ఆకట్టుకుంటున్న క్యాంప్ ఫైర్స్
ట్రెక్కింగ్‌కు సై అంటున్న సాహసికులు
హిల్ స్టేషన్లలో పర్యాటకుల సందడి
ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని దూరం చేసుకునేందుకు నగర ప్రజలు, ఐటీ ఉద్యోగులు వారాంతాల్లో ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నారు. అందుకు అనువైన ప్రదేశంగా హిల్ స్టేషన్లను ఎంపిక చేసుకుంటున్నారు. ట్రెక్కింగ్, రైన్ డ్యాన్స్, వాటర్ ఫాల్స్, ఫైర్ క్యాంప్, అడ్వెంచర్ గేమ్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వాతావరణం చల్లబడింది. ఇటువంటి సందర్భాల్లో హిల్ స్టేషన్లలో ఫైర్ క్యాంప్‌తో ఎంజాయ్ చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారని టూర్ ఆపరేటర్లు పేర్కొంటున్నారు. దీనికి తగ్గట్లు రిస్సార్ట్స్, హోటల్ యాజమాన్యాలు ఆకర్షణీయమైన ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. రానున్నది శీతాకాలం. కాబట్టి ఫిబ్రవరి వరకూ ఈ క్యాంపులకు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఔటర్ చుట్టూ..
ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వందల సంఖ్యలో ఫాం హౌస్‌లు, పదుల సంఖ్యలో స్టార్ హోటల్స్, రిసార్టులు ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఇప్పటి నుంచే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ సీజన్‌కు సిద్ధమవుతున్నారు. రానున్న శీతాకాలంలో సాయంత్రం మంచు కురిసే వేళలో వెచ్చగా ఫైర్ క్యాంప్ కల్చర్ వచ్చే ఐదు నెలలపాటు కొనసాగుతుంది. దీనికి తోడు పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం, ఇతర ఫంక్షన్లు వంటి కార్యక్రమాలను కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి సరదాగా కాలక్షేపం చేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఎత్తైన హిల్ స్టేషన్లలో ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్వచ్ఛమైన గాలి, చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, వాయు, శబ్ధ కాలుష్యాలకు దూరంగా, ఇతర ఆటంకాలు ఉండని చోటు కోరుకుంటున్నారు. చల్లని వాతావరణంలో.. క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చుని చలికాచుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ స్వీట్ మెమొరీస్‌ను పదిలం చేసుకుంటున్నారు.
ఆకర్షణగా అనంతగిరి హిల్స్..
హైదరాబాద్ సమీపంలో హిల్ స్టేషన్ అనగానే గుర్తుకొచ్చేది అనంతగిరి హిల్స్. పాల నురగలు కక్కుతూ జాలువారే వాటర్ ఫాల్స్, అనంత పద్మనాభస్వామి దేవాలయం, దట్టమైన అటవీ ప్రాంతం, పచ్చని కొండలు, ఆ పక్కనే పదుల సంఖ్యలో అత్యాధునిక వసతులతో కూడిన రిసార్ట్స్. ఉదయం లేత సూర్యకిరణాలు తాకుతున్న వేళ ట్రెక్కింగ్, సాయంత్రం చల్లని వాతావరణంలో వెచ్చగా ఫైర్ క్యాంపు, ఆపై రెయిన్ డ్యాన్స్‌లు, వాటర్ ఫాల్స్, వ్యూ పాయింట్లు, ఇంకా ఎన్నో ప్రత్యేకతలతో అనంతగిరి హిల్స్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. రిసార్ట్స్‌కు రోజుకు రూ.3వేల నుంచి రూ.10 వేల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లోని ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వారాంతపు డెస్టినేషన్ హిల్ స్టేషన్‌గా అనంతగిరి వెలుగొందుతోంది.
రెండు సీజన్లలో క్యాంప్ ఫైర్..
రానున్న శీతాకాలం ఎక్కువ మంది క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్ అడుగుతుంటారు. పర్యాటకుల అభిరుచులకు అనుగుణంగా క్రీడలు, అడ్వెంచర్ గేమ్స్, రోప్ వే సంబంధిత కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు కాలానుగుణంగా ప్యాకేజీలు మారుతుంటాయి. వేసవిలో వాటర్ స్పోర్ట్స్, రెయిన్ డ్యాన్స్, వర్షాకాలం, శీతాకాలంలో క్యాంప్ ఫైర్‌కు ఎక్కువ ఆదరణ ఉంటుంది.
– పీ.గంగాథర్ రావు, హరివిల్లు రిస్సార్ట్స్ నిర్వాహకులు, వికారాబాద్
ఆ వాతావరణం ఇష్టం..
చల్లనివాతావరణంలో వెచ్చగా మంట కాగుతూ, పాటలు పాడుకుంటూ డ్సాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తాం. కొడైకెనాల్, కూర్గ్, వయనాడ్, వికారాబాద్ తదితర ప్రాంతాలకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు అప్పటి వాతావరణ పరిస్థితులను బట్టి రిసార్ట్స్ యజమానులే క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసేవారు. బయటకు వెళ్లినప్పుడు ఒత్తిడిని మర్చిపోయి, హాయిగా గడపాలని అనుకుంటాం. ఎత్తయిన కొండ ప్రాంతాల్లో రాత్రి వేళ చుక్కలను చూసుకుంటూ, స్వచ్ఛమైన వాతావరణంలో మనసుకు హాయిగా ఉంటుంది.
– జి.సిద్ధార్థ, ఉప్పల్
Comments
Please login to add a commentAdd a comment