రెండోదశకు పచ్చజెండా! | In the second step, the greenlight! | Sakshi
Sakshi News home page

రెండోదశకు పచ్చజెండా!

Published Sun, Aug 25 2013 1:49 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM

రెండోదశకు పచ్చజెండా!

రెండోదశకు పచ్చజెండా!

సాక్షి,సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రెండోదశలో వేగం పెరిగింది. వచ్చే అక్టోబర్ నుంచి పనులను ప్రారంభించి మూడేళ్లలో మొత్తం 84 కిలోమీటర్లు పూర్తి చేసేందుకు రైల్‌వికాస్  నిగమ్ లిమిటెడ్ కార్యాచరణకు దిగింది. ఈ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు ఆరు బడా కంపెనీలు రంగంలోకి దిగగా.. ఈ కంపెనీల నుంచి అందిన టెక్నికల్ బిడ్‌ల పరిశీలన పూర్తయింది. త్వరలో ఫైనాన్షియల్ బిడ్లను కూడా పరిశీలించి అర్హత సాధించిన కంపెనీలకు పనులను అప్పగించేందుకు అధికారులు పనుల వేగం పెంచారు. 
 
దక్షిణమధ్య రైల్వే, రాష్ట్రప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో అమలువుతోన్న రెండోదశ పూర్తయితే ఘట్‌కేసర్,మేడ్చల్, పటాన్‌చెరు, శంషాబాద్‌లకు రైళ్ల రాకపోకలు పెరుగుతాయి. ప్రస్తుతం లక్షన్నరమంది ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటుండగా, రెండోదశవల్ల మరో రెండు  లక్షలమందికి అదనంగా ప్రయాణ సదుపాయం లభించనుంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సైతం ఎంఎంటీఎస్ రైలు నడిపేందుకు జీఎమ్మార్ సంస్థ సుముఖతను వ్యక్తం చేయడంతో మూడేళ్లలో ఉందానగర్ నుంచి శంషాబాద్ వరకు కూడా రెండోదశ పూర్తి చేయనున్నట్లు రైల్‌వికాస్ నిగమ్ లిమిటెడ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 
 
2016 నాటికి  ప్రతిపాదిత రెండో దశ మొత్తం పూర్తమవుతుందని, 80 శాతానికి పైగా స్థల సేకరణ పూర్తయ్యిందని పేర్కొన్నారు. మొదట రూ.642 కోట్లతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు అంచనా ప్రస్తుతం రూ.816.55 కోట్లకు పెరిగింది. ఇందులో రాష్ట్రప్రభుత్వం  2/3 వంతు,  రై ల్వే 1/3 వంతు చొప్పున నిధులు సమకూరుస్తున్నాయి. రెండో దశ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు ఎల్‌అండ్‌టీ(ఫరీదాబాద్),జీఎమ్మార్ (బెంగళూరు),బాల్‌ఫోర్‌బెట్టి (న్యూఢిల్లీ),సింప్లెక్స్ (కోల్‌కత్తా),కేఇసి, ఎస్‌ఈడబ్ల్యూ (హైదరాబాద్)కంపెనీలు తీవ్రంగాపోటీపడుతున్నాయి. 
 రెండోదశ మార్గాలివే.. 
 
ఘట్‌కేసర్ నుంచి మౌలాలి వరకు 14 కిలోమీటర్లు ప్రస్తుతం ఉన్నవాటితో పాటు రెండు కొత్త లైన్లుతో విద్యుదీకరిస్తారు. దీంతో ఈ  మార్గంలో 4 లైన్‌లు  అందుబాటులోకి వస్తాయి.
 
సనత్‌నగర్ నుంచి మౌలాలి వరకు 23 కిలోమీటర్ల  లైన్‌లు డబ్లింగ్ చేసి విద్యుదీకరించాల్సి ఉంది. 
 
ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు ఉన్న సింగిల్‌లైన్ డబుల్ చేసి విద్యుదీకరిస్తారు.
 
బొల్లారం-మేడ్చల్ మధ్య 14 కిలోమీటర్ల లైన్‌లు డబ్లింగ్ చేసి విద్యుదీకరిస్తారు.
 
సికింద్రాబాద్ నుంచి  బొల్లారం వరకు మరో 14 కిలోమీటర్లు విద్యుదీకరించాల్సి ఉంది. 
 
తెల్లాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు 10 కి.మీ పాత లైన్‌లను ఈ ప్రాజెక్టులో పునరుద్ధరిస్తారు. రెండోదశ వల్ల  ఫిరోజ్‌గూడ, సుచి త్ర జంక్షన్, బీహెచ్‌ఈఎల్,భూదేవీనగర్,మౌలాలి హౌసింగ్‌బోర్డు కాలనీలలో కొత్తగా ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement