మెరుపులు... విరుపులు
పాతబాణీలోనే...
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు సరైన నిర్ణయాలు లేవు. ధరల నియంత్రణ ఆశయంతో నిధులను కేటాయించినప్పటికీ సంచలనాత్మక మార్పులేవీ లేవు. సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు కేటాయించటం ద్వారా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనివ్వటం హర్షణీయం. ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించటం ద్వారా దేశాన్ని వ్యవసాయ రంగంలో ముందుకు నడిపేందుకు తగిన అవకాశాన్ని కల్పించారు. సిగరెట్స్, ఖైనీలు, గుట్కాలపై పన్నులను అధిక మొత్తంలో పెంచటం మంచిది. ఆదాయపు పన్ను పరిమితిని 2లక్షలనుంచి 2.50 లక్షలకు పెంచారు. ఈ పరిమితిని 3 లక్షలకు పెంచితే బాగుండేది. పవర్ సెక్టార్‌పై పన్ను మినహాయింపు మరో పదేళ్ల పాటు పెంచటం కుటీర, మధ్య తరహా పరిశ్రమలకు అనుకూలం. గంగానది ప్రక్షాళనకు రూ.2వేల కోట్లు కేటాయించారు. ఈ ప్రభావం ద్రవ్యోల్బణంపై పడే అవకాశం ఉంది.
- ఈ.ఆర్ .సోమయాజులు (రాంజీ ),
ప్రముఖ చార్డెట్ అకౌంటెంట్
రక్షణ రంగంలో ఎఫ్‌డీఐ శాతం పెంచడమా...?
రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడం వల్ల మనకు భవిష్యత్‌లో నష్టం కలుగుతుంది. ఈ రంగంలో పెట్టుబడుల శాతం 49 వరకు పెంచి కేంద్రం తప్పుచేస్తోంది.
- గంగుల మదన్‌మోహన్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు,
బొబ్బిలి
మన రాష్ట్రానికి ప్రాధాన్యమేదీ?
రాష్ట్ర విభజనతో కనీసం రాజధాని కూడా లేకుండా పోయిన మన రాష్ట్రానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. లోటుబడ్జెట్‌తో ఉన్నామని చెప్పుకుంటున్న రాష్ట్ర పాలకులు ఏమీ చేయలేకపోయారు.
- జరజాపు సూరిబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాలూరు పట్టణ కన్వీనర్, సాలూరు
కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన బడ్జెట్ సంపన్నులకు మేలు చేసేదిగా ఉంది. పేదలకు మేలుకు బదులుగా కీడు కలిగించేదిగా ఉంది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు తదితర ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు తగ్గితే అవి వాడేది డబ్బున్నవారు కాబట్టి వారికే అది ఉపయోగపడేలా ఉంది.
- మజ్జి వెంకటేష్, పట్టణాధ్యక్షులు వైఎస్సార్ సీపీ, పార్వతీపురం
మోడీ సర్కారు పేదలదన్నారు...
మోడీ సర్కారు పేదల సర్కారని ఊదరగొట్టారు. మరి పేదలకు ఈ బడ్జెట్ ఒరిగిందేమీ లేదు. పేదలు ఉపయోగించే పలు వస్తువులపై సుంకం పెంచడం, ధరలు పెంచడం చేసింది. ఉపాధి, ఉద్యోగాలు కల్పించి వలసలు ఆపే పరిస్థితి లేదు. - జి.ఉదయభాను,
వైఎస్సార్ సీపీ నాయకులు, పార్వతీపురం
ఏదీ గిరిజన యూనివర్శిటీ ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ మంజూరు చేస్తామన్నారు. కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు కూడా విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. కానీ కేంద్ర బడ్జెట్‌లో ఆ ప్రస్తావనే లేదు. రాష్ట్ర విభజనకు పచ్చజెండా ఊపి, తనవంతు అభివృద్ధికి సహకరిస్తానని చెప్పిన బీజేపీ బడ్జెట్‌లో చిన్నచూపే చూపింది.
- వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్, సాలూరు
రైతుల మాటేంటి...?
ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఎలాంటి ప్రయోజనాన్నీ చేకూర్చలేదు. రైతుల రుణమాఫీకి మనకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. చంద్రబాబుకు మోడీ ఎలాంటి సహాయం చేసినట్లు కనిపించలేదు బడ్జెట్‌లో.
రాష్ట్ర నిర్మాణానికి నిధులేవీ..?
వేమిరెడ్డి లక్ష్మునాయుడు, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు, బొబ్బిలి
మోడీ సర్కారు రాష్ట్ర పునర్నిర్మాణానికి నిధులు కేటాయించకుండా బడ్జెట్ ప్రవేశ పట్టింది. చంద్రబాబునాయుడు మోడీకి మంచి మిత్రుడేమో...? నిధులు మోడీ ఎందుకు విదల్చలేదో...? దీని వల్ల మన రాష్ట్రానికి ఇబ్బందే కదా.. ఈ బడ్జెట్ ఊహించినంత బాగోలేదు.
- గోర్జ వెంకటమ్మ, ఎంపీపీ, బొబ్బిలి