సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో నేడు ప్రవేశపెట్టనున్న మోడీ సర్కార్ మొట్టమొదటి బడ్జెట్‌పై నగరవాసులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న ఈ సాధారణ బడ్జెట్‌లో రాజధానికి కేటాయింపులు పదిశాతం పెరుగుతాయని భావిస్తున్నారు. కరెంటు సమస్య పరిష్కారం కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని, దీంతో విద్యుత్ చార్జీలు కూడా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. నీటిసరఫరా సమస్యపై కూడా కేంద్రం దృష్టి సారిస్తుందని చెప్పుకొంటున్నారు. ఇక నగరంలో మరో ప్రధాన సమస్య అయిన యమునా నది పునరుద్ధరణకు మోడీ సర్కార్ తప్పకుండా ప్రాధాన్యత ఇస్తుందని ఆశిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించవచ్చని కూడా అంటున్నారు.
యమునా నదిని పునరుద్ధరించాలంటే యమనా నదిలోకి విడుదల చేసే మురుగు నీటిని శుద్ధి చేయవలసి ఉంటుంది కనుక సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల కోసం, సీవేజ్ సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సి ఉంటుందని, దీనిపై మోడీ ప్రభుత్వం తప్పకుండా దృష్టి సారిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 40 శాతం మాత్రమే మురుగునీటిని శుద్ధి చేసే ఏర్పాట్లు నగరంలో ఉన్నాయి. బడ్జెట్ తర్వాత పరిస్థితి మరింత మెరుగుపడవచ్చని చెబుతున్నారు. చారిత్రక కట్టడాల సుందరీకరణ కూడా ప్రాధాన్యమైన అంశమే కావడంతో ఇందుకోసం కనీసం 20 కోట్ల రూపాయలనైనా కేటాయిస్తారని చెబుతున్నారు.
ఢిలీ, ఎన్సీఆర్‌ల మధ్య రవాణా సదుపాయాల కోసం కూడా ఆశించినస్థాయిలోనే నిధులను జైట్లీ కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులకు కూడా కేటాయింపులు పెంచవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సేఫ్ సిటీ ప్రాజెక్టు కోసం 1,259 కోట్లు, పోలీస్ స్టేషన్లు, గృహవసతి, కార్యాలయ భవనాల కోసం 1,790 కోట్ల రూపాయలు కేటాయించాలని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. 1 కోటీ 70 లక్షల జనాభా గల ఢిల్లీలో పోలీసు బలగాలను పెంచాలని, ఇందుకోసం కొత్త నియామకాలు జరపాలని, శిక్షణ కోసం అధిక నిధులు కేటాయించాలని కూడా ఢిల్లీ పోలీసులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ఢిల్లీ పోలీసుల డిమాండ్లు కొంతమేరైనా నెరవేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మొత్తానికి మోడీ సర్కార్ బడ్జెట్‌పై నగరవాసుల అంచనాలు భారీగానే ఉన్నా అరుణ్ జైట్లీ ఏమేరకు కరుణిస్తారో చూడాలి.
ఆశల పల్లకిలో...
Published Wed, Jul 9 2014 11:04 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement