ట్యాక్సీ టాప్‌పై సోదరుడి మృతదేహాన్ని కట్టి..
200 కిలోమీటర్ల దూరంలోని సొంతూరుకు తీసుకెళ్లిన మహిళ
ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్‌గఢ్‌లో ఘటన
హల్దా్వనీ: ప్రైవేట్ అంబులెన్సు నిర్వాహకులు అడిగినంత ఇచ్చుకోలేని ఓ పేద మహిళ..తన సోదరుడి మృతదేహాన్ని ట్యాక్సీ పైన కట్టుకుని 200 కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామానికి తీసుకెళ్లాల్సి వచి్చంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్‌గఢ్ జిల్లాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. విషయం తెలిసిన సీఎం పుష్కర్‌సింగ్ ధామి ఘటనపై దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్య తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పితోర్‌గఢ్ జిల్లా బెరినాగ్ గ్రామంలో శివానీ(22) అనే మహిళ సోదరుడు అభిషేక్(20) కలిసి ఉంటోంది. శుక్రవారం అభిషేక్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. రైలు పట్టాల పక్కన అపస్మారక స్థితిలో పడిపోయిన అతడిని శివానీ చికిత్స కోసం హల్దా్వనీలోని సుశీలా తివారీ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకొచి్చంది. అప్పటికే అతడు చనిపోయినట్లు పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు శనివారం అభిషేక్ మృతదేహాన్ని శివానీకి అప్పగించారు.
సొంతూరుకు తీసుకెళ్లేందుకు ఆస్పత్రి పక్కనే ఉన్న అంబులెన్సుల నిర్వాహకులను ప్రాధేయపడగా రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చవుతుందని వారు చెప్పారు. అంత డబ్బులేకపోవడంతో ఆమె తమ గ్రామానికి చెందిన ట్యాక్సీ డ్రైవర్‌ను బతిమాలుకుంది. అతడు సరే అనడంతో సోదరుడి మృతదేహాన్ని ట్యాక్సీపైన ఉంచి, తాడుతో కట్టేసింది. అక్కడి నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామానికి చేరుకుంది. ఈ విషయం సీఎం పుష్కర్ సింగ్ ధామి దృష్టికి రావడంతో ఆయన దర్యాప్తునకు ఆదేశించారు. అయితే, ఆస్పత్రి ఆవరణ వెలుపల జరిగిన ఘటనతో తమకు తెలియలేదని సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ జోషి చెప్పారు. తెలిసినట్లయితే సాయం చేసి ఉండేవారమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment