హంపీ విరూపాక్షాలయం
అతి పురాతనం... అత్యంత రమణీయం
సిరులు పొంగిపొరలిన సీమ అది. రతనాలను రాశులుగా పోసి అమ్మిన నేల అది. సంగీతం, సాహిత్యం రెండు కన్నులుగా విలసిల్లి, కవులు, రచయితలకు వేదికగా భాసిల్లిన భుజన విజయమది. లేళ్లు, పులులు కలసి సఖ్యతగా మెలిగిన చోటు అది. రాయలు పాలించిన సువిశాల సామ్రాజ్యమది. శిలలపై శిల్పాలు చెక్కి, సృష్టికే సొబగులు అద్దిన నగరమది. అదే హంపీ. అక్కడి విరూపాక్ష స్వామి ఆలయాన్ని చూడాలంటే రెండు కన్నులూ చాలవనిపిస్తుంది.
సుమారు పదిహేను వందల ఏళ్లనాటి ఆ ఆలయం అలనాటి అపురూప శిల్పకళావైభవానికి అద్దం పట్టినట్లనిపిస్తుంది. విరూపాక్షాలయంతో బాటు విజయనగర సామ్రాజ్య స్థాపనకు ఆద్యుడైన విద్యారణ్యస్వామి వారి ఆలయం, గణపతి దేవాలయం, కోదండ రామాలయం, అచ్యుతరాయల గుడి, బదివి లింగం, ఉగ్రనరసింహస్వామి ఆలయాలతోపాటు గజశాల, రాణిస్నానపు గది, కమల మహల్, రాతిరథం, రామాయణ మహా కావ్యంలో వర్ణించిన పంపా సరోవరం, రుష్యమూక పర్వతం చూస్తుంటే వేల ఏళ్లనాటి సాంస్కృతిక వారసత్వం కనుల ముందు సాక్షాత్కరించి నట్లనిపిస్తుంది.
అపురూపమైన చరిత్ర: విరూపాక్ష దేవాలయం ప్రత్యేకత అంతా అత్యున్నతమైన ఆలయ గోపురాలలోనూ, ప్రాకారాలలోనూ, సజీవ శిల్పాలలోనూ కనిపించి కనువిందు చేస్తుంది. విదేశీ యాత్రికులు, చరిత్రకారులు సైతం హంపీ విజయనగర సామ్రాజ్యంలోని విరూపాక్ష దేవాలయపు వైభోగాన్ని వేనోళ్ల పొగిడారంటే... ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించారంటేనే ఈ కట్టడం ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. తుంగభద్రానదికి దక్షిణ తీరాన ఎత్తయిన రాతిగుట్టలపై ఉన్న హంపీ గొప్ప పౌరాణిక క్షేత్రం.
అనేక పేర్ల హంపి: హంపీ నగరానికి అనెగొంది, విరూపాక్షపురం, హోసపట్టణం, హోస పంపా పట్టణం, హస్తినాపతి, హంపీ, విద్యానగరం తదితర పేర్లున్నట్లు ఇక్కడి శిలాశాసనాలను బట్టి తెలుస్తుంది. విజయనగర సామ్రాజ్య స్థాపనకు ముందే విరూపాక్షస్వామి ఆలయం, బేలూరులోని చెన్నకేశవస్వామి ఆలయాలు ఉన్నాయి.
అతి ఎల్తైన దీ, ప్రధానమైనదీ అయిన 165 అడుగుల తూర్పు రాజగోపురంలోనుంచి లోనికి అడుగు పెట్టగానే ఎడమ చేతివైపు మూడు తలల చిన్న నంది విగ్రహం అగుపిస్తుంది. అసలు గోపురమే పదకొండు అంతస్తులుగా ఉంటుంది.
ప్రాకారం కూడా అతి పెద్దది. ప్రథమ ప్రాకారం పశ్చిమ దిశన కనిపించే మరో గోపురానికి రాయగోపురమని పేరు. ప్రాకారంలో ధ్వజస్తంభాలు, దీపస్తంభాలు, అనేక చిన్న దేవాలయాలున్నాయి. ఈ ప్రాకారంలో ఎదురుగా కనిపించేదే విరూపాక్షాలయం. హంపీలో అత్యంత ప్రాచీన ఆలయం. ఈ ఆలయంలోని కొన్ని కట్టడాలను మొదటి హరిహర రాయలు కట్టించగా, ఆలయంలోగల రంగమంటపాన్ని శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషిక్తుడైన సమయంలో కట్టించాడు. గుడిలోపలి భాగంలో పంపాదేవి, భువనేశ్వరీ మూర్తి నవగ్రహ సన్నిధులున్నాయి.
ఆలయానికి ఉత్తర దిక్కున రత్నగిరి గోపురం, ఆ గోపురాన రత్నగర్భ వినాయకుడితో సహా మరికొన్ని సన్నిధులున్నాయి. విరూపాక్షాలయానికి వెనుకవైపున విద్యారణ్యస్వామివారి సన్నిధి ఉంది. ఇక్కడ ఒక చిత్రమేమిటంటే... విద్యారణ్యస్వామి ఆలయం ముందువైపున ఉన్న రాతిగుహలో శ్రీ విరూపాక్షస్వామి ముఖద్వార గోపురం తలకిందులుగా కనపడుతుంది. సూర్యుడెక్కడున్నా, ఏ వేళప్పుడైనా గోపుర బింబం మాత్రం చెక్కుచెదరకుండా స్థాణువులా అలాగే నిలిచి కనిపిస్తుంది.
ఇక్కడికి సమీపంలోనే ఉండే విఠలాలయం శిల్పకళకు సిసలైన సంపదగా శోభిల్లుతుంది. ఆలయంలో గల స్తంభాలును తాకితే చాలు... సప్తస్వరాలూ పలుకుతూ సందర్శకులకు స్వాగతం పలుకుతాయి. ఇవేగాదు, ఈ ఆలయంలోని అనేక స్తంభాలపైన చెక్కిన పక్షులు, చేపలు, హంసలు ఊపిరి పోసుకుని వచ్చి మన మీద దూకుతాయేమో అన్నంత సజీవంగా... ఉండటం అలనాటి పనితనానికి, శిల్పకళాచాతుర్యానికి నిదర్శనం.
ఎక్కడ ఉంది? ఎలా వెళ్లాలి?
కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిజిల్లా హోస్పేటకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది హంపీ. అంటే బెంగళూరు నుంచి 350 కిలోమీటర్లు పైగా ఉంటుంది. హైదరాబాద్ వాసులు బెంగళూరు నుంచి వెళ్లేబదులు నేరుగా అక్కడి నుంచే హోస్పేట వెళ్లడమే సులువు. దగ్గర కూడా.
దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి బెంగళూరుకు రైళ్లు, విమానాలు ఉన్నాయి. అక్కడినుంచి హోస్పేటకు బస్సులు, రైళ్లు ఉన్నాయి. కొన్ని బస్సులు, రైళ్లు నేరుగా హోస్పేటకు వెళ్లేవి ఉన్నాయి. హోస్పేటనుంచి హంపీకి క్యాబ్‌లు లేదా ట్యాక్సీలలో వెళ్లవచ్చు. ప్రైవేటు వాహనాలు కూడా ఉన్నాయి. హంపీలో బస, వసతి కొంచెం ఖరీదుతో కూడుకున్న వ్యవహారమే. అయితే ఒక మోస్తరు హోటళ్లు, లాడ్జీలు కూడా ఉన్నాయి.
– డి.వి.ఆర్. భాస్కర్