Coonoor
-
ఇంట్లోకి చొరబడిన చిరుత.. దాడిలో ఆరుగురికి గాయాలు
తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూరు అటవీ ప్రాంతంలో చిరుత దాడిలో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో విధుల్లో ఉన్న జర్నలిస్ట్ ఒకరు ఉన్నారు. ఆహారం కోసం అడవి నుంచి బయటకు వచ్చిన చిరుత కూనూరు సమీపంలోని గ్రామంలో ఓ వీధి కుక్కను వెంబడిస్తూ ఓ ఇంట్లోకి ప్రవేశించింది. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టారు. చిరుత చొరబడిన ఇంట్లో ఓ వ్యక్తి ఉండటంతో అతన్ని రక్షించేందుకు ప్రయత్నించిన ఆరుగురిపై చిరుత దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన వీరిలో విధుల్లో ఉన్న ఓ జర్నలిస్ట్ కూడా ఉన్నారు. వీరందరినీ కూనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిరుత ఇంకా ఇంట్లోనే ఉందని, దాన్ని బంధించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. -
కున్నూర్‌లో హాయ్ నాన్న
కున్నూర్‌కు మకాం మార్చారు నాని. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతూ, నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రుతీహాసన్, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాని కూతురి పాత్రను కియారా ఖన్నా చేస్తోంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ కున్నూర్‌లో ప్రారంభమైంది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని హీరో నాని వెల్లడించారు. నానీతో పాటు ముఖ్య తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు శౌర్యువ్. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబరు 21న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్. -
ముంబై టు కూనూర్
గోవా టు కూనూర్ వయా ముంబై... ఇది నాని కొత్త సినిమా రూట్ మ్యాప్. నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రుతీహాసన్ కీ రోల్ చేస్తున్నారు. తొలుత గోవాలో ఓ లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసిన చిత్ర యూనిట్, ఇటీవల ముంబైలో మరో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా కొత్త షెడ్యూల్ కోసం కూనూర్ వెళ్లనున్నారు. ఇక్కడి లొకేషన్స్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 21న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్. -
బిపిన్ రావత్ ప్రయాణించిన MI 17 V5 హెలికాప్టర్ ప్రత్యేకతలు
చెన్నై: తమిళనాడులోని నీలగిరి కొండల్లో నేలకూలి, తీవ్ర విషాదాన్ని మిగిలి్చన ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌పై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. సాంకేతికంగా అడ్వాన్స్డ్ హెలికాప్టర్‌గా భావించే ఎంఐ–8 శ్రేణిలో ఇదే అత్యుత్తమమైనది. దీన్ని ఎంఐ–8 హెలికాప్టర్ నుంచే అభివృద్ధి చేశారు. ఎంఐ–8 ఎయిర్ ఫ్రేమ్‌పైనే 17వీ5 రకాన్ని నిర్మించారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ను తమిళనాడులోని సూలూరు ఎయిర్‌బేస్‌లో ఉపయోగిస్తున్నారు. MI 17 V5 హెలికాప్టర్ అన్నింటిలో టాప్ ఎయిర్‌క్రాఫ్ట్ రకం సైనిక రవాణా హెలికాప్టర్. సైనిక ఆపరేషన్లు, ప్రకృతి విపత్తుల్లోనూ సేవలందించగలదు. డిజైన్ చేసిందెవరు? రష్యాలోని మిల్ మాస్కో హెలికాప్టర్ ప్లాంట్ రూపొందించింది? రష్యా హెలికాప్టర్ల సంస్థకు అనుబంధ సంస్థ కజాన్ ఉత్పత్తి నుంచి భారత్‌కు చేరిందిలా ► 1975లో తొలి ఎంఐ–17 హెలికాప్టర్ తయారీ ఎగుమతికి ఉద్దేశించిన హెలికాప్టర్లను ఎంఐ–17గా వ్యవహరిస్తారు. రష్యా సైనిక దళాలు మాత్రం వీటిని ఎంఐ–8ఎంటీ హెలికాప్టర్లుగా పిలుస్తాయి. ► 2008 ఎంఐ–17వీ5 హెలికాప్టర్ల కొనుగోలు కోసం రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ► 2011 భారత వైమానిక దళానికి అందజేత ప్రారంభం. 2012 నుండి సేవలు. చదవండి: హెలికాప్టర్ ప్రమాదంపై రేపు పార్లమెంట్లో ప్రకటన ముఖ్యాంశాలు.. ► ఎంఐ–17వీ5.. హెలికాప్టర్ ప్రపంచంలో అత్యాధునిక రవాణా హెలికాప్టర్. సరుకులు, ఆయుధాల రవాణా కోసం డిజైన్ చేశారు. ► సైనికులను కూడా చేరవేయవచ్చు. అగ్ని మాపక సిబ్బందికి సాయపడుతుంది. కాన్వాయ్ ఎస్కార్ట్‌గా, పెట్రోలింగ్‌కు, గాలింపునకు, సహాయక చర్యల్లోనూ సేవలందిస్తాయి. ► ప్రపంచవ్యాప్తంగా ఈ హెలికాప్టర్లను 60 దేశాలు వినియోగిస్తున్నాయి. చదవండి: ఘోర ప్రమాదం: ఆర్మీ హెలికాప్టర్లో ప్రమాణించింది వీరే.. MI 17 V5 ప్రత్యేకతలు ► ఎంఐ–17వీ5 మధ్యశ్రేణి హెలికాప్టర్లో వాతావరణ పరిస్థితిని ఎప్పటికప్పుడు గుర్తించే రాడార్, రాత్రిపూట సైతం వీక్షించే పరికరాలు ఉన్నాయి. ► గరిష్టంగా 13,000 కిలోల బరువును మోసుకెళ్లగలదు. అత్యధికంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ఎక్కడా ఆగకుండా 580 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ► 36 మంది సైనికులను లేదా 4,000 కిలోల పేలోడును తరలించగలదు. ► రాత్రి, పగలు ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా చక్కగా పనిచేస్తుంది. రాత్రిపూట కూడా ల్యాండింగ్ చేయొచ్చు. ► గత పదేళ్లలో ఐఎం–17వీ5 హెలికాప్టర్లు కొన్ని ప్రమాదాలకు గురయ్యాయి. ► కొన్ని రోజుల క్రితం తూర్పు అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలింది. ఇద్దరు పైలట్లు, మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ► 2018 ఏప్రిల్ 3న ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో కూలిపోయింది. ఇందులోని ఆరుగురు ప్రాణాలతో తప్పించుకోగలిగారు. ► 2017 అక్టోబర్ 7న చైనా సరిహద్దు వైపు వెళ్తుండగా అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో నేలకూలింది. మొత్తం ఏడుగురు మృతిచెందారు. ► 2013 జూన్ 15న ఉత్తరాఖండ్‌లో వరద సహాయక చర్యల్లో పాల్గొని కేదార్నాథ్ నుంచి తిరిగి వస్తుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. ► 2012 ఆగస్టు 30న గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్ సమీపంలో రెండు ఎంఐ–17వీ5 హెలికాప్టర్లు పరస్పరం ఢీకొన్నాయి. 9 మంది వైమానిక దళం జవాన్లు మరణించారు. చదవండి: బిపిన్‌రావత్ ఇంటికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ -
గిరుల్... తరుల్... ఝరుల్ చలో కూనూర్!
టూర్‌దర్శన్ - సమ్మర్ స్పెషల్ - కూనూర్ నీలగిరుల సొగసులను నిండుగా చూడాలని ఉందా..? నింగిని నిటారుగా తాకే కొండలు... కొండలను చీల్చుకుంటూ నేలవైపు పరుగులు తీసే జలపాతాల పరవళ్లను చూస్తూ పరవశించాలని ఉందా..? ఆకుపచ్చని లోకంలో ఆనందంగా విహరించాలని ఉందా..? వేసవి వేడికి దూరంగా... మనసుకు ఉపశమనం కలిగించే చల్లచల్లని ప్రదేశంలో గడపాలని ఉందా..? అయితే, చలో కూనూర్... అక్కడ ఇవన్నీ ఉంటాయి. ఊటీకి కూతవేటు దూరంలోనే ఉన్న అద్భుతమైన హిల్ స్టేషన్, సమ్మర్ డెస్టినేషన్ కూనూర్. నీలగిరి కొండల నడుమ వెలిసిన చిన్న పట్టణం ఇది. ఎటుచూసినా తేయాకు తోటల పచ్చదనం... నిటారుగా నింగిని తాకే నీలగిరుల సొగసులు...పరవళ్లు తొక్కే జలపాతాల గలగలలు... సముద్ర మట్టానికి దాదాపు ఆరువేల అడుగుల ఎత్తులో ఉన్న చల్లచల్లని ప్రశాంత ప్రదేశం కూనూర్. నిప్పులు చెరిగే ఎండలు ఇక్కడ ఉండనే ఉండవు. ఎంతటి వేసవిలోనైనా ఇక్కడి గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు మించవు. తమిళనాడు నీలగిరి జిల్లాలోని కూనూర్ ప్రాంతంలో పూర్వం టోడా తెగకు చెందిన గిరిజనులు నివాసం ఉండేవారు. బ్రిటిష్ పాలకులు నీలగిరి ప్రాంతంలో చల్లని వాతావరణాన్ని గమనించి, ఊటీ మాదిరిగానే కూనూర్‌ను కూడా హిల్‌స్టేషన్‌గా అభివృద్ధి చేశారు. ఒక బ్రిటిష్ అధికారి 1819లో ఈ ప్రదేశాన్ని తొలిసారిగా గుర్తించాడు. ఆ మరుసటి ఏడాదే ఆయన ఇక్కడ ఒక పెద్ద భవంతిని నిర్మించాడు. ఆ తర్వాత సంపన్న బ్రిటిష్ అధికారులు, వ్యాపారులు ఇక్కడ తమ తమ నివాసాలను ఏర్పాటు చేసుకోవడంతో క్రమంగా కూనూర్ పట్టణంగా ఎదిగింది. బ్రిటిష్‌వారి హయాంలోనే ఇక్కడకు రైలుమార్గం ఏర్పడింది. ఏం చూడాలి? కూనూర్‌లోని సిమ్స్ పార్క్ చూసి తీరాల్సిన ప్రదేశం. వెయ్యికి పైగా వృక్షజాతులకు చెందిన మొక్కలు, చెట్లతో కనువిందు చేసే ఈ ఉద్యానవనం నందనవనాన్ని తలపిస్తుంది. అప్పట్లో మద్రాస్ క్లబ్ కార్యదర్శిగా పనిచేసిన బ్రిటిష్ అధికారి జె.డి.సిమ్ పేరిట ఏర్పాటు చేసిన ఈ పార్కులో ఏటా మే నెలలో జరిగే పండ్లు, కూరగాయల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. కూనూర్ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ నుంచి చూస్తే కూనూర్ పట్టణం, పరిసరాల్లోని పచ్చని తేయాకు తోటలు సహా నీలగిరుల అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. కూనూర్ వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా డాల్ఫిన్ నోస్ వ్యూపాయింట్ నుంచి నీలగిరులను తిలకించాలని తహతహలాడతారు. కూనూర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని ల్యాంబ్స్ రాక్ కూడా మరో అద్భుతమైన వ్యూ పాయింట్. ఇది డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్‌కు వెళ్లే దారిలో ఉంటుంది. దీని పైనుంచి చూస్తే కూనూర్ పరిసరాలే కాదు, కోయంబత్తూరు మైదాన ప్రాంతంలో విస్తరించిన పచ్చదనం కూడా కనువిందు చేస్తుంది. ట్రెక్కింగ్‌పై ఆసక్తి గల పర్యాటకులు ఎక్కువగా ఈ ప్రదేశం నుంచి ప్రకృతి సౌందర్యాన్ని తిలకించేందుకు ఇష్టపడతారు. కూనూర్‌కు 7 కిలోమీటర్ల దూరంలోని లాస్ జలపాతం చూసి తీరాల్సిన ప్రదేశం. కూనూర్ నుంచి మెట్టుపాళ్యం వెళ్లే మార్గంలో ఉండే ఈ జలపాతం నీలగిరి కొండల మీదుగా దాదాపు 180 అడుగుల ఎత్తు నుంచి ఉరకలేస్తూ పరవళ్లు తొక్కుతూ ఉంటుంది. కూనూర్ నుంచి మెట్టుపాళ్యం వెళ్లే దారిలోనే కోటగిరి పట్టణానికి సమీపంలో కేథరీన్ జలపాతం కూడా చూసి తీరాల్సిందే. ఇది దాదాపు 250 అడుగుల ఎత్తు నుంచి పరవళ్లు తొక్కుతూ కనువిందు చేస్తుంది. ఈ జలపాతానికి కోటగిరి ప్రాంతంలో కాఫీ సాగును పరిచయం చేసిన బ్రిటిష్ అధికారి ఎండీ కాక్బర్న్ భార్య పేరు పెట్టారు. ఏం కొనాలి? * శ్రేష్టమైన తేయాకు చౌకగా దొరుకు తుంది. రకరకాల టీ పొడిని కొనుక్కోవచ్చు. * గోర్మెట్ చీజ్‌కు కూనూర్ బాగా ఫేమస్. ఇక్కడకు వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా దీనిని కొనుక్కుంటారు. * స్వచ్ఛమైన తేనె, స్థానికంగా తయారయ్యే రకరకాల జామ్స్ ఇక్కడి దుకాణాల్లో చౌకగా దొరుకుతాయి. * ఇక్కడి దుకాణాల్లో స్థానికంగా తయారయ్యే హస్తకళాకృతులు, ఎంబ్రాయిడరీ చేసిన దిండు కవర్లు, కుషన్ కవర్లు, బెడ్‌షీట్స్, టీ సెట్లు కొనుక్కోవచ్చు. ఏం చేయాలి? * బోటింగ్, ట్రెక్కింగ్, వాకింగ్, షాపింగ్ వంటి వాటికి కూనూర్ చాలా అనువుగా ఉంటుంది. సిమ్స్ పార్కులోని కొలనులో బోటింగ్‌ను పిల్లలు బాగా ఆస్వాదిస్తారు. * కూనూర్ నుంచి ఊటీ మధ్య నడిచే హెరిటేజ్ ట్రైన్లో ప్రయాణం కూడా గొప్ప అనుభూతి కలిగిస్తుంది. దాదాపు రెండు గంటలు సాగే ఈ ప్రయాణంలో తాపీగా ప్రకృతి అందాలను తిలకించవచ్చు. * డాల్ఫిన్ నోస్, ల్యాంబ్స్ రాక్ ట్రెక్కింగ్‌కు అనువుగా ఉంటాయి. ట్రెక్కర్లను ఆకర్షించే మరో ప్రదేశం కూనూర్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని బకాసుర కొండ. దీనిపై శిథిలావస్థలో ఉన్న డ్రూగ్ కోట శతాబ్దాల చరిత్రకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ కోట 18వ శతాబ్దిలో టిప్పు సుల్తాను బలగాలకు స్థావరంగా ఉండేది. * కూనూర్ శివార్లలో నలువైపులా విస్తరించి ఉన్న టీ తోటల్లో వాకింగ్ ఆహ్లాదభరితంగా ఉంటుంది. ట్రెక్కింగ్‌కు ఓపిక లేనివారు టీ తోటల్లో విహరిస్తూ నీలగిరుల అందాలను తిలకించవచ్చు. ఎలా వెళ్లాలి? * కోయంబత్తూరు వరకు విమాన సౌకర్యం అందుబాటులో ఉంది. అక్కడి నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూనూర్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవాల్సి ఉంటుంది. * కూనూర్‌లో రైల్వేస్టేషన్ ఉంది. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడకు రైలు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. * తమిళనాడు, కేరళలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఇక్కడకు విరివిగా బస్సులు అందుబాటులో ఉంటాయి. -
షూటింగ్లో హీరోయిన్‌కి గాయాలు
చెన్నై : బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కుమార్తె అలియా భట్ షూటింగ్లో గాయపడింది. దీంతో ఆమె భుజానికి గాయమైంది. దాంతో అలియాను కోయింబత్తూరు ఆస్పత్రికి తరలించారు. అయితే స్వల్పంగా గాయపడ్డానని... నొప్పి మాత్రం కొద్దిగానే ఉందని అలియా తెలిపింది. గాయం వల్ల ఒత్తిడికి మాత్రం గురి కాలేదని పేర్కొంది. రెండు వారాల్లో అంత సర్థుకుంటుందని చెప్పింది. కాగా షూటింగ్ కి మాత్రం డుమ్మాకొట్టకుండా హాజరవుతున్నట్లు అలియా వెల్లడించింది. ఈ మేరకు అలియా ఫోటోబ్లాగ్లో పేర్కొంది. తమిళనాడు నీలగిరి ప్రాంతంలోని కూనూరులో అలియా నటిస్తున్న చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్లో ఆమె గాయపడ్డింది.