులు ఇలా ఉన్నాయి.. * కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సొంత మండలం వెంకటాచలం మీదు గా కృష్ణపట్నం వరకు కొత్త రైల్వే లైన్ (ఆర్వీఎన్ఎల్ ప్రాజెక్టు)కు బడ్జెట్లో రూ. 208 కోట్లు కేటాయించారు. ఓబుళవారిపల్లె - వెంకటాచలం మీదుగా కృష్ణపట్నం పోర్టు వరకు ఈ లైన్ నిర్మిస్తారు. * కడప - బెంగళూరు రైల్వే లైన్ (255.4 కిలోమీటర్లు)లో పెండ్లిమర్రి వరకు నిర్మాణం పూర్తయింది. ఇందుకు రూ.210 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టుకు ఈసారి బడ్జెట్లో కేవలం రూ.30 కోట్లు కేటాయించారు. రాయలసీమలో సరకు రవాణాకు, ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడే ఈ ప్రాజెక్టును అప్రాధాన్య కోటాలో వేశారు. * కదిరి- పుట్టపర్తి, కాకినాడ - నిజాంపట్నం ఓడరేవు క్తొత రైల్వే మార్గాలకు నిధుల కేటాయింపులు లేవు. * కొండపల్లి - కొత్తగూడెం రైల్వే లైన్ నిర్మాణానికి రూ.611 కోట్లు అవసరమైతే రూ.5 కోట్లు మాత్రమే కేటాయించారు. * 2006లో ఆమోదముద్ర వేసిన జగ్గయ్యపేట - మల్లెలచెరువు లైను నిర్మాణానికి రూ.60 కోట్లే కేటాయించారు. ఇంకా రూ.100 కోట్లు అవసరం. * కొవ్వూరు- భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 912 కోట్లు అవసరం కాగా రూ.10 కోట్లు కేటాయించారు. * గూడూరు-దుగరాజపట్నం రైల్వే లైను (41.55కిలోమీటర్లు)కు రూ. 272 కోట్లు అవసరం కాగా రూ. 5 కోట్లతో సరిపెట్టారు * నంద్యాల -ఎర్రగుంట్ల మార్గానికి (126 కిలోమీటర్లు) రూ.80 కోట్లు ఇచ్చారు. * కాకినాడ - పిఠాపురం లైనుకు (21.5 కిలోమీటర్లు) రూ.కోటి ఇచ్చారు. * కోటిపల్లి - నర్సాపూర్ మార్గానికి (57.21 కి.మీ) రూ.10 కోట్లు. * నడికుడి - శ్రీకాళహస్తి లైనుకు (309 కిలోమీటర్లు) రూ.10 కోట్లు ఇచ్చారు. * విజయవాడ- గుడివాడ- మచిలీపట్నం- భీమవరం- నర్సాపురం- నిడదవోలు లైను డబ్లింగ్, విద్యుదీకరణకు రూ.712 కోట్లు అవసరమైతే గత బడ్జెట్లో రూ 40 కోట్లు కేటాయించగా, ఈసారి రూపాయీ కేటాయించలేదు. * గూడూరు-రేణిగుంట-తిరుపతి (92.34 కిలోమీటర్లు) డబ్లింగ్‌కు రూ.5 కోట్లు ఇచ్చారు. * ఆర్వీఎన్ఎల్ చేపట్టే గుత్తి-రేణిగుంట డబ్లింగ్‌కు రూ.4.18 కోట్లు, వెంకటాచలం - కృష్ణపట్నం డబ్లింగ్‌కు రూ.15 కోట్లు, గుంటూరు - తెనాలి డబ్లింగ్‌కు రూ.58 కోట్లు, విజయవాడ- గుడివాడ- భీమవరం డబ్లింగ్‌కు రూ.20 కోట్లు, గుంతకల్-రాయచూర్ డబ్లింగ్‌కు రూ.20 కోట్లు కేటాయించారు. * గుంటూరు - గుంతకల్ - కల్లూరు మార్గం గేజ్ మార్పిడికి (76 కిలోమీటర్లు) రూ.7 కోట్లు కేటాయించారు. * బీబీ నగర్ - గుడివాడ డబ్లింగ్, విద్యుదీకరణ, తిరుపతి-కాట్పాడి డబ్లింగ్, పాకాల - ధర్మవరం విద్యుదీకరణ పనులకు మోక్షం కలగలేదు. * గూడూరు - విజయవాడ మధ్య మూడో లైను, మంత్రాలయం రోడ్ - కర్నూలు, బిట్రగుంట - దొనకొండ, పిడుగురాళ్ల - నర్సరావుపేట, మార్కాపురం రోడ్డు - శ్రీశైలం, బాపట్ల - నిజాంపట్నం - రేపల్లె, గిద్దలూరు - బాకర్‌పూర్, నంద్యాల - ఆత్మకూరు, మచిలీపట్నం - రేపల్లె, విశాఖ - భద్రాచలం కొత్త రైల్వే లైన్లకు, గుంటూరు - గుంతకల్, తెనాలి - రేపల్లె డబ్లింగ్, విద్యుదీకరణ పనుల సర్వేలకు ఈ బడ్జెట్లో చోటు దక్కలేదు. -
రెండోదశకు పచ్చజెండా!
సాక్షి,సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రెండోదశలో వేగం పెరిగింది. వచ్చే అక్టోబర్ నుంచి పనులను ప్రారంభించి మూడేళ్లలో మొత్తం 84 కిలోమీటర్లు పూర్తి చేసేందుకు రైల్‌వికాస్ నిగమ్ లిమిటెడ్ కార్యాచరణకు దిగింది. ఈ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు ఆరు బడా కంపెనీలు రంగంలోకి దిగగా.. ఈ కంపెనీల నుంచి అందిన టెక్నికల్ బిడ్ల పరిశీలన పూర్తయింది. త్వరలో ఫైనాన్షియల్ బిడ్లను కూడా పరిశీలించి అర్హత సాధించిన కంపెనీలకు పనులను అప్పగించేందుకు అధికారులు పనుల వేగం పెంచారు. దక్షిణమధ్య రైల్వే, రాష్ట్రప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో అమలువుతోన్న రెండోదశ పూర్తయితే ఘట్కేసర్,మేడ్చల్, పటాన్చెరు, శంషాబాద్‌లకు రైళ్ల రాకపోకలు పెరుగుతాయి. ప్రస్తుతం లక్షన్నరమంది ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటుండగా, రెండోదశవల్ల మరో రెండు లక్షలమందికి అదనంగా ప్రయాణ సదుపాయం లభించనుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సైతం ఎంఎంటీఎస్ రైలు నడిపేందుకు జీఎమ్మార్ సంస్థ సుముఖతను వ్యక్తం చేయడంతో మూడేళ్లలో ఉందానగర్ నుంచి శంషాబాద్ వరకు కూడా రెండోదశ పూర్తి చేయనున్నట్లు రైల్‌వికాస్ నిగమ్ లిమిటెడ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2016 నాటికి ప్రతిపాదిత రెండో దశ మొత్తం పూర్తమవుతుందని, 80 శాతానికి పైగా స్థల సేకరణ పూర్తయ్యిందని పేర్కొన్నారు. మొదట రూ.642 కోట్లతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు అంచనా ప్రస్తుతం రూ.816.55 కోట్లకు పెరిగింది. ఇందులో రాష్ట్రప్రభుత్వం 2/3 వంతు, రై ల్వే 1/3 వంతు చొప్పున నిధులు సమకూరుస్తున్నాయి. రెండో దశ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు ఎల్అండ్టీ(ఫరీదాబాద్),జీఎమ్మార్ (బెంగళూరు),బాల్‌ఫోర్‌బెట్టి (న్యూఢిల్లీ),సింప్లెక్స్ (కోల్కత్తా),కేఇసి, ఎస్ఈడబ్ల్యూ (హైదరాబాద్)కంపెనీలు తీవ్రంగాపోటీపడుతున్నాయి. రెండోదశ మార్గాలివే.. ఘట్కేసర్ నుంచి మౌలాలి వరకు 14 కిలోమీటర్లు ప్రస్తుతం ఉన్నవాటితో పాటు రెండు కొత్త లైన్లుతో విద్యుదీకరిస్తారు. దీంతో ఈ మార్గంలో 4 లైన్లు అందుబాటులోకి వస్తాయి. సనత్‌నగర్ నుంచి మౌలాలి వరకు 23 కిలోమీటర్ల లైన్లు డబ్లింగ్ చేసి విద్యుదీకరించాల్సి ఉంది. ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు ఉన్న సింగిల్‌లైన్ డబుల్ చేసి విద్యుదీకరిస్తారు. బొల్లారం-మేడ్చల్ మధ్య 14 కిలోమీటర్ల లైన్లు డబ్లింగ్ చేసి విద్యుదీకరిస్తారు. సికింద్రాబాద్ నుంచి బొల్లారం వరకు మరో 14 కిలోమీటర్లు విద్యుదీకరించాల్సి ఉంది. తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 10 కి.మీ పాత లైన్లను ఈ ప్రాజెక్టులో పునరుద్ధరిస్తారు. రెండోదశ వల్ల ఫిరోజ్‌గూడ, సుచి త్ర జంక్షన్, బీహెచ్ఈఎల్,భూదేవీనగర్,మౌలాలి హౌసింగ్‌బోర్డు కాలనీలలో కొత్తగా ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.