మబ్బులతో మాట్లాడవచ్చు! | Almora Tour Darshan | Sakshi
Sakshi News home page

మబ్బులతో మాట్లాడవచ్చు!

Published Sun, Jul 31 2016 4:29 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

మబ్బులతో మాట్లాడవచ్చు!

మబ్బులతో మాట్లాడవచ్చు!

టూర్‌దర్శన్
మంచుకొండల మనోహర సోయగాలు... మైమరపించే పచ్చని వనాల సొగసులు... గుర్రపు జీను ఆకారంలో ఉన్న కొండల మీద వెలసిన అందమైన ఊరు అల్మోరా. అక్కడి కొండల మీదకు వెళ్లి చూస్తే మబ్బులు చేతికందుతాయా అనిపిస్తాయి. ఊరికి ఇరువైపులా పారే కోసీ, సుయాల్ నదుల జలకళ నయనానందం కలిగిస్తుంది. ఇక్కడి కొండలపై కనిపించే ‘కిల్మోరా’ మొక్క కారణంగా ఈ ఊరికి అల్మోరా అనే పేరు వచ్చింది. ఇక ఇక్కడి పురాతన ఆలయాల శిల్పసౌందర్యాన్ని చూసి తీరాల్సిందే.
 
ఏం చూడాలి?
* హిమగిరి సొగసులను తనివితీరా చూసి ఆస్వాదించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సముద్ర మట్టానికి దాదాపు ఆరువేల అడుగుల ఎత్తున ఉండే అల్మోరాలో వేసవిలోనూ వాతావరణం చల్లగా ఉంటుంది.
* అల్మోరా పట్టణంలోను, సమీప పరిసర ప్రదేశాల్లోనూ సుప్రసిద్ధ పురాతన ఆలయాలు చాలానే ఉన్నాయి. కాసర్‌దేవి, నందాదేవి, జాఖన్‌దేవి, పాతాళదేవి, చితాయి గోలుదేవత, బనరీదేవి వంటి పురాతన శాక్తేయ ఆలయాలకు సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు.
* దేశంలో అతి తక్కువగా కనిపించే సూర్యదేవాలయాల్లో ఒకటి అల్మోరాకు చేరువలోని కటార్‌మల్ గ్రామంలో ఉంది. కట్యూరి వంశానికి చెందిన కటారమల్ క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో నిర్మించిన ఈ ఆలయ కుడ్యాలపై కనిపించే శిల్పకళా సంపద సందర్శకులను ఆకట్టుకుంటుంది.
* అల్మోరాకు చేరువలోని చితాయి గ్రామంలో గోలుదేవత ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కడి అమ్మవారికి తమ కోరికలను దరఖాస్తులుగా సమర్పించుకుంటారు. అవి తీరితే తిరిగి ఇక్కడకు వచ్చి, తీరిన కోరికకు గుర్తుగా ఆలయ ప్రాంగణంలో గంటలు కడతారు.
* అల్మోరా చేరువలోని పాండుఖోలి మరో ప్రసిద్ధ ఆలయం. లాక్షాగృహ దహనం తర్వాత దుర్యోధనుడి బారి నుంచి తప్పించుకోవడానికి పాండవులు కొన్నాళ్లు ఇక్కడ తలదాచుకున్నారని ప్రతీతి.
* అల్మోరాలోనే పుట్టిపెరిగిన స్వాతంత్య్ర సమరయోధుడు, ఉత్తరప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి గోవిందవల్లభ్ పంత్ జ్ఞాపకార్థం ఇక్కడ ఆయన పేరిట నిర్మించిన మ్యూజియంలోని పురాతన వస్తువులను, కళాఖండాలను చూసి తీరాల్సిందే.
* ఇక్కడకు చేరువలోని లఖుడియా ప్రాంతంలోని కొండగుహలలో చరిత్రపూర్వయుగం నాటి కుడ్యచిత్రాలు ఇక్కడి పురాతన నాగరికతకు ఆనవాళ్లుగా నేటికీ నిలిచి ఉన్నాయి.
* అల్మోరాలోని కొండ శిఖరాలపై ఉన్న జీరోపాయింట్, బ్రైట్ ఎండ్ కార్నర్ వంటి ప్రదేశాలకు చేరుకుని సూర్యాస్తమయ దృశ్యాలను, చుట్టుపక్కల కనిపించే దట్టమైన అడవుల పచ్చదనాన్ని తిలకించడం పర్యాటకులకు మధురానుభూతినిస్తుంది.
* ఇక్కడకు చేరువలోని బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యంలో విహరిస్తూ ఇక్కడ సంచరించే అరుదైన వన్యప్రాణులను తిలకించవచ్చు. పులులు, చిరుతలు, జింకలు వంటి అరుదైన జంతువులతో పాటు రకరకాల అరుదైన పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తాయి.
 
ఏం చేయాలి?
* ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ప్రశాంత వాతావరణంలో గడపాలనుకునే పర్యాటకులకు ఇది పూర్తిగా అనువైన ప్రదేశం. ఇక్కడి హోటళ్లలో, రిసార్టుల్లో ఎక్కడ బస చేసినా ఆరుబయటకు చూస్తే కనుచూపు మేర చుట్టూ పరుచుకున్న పచ్చదనం, సుదూరాన మంచుకొండల ధవళకాంతులు కనువిందు చేస్తాయి.
* పర్వతారోహకులకు ఇక్కడి కొండలు సవాలుగా నిలుస్తాయి. ట్రెక్కింగ్‌పై ఆసక్తి గల ఔత్సాహిక పర్యాటకులు ఇక్కడి కొండలపైకి ఎక్కి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతారు.
* ఆలయ సందర్శనంపై ఆసక్తిగల పర్యాటకులకు ఇక్కడ అడుగడుగునా కనిపించే అత్యంత పురాతన ఆలయాలు, ఆ ఆలయాల్లోని ఆచార వ్యవహారాలు ఆకట్టుకుంటాయి.
* అల్మోరాలోను, ఇక్కడి పరిసరాల్లోని గోవిందవల్లభ్ పంత్ మ్యూజియం, కుమావో రెజిమెంటల్ మ్యూజియం, జగేశ్వర్ ఆర్కియాలాజికల్ మ్యూజియం వంటివి చూసి తీరాల్సిందే. వీటిలో భద్రపరచిన పురాతన వస్తువులు, కళాఖండాల ద్వారా ఇక్కడి ప్రాచీన నాగరికతా వికాసాన్ని ఆకళింపు చేసుకోవచ్చు.
 
ఏం కొనాలి?
* మంచుకొండలకు చేరువగా ఉండటంతో అల్మోరాలో ఊలు దుస్తుల వాడకం ఎక్కువ. ఇక్కడి నేతగాళ్లు ప్రత్యేకంగా తయారు చేసిన స్వెట్టర్లు, మఫ్లర్లు, శాలువలు వంటి ఊలు దుస్తులు ఇక్కడ చౌకగా దొరుకుతాయి.
* అల్మోరా రాగి వస్తువులకు కూడా ప్రసిద్ధి పొందిన ఊరు. ఇక్కడి కళాకారులు రాగితో తయారు చేసిన పాత్రలు, సంప్రదాయ కళాకృతులు, విగ్రహాలు వంటివి సరసమైన ధరలకే దొరుకుతాయి.
* ఇక్కడ ప్రత్యేకంగా దొరికే సింగొరా, బాల్ మిఠాయి వంటి నోరూరించే మిఠాయిలను కూడా కొనుక్కోవచ్చు.
 
ఎలా చేరుకోవాలి?
* దూర ప్రాంతాల నుంచి విమానాల్లో వచ్చేవారు డెహ్రాడూన్‌లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో బస్సులు లేదా ట్యాక్సీల ద్వారా అల్మోరా చేరుకోవచ్చు.
* రైళ్లలో వచ్చేవారు అల్మోరాకు సమీపంలోని కఠ్‌గోదాం స్టేషన్‌లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి బస్సులు లేదా ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు.
* ఉత్తరాదిలో ఢిల్లీ, చండీగఢ్ వంటి నగరాలతో పాటు ఉత్తరాఖండ్‌లోని దాదాపు అన్ని పట్టణాల నుంచి అల్మోరా వరకు నేరుగా బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement