త్రిమూర్త్యాత్మకం... త్రిప్రయార్ రామాలయం
టూర్‌దర్శన్
గుండె గుండెకో గుడి ఉంటే, ఆ గుడిలో రాముడుంటాడట. అందుకే ఊరూరా రామాలయాలుంటాయి. అలాగే పరశురాముడు నడయాడిన కేరళలో రామునికి 30 గుడులున్నాయి. రామునికే కాదు, ఆయనతోబాటు ఆయన సోదరులైన లక్ష్మణ భరత శత్రుఘ్నులకు కూడా గుడులున్నాయి. ఈ ఆలయాలన్నీ అలాంటిలాంటివి కావు. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వీటన్నింటికీ మించిన ప్రత్యేకత త్రిప్రయార్ ఆలయానిది.
అదేమంటే, రామచంద్రమూర్తి చతుర్భుజాలతో దర్శనమిస్తాడక్కడ. అదేంటీ, రాముడు దేవుడు కదా, అందులోనూ సాక్షాత్తూ విష్ణుమూర్తి అవతారం కదా, ఆయనకు నాలుగు చేతులుండటంలో వింతేముంది, అనుకుంటే పొరబడ్డట్టే. ఎందుకంటే రాముడు మానవుడిగా పుట్టాడు కాబట్టి ఆయనకూ మనలాగే రెండుచేతులే ఉంటాయి. నాలుగు చేతులుండవు. అందుకే ఆయన ఆలయాలన్నిటిలోనూ రెండు చేతులతోనే దర్శనమిస్తాడు. కేవలం రెండే రెండుచోట్ల మాత్రం నాలుగు చేతులతో విష్ణుమూర్తిలా కనిపిస్తాడు. వాటిలో మొదటిది భద్రాద్రి అయితే, రెండవది త్రిప్రయార్. ఇలా ఆయన నాలుగు చేతులతో దర్శనమివ్వడానికి కారణాలు ఇలా చెబుతున్నారు... అరణ్యవాస సమయంలో శ్రీరామచంద్రుని సమక్షంలో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కూచెవులూ కోయగా, ఆమె ఏడ్చుకుంటూ తన పినతల్లి కుమారులైన ఖరదూషణులకు చెప్పింది. దాంతో వారు క్రోధావేశాలకు లోనై, తమ స్నేహితుడు త్రిశిరుడిని కలుపుకొని మరో పద్నాలుగువేల మంది సైన్యాన్ని వెంటబెట్టుకుని సీతారామ లక్ష్మణులపైకి దండెత్తాడు. అప్పుడు వారిమధ్య ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రామచంద్రమూర్తి వారందరినీ మట్టుబెట్టాడు. అయితే ఆ ఖరదూషణాదులను సంహరించే సమయంలో రాముడు నాలుగు చేతులతో విష్ణుమూర్తిలా దర్శనమిచ్చాడట. అందుకే ఈ రామునికి నాలుగు చేతులున్నాయని స్థానికుల కథనం. ఆ యుద్ధం జరిగిన స్థలమే ఇది.
ద్వారక నుంచి శ్రీకృష్ణుడు ప్రతిరోజూ ఇక్కడకు వచ్చి శ్రీరాముని సేవించేవాడట. అయితే ద్వారక సముద్రగర్భంలో కలసిపోవడంతో ఈ విగ్రహాలు కూడా సముద్రంలోనే ఉన్నాయట. చాలాకాలం తర్వాత కొందరు జాలరులు చేపలు పట్టుకుంటుండగా, వారికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల విగ్రహాలు దొరికాయట. దివ్యతేజస్సుతో ఉన్న ఆ విగ్రహాలను ఏం చేయాలో తెలియక అక్కడి రాజుకు అప్పగించారు. ఆ రాజు పండితుల సలహా మేరకు ఆలయం కట్టిద్దామని సన్నాహాలు చేస్తుండగా, అక్కడి వారిలో ఒకరికి పూనకం వచ్చి, రాముడి విగ్రహాన్ని మాత్రం నెమళ్లు నడయాడే చోటే ప్రతిష్ఠించాలని, లేకుంటే ఆలయం కట్టించిన ఫలం ఉండదని చెప్పడంతో రాజు, స్వయంగా నెమళ్లకోసం చాలాదూరం పాటు వెదికాడట. అయితే ఎంత వెదికినా నెమళ్లు కనిపించకపోవడంతో విసిగి వేసారిన రాజుకు ఒకచోట నెమలీకలు కనిపించాయట. ఇక్కడ తప్పనిసరిగా నెమళ్లు ఉండి ఉంటాయని నమ్మి, ఆలయాన్ని నిర్మించి, ఆ ఆలయంలో రాముణ్ణి ప్రతిష్ఠించారట. అలాగే ఇరింజక్కుడ అనే చోట భరతుడికీ, మూఝిక్కుళంలో లక్ష్మణుడికీ, అక్కడికి చేరువలోగల పాయమ్మేళులో శత్రుఘ్నుడికీ ఆలయాలను నిర్మించి, విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది.
ఆలయ ఉనికి: కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లాలో తీవ్రా నది ఒడ్డున గురువాయూర్‌కు సుమారు 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. అద్భుతమైన నిర్మాణం: ఈ ఆలయం త్రిశూర్‌లోని వడక్కునాథన్ ఆలయాన్ని పోలి ఉంటుంది. వృత్తాకారపు ఆలయ ప్రాంగణం అద్భుతంగా అనిపిస్తుంది. ఆలయ గోడలపై రామాయణ కావ్యదృశ్యాలు మనోజ్ఞంగా మలచబడ్డాయి. పదకొండో శతాబ్దికి చెందిన ఈ ఆలయ ప్రాంగణంలో దక్షిణామూర్తి, అయ్యప్ప, గణపతి ఆలయ సన్నిధులున్నాయి. అయితే రామభక్త హనుమాన్ సన్నిధి మాత్రం ఆలయం లేదు. అయినప్పటికీ, హనుమకు కూడా ఆలయ పూజారులు అర్చనవిధులు నిర్వర్తించడం విశేషం. దక్షిణామూర్తి సన్నిధి ముందు అఖండదీపం వెలుగుతూ ఉంటుంది. ఈ దీపం దుష్టశక్తులను దూరం చేస్తుందంటారు. ఈ ఆలయ మూలమూర్తి త్రిమూర్త్యాత్మకం అని చెబుతారు. దక్షిణామూర్తి విగ్రహాన్ని సాధారణంగా శివాలయాలలోనే ప్రతిష్ఠిస్తారు. అయితే ఇక్కడ దక్షిణామూర్తి కూడా కొలువై ఉంటాడు.
అలాగే చేతిలో పుష్పమాల ఉండటం బ్రహ్మకు ప్రతీక. అందుకే ఈ రాముడికి త్రిప్రయార్ రామర్ అని పేరొచ్చింది. ఉత్సవాల వేలుపు: స్వామికి రోజూ ఐదుపూటలా పూజలు జరుగుతుంటాయి. స్వామివారి ఉత్సవమూర్తిని రోజూ గుడిచుట్టూ మూడుమార్లు ఊరేగిస్తారు. నిత్యపూజలతోబాటు ఏకాదశి, అరట్టు, పూరం అంటూ మూడు ఉత్సవాలు నిర్వర్తిసారు. ఏకాదశి ఉత్సవంలో వెనకాల 20 ఏనుగులు వరసుగా రాగా, ముందు ఒక ఏనుగుపై స్వామివారు తన సతీమణి సీతాదేవి, సోదరుడు లక్ష్మణుడితో కలసి ఊరేగుతారు. సేతుబంధనోత్సవం పెద్ద ఎత్తున చేస్తారు. శ్రీరామ నవమి ఉత్సవాల సంగతి ఇక ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. మూలవిరాట్టు: ఆలయంలోని మూలమూర్తి ఒకచేతిలో విల్లు, మరో చేతిలో పుష్పం, మిగతా రెండు చేతులలో శంఖు, చక్రాలను ధరించి, అత్యంత రమణీయంగా దర్శనమిస్తాడు. ఈ ఆలయంలోని రామచంద్రమూర్తి విగ్రహాన్ని శ్రీకృష్ణుడు పూజించినట్లు స్థలపురాణం చెబుతోంది. ఆలయానికి ముందు నమస్కార మండపం... ఆ మండపంలో నవగ్రహ సన్నిధి కనిపిస్తుంది. రాగితో నిర్మించిన నమస్కార మండప గోడలకు బంగారు తాపడం చేశారు.
ఎలా చేరుకోవాలి?
రైలుమార్గం: త్రిప్రయార్ శ్రీరామాలయానికి వెళ్లేందుకు దగ్గరలో గల రైల్వే స్టేషన్ త్రిస్సూర్. ఇక్కడినుంచి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలోనే స్వామివారి ఆలయాన్ని చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులతోబాటు ప్రైవేటు వాహనాలు కూడా ఉన్నాయి. విమానంలో అయితే కొచ్చిన్ వరకు వెళ్లవచ్చు. అక్కడినుంచి 55 కిలోమీటర్ల దూరంలోని ఆలయాన్ని చేరుకోవడానికి రైళ్లు, బస్సులూ ఉన్నాయి.
కొత్తదిల్లీ, చెన్నై, ముంబాయి, కోల్‌కత్తా, బెంగళూరు, హైదరాబాద్, పూణే, భోపాల్, పట్నాల నుంచి గురువాయూర్‌కి వెళ్లేందుకు బస్సులు, రైళ్లూ ఉన్నాయి. గురువాయూర్ వెళ్తే అక్కడినుంచి త్రిప్రయార్ రామాలయానికి వెళ్లడం చాలా సులువు.
– డి.వి.ఆర్. భాస్కర్