Himagiri
-
హిమగిరి బార్ నిర్వాహకులపై కేసు
అనంతపురం, తాడిపత్రి: మద్యం అమ్మకాలకు సంబంధించి సరైన రికార్డులు లేకపోవడంతో తాడిపత్రిలోని హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులపై ఎక్సైజ్ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ‘మద్యం చీప్’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఎక్సైజ్ సూపరిండెంట్ నారాయణస్వామి, స్థానిక ఎక్సైజ్ సీఐ దశరథరామిరెడ్డి సిబ్బందితో కలిసి హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్లను మంగళవారం తనిఖీ చేశారు. ఇక్కడ ఎక్కువ శాతం చీప్ లిక్కర్ విక్రయిస్తున్నట్లు తేలినట్లు తెలిసింది. 6బీ, 7బీ రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంతో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ముందే జాగ్రత్త పడ్డ నిర్వాహకులు? సాక్షిలో వచ్చిన కథనంతో ముందే జాగ్రత్త పడ్డ నిర్వాహకులు ఉదయమే రెస్టారెంట్లో ఉన్న నకిలీ మద్యాన్ని తరలించినట్లు తెలిసింది. భారీగా నకిలీ మద్యం నిల్వ ఉండడంతో ఎక్సైజ్ అధికారులు వచ్చి ఎక్కడ తనిఖీ చేస్తారో అని ముందు జాగ్రత్తగా ‘తగ్గింపు ధరకే మద్యం విక్రయాలు’ అని బార్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించడమే కాకుండా బార్లో ఉన్న నకిలీ మద్యాన్ని మరోచోటుకు తరలించేసినట్లు సమాచారం. ఇన్నేళ్లుగా హిమగిరి బార్ అండ్ రెస్టారెంట్లో ఇష్టారాజ్యంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నా స్థానిక ఎక్సైజ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేయడం విశేషం. -
మబ్బులతో మాట్లాడవచ్చు!
టూర్‌దర్శన్ మంచుకొండల మనోహర సోయగాలు... మైమరపించే పచ్చని వనాల సొగసులు... గుర్రపు జీను ఆకారంలో ఉన్న కొండల మీద వెలసిన అందమైన ఊరు అల్మోరా. అక్కడి కొండల మీదకు వెళ్లి చూస్తే మబ్బులు చేతికందుతాయా అనిపిస్తాయి. ఊరికి ఇరువైపులా పారే కోసీ, సుయాల్ నదుల జలకళ నయనానందం కలిగిస్తుంది. ఇక్కడి కొండలపై కనిపించే ‘కిల్మోరా’ మొక్క కారణంగా ఈ ఊరికి అల్మోరా అనే పేరు వచ్చింది. ఇక ఇక్కడి పురాతన ఆలయాల శిల్పసౌందర్యాన్ని చూసి తీరాల్సిందే. ఏం చూడాలి? * హిమగిరి సొగసులను తనివితీరా చూసి ఆస్వాదించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సముద్ర మట్టానికి దాదాపు ఆరువేల అడుగుల ఎత్తున ఉండే అల్మోరాలో వేసవిలోనూ వాతావరణం చల్లగా ఉంటుంది. * అల్మోరా పట్టణంలోను, సమీప పరిసర ప్రదేశాల్లోనూ సుప్రసిద్ధ పురాతన ఆలయాలు చాలానే ఉన్నాయి. కాసర్‌దేవి, నందాదేవి, జాఖన్దేవి, పాతాళదేవి, చితాయి గోలుదేవత, బనరీదేవి వంటి పురాతన శాక్తేయ ఆలయాలకు సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. * దేశంలో అతి తక్కువగా కనిపించే సూర్యదేవాలయాల్లో ఒకటి అల్మోరాకు చేరువలోని కటార్మల్ గ్రామంలో ఉంది. కట్యూరి వంశానికి చెందిన కటారమల్ క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో నిర్మించిన ఈ ఆలయ కుడ్యాలపై కనిపించే శిల్పకళా సంపద సందర్శకులను ఆకట్టుకుంటుంది. * అల్మోరాకు చేరువలోని చితాయి గ్రామంలో గోలుదేవత ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కడి అమ్మవారికి తమ కోరికలను దరఖాస్తులుగా సమర్పించుకుంటారు. అవి తీరితే తిరిగి ఇక్కడకు వచ్చి, తీరిన కోరికకు గుర్తుగా ఆలయ ప్రాంగణంలో గంటలు కడతారు. * అల్మోరా చేరువలోని పాండుఖోలి మరో ప్రసిద్ధ ఆలయం. లాక్షాగృహ దహనం తర్వాత దుర్యోధనుడి బారి నుంచి తప్పించుకోవడానికి పాండవులు కొన్నాళ్లు ఇక్కడ తలదాచుకున్నారని ప్రతీతి. * అల్మోరాలోనే పుట్టిపెరిగిన స్వాతంత్య్ర సమరయోధుడు, ఉత్తరప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి గోవిందవల్లభ్ పంత్ జ్ఞాపకార్థం ఇక్కడ ఆయన పేరిట నిర్మించిన మ్యూజియంలోని పురాతన వస్తువులను, కళాఖండాలను చూసి తీరాల్సిందే. * ఇక్కడకు చేరువలోని లఖుడియా ప్రాంతంలోని కొండగుహలలో చరిత్రపూర్వయుగం నాటి కుడ్యచిత్రాలు ఇక్కడి పురాతన నాగరికతకు ఆనవాళ్లుగా నేటికీ నిలిచి ఉన్నాయి. * అల్మోరాలోని కొండ శిఖరాలపై ఉన్న జీరోపాయింట్, బ్రైట్ ఎండ్ కార్నర్ వంటి ప్రదేశాలకు చేరుకుని సూర్యాస్తమయ దృశ్యాలను, చుట్టుపక్కల కనిపించే దట్టమైన అడవుల పచ్చదనాన్ని తిలకించడం పర్యాటకులకు మధురానుభూతినిస్తుంది. * ఇక్కడకు చేరువలోని బిన్సార్ వన్యప్రాణుల అభయారణ్యంలో విహరిస్తూ ఇక్కడ సంచరించే అరుదైన వన్యప్రాణులను తిలకించవచ్చు. పులులు, చిరుతలు, జింకలు వంటి అరుదైన జంతువులతో పాటు రకరకాల అరుదైన పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఏం చేయాలి? * ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ప్రశాంత వాతావరణంలో గడపాలనుకునే పర్యాటకులకు ఇది పూర్తిగా అనువైన ప్రదేశం. ఇక్కడి హోటళ్లలో, రిసార్టుల్లో ఎక్కడ బస చేసినా ఆరుబయటకు చూస్తే కనుచూపు మేర చుట్టూ పరుచుకున్న పచ్చదనం, సుదూరాన మంచుకొండల ధవళకాంతులు కనువిందు చేస్తాయి. * పర్వతారోహకులకు ఇక్కడి కొండలు సవాలుగా నిలుస్తాయి. ట్రెక్కింగ్‌పై ఆసక్తి గల ఔత్సాహిక పర్యాటకులు ఇక్కడి కొండలపైకి ఎక్కి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు ఉవ్విళ్లూరుతారు. * ఆలయ సందర్శనంపై ఆసక్తిగల పర్యాటకులకు ఇక్కడ అడుగడుగునా కనిపించే అత్యంత పురాతన ఆలయాలు, ఆ ఆలయాల్లోని ఆచార వ్యవహారాలు ఆకట్టుకుంటాయి. * అల్మోరాలోను, ఇక్కడి పరిసరాల్లోని గోవిందవల్లభ్ పంత్ మ్యూజియం, కుమావో రెజిమెంటల్ మ్యూజియం, జగేశ్వర్ ఆర్కియాలాజికల్ మ్యూజియం వంటివి చూసి తీరాల్సిందే. వీటిలో భద్రపరచిన పురాతన వస్తువులు, కళాఖండాల ద్వారా ఇక్కడి ప్రాచీన నాగరికతా వికాసాన్ని ఆకళింపు చేసుకోవచ్చు. ఏం కొనాలి? * మంచుకొండలకు చేరువగా ఉండటంతో అల్మోరాలో ఊలు దుస్తుల వాడకం ఎక్కువ. ఇక్కడి నేతగాళ్లు ప్రత్యేకంగా తయారు చేసిన స్వెట్టర్లు, మఫ్లర్లు, శాలువలు వంటి ఊలు దుస్తులు ఇక్కడ చౌకగా దొరుకుతాయి. * అల్మోరా రాగి వస్తువులకు కూడా ప్రసిద్ధి పొందిన ఊరు. ఇక్కడి కళాకారులు రాగితో తయారు చేసిన పాత్రలు, సంప్రదాయ కళాకృతులు, విగ్రహాలు వంటివి సరసమైన ధరలకే దొరుకుతాయి. * ఇక్కడ ప్రత్యేకంగా దొరికే సింగొరా, బాల్ మిఠాయి వంటి నోరూరించే మిఠాయిలను కూడా కొనుక్కోవచ్చు. ఎలా చేరుకోవాలి? * దూర ప్రాంతాల నుంచి విమానాల్లో వచ్చేవారు డెహ్రాడూన్‌లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో బస్సులు లేదా ట్యాక్సీల ద్వారా అల్మోరా చేరుకోవచ్చు. * రైళ్లలో వచ్చేవారు అల్మోరాకు సమీపంలోని కఠ్గోదాం స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. అక్కడి నుంచి బస్సులు లేదా ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు. * ఉత్తరాదిలో ఢిల్లీ, చండీగఢ్ వంటి నగరాలతో పాటు ఉత్తరాఖండ్‌లోని దాదాపు అన్ని పట్టణాల నుంచి అల్మోరా వరకు నేరుగా బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. -
హిమగిరి నుంచి బ్రహ్మఝరి
గమనం : నదుల స్వగత కథనం మానస సరోవరం... జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలనిపించే ప్రదేశం. నేను అక్కడే పుట్టి కైలాస పర్వతాన్ని చూస్తూ ప్రయాణం మొదలు పెట్టాను. హిమాలయాల్లోని చెమాయుంగ్ దుంగ్ హిమనీనదం నా పుట్టిల్లు. ప్రాచీనంలో తూర్పు దేశాలకు, పశ్చిమానికి మధ్య రవాణా నా కళ్ల ముందే జరిగేది. మానస సరోవరానికి కైలాసపర్వతానికి మధ్యనున్న ‘పర్కా’ వాణిజ్యకేంద్రం వ్యాపార లావాదేవీల స్థావరం. ‘యార్లాంగ్ గ్జాంగ్పో’ పేరుతో పుట్టిన నేను టిబెట్ పీఠభూమి నుంచి నేలను వెతుక్కుంటూ ‘నమ్చబర్వా పర్వతం’ దగ్గర మంచుకొండలను చుడుతూ వంపు తిరిగి, లోయల్లోకి జారిపోతాను. అలా జారిపోవడంలో సున్నితత్వం లోపించి కరుకుగా పర్వతాన్ని కోసేస్తుంటాను. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర భారత్‌లో అడుగుపెడతాను. అక్కడ నన్ను ‘సియాంగ్’ అని పిలుస్తారు. అక్కడి నుంచి కొద్దిగా దిశ మార్చుకుంటూ, అస్సాం రాష్ట్రంలోకి ప్రవేశిస్తానో లేదో ‘లుయిత్’ అంటూ పలకరిస్తారు. బహుశా ఈ లుయిత్... సంస్కృతంలో లౌహిత్య పేరుతో పిలిచిన పేరుకి వ్యవహారిక నామం కాబోలు. బోడోలయితే నన్ను ‘భుల్లుంబత్తర్’ అంటారు. భుల్లుంబత్తర్ అంటే - నీటిని గొంతు దగ్గర ఆపేసి గరగర శబ్దం చేస్తుంటారు చూడండి! - అలాంటి శబ్దం అని అర్థం. గిరిపుత్రులు చెప్పిన భాష్యం నా ప్రవాహవేగాన్ని చెప్పకనే చెప్తోంది. మరి సముద్ర మట్టానికి నాలుగు వేల మీటర్ల ఎత్తు నుంచి నేలకు దిగే ప్రయాణం నిశ్శబ్దంగా ఎలా ఉంటుంది? దిహంగ్, లుయిత్లు కలిసిన తర్వాత నన్ను ‘బ్రహ్మపుత్ర’ అని పిలుస్తారు. మంచు కరిగే రోజుల్లో... హిమాలయాల్లో మంచు కరిగే కొద్దీ నా ప్రవాహం ఉద్ధృతమవుతుంటుంది. నా తీరంలో నేలలు ఎప్పుడూ చిత్తడిగానే ఉంటాయి. ఎటు చూసినా పచ్చటి చెట్లు, దట్టమైన అడవులు, పొదల మయం. పచ్చదనం పరవళ్లు తొక్కుతున్నట్లు ఉంటుంది. కళ్లు ఒక్క ఆకుపచ్చ రంగుని మాత్రమే చూస్తున్నాయా, ఇతర రంగులను గుర్తించడం మానేశాయా అనే భ్రమ కలుగుతుంది కూడా. ఏడాది పొడవునా నీటి ప్రవాహంతో అలరారే నా తీరం ఇలాగే ఉంటుంది మరి. మంచు కరగడం తగ్గుముఖం పడుతుందో లేదో వర్షాలు మొదలవుతాయి. నా తీరాన ఎప్పుడు వర్షం పడుతుందో ఊహించడం కష్టం. ఉన్న ఫళంగా కుండపోత కురుస్తుంది. చిరపుంజిలో కురిసే ప్రతి చినుకూ నన్నే చేరుతుంది. నా తీరాన నిలబడి ‘ఈ ఒడ్డు ఆ ఒడ్డు నడిమధ్య ఏరడ్డు’ అని పాడుకోవడం అంత సులభం కాదు. చాలా చోట్ల రెండు ఒడ్డుల మధ్య దూరం పది కిలోమీటర్లు ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు ప్రధాన జలరవాణా మార్గాన్ని కూడా. నా తీరాన దట్టమైన అడవులు, పచ్చటి పంట పొలాలు విస్తరించాయని సంతోషపడే లోపు వరద బీభత్సానికి తల్లడిల్లే తీర ప్రజలతోపాటు కజిరంగా నేషనల్పార్కులోని వన్యమృగాలు కళ్ల ముందు మెదులుతాయి. కజిరంగాలో... ఖడ్గమృగం భారంగా పరుగులు తీస్తుంటుంది. ఏనుగు బరువుగా అడుగులేస్తుంటుంది. చిన్న సవ్వడికే లేడి చెంగున ఎగురుతుంటే, దుప్పి అంత తొందరేముందన్నట్లు పరికించి చూస్తూ అడుగులేస్తుంటుంది. నీటి బర్రెలు... ఇంకెక్కడికెళతాం అన్నట్లు వీపులు మునిగే లోతులో విశ్రాంతిగా కాలం గడుపుతుంటాయి. రాయల్ బెంగాల్ పులులు, చిరుతలు ఎప్పుడో కానీ కనిపించవు. నీలిరంగు పాలపిట్ట, అడవి కోడి, గద్ద, తోడేళ్ల గుంపులు కనువిందు చేస్తుంటే... రామచిలుకలు ఆకుల్లో కలిసిపోయి మేమున్నామంటూ చిట్టి పలుకులతో ఆకర్షిస్తుంటాయి. ఏనుగు అంబారీ ఎక్కి వన్యమృగాలను చూడడానికి అడవిలో పర్యటించే పర్యాటకులు నా ప్రవాహ సవ్వడిని నేపథ్య సంగీతంలా ఆస్వాదిస్తుంటారు. ఇంత అందమైన ప్రదేశం కావడంతోనో ఏమో హిందువులు, జైనులు జీవితంలో ఒక్కసారైనా కైలాసపర్వతాన్ని చూడాలని, ఆ యాత్ర బ్రహ్మపుత్ర మీదుగానే సాగాలని కోరుకుంటారు. కైలాసపర్వతాన్ని అందరూ ఎడమ నుంచి కుడివైపుగా ప్రదక్షిణ మార్గంలో చుట్టివస్తుంటే బోనులు మాత్రం కుడి నుంచి ఎడమవైపుకి అప్రదక్షిణ మార్గంలో చుట్టి వస్తుంటారు. బౌద్ధులు, జైనులు, బోనులు నన్ను నదీమతల్లిగా గౌరవిస్తారు. ప్రకృతి పరిరక్షణ నియమాలన్నీ పాటిస్తారు. నా ప్రవాహంలో ‘అమోచు, సంకోష్, దిబాంగ్, రాయ్దక్, భరేలి, మాన్స్, లుహిత్, జియా భోరేలి, కామెంగ్, తీస్తా నదులు నాకు తోడుగా వచ్చి నా శక్తిని పెంచుతుంటే అస్సాంలో నేనే ‘ఖేర్జుతియా’ పేరుతో ఒక పాయగా దూరంగా వెళ్లిపోతాను. వంద కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ఖేర్జుతియా పాయ తిరిగి నాలో కలిసిపోతుంది. ఆ మధ్యలో ఉన్న భూభాగం ‘మజులి’ ద్వీపం. ఇది ప్రపంచంలో పెద్ద నదీద్వీపం. ఈ కలయికను చూస్తుంటాయి గౌహతి నగరం, ‘కామాఖ్య’ ఆలయం. ఇది 51 శక్తి పీఠాలలో ఒకటి. ‘ఇక్కడి వరకు వచ్చి కామాఖ్య ఆలయాన్ని దర్శించుకోకపోతే బ్రహ్మపుత్రను ఏడుసార్లు దాటాల్సి వస్తుందని’ ఓ నానుడి. అంత విశాలంగా ఉండే నేను గౌహతి దాటి షిల్లాంగ్ చేరేసరికి సన్నగిల్లి ఒక్క కిలోమీటరు వెడల్పుకే పరిమితమవుతాను. ఇక్కడికి చేరగానే 17వ శతాబ్దం నాటి సరయ్ఘాట్ యుద్ధం కళ్ల ముందు మెదులుతుంది. ‘అహోం’ రాజ్యం మీద మొఘలుల ప్రతినిధి రాజా రామ్‌సింగ్ చేసిన దాడిని, గౌహతి వరకు విస్తరించిన పాలనను చూశాను. రాజ్యవిస్తరణలో మొఘలులు చేసిన చివరి ప్రయత్నం అదే. భూతాన్ని దాచుకున్నానని... సముద్రాన్ని తలపించే భారీ నదిని కావడంతో అలలు ఎగిసిపడుతుంటాయి. నీటి లోపల భూతం ఉండడంతోనే భారీ వరదలనీ, పడవలు బోల్తా పడతాయనీ, భూతాన్ని కడుపులో దాచుకున్న నది అని శాపనార్థాలు పెడతారు గిరిపుత్రులు. అస్సాంలోని వెనుకబాటును వెనక్కి తోసి అభివృద్ధి పథంలో నడిపించడానికి నేనూ దోహదం అవుతున్నానని సంతోషించే లోపు దిగ్బాయ్ ఆయిల్ రిఫైనరీ ఫీల్డ్స్ నుంచి పెట్రో ఉత్పత్తుల వెలికితీత, రవాణాలతో కలుషితమవుతున్నాను. బంగ్లాదేశ్‌లో అడుగు పెట్టగానే సుందర్బన్ అడవుల సాక్షిగా మరోసారి చీలిపోతాను. ఇక్కడ విచిత్రమేమిటంటే పెద్ద పాయకు నా పేరు ఉండదు, ‘జమున’ అని పిలుస్తారు. జమున కాస్తా ‘పద్మ’ (గంగను బంగ్లాదేశ్‌లో పద్మ అంటారు)లో మమేకమవుతుంది. బ్రహ్మపుత్రగా కొనసాగిన నేను చాంద్‌పూర్ దగ్గర ‘మేఘన’లో కలుస్తాను. ఇక్కడ నాకు మిగిలే సంతోషం... జమున పేరుతో వేరుపడిన నా పాయ కూడా మేఘనలోనే కలుస్తుంది. నేరుగా నాలో కలవడానికి కొద్దిగా భేషజం అడ్డొచ్చిందేమో మరి! ఇంత పెద్ద ప్రవాహాన్ని, ప్రపంచంలో పెద్ద నదుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నేను... నేనుగా సముద్రంలో అడుగుపెట్టడం లేదు. అయితే ఆ ప్రదేశాన్ని గంగ- బ్రహ్మపుత్ర డెల్టా అంటూ నా పేరు వ్యవహారంలో ఉండడం నాకు సంతోషం. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి manjula.features@sakshi.com