అమెరికాతో రక్షణ రోడ్డు మ్యాప్‌ ఖరారు | US, India agree roadmap for defence industry cooperation | Sakshi
Sakshi News home page

అమెరికాతో రక్షణ రోడ్డు మ్యాప్‌ ఖరారు

Published Tue, Jun 6 2023 5:52 AM | Last Updated on Fri, Jun 23 2023 6:12 PM

US, India agree roadmap for defence industry cooperation - Sakshi

ద్వైపాక్షిక భేటీ సందర్భంగా ఆస్టిన్, రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ:  రక్షణ రంగంలో అమెరికా, భారత్‌ మధ్య పరస్పర సహకారానికి రోడ్డు మ్యాప్‌ ఖరారైంది. ఢిల్లీలో సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ సుదీర్ఘంగా చర్చించి, ఈ మేరకు రోడ్డు మ్యాప్‌ సిద్ధం చేశారు. రక్షణ పారిశ్రామిక రంగంతోపాటు రక్షణ ఉత్పత్తుల తయారీలో ఇకపై ఇరు దేశాలు సహకరించుకుంటాయి. ఫాస్ట్‌–ట్రాక్‌ టెక్నాలజీ ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. గగతతల, భూ ఉపరితల యుద్ధానికి అవసరమైన ఆయుధాలను కలిసికట్టుగా తయారు చేసుకుంటాయి.

ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో డ్రాగన్‌ దేశం చైనా దూకుడు పెరుగుతున్న సమయంలో భారత్, అమెరికా మధ్య ఈ రోడ్డు మ్యాప్‌ ఖరారు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో రెండు వారాల తర్వాత అమెరికాలో పర్యటించబోతున్నారు. రెండు దేశాల నడుమ సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఈ పర్యటన దోహదపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా దుందుడుకు చర్యలు, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాల సార్వభౌమత్వానికి ముప్పు పొంచి ఉందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ అస్టిన్‌ చెప్పారు. రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌కు భారత్‌–అమెరికా బంధం ఒక మూలస్తంభమని అభివర్ణించారు. భారత సైన్యం ఆధునీకరణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని పునరుద్ఘాటించారు. భారత్, అమెరికా నడుమ రక్షణ రంగంలో సహకారం విషయంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడానికే రోడ్డు మ్యాప్‌ ఖరారు చేసుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ కార్యాలయం ‘పెంటగాన్‌’ వెల్లడించింది.   ఫైటర్‌ జెట్‌ ఇంజన్లకు అవసరమైన ఆధునిక టెక్నాలజీని భారత్‌కు అందజేయానికి జనరల్‌ ఎలక్ట్రిక్స్‌ సంస్థ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసింది. అలాగే 30 ఎంక్యూ–9బీ ఆర్మ్‌డ్‌ డ్రోన్లను అమెరికా రక్షణ రంగ సంస్థ నుంచి కొనుగోలు చేయాలని భారత్‌ భావిస్తోంది. ఈ రెండు అంశాల గురించి లాయిన్‌ అస్టిన్‌ వద్ద రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ద్వైపాకిక్ష రక్షణ సహకారాన్ని పెంపొందించుకోవడానికి 2020 అక్టోబర్‌లో బేసిక్‌ ఎక్సే్ఛంజ్, కో–ఆపరేషన్‌ అగ్రిమెంట్‌(బీఈసీఏ) కుదిరింది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement