థ్రిల్లింగ్ షిల్లాంగ్...
టూర్‌దర్శన్ - షిల్లాంగ్
వెండిమబ్బులను తాకే కొండల తీరు... కొండల మీదుగా జోరుగా దూకే జలపాతాల హోరు... పచ్చని పరిసరాల్లోంచి తలపెకైత్తి చూస్తే నింగీ నేలా కలుసుకున్నాయా అనిపించే ప్రకృతి వర్ణవైవిధ్యం... బాతులు ఈదులాడే కొలనులు, కొంగలు వాలే సరస్సులు సరేసరి... సముద్ర మట్టానికి దాదాపు ఐదువేల అడుగుల ఎత్తున వెలసిన పట్టణం షిల్లాంగ్... పట్టణానికి చుట్టూ దట్టమైన అరణ్యం...
ప్రకృతి ఒడిలో ఒదిగిపోయి సేదదీరాలనుకునే పర్యాటకులకు ఇది సాక్షాత్తు స్వర్గధామాన్నే తలపిస్తుంది.
అస్సాం నుంచి మేఘాలయ 1972లో విడిపోయేంత వరకు షిల్లాంగ్ అస్సాం రాజధానిగా ఉండేది. ఇక్కడి చల్లని వాతావరణానికి, చూడచక్కని ప్రకృతి అందాలకు ముగ్ధులైన బ్రిటిష్ పాలకులు ఇక్కడ తరచుగా విడిది చేసేవారు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ కూడా ఇక్కడ ఒక వేసవి విడిది గృహాన్ని నిర్మించుకున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత సుందర నగరంగా పేరుపొందిన షిల్లాంగ్, నేటికీ దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంది.
ఏం చూడాలి?
చిన్న పట్టణమే అయినా షిల్లాంగ్‌లో చూసి తీరాల్సిన ప్రదేశాలు, విశేషాలు చాలానే ఉన్నాయి. షిల్లాంగ్ శిఖరం పైనుంచి పరిసరాల పచ్చదనాన్ని తిలకించడం గొప్ప అనుభూతినిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే షిల్లాంగ్ పట్టణం, పరిసర ప్రాంతాలు చక్కగా కనిపిస్తాయి.
తూర్పు ఖాసీ కొండలపై వెలసిన షిల్లాంగ్ పరిసరాల్లో ఎక్కడికక్కడ జలపాతాలు కనిపిస్తాయి. వీటిలో ఎలిఫెంట్ జలపాతం, స్ప్రెడ్ ఈగల్ జలపాతం, స్వీట్ జలపాతం, క్రినోలిన్ జలపాతాల వద్దకు పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఉరకలేసే ఈ జలపాతాల సొగసును చూసి తీరాల్సిందే.
ఈశాన్య సంస్కృతికి ఆలవాలమైన షిల్లాంగ్‌లో తప్పనిసరిగా చూడాల్సినవి మ్యూజియమ్స్. స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కాంప్లెక్స్‌లోని కెప్టెన్ విలియమ్‌సన్ సంగ్మా స్టేట్ మ్యూజియం, డాన్‌బాస్కో ఆదిమ సంస్కృతుల మ్యూజియంలలో ఈశాన్య సంస్కృతికి సంబంధించిన రకరకాల పురాతన వస్తువులను చూడవచ్చు. ఎంటమాలజీ మ్యూజియంలో రంగురంగుల సీతాకోకలు, అరుదైన కీటకాలను తిలకించవచ్చు.
లేడీ హైదరీ పార్కు నందనవనాన్నే తలపిస్తుంది. ఈ పార్కులోనే ఉన్న ఫారెస్ట్ మ్యూజియంలో అటవీ సంపదకు సంబంధించిన అరుదైన వస్తువులను తిలకించవచ్చు. ఎగువ షిల్లాంగ్‌లో ఎయిర్‌ఫోర్స్ మ్యూజియం కూడా సందర్శకులను ఆకట్టుకుంటుంది.
ఇక్కడి వార్డ్స్ లేక్, ఉమియమ్ లేక్ వంటి సుందర సరోవరాలు బాతులు, కొంగలు వంటి పక్షులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఈ సరస్సుల్లో బోటింగ్ చేస్తూ ప్రకృతి అందాలను తిలకించడానికి పర్యాటకులు ఇష్టపడతారు.
ఇక్కడి పురాతన మహాదేవ్ ఖోలా ధామ్ శైవక్షేత్రం, కేథలిక్ కెథడ్రల్, ఆల్ సెయింట్స్ చర్చి వంటివి ఆధ్యాత్మిక చింతన గలవారిని ఆకట్టుకుంటాయి. ఇక క్రిసాలిస్ ఆర్ట్ గ్యాలరీని కళాభిమానులు చూసి తీరాల్సిందే.
ఏం చేయాలి?
జనసమ్మర్దం తక్కువగా ఉండే షిల్లాంగ్ వీధుల్లో జాలీగా షికారు చేస్తూ, షాపింగ్ చేయవచ్చు. షిల్లాంగ్ పీక్ పెకైక్కి ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించవచ్చు.
ఉరకలేసే జలపాతాల వద్ద ఉత్సాహంగా, ఉల్లాసంగా పిక్నిక్ పార్టీలు చేసుకోవచ్చు. ట్రెక్కింగ్‌పై ఆసక్తి ఉన్నవారు కొండలు, గుట్టలు ఎక్కవచ్చు. సరస్సుల్లో బోటు షికార్లు చేయవచ్చు.
ఈశాన్య సంస్కృతి, ఇక్కడి ఆదిమ తెగలు, అరుదైన జీవజాతుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు తప్పనిసరిగా ఇక్కడి మ్యూజియమ్స్‌ను చూసి తీరాల్సిందే.
షిల్లాంగ్ శివార్లలోనే దట్టంగా విస్తరించి ఉన్న మాఫ్లాంగ్ అరణ్యంలో వనవిహారం చేయవచ్చు. ఈ అరణ్యాన్ని ‘సేక్రెడ్ ఫారెస్ట్’ (పవిత్రారణ్యం) అంటారు.
ఎలా చేరుకోవాలి?
షిల్లాంగ్‌కు వెలుపల ఉన్న ఉమ్రాయ్‌లో విమానాశ్రయం ఉంది. అయితే, కోల్‌కతా నుంచి మాత్రమే ఇక్కడకు విమానాల రాకపోకలు ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి విమానాల్లో వచ్చేవారు కోల్‌కతాలో మరో విమానం ద్వారా ఇక్కడకు రావచ్చు. విమానాశ్రయం నుంచి షిల్లాంగ్ పట్టణానికి ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. రైళ్లలో వచ్చేవారు గువాహటి రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో షిల్లాంగ్ చేరుకోవాల్సి ఉంటుంది. గువాహటి నుంచి షిల్లాంగ్‌కు బస్సులు, ట్యాక్సీలు విరివిగా అందుబాటులో ఉంటాయి.
ఏం కొనాలి?
ఇక్కడి అడవుల్లో విస్తారంగా దొరికే స్థానిక కళాకారులు రూపొందించిన వెదురు అలంకరణ వస్తువులు, బుట్టలు, పూలసజ్జలు, వెదురు కర్టెన్లు వంటివి కొనుక్కోవచ్చు.
నాగా, మణిపురి నేతగాళ్లు నేసిన ఊలు దుప్పట్లు, శాలువలు, తేలికపాటి ఊలుతో ప్రత్యేకంగా నేసిన మణిపురి లుంగీలు, షర్టులు కొనుక్కోవచ్చు.
బడాబజార్ అని ఇక్కడి స్థానికులు పిలుచుకునే ల్యూడహ్ మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు, చేనేత వస్త్రాలు, హస్త కళాకృతులు వంటివి చౌకగా దొరుకుతాయి. ఈ బజారులోని దుకాణదారులందరూ మహిళలే కావడం విశేషం.
పసుపు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు ఇక్కడ బజార్లలో చౌకగా దొరుకుతాయి. ఇక్కడ మాత్రమే దొరికే ‘ఖాసీ స్క్రబ్’ను కొని తీరాల్సిందే. పాత్రలు తదితరమైన వాటిని శుభ్రం చేసుకునేందుకు వాడవచ్చు. చాలా పెద్ద సైజులో దొరికే ఈ స్క్రబ్‌ను కావలసిన రీతిలో ముక్కలుగా కత్తిరించుకుని వాడుకోవచ్చు.