Manasarovar
-
ఇది ధైర్యం కాదు... భయం లేకపోవడం!
ఎమ్మెస్సీ కంప్యూటర్స్, ఎకనమిక్స్‌లో ఎంఫిల్ చేసిన కవిత యాగ బుగ్గన యూఎస్‌లో సాఫ్ట్వేర్ నిపుణులుగా, ఇండియాలో డెవలప్మెంటల్ ఎకనమిస్ట్‌గా చేశారు. ట్రావెల్, ఫిక్షన్, నాన్ఫిక్షన్ రైటర్. రిషివ్యాలీ స్కూల్ ఆమెకు ప్రపంచాన్ని చదవడం నేర్పించింది. సునిశితంగా విశ్లేషించి, ప్రశ్నించగలిగిన నైపుణ్యాన్ని అలవరిచింది. ‘‘వీటన్నింటి నేపథ్యంలో నాకు తెలిసిందేమిటంటే... ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని నిస్సారంగా గడపడం కాదు, సమాజం నుంచి దూరంగా వెళ్లిపోవడమూ కాదు. సమాజంలో జీవిస్తూ, వృత్తి ఉద్యోగాలలో కరుణపూరితంగా వ్యవహరించగలగడం’ అంటారామె. ఆ నీటిలో విషం లేదు! కవిత విస్తృతంగా పర్యటనలు చేస్తారు. అవి సాహసానికి లోతైన నిర్వచనాన్ని తెలియచేస్తుంటాయి. అవన్నీ జీవితాలను అర్థం చేసుకోవడానికే అయి ఉంటాయి. మూఢనమ్మకాలను తుడిచేయడానికి సాహసాలు చేశారు. మన్సరోవర్ సమీపంలోని రాక్షస్‌తాల్ ను స్థానికులు విషపు నీటి మడుగు అంటారు. రావణాసురుడు ఆ మడుగు దగ్గర తపస్సు చేసిన కారణంగా అవి విషపూరితమయ్యాయనే కథనంతో ఆ సరస్సు సామాజిక బహిష్కరణుకు గురైంది. కవిత తన పర్యటన సందర్భంగా ఆ నీటిని తాగి ‘నేను తాగాను, ఏమైంది’ అని ప్రశ్నించారు. కొంచెం ఉప్పగా ఉన్న కారణంగా ఆ నీటిని తాగవద్దు అని చెప్పడానికి ఇంత పెద్ద ట్యాగ్ తగిలించడం ఏమిటనేది ఆమె ప్రశ్న. అందరూ తీర్పరులే! ప్రయాణం అంటే ప్రదేశాలను చూసే వ్యాపకం కాదు, జీవితాలను చదివే సాధనం అంటారు కవిత. గుంటూరు జిల్లాలోని స్టూవర్ట్‌పురం మీదుగా ఎంతోమంది ఎన్నోసార్లు ప్రయాణించి ఉంటారు. స్టేషన్ పేరు విని ఆ పేరు రావడానికి కారణాలు తెలుసుకుని, ఆ గ్రామాన్ని ఏర్పాటు చేయడానికి దారి తీసిన పరిస్థితులను అన్వేషించారు కవిత. కులవ్యవస్థ మన సమాజంలో అభివృద్ధి నిరోధకంగా ఉన్న పెద్ద అడ్డంకి. అయితే ఏకంగా ఒక సామాజిక వర్గం మొత్తాన్ని దొంగలుగా ముద్ర వేయడాన్ని తీవ్రంగా నిరసించారామె. ‘‘ఒక వ్యక్తి గుణగణాలు ఆ వ్యక్తికే పరిమితం. ఒక వ్యక్తి దుర్గుణాలను ఆ కుటుంబం మొత్తానికి ఆపాదించడమే పెద్ద తప్పు, అలాంటిది ఆ కులమంతటికీ ఆపాదించడం ఏమిటి? సంస్కరణ పేరుతో వారిని బలవంతం గా ఒకచోటకు తరలించి, ఇక్కడే నివసించాలనే నిర్దేశించడం శిక్షార్హమైన నేరం’’ అంటారు కవిత. మన సమాజంలో అగ్రవర్ణాలుగా చలామణిలో ఉన్న వాళ్ల విషయంలో ఇలాగే చేసేవారా... అంటూ అప్పటి బ్రిటిష్ పాలకుల విధానాన్ని నిరసించారు. తన ప్రయాణ పరిశోధనలన్నింటినీ అక్షరబద్ధం చేస్తారామె. మన సమాజంలో ఉన్న పెద్ద అవలక్షణం... ఇతరుల జీవితానికి ప్రతి ఒక్కరూ తీర్పరులుగా మారిపోవడమే అంటారు కవిత. పాశ్చాత్య జీవనశైలిని మన జీవితాల్లోకి స్వాగతించినంత బేషరతుగా వారి ఆలోచన ధోరణిని అలవరుచుకోవడం లేదంటారామె. హిందూ, రివర్ టీత్, తెహల్కా, జాగరీ లిట్ వంటి వార్తాపత్రికలు, ఫిక్షన్– నాన్ ఫిక్షన్ జర్నల్స్‌లో ప్రచురితమైన రచనల్లో ఆమె తెలుగు నేల మీద విస్తరించిన బ్రిటిష్ కాలనీ బిట్రగుంటను కూడా ప్రస్తావించారు. చైనా పాలనలో టిబెట్ వాసుల అసంతృప్తినీ, నేపాల్‌లోని హమ్లా వ్యాలీ ప్రజల పేదరికాన్నీ రాశారు. అసలైన తాత్వికత శ్రీలంక, నేపాల్, టిబెట్, లెబనాన్, రుమేనియా, ఇటలీ, ఫ్రాన్స్, యూకే, యూఎస్, కెనడా,స్పెయిన్, చైనా, జపాన్, కాంబోడియా, మయన్మార్, థాయ్‌ల్యాండ్, టాంజానియావంటి అనేక దేశాల్లో పర్యటించిన కవిత అసలైన తాత్విక జీవనం సాగిస్తున్నది సంచార జాతులేనంటారు. ‘‘ఆదివాసీలు, అందులోనూ సంచార జాతుల ఫిలాసఫీ చాలా గొప్పది. ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, అందుకే ఈర్ష్య, అసూయ, వైషమ్యాలు ఉండవు. జీవితాన్ని యథాతథంగా స్వీకరిస్తారు. అడవుల్లో జీవించే వాళ్లు ప్రకృతి ఏమి ఇస్తే దాంతోనే జీవితం అనుకుంటారు, ప్రకృతికి హాని కలిగించరు. ప్రభుత్వాలు అడవి మీద ఆధిపత్యాన్ని హస్తగతం చేసుకోవడంతో వారి జీవితాల్లో ఒడిదొడుకులు మొదలయ్యాయ’’ంటారు కవిత. మగవాళ్లు సాహసించని ప్రదేశాలకు కూడా ఆమె చొరవగా వెళ్లిపోతారు, అక్కడి విషయాలను అంతే ధైర్యంగా రాస్తారు. అదే విషయాన్ని ఆమె ‘ఇది ధైర్యం కాదు, భయం లేకపోవడం’ అంటారు. జీవితం పట్ల ఆందోళన, భయం లేనప్పుడు ఏదీ భయపెట్టద’ని రిషీవ్యాలీ స్కూల్ నేర్పించిన ఫిలాసఫీని మరోసారి గుర్తు చేశారు. – వాకా మంజులారెడ్డి -
హిమగిరి నుంచి బ్రహ్మఝరి
గమనం : నదుల స్వగత కథనం మానస సరోవరం... జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలనిపించే ప్రదేశం. నేను అక్కడే పుట్టి కైలాస పర్వతాన్ని చూస్తూ ప్రయాణం మొదలు పెట్టాను. హిమాలయాల్లోని చెమాయుంగ్ దుంగ్ హిమనీనదం నా పుట్టిల్లు. ప్రాచీనంలో తూర్పు దేశాలకు, పశ్చిమానికి మధ్య రవాణా నా కళ్ల ముందే జరిగేది. మానస సరోవరానికి కైలాసపర్వతానికి మధ్యనున్న ‘పర్కా’ వాణిజ్యకేంద్రం వ్యాపార లావాదేవీల స్థావరం. ‘యార్లాంగ్ గ్జాంగ్పో’ పేరుతో పుట్టిన నేను టిబెట్ పీఠభూమి నుంచి నేలను వెతుక్కుంటూ ‘నమ్చబర్వా పర్వతం’ దగ్గర మంచుకొండలను చుడుతూ వంపు తిరిగి, లోయల్లోకి జారిపోతాను. అలా జారిపోవడంలో సున్నితత్వం లోపించి కరుకుగా పర్వతాన్ని కోసేస్తుంటాను. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర భారత్‌లో అడుగుపెడతాను. అక్కడ నన్ను ‘సియాంగ్’ అని పిలుస్తారు. అక్కడి నుంచి కొద్దిగా దిశ మార్చుకుంటూ, అస్సాం రాష్ట్రంలోకి ప్రవేశిస్తానో లేదో ‘లుయిత్’ అంటూ పలకరిస్తారు. బహుశా ఈ లుయిత్... సంస్కృతంలో లౌహిత్య పేరుతో పిలిచిన పేరుకి వ్యవహారిక నామం కాబోలు. బోడోలయితే నన్ను ‘భుల్లుంబత్తర్’ అంటారు. భుల్లుంబత్తర్ అంటే - నీటిని గొంతు దగ్గర ఆపేసి గరగర శబ్దం చేస్తుంటారు చూడండి! - అలాంటి శబ్దం అని అర్థం. గిరిపుత్రులు చెప్పిన భాష్యం నా ప్రవాహవేగాన్ని చెప్పకనే చెప్తోంది. మరి సముద్ర మట్టానికి నాలుగు వేల మీటర్ల ఎత్తు నుంచి నేలకు దిగే ప్రయాణం నిశ్శబ్దంగా ఎలా ఉంటుంది? దిహంగ్, లుయిత్లు కలిసిన తర్వాత నన్ను ‘బ్రహ్మపుత్ర’ అని పిలుస్తారు. మంచు కరిగే రోజుల్లో... హిమాలయాల్లో మంచు కరిగే కొద్దీ నా ప్రవాహం ఉద్ధృతమవుతుంటుంది. నా తీరంలో నేలలు ఎప్పుడూ చిత్తడిగానే ఉంటాయి. ఎటు చూసినా పచ్చటి చెట్లు, దట్టమైన అడవులు, పొదల మయం. పచ్చదనం పరవళ్లు తొక్కుతున్నట్లు ఉంటుంది. కళ్లు ఒక్క ఆకుపచ్చ రంగుని మాత్రమే చూస్తున్నాయా, ఇతర రంగులను గుర్తించడం మానేశాయా అనే భ్రమ కలుగుతుంది కూడా. ఏడాది పొడవునా నీటి ప్రవాహంతో అలరారే నా తీరం ఇలాగే ఉంటుంది మరి. మంచు కరగడం తగ్గుముఖం పడుతుందో లేదో వర్షాలు మొదలవుతాయి. నా తీరాన ఎప్పుడు వర్షం పడుతుందో ఊహించడం కష్టం. ఉన్న ఫళంగా కుండపోత కురుస్తుంది. చిరపుంజిలో కురిసే ప్రతి చినుకూ నన్నే చేరుతుంది. నా తీరాన నిలబడి ‘ఈ ఒడ్డు ఆ ఒడ్డు నడిమధ్య ఏరడ్డు’ అని పాడుకోవడం అంత సులభం కాదు. చాలా చోట్ల రెండు ఒడ్డుల మధ్య దూరం పది కిలోమీటర్లు ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు ప్రధాన జలరవాణా మార్గాన్ని కూడా. నా తీరాన దట్టమైన అడవులు, పచ్చటి పంట పొలాలు విస్తరించాయని సంతోషపడే లోపు వరద బీభత్సానికి తల్లడిల్లే తీర ప్రజలతోపాటు కజిరంగా నేషనల్పార్కులోని వన్యమృగాలు కళ్ల ముందు మెదులుతాయి. కజిరంగాలో... ఖడ్గమృగం భారంగా పరుగులు తీస్తుంటుంది. ఏనుగు బరువుగా అడుగులేస్తుంటుంది. చిన్న సవ్వడికే లేడి చెంగున ఎగురుతుంటే, దుప్పి అంత తొందరేముందన్నట్లు పరికించి చూస్తూ అడుగులేస్తుంటుంది. నీటి బర్రెలు... ఇంకెక్కడికెళతాం అన్నట్లు వీపులు మునిగే లోతులో విశ్రాంతిగా కాలం గడుపుతుంటాయి. రాయల్ బెంగాల్ పులులు, చిరుతలు ఎప్పుడో కానీ కనిపించవు. నీలిరంగు పాలపిట్ట, అడవి కోడి, గద్ద, తోడేళ్ల గుంపులు కనువిందు చేస్తుంటే... రామచిలుకలు ఆకుల్లో కలిసిపోయి మేమున్నామంటూ చిట్టి పలుకులతో ఆకర్షిస్తుంటాయి. ఏనుగు అంబారీ ఎక్కి వన్యమృగాలను చూడడానికి అడవిలో పర్యటించే పర్యాటకులు నా ప్రవాహ సవ్వడిని నేపథ్య సంగీతంలా ఆస్వాదిస్తుంటారు. ఇంత అందమైన ప్రదేశం కావడంతోనో ఏమో హిందువులు, జైనులు జీవితంలో ఒక్కసారైనా కైలాసపర్వతాన్ని చూడాలని, ఆ యాత్ర బ్రహ్మపుత్ర మీదుగానే సాగాలని కోరుకుంటారు. కైలాసపర్వతాన్ని అందరూ ఎడమ నుంచి కుడివైపుగా ప్రదక్షిణ మార్గంలో చుట్టివస్తుంటే బోనులు మాత్రం కుడి నుంచి ఎడమవైపుకి అప్రదక్షిణ మార్గంలో చుట్టి వస్తుంటారు. బౌద్ధులు, జైనులు, బోనులు నన్ను నదీమతల్లిగా గౌరవిస్తారు. ప్రకృతి పరిరక్షణ నియమాలన్నీ పాటిస్తారు. నా ప్రవాహంలో ‘అమోచు, సంకోష్, దిబాంగ్, రాయ్దక్, భరేలి, మాన్స్, లుహిత్, జియా భోరేలి, కామెంగ్, తీస్తా నదులు నాకు తోడుగా వచ్చి నా శక్తిని పెంచుతుంటే అస్సాంలో నేనే ‘ఖేర్జుతియా’ పేరుతో ఒక పాయగా దూరంగా వెళ్లిపోతాను. వంద కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ఖేర్జుతియా పాయ తిరిగి నాలో కలిసిపోతుంది. ఆ మధ్యలో ఉన్న భూభాగం ‘మజులి’ ద్వీపం. ఇది ప్రపంచంలో పెద్ద నదీద్వీపం. ఈ కలయికను చూస్తుంటాయి గౌహతి నగరం, ‘కామాఖ్య’ ఆలయం. ఇది 51 శక్తి పీఠాలలో ఒకటి. ‘ఇక్కడి వరకు వచ్చి కామాఖ్య ఆలయాన్ని దర్శించుకోకపోతే బ్రహ్మపుత్రను ఏడుసార్లు దాటాల్సి వస్తుందని’ ఓ నానుడి. అంత విశాలంగా ఉండే నేను గౌహతి దాటి షిల్లాంగ్ చేరేసరికి సన్నగిల్లి ఒక్క కిలోమీటరు వెడల్పుకే పరిమితమవుతాను. ఇక్కడికి చేరగానే 17వ శతాబ్దం నాటి సరయ్ఘాట్ యుద్ధం కళ్ల ముందు మెదులుతుంది. ‘అహోం’ రాజ్యం మీద మొఘలుల ప్రతినిధి రాజా రామ్‌సింగ్ చేసిన దాడిని, గౌహతి వరకు విస్తరించిన పాలనను చూశాను. రాజ్యవిస్తరణలో మొఘలులు చేసిన చివరి ప్రయత్నం అదే. భూతాన్ని దాచుకున్నానని... సముద్రాన్ని తలపించే భారీ నదిని కావడంతో అలలు ఎగిసిపడుతుంటాయి. నీటి లోపల భూతం ఉండడంతోనే భారీ వరదలనీ, పడవలు బోల్తా పడతాయనీ, భూతాన్ని కడుపులో దాచుకున్న నది అని శాపనార్థాలు పెడతారు గిరిపుత్రులు. అస్సాంలోని వెనుకబాటును వెనక్కి తోసి అభివృద్ధి పథంలో నడిపించడానికి నేనూ దోహదం అవుతున్నానని సంతోషించే లోపు దిగ్బాయ్ ఆయిల్ రిఫైనరీ ఫీల్డ్స్ నుంచి పెట్రో ఉత్పత్తుల వెలికితీత, రవాణాలతో కలుషితమవుతున్నాను. బంగ్లాదేశ్‌లో అడుగు పెట్టగానే సుందర్బన్ అడవుల సాక్షిగా మరోసారి చీలిపోతాను. ఇక్కడ విచిత్రమేమిటంటే పెద్ద పాయకు నా పేరు ఉండదు, ‘జమున’ అని పిలుస్తారు. జమున కాస్తా ‘పద్మ’ (గంగను బంగ్లాదేశ్‌లో పద్మ అంటారు)లో మమేకమవుతుంది. బ్రహ్మపుత్రగా కొనసాగిన నేను చాంద్‌పూర్ దగ్గర ‘మేఘన’లో కలుస్తాను. ఇక్కడ నాకు మిగిలే సంతోషం... జమున పేరుతో వేరుపడిన నా పాయ కూడా మేఘనలోనే కలుస్తుంది. నేరుగా నాలో కలవడానికి కొద్దిగా భేషజం అడ్డొచ్చిందేమో మరి! ఇంత పెద్ద ప్రవాహాన్ని, ప్రపంచంలో పెద్ద నదుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నేను... నేనుగా సముద్రంలో అడుగుపెట్టడం లేదు. అయితే ఆ ప్రదేశాన్ని గంగ- బ్రహ్మపుత్ర డెల్టా అంటూ నా పేరు వ్యవహారంలో ఉండడం నాకు సంతోషం. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి manjula.features@sakshi.com