సమాజానికి మంచి ఆహారాన్నివ్వాలనుకుంది. ఖాద్యమ్... పేరుతో తినదగిన ఆహారాన్నిస్తోంది. ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’లోనూ నిరూపించుకుంది. దేశ రక్షణ కోసం కొండల్లో గుట్టల్లో డ్యూటీ చేసే సైన్యానికి మంచి ఆహారాన్నిచ్చే బాధ్యత చేపట్టింది. ఈ సందర్భంగా కట్టెకోల మాధవి విజయగాథ.
రక్షణరంగంలో విధులు నిర్వర్తించే వారి ఆహారం ఎలా ఉండాలో నిర్దేశించడానికి డీఎఫ్‌ఆర్‌ఎల్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం పని చేస్తూ ఉంటుంది. ఆ ప్రమాణాల మేరకు ఆహారం తయారు చేయడానికి అనుమతి సాధించారు ఓ తెలుగు మహిళ. ఈ అనుమతి సాధించడానికి ముందు ఆమె ఆహారం మీద అంతులేని పరిశోధన చేశారు.
భూమిలో నాటే గింజ నుంచి పంట దిగుబడి, దినుసులను ప్రాసెస్ చేయడం, వండి చల్లార్చి డబ్బాల్లో ప్యాక్ చేయడం వరకు ప్రతిదీ ఒక చేతి మీదుగా నడిచినప్పుడే నిర్దేశించిన ప్రమాణాలను పాటించగలమని నమ్ముతారామె. సేంద్రియ పంట, వంటను ఈ నెల న్యూఢిల్లీలో జరిగిన ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సులో ప్రదర్శించి మరోసారి నిరూపించారు. ఈ సందర్భంగా సాక్షితో తన అనుభవాలను పంచుకున్నారు హైదరాబాద్‌లో నివసిస్తున్న కట్టెకోల మాధవి.
రైతులు విచిత్రంగా చూశారు!
మాది సూర్యాపేట. నాన్న ఉద్యోగ రీత్యా నా చదువు మొత్తం హైదరాబాద్‌లోనే. నిజానికి నా చదువుకి, నేనెంచుకున్న ఈ రంగానికి సంబంధమే లేదు. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేసి కొంతకాలం టీచర్‌గా, ఆ తర్వాత బ్యాంకులో ఉద్యోగం చేశాను. మా వారు మైక్రో బయాలజీ చేసి హిమాలయ సంస్థలో ఉద్యోగం చేశారు. నెలలో ఇరవై రోజులు క్యాంపుల ఉద్యోగం ఆయనది. జీవితం ఇది కాదనిపించేది. మన జ్ఞానాన్ని సరిగ్గా ఒకదారిలో పెడితే గొప్ప లక్ష్యాలను సాధించవచ్చనిపించింది.
సొంతంగా ఏదో ఒకటి చేయాలనే నిర్ణయానికి 2009లో వచ్చాం. నాలుగేళ్లపాటు సమాజం అవసరాలేమిటి, అందుబాటులో ఉన్న వనరులేమిటి అని అధ్యయనం చేశాం. సమాజంలో ఆరోగ్యకరమైన ఆహారం తప్ప అన్నీ ఉన్నాయని తెలిసింది. మేము 2014లో గ్రామాలకు వెళ్లి రైతులతో కొర్రలు పండిస్తారా అని అడిగినప్పుడు మమ్మల్ని వెర్రివాళ్లను చూసినట్లు చూశారు. కుగ్రామాలకు వెళ్లి మహిళలకు మా ఉద్దేశాన్ని వివరించాం. విత్తనాల నుంచి పంటకు అవసరమైన ఇన్‌పుట్స్ అన్నీ మేమే ఇస్తాం, మీరు పండించిన పంటను మేమే కొంటాం... అని భరోసా ఇచ్చాం.
దాంతోపాటు వారు పండించే కంది పంట మధ్య చాళ్లలో చిరుధాన్యాలను పండించమని సూచించాం. ఒక కందిపంట సమయంలో చిరుధాన్యాలు మూడు పంటలు వస్తాయి. తమకు నష్టం ఏమీ ఉండదనే నమ్మకంతోపాటు మామీద విశ్వాసం కలిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాల్లో మొత్తం 1350 మంది మహిళారైతులు మాతో కలిశారు. గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత 2018లో కంపెనీ ఖాద్యమ్‌ని రిజిస్టర్ చేశాం. ఖాద్యమ్ అనే సంస్కృత పదానికి అర్థం తినదగినది అని. పంట నుంచి మా ప్రయోగాలు వంటకు విస్తరించాయి.
వండి చల్లబరుస్తాం!
ఇడ్లీ, సాంబార్, చట్నీ వంటి ఆహార పదార్థాలు యంత్రాల్లోనే తయారవుతాయి. ఉడికిన వెంటనే మైనస్ నలభై డిగ్రీల ఉష్ణోగ్రతకు తీసుకువెళ్లడంతో వాటిలో ఉండే తేమ హరించుకుపోతుంది. ఇలా తయారైన ఆహారం ప్యాకెట్‌లలో తొమ్మిది నెలల పాటు నిల్వ ఉంటుంది. వేడినీటిలో ముంచితే ఐదు నిమిషాల్లో ఇడ్లీ మెత్తగా మారుతుంది, సాంబార్, చట్నీలు కూడా అంతే. మేము కనుగొన్న విజయవంతమైన ఫార్ములా ఇది. పోహా నుంచి స్పగెట్టీ, పాస్తా వరకు ఒక ఇంట్లో అన్ని తరాల వారూ ఇష్టపడే రుచులన్నింటినీ ఇలాగే చేస్తున్నాం.
మొదట్లో రెడీ టూ కుక్ ఉత్పత్తుల మీద దృష్టి పెట్టాం. రోజూ వండి బాక్సు పట్టుకెళ్లడం కుదరని రోజుల్లో రెడీ టూ ఈట్ విధానాన్ని అనుసరించాం. ఆఫీస్‌కి టిఫిన్ బాక్స్ తేలిగ్గా తీసుకెళ్లడానికి, ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి మా ఉత్పత్తులు చాలా అనువుగా ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే సైన్యం అవసరాలకు తగినట్లు ఆహారాన్ని తయారు చేయడం పెద్ద సవాల్ అనే చెప్పాలి. మైసూర్‌లో ఉన్న డీఎఫ్‌ఆర్‌ఎల్‌కి ఎన్నిసార్లు వెళ్లామో లెక్క పెట్టలేం. యాభైసార్లకు పైగా వెళ్లి ఉంటాం. విమాన టిక్కెట్ల ఖర్చే లక్షల్లో వచ్చింది.
సైంటిస్టులు సూచించిన నియమావళి ప్రకారం తయారు చేయడం, శాంపుల్ తీసుకెళ్లి చూపించడం, వాళ్లు చెప్పిన సవరణలను రాసుకుని హైదరాబాద్ రావడం, మేడ్చల్ దగ్గర బండ మాదారంలో ఉన్న మా యూనిట్‌లో తయారు చేసి మళ్లీ పట్టుకెళ్లడం... ఇలా సాగింది. మా ప్రయోగాల గురించిన ప్రతి వివరాన్నీ నోట్స్ సమర్పించాం. జీవితంలో ఓ గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకున్నాం, ఆ ప్రయాణంలో మేము లక్ష్యాన్ని చేరేలోపు ఉద్యోగంలో సంపాదించుకున్న డబ్బు రెండు కోట్లకు పైగా ఖర్చయిపోయింది.
ఏ దశలోనూ వెనుకడుగు వేయకుండా దీక్షగా ముందుకెళ్లడమే ఈ రోజు విజేతగా నిలిపింది. ఏ– ఐడియా వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఆర్థికంగానూ, మౌలిక వసతుల కల్పనలోనూ సహకరిస్తున్నాయి. మా ఉత్పత్తులు ఈ–కామర్స్ వేదికల మీద పన్నెండు దేశాలకు చేరుతున్నాయి. ఢిల్లీలో ఈ నెల మూడు నుంచి ఐదు వరకు ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సు జరిగింది. అందులో స్టాల్ పెట్టమని ప్రభుత్వం నుంచి ఆహ్వానం రావడమే ఈ ప్రయత్నంలో మేము గెలిచామని చెప్పడానికి ఉదాహరణ’’ అని వివరించారు ఖాద్యమ్ కో ఫౌండర్ మాధవి.
డీఎఫ్‌ఆర్‌ఎల్... డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ. కర్నాటక రాష్ట్రం మైసూర్‌లో ఉన్న ఈ సంస్థ డీఆర్‌డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్)లో ఒక విభాగం. రక్షణరంగంలో విధులు నిర్వర్తించే వారికి నిల్వ ఉండే ఆహారాన్ని సరఫరా చేస్తుంది. పర్వత ప్రాంతాలు, లోయలు, గడ్డకట్టే మంచులో ఉండే ఆర్మీ క్యాంపుల్లో విధులు నిర్వర్తించేవారికి తాజా ఆహారాన్ని అందించడం కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. అలాంటి సమయాల్లో వారి ఆకలి తీర్చేది... ముందుగానే వండి, శీతలపరిచి డబ్బాల్లో నిల్వ చేసిన ఆహారమే. అలా నిల్వ చేసే ఆహారాన్ని తయారు చేయడం అత్యంత క్లిష్టమైన పని. ఆహారం నెలల కొద్దీ నిల్వ ఉండాలి, అందులో పోషకాలు లోపించకూడదు.
– వాకా మంజులారెడ్డి
ఫొటో : నోముల రాజేశ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment