Poor woman
-
పల్లె కుసుమం.. బెంగుళూరు డీఆర్డీఏలో శాస్త్రవేత్తగా కొలువు
సాక్షి, వరంగల్: కృషి, పట్టుదల ఉంటే పేదరికం అడ్డు కాదని ఓ యువతి నిరూపించింది. నిరుపేద చేనేత కార్మికుడి కూతురు బెంగుళూరు డీఆర్డీఏలో శాస్త్రవేత్తగా కొలువు సంపాదించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆ యువతి తండ్రి సంరక్షణలో పెరిగి ఇంతటి ఘన కీర్తిని సొంతం చేసుకున్న ఆ పల్లె కుసుమం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన వనం ఉమాదేవి-సదా నందం దంపతుల కూతురే ఈ రాజ్యలక్ష్మి. సదా నందం దంపతులకు ఇద్దరు సంతానంలో రాజ్యలక్ష్మి పెద్దది.. తల్లి ఉమాదేవి 2004లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. అప్పటి నుంచి తండ్రి సదానందం పిల్లలకు అన్నీతానై అల్లారు ముద్దుగా పెంచాడు. చేనేత కార్మికుడిగా వచ్చేది చాలీచాలని సంపాదనే అయినా పిల్లల చదువు విషయంలో రాజీ పడలేదు. ఇల్లందలోనే ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి దాకా చదివిన రాజ్య లక్ష్మి, ఇంటర్ పూర్తయ్యాక బాసర ట్రిపుల్ ఐటీలో సీటు (బీటెక్ - కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్) సంపాదించి ఉన్నత విద్యపూర్తి చేసింది ఆమె ప్రతిభను గుర్తించిన అక్కడి అధ్యాపకులు అక్కడే ఆమెకు గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసే అవకాశం కల్పించారు. అక్కడ పనిచేస్తూ అహర్నిశలు కష్టపడింది. ఈ క్రమంలో ఆమె వివాహం ప్రశాంత్‌తో అయ్యింది. భర్త, అత్తమామల ప్రోత్సాహంతో పరీక్షలు రాసి బెంగుళూరులోని డీఆర్డీఏలో కేటగిరీ-బీలో సైంటిస్ట్‌గా ఉద్యోగం సాధించినట్లు రాజ్యలక్ష్మి తెలిపింది. ఎన్నో కష్టాలను అధిగమించి అహర్నిశలు శ్రమిస్తే గాని ఈ ఉద్యోగం తనని భరించలేదని రాజ్యలక్ష్మి చెబుతోంది. తనకు పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చదివి శాస్త్రవేత్తగా ఉద్యోగం సాధించాలని చెబుతోంది. తన విద్యాభ్యాసంలో తోడ్పాటు అందించిన అధ్యాపకులను గుర్తుచేసుకొని తన కృతజ్ఞతలు తెలిపింది. గ్రామీణ ప్రాంతం నుండి ఓ యువతి బెంగళూరు డిఆర్డిఏ లో శాస్త్రవేత్తగా ఎంపిక కావడం పట్ల తన తండ్రి సదానందం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన కూతురు సాధించిన ఘనత మా కష్టాలను దూరం చేసిందని తెలిపారు. నిరుపేద కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులో రాణించి యువ శాస్త్రవేత్తగా ఎంపికైన రాజ్యలక్ష్మి ప్రయాణం నేటి యువతకు ఆదర్శమని చెప్పాలి. -
ఒక ప్రాణం.. మూడు వేల కిలోమీటర్ల ప్రయాణం
అన్నిదానాల్లోకెల్లా అవయవదానం గొప్పదంటారు వైద్యులు. ఎందుకంటే.. ఒకరు కన్నుమూసినా.. మరికొందరి ప్రాణాలు నిలబెట్టొచ్చు కాబట్టి. పరిస్థితులు ఎలాంటివైనా పోతూ పోతూ.. ఇంకోన్ని ప్రాణాలు నిలబెట్టినవాళ్లకు, నిలబెడుతున్నవాళ్లకు జోహార్లు. ఇదిలా ఉండగా.. ఎక్కడో దేశం చివర ఉన్న ఓ పేషెంట్ కోసం ఈ చివర ఉన్న దాత నుంచి గుండె ప్రయాణించిన ఘట్టం ఇది.. జమ్ము కశ్మీర్ శ్రీనగర్‌లో ఉండే షాజాదీ ఫాతిమా(33).. గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతోంది. నానాటికీ ఆమె పరిస్థితి దిగజారడంతో గుండె మార్పిడి తప్పనిసరిగా మారింది. ఎంజీఎం హెల్త్‌కేర్‌లో ఫాతిమాను చేర్పించి.. ఆమెకు సరిపోయే గుండె కోసం దేశం మొత్తం జల్లెడ పట్టారు. ఈలోపు జనవరి 26న తమిళనాడు తిరుచురాపల్లిలో బ్రెయిన్ డెడ్ అయిన 18 ఏళ్ల టీనేజర్ గుండె.. ఫాతిమాకు మ్యాచ్ అయ్యింది. దీంతో గ్రీన్ కారిడార్ ద్వారా తమిళనాడు నుంచి కశ్మీర్‌కు తరలించారు. హై రిస్క్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా ఫాతిమాకు గుండెను అమర్చారు. కొన్నాళ్లకు.. పూర్తిగా కోలుకున్న ఫాతిమా సంతోషకరమైన జీవితాన్ని మొదలుపెట్టింది. ఫాతిమా అవివాహిత. సోదరుడితో ఉంటూ కూలీ పనులు చేసుకుంటోంది. తన ఆరోగ్య సమస్యపై కనీసం మందులు కూడా కొనుక్కోలేని స్థితి ఆమెది. అందుకే ఐశ్వర్య ట్రస్ట్ అనే ఎన్జీవో ముందుకు వచ్చి సాయం చేసింది. ఫండింగ్ ద్వారా గుండె మార్పిడి చేయించింది. ప్రాణాలను నిలబెట్టే ఇటువంటి మార్పిడికి చాలామంది సమన్వయం, మద్దతు అవసరం. నిజంగా ఫాతిమా కేసు సమిష్టి కృషి ప్రతిఫలం. -
నిలువ నీడ లేని ఆడ బిడ్డ..
ఈమె పేరు కొప్పుల నాగమణి. స్వగ్రామం కృష్ణా జిల్లా చోడవరం. కొన్నేళ్ల కిందట భర్త చనిపోయాడు. పెళ్లిళ్లలో వంట చేస్తూ ఉపాధి పొందుతోంది. ఎక్కడికెళ్లినా... దివ్యాంగురాలైన కూతురిని తనతోపాటు తీసుకెళ్తూ కంటికి రెప్పలా చూసుకుంటోంది. సొంత ఇల్లు లేని నాగమణికి... ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రకటించిన ఎన్టీఆర్ హౌసింగ్ పథకంలోనైనా పక్కా గృహం వస్తుందని ఆశిస్తే నిరాశే మిగిలింది. అధికార పార్టీ స్థానిక నాయకులను కలిసినా ఫలితం లేకపోయిందని వాపోతోంది. తనకున్న కొద్దిపాటి స్థలంలో ఇల్లు కట్టుకుంటానని అధికారులను వేడుకుంటే, పునాది వేశాకే డబ్బు మంజూరు చేస్తామంటున్నారు. ఆ స్థాయి స్థోమత కూడా లేని నాగమణి ఇదుగో ఇలా స్థలం చుట్టూ పాక వేసుకుని, ఇంటికి రక్షణగా ఫ్లెక్సీలను ఉంచి జీవనం వెళ్లదీస్తోంది. -
నిరుపేదను.. గుండెమార్పిడి చేయండి: జ్యోతి
పంజగుట్ట (హైదరాబాద్): గుండె జబ్బుతో బాధపడుతున్న తనను ఆదుకోవాలని ఓ నిరుపేద యువతి నిమ్స్ జీవన్‌దాన్‌లో దరఖాస్తు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల శ్రీరామ్పూర్కు చెందిన ఆర్ జ్యోతి (23) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఆమె ఇటీవల నిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించుకోగా గుండె మార్పిడి చేయాల్సిన అవసరముందని వైద్యులు సూచించారు. దీంతో నిమ్స్ జీవన్‌దాన్ పథకంలో గుండె దాత కోసం ఆమె దరఖాస్తు పెట్టుకుంది. తన తల్లిదండ్రులు ఇద్దరూ అనారోగ్యంతో మృతి చెందారని, తనకు సాయం చేయాల్సిందిగా నిమ్స్ జివన్దాన్ ప్రతినిధి అనూరాధను వేడుకుంది. జ్యోతిని అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని అనురాధ తెలిపారు. -
లక్ష్యం చేరని సురక్ష
- సక్రమంగా అమలు కాని జేఎస్ఎస్కే, జేఎస్వై - జిల్లాలో మిగిలిపోతున్న రెండు పథకాల నిధులు - పేద గర్భిణులకు అవగాహన కల్పించని అధికారులు - ప్రభుత్వాస్పత్రుల్లో అరకొరగా గైనకాలజిస్టులు రామచంద్రపురం : జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా నిరుపేదలైన తల్లీబిడ్డల సంక్షేమం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన జననీ శిశు సురక్ష కార్యక్రమాన్ని (జేఎస్ఎస్కే) జిల్లాలో అమలు చేయటంలో అధికారులు విఫలమవుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సురక్షిత ప్రసవానికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్న అవగాహనను పేదగర్భిణులకు కల్పించలేకపోవడంతో వారు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పేద మహిళలకు ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలందించి తల్లీబిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వాలనేది జేఎస్ఎస్కే లక్ష్యం. ఈ పథకం కింద గర్భిణులు ఆస్పత్రుల్లో చేరేందుకు అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తారు. శస్త్రచికిత్స, రక్త పరీక్షలు, రక్తం ఎక్కించాల్సి వస్తే ఆ ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. శిశువుకు అవసరమైన మందులన్నింటినీ ఉచితంగానే ఇచ్చి, బాలింతను ఆస్పత్రి నుంచి ఇంటికి సురక్షితంగా పంపిస్తారు. ఈ పథకానికి నిధులను ప్రభుత్వం సకాలంలో విడుదల చేస్తోంది. జిల్లాలో 11 ప్రభుత్వాస్పత్రులతో పాటు 24 గంటలూ పనిచేసే 33 పీహెచ్సీలలో ఈ పథకం అమలులో ఉంది. రాజమండ్రి జిల్లా ఆస్పత్రి, అమలాపురం, రామచంద్రపురం, తుని, రాజోలు, కొత్తపేట, రంపచోడవరం, పెద్దాపురం, ప్రత్తిపాడు, వై.రామవరం, అనపర్తి ఏరియా ఆస్పత్రులకు గత ఏడాది ఈ పథకం కింద రూ.6.76 కోట్లు విడుదల చేయగా రూ.4.30 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. డబ్బులు గుంజుతున్న సిబ్బంది జేఎస్ఎస్కే సక్రమంగా అమలు జరగాలంటే ప్రభుత్వాస్పత్రుల్లో గైనకాలజిస్టులు ఉండి తీరాలి. కాకినాడ జీజీహెచ్ మినహా 250 పడకలున్న రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో ఆరుగురు గైనకాలజిస్టులుండాలి. కానీ ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. 100 పడకల రామచంద్రపురం, అమలాపురం, తుని ఏరియా ఆసుపత్రుల్లో నలుగురు చొప్పున ఉండాల్సి ఉండగా ఇద్దరు లేక ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు. పెద్దాపురం, కొత్తపేట ఏరియా ఆస్పత్రుల్లో ఒక్కొక్కరే ఉండగా ప్రత్తిపాడు, వై.రామవరం, రంపచోడవరం, అనపర్తి ఏరియా ఆస్పత్రుల్లో అసలు గైనకాలజిస్టులే లేరు. జేఎస్ఎస్కే ద్వారా ప్రభుత్వాస్పత్రికి ప్రైవేటు డాక్టర ్లను తీసుకువచ్చి సిజేరియన్ చేయించే అవకాశముంది. శస్త్రచికిత్స చేసిన వైద్యునికి రూ.1200 నుంచి రూ.1700, మత్తు వైద్యునికి రూ.1000 నుంచి రూ.1500 వరకు ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే దీన్ని అవకాశంగా మలచుకుని ప్రభుత్వాస్పత్రిలో సిజేరియన్ చేయించుకున్న పేద గర్భిణుల నుంచి సిబ్బంది రూ.2500 నుంచి రూ.3 వేల వరకు గుంజుతున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధనలే ప్రతిబంధకం.. పేద మహిళల కోసం కేంద్రమే అమలు చేస్తున్న జననీ సురక్ష యోజన (జేఎస్వై) కూడా ఆశించిన ప్రయోజానానికి ఎడంగానే ఉంది. ఈ పథకం కింద ప్రభుత్వాస్పత్రుల్లో పురుడు పోసుకున్న పేద మహిళలకు ఖర్చులుగా గ్రామీణులకు రూ.800, పట్టణవాసులకు రూ.600 చెల్లిస్తారు. 2013 ఏప్రిల్ నుంచి 2014 మార్చి వరకు ఈ పథకం కింద రూ.కోటీ 53 లక్షలు విడుదల కాగా కేవలం రూ.44 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. పేదమహిళలకు అవగాహన లేకపోవటం, అర్థం లేని నిబంధనలు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కూడా పేదమహిళలకు దక్కాల్సిన సాయం దూరమవుతోంది. గర్భిణుల్లో పేదలకు సురక్షితమైన వైద్యంతో పాటు ఒకింత ఆర్థిక ఊతం కూడా అందించే ఈ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి.