హిమగిరి నుంచి బ్రహ్మఝరి | Brahmachari from himagiri | Sakshi
Sakshi News home page

హిమగిరి నుంచి బ్రహ్మఝరి

Published Tue, Mar 17 2015 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM

హిమగిరి నుంచి బ్రహ్మఝరి

హిమగిరి నుంచి బ్రహ్మఝరి

గమనం : నదుల స్వగత కథనం
మానస సరోవరం... జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలనిపించే ప్రదేశం. నేను అక్కడే పుట్టి కైలాస పర్వతాన్ని చూస్తూ ప్రయాణం మొదలు పెట్టాను. హిమాలయాల్లోని చెమాయుంగ్ దుంగ్ హిమనీనదం నా పుట్టిల్లు. ప్రాచీనంలో తూర్పు దేశాలకు, పశ్చిమానికి మధ్య రవాణా నా కళ్ల ముందే జరిగేది. మానస సరోవరానికి కైలాసపర్వతానికి మధ్యనున్న ‘పర్కా’ వాణిజ్యకేంద్రం వ్యాపార లావాదేవీల స్థావరం.

‘యార్లాంగ్ గ్జాంగ్‌పో’ పేరుతో పుట్టిన నేను టిబెట్ పీఠభూమి నుంచి నేలను వెతుక్కుంటూ ‘నమ్‌చబర్వా పర్వతం’ దగ్గర మంచుకొండలను చుడుతూ వంపు తిరిగి, లోయల్లోకి జారిపోతాను. అలా జారిపోవడంలో సున్నితత్వం లోపించి కరుకుగా పర్వతాన్ని కోసేస్తుంటాను. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర భారత్‌లో అడుగుపెడతాను. అక్కడ నన్ను ‘సియాంగ్’ అని పిలుస్తారు. అక్కడి నుంచి కొద్దిగా దిశ మార్చుకుంటూ, అస్సాం రాష్ట్రంలోకి ప్రవేశిస్తానో లేదో ‘లుయిత్’ అంటూ పలకరిస్తారు.

బహుశా ఈ లుయిత్... సంస్కృతంలో లౌహిత్య పేరుతో పిలిచిన పేరుకి వ్యవహారిక నామం కాబోలు. బోడోలయితే నన్ను ‘భుల్లుంబత్తర్’ అంటారు. భుల్లుంబత్తర్ అంటే - నీటిని గొంతు దగ్గర ఆపేసి గరగర శబ్దం చేస్తుంటారు చూడండి! - అలాంటి శబ్దం అని అర్థం. గిరిపుత్రులు చెప్పిన భాష్యం నా ప్రవాహవేగాన్ని చెప్పకనే చెప్తోంది. మరి సముద్ర మట్టానికి నాలుగు వేల మీటర్ల ఎత్తు నుంచి నేలకు దిగే ప్రయాణం నిశ్శబ్దంగా ఎలా ఉంటుంది? దిహంగ్, లుయిత్‌లు కలిసిన తర్వాత నన్ను ‘బ్రహ్మపుత్ర’ అని పిలుస్తారు.
 
మంచు కరిగే రోజుల్లో...
హిమాలయాల్లో మంచు కరిగే కొద్దీ నా ప్రవాహం ఉద్ధృతమవుతుంటుంది. నా తీరంలో నేలలు ఎప్పుడూ చిత్తడిగానే ఉంటాయి. ఎటు చూసినా పచ్చటి చెట్లు, దట్టమైన అడవులు, పొదల మయం. పచ్చదనం పరవళ్లు తొక్కుతున్నట్లు ఉంటుంది. కళ్లు ఒక్క ఆకుపచ్చ రంగుని మాత్రమే చూస్తున్నాయా, ఇతర రంగులను గుర్తించడం మానేశాయా అనే భ్రమ కలుగుతుంది కూడా. ఏడాది పొడవునా నీటి ప్రవాహంతో అలరారే నా తీరం ఇలాగే ఉంటుంది మరి. మంచు కరగడం తగ్గుముఖం పడుతుందో లేదో వర్షాలు మొదలవుతాయి.

నా తీరాన ఎప్పుడు వర్షం పడుతుందో ఊహించడం కష్టం. ఉన్న ఫళంగా కుండపోత కురుస్తుంది. చిరపుంజిలో కురిసే ప్రతి చినుకూ నన్నే చేరుతుంది. నా తీరాన నిలబడి ‘ఈ ఒడ్డు ఆ ఒడ్డు నడిమధ్య ఏరడ్డు’ అని పాడుకోవడం అంత సులభం కాదు. చాలా చోట్ల రెండు ఒడ్డుల మధ్య దూరం పది కిలోమీటర్లు ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు ప్రధాన జలరవాణా మార్గాన్ని కూడా. నా తీరాన దట్టమైన అడవులు, పచ్చటి పంట పొలాలు విస్తరించాయని సంతోషపడే లోపు వరద బీభత్సానికి తల్లడిల్లే తీర ప్రజలతోపాటు కజిరంగా నేషనల్‌పార్కులోని వన్యమృగాలు కళ్ల ముందు మెదులుతాయి.
 
కజిరంగాలో...
ఖడ్గమృగం భారంగా పరుగులు తీస్తుంటుంది. ఏనుగు బరువుగా అడుగులేస్తుంటుంది. చిన్న సవ్వడికే లేడి చెంగున ఎగురుతుంటే, దుప్పి అంత తొందరేముందన్నట్లు పరికించి చూస్తూ అడుగులేస్తుంటుంది. నీటి బర్రెలు... ఇంకెక్కడికెళతాం అన్నట్లు వీపులు మునిగే లోతులో విశ్రాంతిగా కాలం గడుపుతుంటాయి. రాయల్ బెంగాల్ పులులు, చిరుతలు ఎప్పుడో కానీ కనిపించవు. నీలిరంగు పాలపిట్ట, అడవి కోడి, గద్ద, తోడేళ్ల గుంపులు కనువిందు చేస్తుంటే... రామచిలుకలు ఆకుల్లో కలిసిపోయి మేమున్నామంటూ చిట్టి పలుకులతో ఆకర్షిస్తుంటాయి.

ఏనుగు అంబారీ ఎక్కి వన్యమృగాలను చూడడానికి అడవిలో పర్యటించే పర్యాటకులు నా ప్రవాహ సవ్వడిని నేపథ్య సంగీతంలా ఆస్వాదిస్తుంటారు. ఇంత అందమైన ప్రదేశం కావడంతోనో ఏమో హిందువులు,  జైనులు జీవితంలో ఒక్కసారైనా కైలాసపర్వతాన్ని చూడాలని, ఆ యాత్ర బ్రహ్మపుత్ర మీదుగానే సాగాలని కోరుకుంటారు. కైలాసపర్వతాన్ని అందరూ ఎడమ నుంచి కుడివైపుగా ప్రదక్షిణ మార్గంలో చుట్టివస్తుంటే బోనులు మాత్రం కుడి నుంచి ఎడమవైపుకి అప్రదక్షిణ మార్గంలో చుట్టి వస్తుంటారు. బౌద్ధులు, జైనులు, బోనులు నన్ను నదీమతల్లిగా గౌరవిస్తారు. ప్రకృతి పరిరక్షణ నియమాలన్నీ పాటిస్తారు.
 
నా ప్రవాహంలో ‘అమోచు, సంకోష్, దిబాంగ్, రాయ్‌దక్, భరేలి, మాన్స్, లుహిత్, జియా భోరేలి, కామెంగ్, తీస్తా నదులు నాకు తోడుగా వచ్చి నా శక్తిని పెంచుతుంటే అస్సాంలో నేనే ‘ఖేర్‌జుతియా’ పేరుతో ఒక పాయగా దూరంగా వెళ్లిపోతాను. వంద కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ఖేర్‌జుతియా పాయ తిరిగి నాలో కలిసిపోతుంది. ఆ మధ్యలో ఉన్న భూభాగం ‘మజులి’ ద్వీపం. ఇది ప్రపంచంలో పెద్ద నదీద్వీపం. ఈ కలయికను చూస్తుంటాయి గౌహతి నగరం, ‘కామాఖ్య’ ఆలయం.

ఇది 51 శక్తి పీఠాలలో ఒకటి. ‘ఇక్కడి వరకు వచ్చి కామాఖ్య ఆలయాన్ని దర్శించుకోకపోతే బ్రహ్మపుత్రను ఏడుసార్లు దాటాల్సి వస్తుందని’ ఓ నానుడి. అంత విశాలంగా ఉండే నేను గౌహతి దాటి షిల్లాంగ్ చేరేసరికి సన్నగిల్లి ఒక్క కిలోమీటరు వెడల్పుకే పరిమితమవుతాను. ఇక్కడికి చేరగానే 17వ శతాబ్దం నాటి సరయ్‌ఘాట్ యుద్ధం కళ్ల ముందు మెదులుతుంది. ‘అహోం’ రాజ్యం మీద మొఘలుల ప్రతినిధి రాజా రామ్‌సింగ్ చేసిన దాడిని, గౌహతి వరకు విస్తరించిన పాలనను చూశాను. రాజ్యవిస్తరణలో మొఘలులు చేసిన చివరి ప్రయత్నం అదే.
 
భూతాన్ని దాచుకున్నానని...
సముద్రాన్ని తలపించే భారీ నదిని కావడంతో అలలు ఎగిసిపడుతుంటాయి. నీటి లోపల భూతం ఉండడంతోనే భారీ వరదలనీ, పడవలు బోల్తా పడతాయనీ, భూతాన్ని కడుపులో దాచుకున్న నది అని శాపనార్థాలు పెడతారు గిరిపుత్రులు. అస్సాంలోని వెనుకబాటును వెనక్కి తోసి అభివృద్ధి పథంలో నడిపించడానికి నేనూ దోహదం అవుతున్నానని సంతోషించే లోపు దిగ్‌బాయ్ ఆయిల్ రిఫైనరీ ఫీల్డ్స్ నుంచి పెట్రో ఉత్పత్తుల వెలికితీత, రవాణాలతో కలుషితమవుతున్నాను. బంగ్లాదేశ్‌లో అడుగు పెట్టగానే సుందర్‌బన్ అడవుల సాక్షిగా మరోసారి చీలిపోతాను.

ఇక్కడ విచిత్రమేమిటంటే పెద్ద పాయకు నా పేరు ఉండదు, ‘జమున’ అని పిలుస్తారు. జమున కాస్తా ‘పద్మ’ (గంగను బంగ్లాదేశ్‌లో పద్మ అంటారు)లో మమేకమవుతుంది. బ్రహ్మపుత్రగా కొనసాగిన నేను చాంద్‌పూర్ దగ్గర ‘మేఘన’లో కలుస్తాను. ఇక్కడ నాకు మిగిలే సంతోషం... జమున పేరుతో వేరుపడిన నా పాయ కూడా మేఘనలోనే కలుస్తుంది. నేరుగా నాలో కలవడానికి కొద్దిగా భేషజం అడ్డొచ్చిందేమో మరి! ఇంత పెద్ద ప్రవాహాన్ని, ప్రపంచంలో పెద్ద నదుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నేను... నేనుగా సముద్రంలో అడుగుపెట్టడం లేదు. అయితే ఆ ప్రదేశాన్ని గంగ- బ్రహ్మపుత్ర డెల్టా అంటూ నా పేరు వ్యవహారంలో ఉండడం నాకు సంతోషం.
- వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి manjula.features@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement