Chennamadhavuni Ashok raj: విశ్రాంతి ఉద్యోగానికే... జీవితానికి కాదు! | Avoid Boredom And Loneliness After Retirement special story | Sakshi
Sakshi News home page

Chennamadhavuni Ashok raj: విశ్రాంతి ఉద్యోగానికే... జీవితానికి కాదు!

Published Sat, Feb 3 2024 4:16 AM | Last Updated on Sat, Feb 3 2024 4:16 AM

Avoid Boredom And Loneliness After Retirement special story - Sakshi

శంకర్‌ నేత్రాలయ ఫండ్‌ రైజింగ్‌ కోసం దాండియా ఆడుతూ... ; ఎస్ట్రెల్లాకు యోగసాధనలో మెళకువలు నేర్పిస్తూ...

ప్రతిరోజూ మనదే.
ప్రతిరోజునీ శ్వాసించాలి.
ప్రతిరోజునీ ఆఘ్రాణించాలి.
ప్రతిరోజునీ ఆస్వాదించాలి.
ప్రతిరోజుకీ జీవం ఉండాలి.
అప్పుడే... జీవితం జీవంతో ఉంటుంది. సంతోషాల సుమహారమవుతుంది.


‘బోర్‌ కొడుతోంది’ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరి ముని పెదవుల మీద ఉంటుందీ మాట. పిల్లలను బోర్‌డమ్‌ నుంచి బయటేయడం సులువే. కానీ రిటైర్‌ అయిన వాళ్లను వేధించే బోర్‌డమ్‌కు పరిష్కారం ఎలా? వయసు పై బడేకొద్దీ... అలవాటు పడిన జీవితం నుంచి కొద్దిపాటి మార్పును కూడా స్వీకరించలేని మొండితనం ఆవరించేస్తుంటుంది. ఆ మొండితనం నుంచి బయటపడలేక అవస్థలు పడే వార్ధక్యానికి ఓ సమాధానం చెన్నమాధవుని అశోక్‌రాజు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల దగ్గరకు వెళ్లిన తల్లిదండ్రులు ‘మేమక్కడ ఉండలేక΄ోయాం. బోర్‌ కొట్టి చచ్చాం. ఒక్క రోజు ఒక్క యుగంలా గడిచింది’ అనే వాళ్లకు సమాధానంగా అశోక్‌రాజు తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.

కలప కరెంట్‌ స్తంభాలు
‘‘మేము హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో విశ్రాంత జీవనం గడుపుతున్నాం. యూఎస్‌లోని రెడ్‌మాండ్‌లో మా పెద్దమ్మాయి, అల్లుడు, మనుమరాలు ఉన్నారు. గడచిన ఏడాది నేను, మా ఆవిడ వీణారాణి... పెద్దమ్మాయి దగ్గరకు వెళ్లి ఆరు నెలలు ఉండి డిసెంబర్‌లో ఇండియాకొచ్చాం. టూర్‌లో భాగంగా... యూఎస్‌లో టకోమా – సియాటెల్‌ ఎయిర్‌΄ోర్ట్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గాన రెడ్‌మాండ్‌కు చేరుకున్నాం. రోడ్డు వెడల్పుగా, ఇరువైపులా నిటారుగా పెరిగిన చెట్లతో పచ్చగా ఉన్నాయి పరిసరాలు.

కర్రలతో నిర్మించిన ఇళ్లు చూడముచ్చటగా ఉన్నాయి. ఇంటి చుట్టూ ఎత్తుగా పెరిగిన చెట్లతో అడవిమధ్యలో ఇల్లు కట్టినట్లు ఉంది. ఇంటి నిర్మాణంలో మాత్రమే కాదు, విద్యుత్‌ స్తంభాలుగా కూడా కలపనే వాడతారు. బాగా ఎత్తుగా పెరిగిన చెట్లను కరెంట్‌ స్తంభాలుగా ఉపయోగిస్తారు. పైన్‌ లేక్, లేక్‌ వాషింగ్టన్, స్నో క్యూలమిన్‌ ఫాల్స్, విద్యుత్‌ ఉత్పాదన కేంద్రాలను చూశాం. ఓపెన్‌ ప్లేస్‌ మేరిమూర్‌ పార్క్‌లో సినిమా చూడడం మాకు విచిత్రమైన అనుభూతి. మన దగ్గర ఉన్నట్లు క్లోజ్‌డ్‌ థియేటర్‌ కాదది. బహిరంగ ప్రదేశంలో లాన్‌లో కుటుంబాలతో కూర్చుని స్నాక్స్‌ తింటూ, కూల్‌డ్రింకులు తాగుతూ సినిమా చూస్తుంటారు.

పాశ్చాత్యంలో మన పతంజలి యోగ
మెక్సికోలో ముఖ్యమైన పర్యాటక ప్రదేశం కంకూన్‌కెళ్లాం. అక్కడ క్లౌన్‌ ΄్యారడైజ్‌ క్లబ్‌... ఐదు వందలకు పైగా గదులున్న పెద్ద హోటల్‌. యూఎస్, కెనడా, బ్రెజిల్, యూకే నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. మన దగ్గర ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో జిమ్‌లుంటే... అక్కడ అతిథుల కోసం డెయిలీ రొటీన్‌లో యోగసాధన కూడా ఉంది. అక్కడి శిక్షకులు పతంజలి యోగ పుస్తకాన్ని ఆధారం చేసుకుని స్పానిష్‌ భాషలో వివరిస్తున్నారు.

థియరీని మక్కీకి మక్కీ నేర్చుకుని అర్థమైనంతలో సాధ్యమైనంత వరకు ఆచరణలో పెడుతున్నారని అర్థమైంది. నాకున్న ముప్పై ఏళ్ల యోగ సాధన అనుభవంతో సీనియర్‌ సిటిజెన్‌ కోసం ఆరు రోజుల కోర్సు డిజైన్‌ చేసి నేర్పించాను. పవన ముక్తాసనం, మకరాసనం, సర్పాసనం, వజ్రాసనం, భుజంగాసనం, సూర్య నమస్కారాలతోపాటు ్రపాణాయామం, భస్త్రిక సాధనను కూడా వాళ్లు వీడియో తీసుకుని ఇకపై ఇలాగే సాధన చేస్తామని చె΄్పారు. పర్యటన కోసం అక్కడికి వెళ్లిన భారతీయులకంటే పాశ్చాత్యులు, అక్కడ స్థిరపడిన భారతీయులు యోగసాధన పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

శంకర నేత్రాలయ కోసం దాండియా
యూఎస్‌ పర్యటనలో కొన్ని రోజులు అట్లాంటాలో గడిపాం. అట్లాంటాలో ఉన్న రోజుల్లో నేను రోజూ జేమ్స్‌ క్రీక్‌ క్లబ్‌లో యోగసాధన చేసేవాడిని. అక్కడి వారి కోరిక మేరకు యోగాతోపాటు విపస్సన ధ్యాన ప్రక్రియ కూడా నేర్పించాను. అక్కడ ఉద్యోగ, వ్యాపారాల్లో భారతీయులు ఎక్కువగా ఉన్నారు. వాళ్లకు యోగ సాధన చేయాలని ఉన్నప్పటికీ టీచర్‌ లేక΄ోవడంతో ్రపాక్టీస్‌ చేయలేక΄ోయేవారు. ‘అట్లాంటా విజిటర్స్‌ అసోసియేషన్‌’ వాట్సాప్‌ గ్రూప్‌లో కనెక్ట్‌ అయ్యాం. అక్కడ చాలా విశాలమైన కమ్యూనిటీ హాల్‌ ఉంది.

అందులో సమావేశపరిచి యోగ, విపస్సన నేర్పించాను. వీటన్నింటికంటే నాకు అత్యంత సంతృప్తినిచ్చిన విషయం ఏమిటంటే... సియాటెల్‌లోని మైక్రోసాఫ్ట్‌ కార్యాలయంలో నవరాత్రి సందర్భంగా నిర్వహించిన కల్చరల్‌ ్ర΄ోగ్రామ్‌లో పాల్గొనడం. ఎందుకంటే అది మనదేశంలో పేదవారికి ఉచితంగా వైద్యం అందించే సేవాసంస్థ ‘శంకర్‌ నేత్రాలయ’ కోసం ఫండ్‌ రైజింగ్‌ ్ర΄ోగ్రామ్‌. పాశ్చాత్య గడ్డ మీద మన భారతీయులతో కలిసి దాండియా నాట్యం చేయడం, విదేశీయులకు నేర్పించడం, అది కూడా ఒక సామాజిక ప్రయోజనం కోసం కావడం నాకు సంతోషాన్నిచ్చింది. మనం ఎక్కడ ఉన్నా సరే... రోజును ఉపయుక్తంగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుందని నమ్ముతాను. అదే ఆచరణలో పెడతాను.

పని... చేసే వారికి ఎదురొస్తుంది!
ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్‌ అయ్యాను. పెద్దమ్మాయి అమెరికా, చిన్నమ్మాయి ఆస్ట్రేలియాలో స్థిరపడడంతో రెండేళ్లకోసారి ఒక్కో అమ్మాయి దగ్గరకు వెళ్లడం అలవాటు చేసుకున్నాం. ఎక్కడ ఉన్నా నాకు బోర్‌ అనే మాట నా దగ్గరకు చేరదు. ఎందుకంటే మనిషి సంఘజీవి. ఏ సంఘంలో ఉంటే ఆ సంఘంతో మమేకమై జీవించాలనేది నా ఫిలాసఫీ. ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు అక్కడి వాళ్లతో కలిసి కమ్యూనిటీ ఫార్మింగ్‌ చేశాను. మా చిన్నల్లుడి సహకారంతో అక్కడి లైబ్రరీలో తెలుగు పుస్తకాలు పెట్టే ఏర్పాటు చేయగలిగాను.

మనం ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ ఏదో ఒక పని చేయడానికి సిద్ధంగా ఉంటే చాలు. అక్కడ మన అవసరం ఏమిటో, మనం మాత్రమే చేయగలిగిన పని ఏమిటో మనకు కనిపించి తీరుతుంది. ఒక్కమాటలో చె΄్పాలంటే పని మనకు ఎదురొస్తుంది. అలా ఒక వ్యాపకంలో నిమగ్నమైతే చాలు. మన వల్ల మరొకరికి ప్రయోజనమూ కలుగుతుంది. మనకు రోజు నిర్వీర్యంగా గడిచి΄ోకుండా ఉపయుక్తంగా గడిచిన సంతోషమూ కలుగుతుంది’’ అన్నారు చెన్నమాధవుని అశోక్‌రాజు.

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement