నేడు ప్రపంచ ఆహార దినోత్సవం
ప్యాకెట్ మీద సగం కోసిన ఆరెంజ్ పెద్ద అక్షరాలతో ‘సి విటమిన్స్ సమృద్ధితో’ అని ఉంటుంది. ‘మీరు ప్యాకెట్ వెనుక ఉన్న లేబుల్ చదవండి’ అంటాడు రేవంత్ హిమత్‌సింగ్‌కా. లేబుల్ మీద 0.9 పర్సెంట్ ఆరెంజ్ ఫ్రూట్ ΄పౌడర్ అని ఉంటుంది. అంటే ఒక శాతం ఆరెంజ్, మిగిలిన 99 శాతం కెమికల్. ‘లేబుల్ చదివితే మీరు ఆ విషాన్ని ఇంటికి తేరు’ అంటాడు ఈ హెల్త్ చాంపియన్స్ . ప్రపంచ ఆహార దినోత్సవం సురక్షితమైన ఆహారాన్ని కల్పించుకోమంటోంది. ‘దేశమా... లేబుల్ చదువు’ ఉద్యమం ఒక అవసరమైన చైతన్యం.
‘గుర్తు పెట్టుకోండి. ఏది ఎక్కువ రోజులు ప్యాకెట్‌లో నిల్వ ఉంటుందో అది మనకు ఎక్కువ అపాయం కలిగిస్తుంది’ అంటాడు రేవంత్ హిమత్ సింగ్‌కా. అమెరికాలో చదువుకుని, మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తూ అవన్నీ వదులుకొని ఇండియాలో ఫుడ్ రెవల్యూషన్ తేవాలని వచ్చేసిన ఈ కోల్‌కతా కుర్రాడు బడాబడా కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. రావడం రావడమే ముందు బోర్నవిటా హెల్త్‌డ్రింక్ కాదని చేసిన వీడియో సంచలనం సృష్టించింది.
కేంద్రప్రభుత్వం బోర్నవిటా యజమాని అయిన క్యాడ్‌బరీకి నోటీసు ఇచ్చి ఇకమీదట లేబుల్ మీద హెల్త్ డ్రింక్ అని వేయకూడదని చెప్పింది. ఆ మాట చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు... లేబుల్ చదివి ఉంటే మనకే తెలిసేది అంటాడు హిమత్ సింగ్‌కా. ఎందుకంటే 400 గ్రాముల బోర్నవిటాలో 50 గ్రాముల చక్కెర ఉంది. లిక్విడ్ గ్లూకోజ్ ఉంది. కృత్రిమ రంగులు ఉన్నాయి. నిల్వకారకాలైన రసాయనాలు ఉన్నాయి. ఇవన్నీ చూపి అతడు సంధించిన ప్రశ్నలకు గొప్ప స్పందన వచ్చింది. ప్రస్తుతం అతడు ప్యాకేజ్డ్ ఫుడ్ మీద చేస్తున్న వీడియోలు అతణ్ణి ఫుడ్ క్రూసేడర్ అని పిలిచేలా చేస్తున్నాయి.
పదార్థం గుట్టు ప్యాకెట్ వెనుక
కాలం చాలా మారింది. మన తాత, తండ్రులు అంగడికి వెళ్లి సరుకులు తెచ్చుకునేవారు. అవి కొన్నాళ్లకు పాడైపోయేవి. కాబట్టి అవసరమైనంత వరకే తెచ్చుకునేవారు. ఇప్పుడు మాల్, మార్ట్‌ల కల్చర్ వచ్చింది. ప్యాకేజ్డ్ ఫుడ్ అందుబాటులోకి వచ్చింది. వెళ్లి కొనుక్కొస్తే రెండు మూడు నెలలకు కూడా పాడుకావు. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్‌ను ‘ఎఫ్‌ఎంసిజి’ (ఫాస్ట్ మూవింగ్ కన్సూ్యమర్ గూడ్స్) అంటారు. వీటిలో కొన్ని ‘ఆరోగ్యకరమైనవి’గా, ‘ఆరోగ్యానికి మేలు చేసేవిగా’ చెప్పుకుని అమ్మకాలు పెంచుకోవాలని చూస్తాయి.
‘లేబుల్ మీద చూస్తే అవి మీకు హాని చేసేవిగా తెలుస్తుంది’ అంటాడు హిమత్ సింగ్‌కా. ఇవాళ దేశానికి ‘కాన్షియస్ కాపిటలిజమ్’ కావాలనేది హిమత్ నినాదం. అంటే బాధ్యతాయుతమైన పెట్టుబడిదారీ వ్యవస్థ. ముఖ్యంగా ఆహార రంగంలో ఈ బాధ్యత మరింత ఎక్కువ ఉండాలంటాడు అతను. ఇవాళ మన దేశం ఏటా 50 వేల కోట్ల రూపాయల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. దీన్ని ప్యాకేజ్డ్ ఫుడ్‌లో విస్తారంగా ఉపయోగిస్తారు. ‘హార్డ్ ఎటాక్‌లకు పామాయిల్ కూడా ఒక కారణం’ అంటాడు హిమత్.
ఇంగ్లిష్‌లో చిన్న అక్షరాల్లో
మ్యాంగో జ్యూస్‌ల పేరుతో ఇవాళ ఫేమస్ అయిన రెండు మూడు బ్రాండ్‌ల లేబుల్స్ చదివితే వాటిలో 20 శాతానికి మించిన మ్యాంగో పల్ప్ లేదని ఆ కంపెనీలే చెప్పడం కనిపిస్తుంది. వైట్ బ్రెడ్ కాదని బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నవాళ్లు లేబుల్ మీద చూస్తే కలర్ వల్ల మాత్రమే అది బ్రౌన్ కాని, వాస్తవానికి అది మైదాపిండి అని తెలుసుకుంటారు. కంపెనీ ఆ మాట చెప్తుందికానీ చిన్న అక్షరాల్లో, ఇంగ్లిష్‌లో చెబుతుంది. పీనట్ బటర్‌లోప్రోటీన్ సమృద్ధిగా ఉంటుందని యాడ్స్ చెబుతాయి. కాని పీనట్ బటర్‌లో క్యాలరీలు తప్ప ప్రోటీన్ 3 శాతానికి మించి ఉండదు.
మన దేశంలో ఒకలా విదేశాల్లో ఒకలా
ఒకే వ్యాపార సంస్థ మన దేశంలో చిప్స్‌కు నాసిరకం నూనె, యూరప్‌లో నాణ్యతగల నూనె వాడుతుంది. ఎందుకంటే యూరప్‌లో నియమాలు కఠినంగా ఉంటాయి. అలాగే రెండేళ్ల లోపు పిల్లలకు అమ్మే సెరియల్స్‌లో మనదేశంలో యాడెడ్ సుగర్స్ ఉంటాయి. యూరప్‌లో ఉండవు. రెండేళ్లలోపు పిల్లలకు యాడెడ్ సుగర్స్ ఉన్న ఆహారం అంత మంచిది కాదు. తీపికి అడిక్ట్ అయిన పిల్లలు ఇంట్లో ఆరోగ్యకరమైనది పెట్టినా తినరు. అదీ కంపెనీల ఎత్తుగడ. డబ్బా ఆహారం తినే పసికందులు తర్వాతి కాలంలో స్థూలకాయం, డయబెటిస్‌తో బాధ పడే అవకాశం ఉంటుంది. ‘మా డ్రింక్ రోజూ తాగితే ΄÷డవు పెరుగుతారు’, ‘మా నూనె వాడితే గుండెకు మంచిది’... ఇలాంటివి ఏవీ నమ్మొద్దు అంటాడు హిమత్.
దేశమా.. లేబుల్ చదువు...
‘మీరు ఏ వస్తువు కొన్నా దాని వెనుక ఉన్న లేబుల్ చదవండి. చెడ్డ పదార్థాలు ఉంటే నాణ్యంగా తయారు చేయమని గొంతు విప్పండి. మనం ఏకమైతే సంస్థలు మారి మంచి ఉత్పత్తులు అందిస్తాయి. మన ఆరోగ్యాలు మెరుగు పడతాయి. అలాగే ప్రకటనలతో సంబంధం లేకుండా కొన్ని కంపెనీలు నాణ్యమైన పదార్థాలు అందిస్తున్నాయి. వాటిని గుర్తించి కొనడం కూడా మన పనే’ అంటాడతను. ఇవాళ ‘వరల్డ్ ఫుడ్ డే’. ‘బలవర్థకమైన, సురక్షితమైన ఆహారం ప్రతి ఒక్కరి హక్కు’. కాని మోసాన్ని గుర్తించడంలో మనమే వెనుక ఉంటే నష్టం మనకే కదా. ‘లేబుల్ పఢేగా ఇండియా’. ఇండియా.. లేబుల్ చదువు.
కోర్టు కేసులు ఎదుర్కొంటూ
ప్యాకేజ్డ్ ఫుడ్‌లోని మోసాలను బయట పెడుతున్నందుకు పెద్ద పెద్ద సంస్థలు హిమత్ మీద కత్తి కట్టాయి. కోర్టుకు ఈడ్చాయి. మొదట్లో భయపడినా ఇప్పుడు లెక్క చేయడం లేదు. ‘నన్ను కోర్టుకు లాగితే మిమ్మల్ని బజారుకు లాగుతా’ అంటున్నాడు హిమత్. కొన్ని కంపెనీలు రకరకాల చోట్ల కేసులు వేసి ఇబ్బంది పెడుతున్నాయి. అంటే తన ఊరి నుంచి కాకుండా వేరే ఊళ్లకు అతడు వాయిదాకు హాజరు కావాలి.
Comments
Please login to add a commentAdd a comment