మూడు తొండాల గణేశుడు | Three Gecko Ganesh in pune | Sakshi
Sakshi News home page

మూడు తొండాల గణేశుడు

Published Sun, Sep 4 2016 1:50 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

మూడు తొండాల గణేశుడు

మూడు తొండాల గణేశుడు

టూర్‌దర్శన్
 జై జై గణేశా... మూడు తొండాల గణేశా... జయములిమ్ము బొజ్జ గణేశా..

 
వినాయకుడి ఆలయాల్లో సాధారణంగా ఒక తల, ఒక తొండం, నాలుగు చేతులతో స్వామి కనిపిస్తాడు.  అదే, పుణేలోని సోమ్వార్‌లేన్‌లో గల త్రిశుండ్ మయూరేశ్వర మందిరానికి వెళితే మూడు తొండాలు, ఆరు చేతులతో నెమలి వాహనంపై ఆశీనుడైన గణేశుడు మనకు దర్శనమిస్తాడు. జీవితంలో విజయావకాశాలు అందుకోవాలని తపించే భక్తులకు అభయముద్రలో ఆశీస్సులు అందిస్తుంటాడు.
 
మహారాష్ట్రలోని పుణే పట్టణంలోని రైల్వేస్టేషన్‌కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చిన్నదే అయినా ఎంతో చారిత్రక నేపథ్యంతో పాటు అతి ప్రాచీన ఆలయంగా త్రిశుండ్ మయూరేశ్వర గణపతి మందిరానికి ఘనమైన పేరుంది. దీర్ఘచతురస్రాకారంలో నిటారుగా ఉండే నల్లని రాతి గోడలతో ఈ ఆలయం అలరారుతుంటుంది. రాజస్థానీ, మాల్వా, దక్షిణ భారతీయ శైలులకు చెందిన శిల్పకళతో ఈ మందిరం ఆకట్టుకుంటుంది. రాతి గొడలపై నెమళ్లు, చిలకలు, ఏనుగులు, ఖడ్గమృగాలు, రక్షకభటుల బొమ్మలు, పురాణగాథల శిల్పాలు అత్యంత సహజంగా కనిపిస్తుంటాయి.  
 
గణనాథుడి ద్వారపాలకులు...
అత్యంత ఆకర్షణీయంగా కనిపించే ఈ దేవాలయాన్ని 1754లో భీమ్‌జిగిరి గోసవి అనే స్థానికుడు కట్టించాడని ప్రతీతి. నల్లటి పెద్ద పెద్ద రాళ్లను ఈ నిర్మాణానికి ఉపయోగించారు. ఎక్కడా మట్టిగానీ, కాంక్రీట్ కానీ కనిపించని ఈ ఆలయాన్ని పూర్తి రాతిమయంగానే రూపొందించారు. రాళ్ల మీదనే చెక్కిన అపురూపమైన కుడ్యాలలో ఆలయ మహాద్వారంపైన మధ్యలో గజలక్ష్మి ఆసీనురాలై ఉంటుంది. ఆ పైన ప్రసన్నవదనంతో అనుగ్రహిస్తున్నట్లు కనిపించే వినాయక విగ్రహం ఇట్టే ఆకర్షిస్తుంది. కుంకుమపువ్వు రంగులో కనిపించే మరో చిట్టి గణపతి ద్వారం మీదుగా ఉంటుంది. ద్వారం గుండా నేరుగా గర్భగుడిలో స్వామి దర్శించుకోవచ్చు. ఈ ఆలయ నిర్మాణం పూర్తవడానికి పదహారేళ్లు పట్టింది. 1770లో ఏకశిలతో చెక్కబడిన మూడు తొండాలు గల గణపతిని ఈ ఆలయంలో ప్రతిష్టించారు.
 
సిందూర రూపుడై...
గర్భగుడిలో కనిపించే గణపతి సిందూరాన్ని నిలువెల్లా పులుముకొని, ప్రత్యేకంగా కనిపిస్తాడు. మూడు తొండాలు (త్రి-శుండ్), ఆరు చే తులతో, నెమలి వాహనం (సాధారణంగా ఎలుక వాహనంగా ఉంటుంది) మీద ఆసీనుడై ఉండే స్వామి దర్శన భాగ్యం చేతనే భక్తుల కోరికలు నెరవేరుతాయని, ఎటువంటి క్లిష్టమైన పనినైనా విజయవంతంగా పూర్తిచేయవచ్చు అనే నమ్మకం ఇక్కడి భక్తులలో ఉంది.
 
నాటి శాసనాలే ఆధారాలు...
గర్భగృహం లోపలి రాతి గోడలను పరిశీలిస్తే అబ్బురపరచే శిల్పకళాకృతి కళ్లకు కడుతుంది. ఇక్కడి గర్భగుడి గోడల మీద మూడు శాసనాలు చెక్కి ఉన్నాయి. రెండు శాసనాలు దేవనాగరి లిపి, మూడోది పర్షియన్ లిపిలో ఉంది.  దేవనాగరి లిపిలో ఉండే రెండు శాసనాలలో ఒకదానిమీద రామేశ్వర ఆలయ స్థాపన, రెండవది సంస్కృత శాసనంలో భగవద్గీతశ్లోకాలను చెక్కారు. మూడవ శాసనం పర్షియన్ భాషలో ఉండగా, అది ఈ దేవాలయ చరిత్రను తెలియజేస్తోంది.
 
త్రిశుండ్ మయూరేశ్వర్ గణపతి మందిరానికి సమీపంలో 8వ శతాబ్దికి చెందిన పాటలేశ్వర గుహలు ఉన్నాయి. ఇవి రాష్ట్రకూటుల కాలానికి చెందినవి. ఇక్కడి గుహలలో దేవాలయాలూ ఉన్నాయి.
 
లాల్‌మహల్ ఇక్కడ తప్పక చూడవలసింది. ఛత్రపతి శివాజీ తండ్రి షహాజీ భోంస్లే 1630లో లాల్ మహల్‌ని నిర్మింపజేశాడు. ఆయన భార్య జిజియాబాయి, కుమారుడితో సహా ఈ లాల్‌మాల్‌లో నివసించేవారు. దీనిని పునరుద్ధరించి మ్యూజియమ్‌గా మార్చి పర్యాటకుల సందర్శనం కోసం ఉంచారు.
 
శనివార్‌వాడలో గల కస్బా గణపతి ఆలయం అతి ప్రాచీనమైనది. స్వాతంత్య్రోద్యమ కాలంలో బాల్ గంగాధర్ తిలక్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. అదే సంప్రదాయం నేటికీ కొనసాగుతుంది.

 
ఎలా వెళ్లాలి?
* హైదరాబాద్ నుంచి పుణేకి బస్సు, రైలు సదుపాయాలున్నాయి. పుణే జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి సోమ్వార్‌పేట్‌కి 2 కి.మీ దూరం.
* పుణేలో విమానాశ్రయం ఉంది. ఇక్కడ నుంచి సోమ్వార్‌పేట్‌కి 10 కిలోమీటర్లు.
* అన్ని హోటల్ వసతి సదుపాయాలు ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement