మేఘాలయ రాజధాని వైపు మొగ్గుచూపుతున్న భారతీయుల పర్యాటకులు
విదేశీయాత్రపై మరింత పెరిగిన మక్కువ
స్కైస్కానర్ నివేదిక
న్యూఢిల్లీ: జలపాతాలు, ప్రకృతి రమణీయతలకు నెలవై ‘స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్’గా ఖ్యాతిగడించిన మేఘాలయ రాజధాని నగరం షిల్లాంగ్‌లో వచ్చే ఏడాది పర్యటించేందుకు భారతీయులు తెగ ఉవి్వళ్లూరుతున్నారని ప్రఖ్యాత ట్రావెల్ యాప్ స్కైస్కానర్ తన నివేదికలో వెల్లడించింది. వచ్చే ఏడాదికి సంబంధించిన ‘ట్రావెల్ ట్రెండ్స్ రిపోర్ట్’ను బుధవారం విడుదలచేసింది.
తరచూ పర్యటనకు వెళ్లే భారతీయుల్లో 66 శాతం మంది 2025 సంవత్సరంలో మరింతగా పర్యటనలు చేయాలని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. పర్యాటకం అనగానే విదేశీయానం చేసే భారతీయులు స్వదేశంలో షిల్లాంగ్‌కు అగ్రతాంబూలం ఇచ్చారు. అజర్‌బైజాన్ దేశంలోని బాకూ నగరం, మలేసియాలోని లాంగ్‌కావీ నగరాలను పక్కకునెట్టి షిల్లాంగ్ ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది.
హాయిగా విశ్రాంతి తీసుకునేందుకు ఆహ్లాదకర వాతావరణం, ట్రెక్కింగ్ వంటి సాహసాలు చేయడానికి అనువైన పచ్చటి కొండలతో అలరారే షిల్లాంగ్‌లో పర్యటించాలని ఎక్కువ మంది భారతీయులు భావిస్తున్నారు. దీంతోపాటే నార్వేలోని ట్రోంసో, ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్, సౌదీ అరేబియాలోని అల్–ఉలాలనూ పర్యటనల కోసం భారతీయులు ఎక్కువగా సెర్చ్‌చేశారు.
తమ పర్యాటక ఖర్చులకు తగ్గ ఆనందం లభిస్తుందన్న ‘బెస్ట్ వాల్యూ డెస్టినేషన్ కేటగిరీ’లో కజక్‌స్థాన్‌లోని అల్మటీ తొలిస్థానంలో నిలిచింది. ఇండోనేసియాలోని జకార్తా, మలేసియాలోని సింగపూర్, కౌలాలంపూర్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ దేశాలకు విమానచార్జీలు గత ఏడాదికాలంలో భారీగా తగ్గడమూ ఇందుకు మరో కారణం.
ఖర్చులే కీలకం
ఏ దేశాల్లో పర్యటించాలనే విషయంలో హోటల్ ఖర్చులను లెక్కలోకి తీసుకుంటామని 65 శాతం మంది చెప్పగా విమానచార్జీలను లెక్కిస్తామని 62 శాతం మంది చెప్పారు. అక్కడి ఆహారం, చిరుతిళ్ల ఖర్చులు సైతం బేరేజు వేసుకుంటామని 54శాతం మంది పేర్కొన్నారు. విమాన ఖర్చులకే ఎక్కువ ఖర్చవుతోందని 86 శాతం మంది చెప్పగా, ఇతర ఖర్చులే ఎక్కువగా ఉంటాయని 80 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాదితో పోలిస్తే 2025లో ఖచి్చతంగా పర్యటించాలన్న బలమైన కాంక్ష ఎక్కువ మందిలో ఉండటం విశేషం. వచ్చేసారి ఎక్కడికి వెళ్లాలనే తుది నిర్ణయంలో ఖర్చులదే అత్యంత కీలక పాత్ర అని స్కైస్కానర్‌కు సంబంధించిన పర్యాటక నిపుణుడు మోహిత్ జోషి వ్యాఖ్యానించారు. అబూధాబిలో డిసెంబర్‌లో జరగబోయే ఫార్ములా1 రేసింగ్ వంటి క్రీడలు చూసేందుకు భారతీయులు విపరీతంగా విమానాల్లో వెళ్తున్నారని నివేదిక పేర్కొంది.
పాలపుంత వెలుగుల్లోనూ..
జెడ్ జనరేషన్ యువతలో 62 శాతం మంది ఖాళీ సమయాలను విదేశాల్లో ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారు. అందులో ముఖ్యంగా 57 శాతం మంది తాము ఆడిన వీడియోగేమ్‌లో తరచూ చూసిన ప్రపంచ ప్రఖ్యాత స్థలాలను వెళ్లిరావాలని కోరుకుంటున్నారు. రాత్రిళ్లు వినీలాకాశంలో పాలపుంత అందాలను కళ్లారా చూసేందుకూ ఆయా ప్రదేశాలకు వెళ్లేలని అనుకుంటున్నట్లు 53 శాతం మంది చెప్పారు. ఖగోళ వింతలను కెమెరాల్లో బంధించేందుకు ఇష్టపడుతున్నట్లు 56 శాతం మంది చెప్పారు. ధృవకాంతులను చూసేందుకు విదేశీయానం చేయాలనుకుంటున్నట్లు 44 శాతం మంది చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment