మస్త్ మస్త్ మాండూ
టూర్‌దర్శన్
భారతదేశం నడిబొడ్డున మధ్యప్రదేశ్‌లో గతవైభవ ఘనచరిత్రకు నిలువెత్తు సాక్షీభూతం మాండూ. మాల్వా ప్రాంతంలోని ధార్ జిల్లాలో ఉన్న ఈ పట్టణాన్ని మాండవ్‌గఢ్ అనేవారు. ఈ పట్టణంలో ఎక్కడ చూసినా ఎత్తయిన గుట్టలపై రాతితో నిర్మించిన పురాతనమైన కోటలు, రాజప్రాసాదాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు కనిపిస్తాయి. వింధ్యపర్వత శ్రేణుల్లో వెలసిన ఈ పట్టణం సముద్ర మట్టానికి 633 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పీఠభూమి ప్రాంతపు సహజ ప్రకృతి సౌందర్యంతో పాటు, చారిత్రక విశేషాలను కూడా ఆస్వాదించాలనుకునే వారికి మాండూ చక్కని విడిది ప్రదేశం.
ఏం చూడాలి?
* క్రీస్తుశకం ఆరో శతాబ్ది నాటికే ఈ పట్టణం ఉనికిలో ఉందనేందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే, క్రీస్తుశకం పదో శతాబ్దం నాటికి ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పరమార్ వంశపు రాజులు నిర్మించిన మాండవ్‌గఢ్ కోట, పట్టణానికి గల పన్నెండు ప్రవేశ ద్వారాలు నేటికీ నిలిచి ఉన్నాయి. ఈ కోటను, ఇందులోని శ్రీ సుపార్శ్వనాథుని ఆలయాన్ని, ఆలయం ఒడ్డునే ఉన్న ‘మాండవ్‌గఢ్ తీర్థ్’ కోనేరును తప్పక చూసి తీరాల్సిందే.
* భారతదేశంలోనే మొట్టమొదటి పాలరాతి కట్టడమైన హోషంగ్ షా టోంబ్ ఇక్కడే ఉంది. మాల్వా ప్రాంతాన్ని పరిపాలించిన మొట్టమొదటి ముస్లిం రాజు హోషంగ్ షా ఘోరీ (ఆల్ఫ్ ఖాన్) మరణానంతరం 15వ శతాబ్దిలో ఆయన వారసులు దీనిని నిర్మించారు. తాజ్‌మహల్ కంటే ముందే నిర్మించిన ఈ పాలరాతి కట్టడం ఆనాటి అఫ్ఘాన్ శిల్పకళా శైలిలో కనువిందు చేస్తుంది.
* రాణీ రూప్‌మతి, సుల్తాన్ బాజ్ బహదూర్ ఖాన్‌ల ప్రేమగాథకు నిలువెత్తు సాక్ష్యం మాండూ పట్టణం. మాండూ రాజధానిగా మాల్వా ప్రాంతాన్ని పరిపాలించిన చిట్టచివరి స్వతంత్ర పరిపాలకుడు సుల్తాన్ బాజ్ బహదూర్ ఖాన్ సామాన్య గాయని అయిన రూప్‌మతిని ప్రేమించి పెళ్లాడాడు. రూప్‌మతి అందచందాలు తెలుసుకుని ఆమెను సొంతం చేసుకునేందుకు అక్బర్ చక్రవర్తి తన సేనాని ఆదమ్ ఖాన్‌ను మాండూపై దండయాత్రకు పంపాడు. యుద్ధంలో బహదూర్ ఖాన్ మరణించగా, రూప్‌మతి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కోసం బాజ్ బహదూర్ ఖాన్ నిర్మించిన రూప్‌మతి ప్యాలెస్, ఆ ప్యాలెస్‌కు నిరంతరం నీటి సరఫరా చేసేందుకు నిర్మించిన రేవా కుండ్ రిజర్వాయర్, బాజ్ బహదూర్ కొలువుతీరిన బాజ్ బహదూర్ ప్యాలెస్ నేటికీ వారి ప్రేమకు నిదర్శనంగా నిలిచి ఉన్నాయి.
* మాండూలో జహాజ్ మహల్ ఒక ప్రత్యేక ఆకర్షణ. ఓడను తలపించే ఈ భారీ రాతికోట వాస్తు చాతుర్యం, శిల్పకళా నైపుణ్యం తనివితీరా చూసి తీరాల్సిందే. రెండు తటాకాల మధ్య ఘిజాజుద్దీన్ ఖిల్జీ నిర్మించిన జహాజ్ మహల్‌ను దూరం నుంచి చూస్తే నీటిలో తేలుతున్న ఓడలాగానే కనిపిస్తుంది.
* హోషంగ్ షా హయాంలో నిర్మించిన మరో అద్భుతమైన రాతి కట్టడం హిందోలా మహల్. ఏటవాలు రాతిగోడలతో నిర్మించిన ఈ కోట అప్పట్లో రాజప్రాసాదంగా ఉపయోగపడేది.
* జమీ మసీదు, దరియాఖాన్ టోంబ్, మాలిక్ ముగిత్ టోంబ్ వంటి కట్టడాలు కూడా సందర్శకులను ఆకట్టుకుంటాయి. డమాస్కస్ మసీదు రీతిలో నిర్మించిన జమీ మసీదు పదిహేనో శతాబ్ది నాటి వాస్తుశైలికి నిదర్శనంగా నేటికీ చెక్కు చెదరకుండా నిలిచి ఉంది.
* లొహానీ గుహలు, బాఘ్ గుహలు వంటి పురాతన కొండ గుహలలోని పురాతన కుడ్యశిల్పాలను, కుడ్య చిత్రాలను చూడాల్సిందే. లోహానీ గుహలలో క్రీస్తుశకం పదో శతాబ్దంలో శైవయోగులు ఉండేవారని చెబుతారు. బాఘ్ గుహలలో బౌద్ధ సన్యాసులు ఉండేవారనేందుకు ఇక్కడి కుడ్యచిత్రాలే ఆధారాలు.
ఏం చేయాలి?
* రూప్‌మతి మహల్ పైభాగంలో ఉన్న రూప్‌మతి పెవిలియన్‌కు చేరుకుని అక్కడి నుంచి మాండూ పట్టణాన్ని, చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాలను వీక్షించడం ఒక మధురానుభూతి. ఇక్కడ నిలుచునే రాణీ రూప్‌మతి ఇక్కడకు దక్షిణాన కనిపించే బాజ్ బహదూర్ ప్యాలెస్‌ను, నర్మదా నదిని చూస్తూ గంటల తరబడి గడిపేదని ప్రతీతి.
* బాజ్ బహదూర్ ప్యాలెస్, జహాజ్ మహల్, హోషంగ్ టోంబ్, జైన మందిరం వంటి అరుదైన కట్టడాలను అడుగడుగునా తిలకించడం గొప్ప అనుభూతినిస్తుంది. దిగువన ఏర్పాటు చేసిన రేవాకుండ్ నుంచి ఎగువన ఉన్న రూప్‌మతి మహల్‌కు నీటి సరఫరా జరిగేది. అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యం చూస్తే ఇప్పటి వారికీ ఆశ్చర్యం కలుగుతుంది.
* ఉజాలి బవుడి ఇక్కడ తప్పనిసరిగా చూడాల్సిన మరో ఇంజనీరింగ్ అద్భుతం. పురాతనమైన ఈ బావి చాలా విశాలంగా ఉండటమే కాకుండా, నీటి మట్టం వరకు చేరుకునేందుకు అనువుగా రెండువైపులా రాతి మెట్లు ఉంటాయి. నీటిని మోసుకొచ్చేవారు అక్కడక్కడా బరువును దించుకునేందుకు వీలుగా చదునైన గట్లు ఉంటాయి.
* గుట్టలెక్కుతూ కోటలను సందర్శించడమే కాకుండా, జన సమ్మర్దం తక్కువగా ఉండే మాండూ వీధులు వాకింగ్‌కు, సైక్లింగ్‌కు అనువుగా ఉంటాయి. ఇక్కడి వాతావరణం కూడా దాదాపు ఏడాది పొడవునా ఆహ్లాదభరితంగానే ఉంటుంది.
ఏం కొనాలి?
* గృహాలంకరణ వస్తువులు, స్థానిక మాల్వా గిరిజన కళాకారులు రూపొందించిన హస్తకళాకృతులు మాండూ మార్కెట్‌లో చౌకగా లభిస్తాయి. వీటిని ఇక్కడి నుంచి కొని తీసుకుపోవచ్చు.
* చేనేత వస్త్రాలు, దుప్పట్లు వంటివి కూడా ఇక్కడ తక్కువ ధరలకే దొరుకుతాయి.
* అటుకులతో తయారు చేసే అల్పాహారం, దాల్ కచోడీలు, పనీర్ వంటకాలు వంటి మాల్వా ఆహారాన్ని ఇక్కడ రుచి చూడాల్సిందే.
ఎలా చేరుకోవాలి?
* విమానాల్లో వచ్చేవారు ఇండోర్ విమానాశ్రయంలో దిగాల్సి ఉంటుంది. ఇండోర్ నుంచి సుమారు వంద కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం ద్వారా మాండూ చేరుకోవచ్చు.
* రైళ్లలో వచ్చేవారు రత్లాం స్టేషన్‌లో దిగాల్సి ఉంటుంది. దేశంలోని దాదాపు అన్ని మార్గాల నుంచి వచ్చే రైళ్లు ఇక్కడ ఆగుతాయి. ఇక్కడి నుంచి 124 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం ద్వారా మాండూ చేరుకోవాల్సి ఉంటుంది. బస్సులు, ట్యాక్సీలు విరివిగా అందుబాటులో ఉంటాయి.
* ధార్, రత్లాం, ఇండోర్, ఉజ్జయిని, భోపాల్ వంటి ప్రధాన పట్టణాలు, నగరాల నుంచి మాండూకు బస్సులు అందుబాటులో ఉంటాయి.