కళింగ కశ్మీర్
టూర్‌దర్శన్ - దారింగిబాడి
నింగిని తాకే కొండలు... కొండల దిగువన ఆకుపచ్చని లోయలు... కొండలను ముద్దాడుతున్నాయా అనిపించే నీలిమబ్బులు... కొండల మీదుగా ఉరకలేస్తూ జాలువారే జలపాతాలు... కనుచూపు మేరలో కనిపించే పచ్చని కాఫీ తోటలు, మిరియాల తోటలు... పక్షుల కిలకిలలు తప్ప వాహనాల రణగొణలు వినిపించని ప్రశాంత వాతావరణం... వేసవిలోనూ చెమటలు పట్టనివ్వని చల్లని వాతావరణం... ఇటీవలి కాలం వరకు పెద్దగా ప్రాచుర్యంలోకి రాని అద్భుత ప్రదేశం దారింగిబాడి.
ఒడిశా రాష్ట్రంలో వెనుకబడిన కొంధొమాల్ జిల్లాలో మారుమూల గిరిజన గ్రామం దారింగిబాడి. సముద్ర మట్టానికి దాదాపు 3 వేల అడుగుల ఎత్తున ఉన్న ఈ ప్రదేశం వేసవిలోనూ చల్లగా ఉంటుంది. శీతాకాలం ఇక్కడ చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోతాయి. కొండలన్నీ మంచుతో కప్పబడి కనిపిస్తాయి. అందుకే ‘కశ్మీర్ ఆఫ్ ఒడిశా’గా పేరుపొందింది. దారింగిబాడి ఉన్న కొంధొమాల్ ప్రాంతం చాలాకాలం వరకు ఆటవికుల రాజ్యంగానే ఉండేది.
క్రీస్తుశకం నాలుగో దశాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని ఏ రాజులూ జయించిన దాఖలాల్లేవు. క్రీస్తుశకం నాలుగో శతాబ్దంలో సముద్రగుప్తుడు కోసలకు దక్షిణాన ఉన్న కొంధొమాల్ ప్రాంతం మీదుగా దక్షిణాపథానికి జైత్రయాత్ర సాగించాడని చెబుతారు. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో ఈ ప్రాంతం ఘుముసుర రాజ్యాన్ని పాలించిన భంజ వంశీయుల అధీనంలోకి వచ్చింది. ఆ తర్వాత బ్రిటిష్ పాలకుల చేతిలోకి వచ్చింది.
ఏం చూడాలి?
* దారింగిబాడిలో పచ్చదనం నిండిన కొండలు, లోయల అందాలను చూసి తీరాల్సిందే. ఇక్కడి కొండలలో రుషికుల్యా నది మొదలైన ప్రదేశం, పుతుడి, పకడాఝర్ జలపాతాలతో పాటు ఊరికి చేరువలోనే జలకళ ఉట్టిపడే డోలూరి నది ప్రవాహ మార్గంలో పలుచోట్ల కనిపించే జలపాతాలు కనువిందు చేస్తాయి.
* దారింగిబాడి పరిసరాల్లో విరివిగా కనిపించే కాఫీ తోటలు, మిరియాల తోటలు పర్యాటకులను ఆకర్షిస్తాయి.
* దారింగిబాడి కొండలపైన హిల్‌వ్యూ పాయింట్ వద్దకు చేరుకుని చూస్తే, దారింగిబాడి ఊరితో పాటు కనుచూపు మేరలోని పరిసరాలన్నీ పచ్చదనంతో అలరారుతూ నయనానందం కలిగిస్తాయి.
* ఇక్కడకు చేరువలోనే చకాపడాలోని ప్రాచీన విరూపాక్ష దేవాలయం, బాలాస్కుంపాలోని బరలాదేవి ఆలయం ప్రశాంత వాతావరణంతో సందర్శకులను ఆకట్టుకుంటాయి.
* దారింగిబాడికి చేరువలోని బేల్‌గఢ్ అభయారణ్యంలో అరుదైన జాతులకు చెందిన పక్షులు, వన్యప్రాణులు, వృక్షసంపద కనువిందు చేస్తాయి. దాదాపు 16 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విస్తరించిన ఈ అభయారణ్యంలోనే ఆదిమ తెగకు చెందిన డోగ్రియా కొంధొలు నివసిస్తూ ఉంటారు.
ఏం కొనాలి?
* ఇక్కడి తోటల్లో విస్తారంగా పండే శ్రేష్టమైన కాఫీ గింజలను, మిరియాలను చౌకగా కొనుక్కోవచ్చు.
* పసుపు సాగుకు కొంధొమాల్ జిల్లా పెట్టింది పేరు. ఇక్కడి పసుపు విదేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటుంది. ఇక్కడ నాణ్యమైన పసుపు కొమ్ములను కొనుక్కోవచ్చు.
* ఇక్కడ విరివిగా పండే అల్లం, వెల్లుల్లి, ఆవాలు వంటివి కూడా చాలా చౌకగా దొరుకుతాయి.
* స్థానిక గిరిజనులు సేకరించే స్వచ్ఛమైన తేనె, వనమూలికలు, ఇతర అటవీ ఉత్పత్తులు కూడా ఇక్కడ చాలా చౌకగా దొరుకుతాయి.
ఎలా చేరుకోవాలి?
* విమాన మార్గంలో వచ్చేవారు ఒడిశా రాజధాని భువనేశ్వర్ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉండే దారింగిబాడికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.
* కొంధొమాల్ జిల్లాలో ఇప్పటికీ కనీసం రైల్వేస్టేషన్ కూడా లేదు. రైళ్లలో వచ్చేవారు బరంపురం రైల్వేస్టేషన్‌లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో దారింగిబాడికి చేరుకోవాల్సి ఉంటుంది.
* బరంపురం నుంచి సురడా మీదుగా లేదా మోహనా, బ్రాహ్మణిగావ్‌ల మీదుగా లేదా భంజనగర్, జి.ఉదయగిరిల మీదుగా దారింగిబాడి చేరుకోవచ్చు.