ఈ వాస్తు చిత్రలేఖనం.. ఇప్పుడొక ట్రెండ్‌! | Vastu Painting Is A Combination Of Sculpture And Form | Sakshi
Sakshi News home page

ఈ వాస్తు చిత్రలేఖనం.. ఇప్పుడొక ట్రెండ్‌!

Published Fri, Aug 2 2024 1:27 PM | Last Updated on Fri, Aug 2 2024 1:27 PM

Vastu Painting Is A Combination Of Sculpture And Form

సాక్షి, సిటీబ్యూరో: ప్రాచీన ఆలయాలు, గోపురాలు, గృహాలు వాస్తు శాస్త్రం ప్రకారమే నిర్మించారని భారతీయ వాస్తు శాస్త్రం చెబుతుంది. వాస్తు అంటే బలం, విశ్వాసం! అందుకే ఇల్లు కొంటున్నామంటే చాలు వాస్తు చూడనిదే నిర్ణయం తీసుకోరు. ఈ వాస్తుకు శిల్ప శా్రస్తాన్ని, చిత్రలేఖనాన్ని జోడించిన వాస్తు చిత్రలేఖనానికి కూడా ప్రాధాన్యం పెరిగిపోయింది. గృహాలు, కార్యాలయాలు, హోటళ్లు వంటి అన్ని రకాల భవన నిర్మాణాల్లో వాస్తు పెయింటింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

చూపరులను ఆకట్టుకునే ఈ వాస్తు చిత్రలేఖనం ఇప్పుడొక ట్రెండ్‌! దేవాలయానికి, శిల్పకళకు అవినాభావ సంబంధం ఉంది. విశ్వఖ్యాతిగాంచిన భారతీయ శిల్ప కళకు రెండువేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఇక్షా్వకులు మొదలుకొని విజయనగర చక్రవర్తుల వరకూ వేర్వేరు కాలాల్లో శిల్ప–చిత్రకళాభివృద్ధికి దోహదం చేశారు. వాస్తు, శిల్పశాస్త్రం, చిత్రలేఖనం మూడు వేర్వేరు కళలను మిళితం చేసి.. నేటి తరానికి, అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి వచి్చందే వాస్తు పెయింటింగ్‌.

బ్రహ్మ ముహూర్తంలోనే.. 
ఒక కుటుంబంలోని అందరి వ్యక్తుల జాతకం, నక్షత్రం ప్రకారం ఆ ఇంటిలో ఎవరి నక్షత్రం బలంగా ఉంటుందో వారు పూజించాల్సిన దేవుడిని నిర్ణయిస్తారు. ఆ ఇంటి వాస్తు, నక్షత్రం తిథి ప్రకారం బ్రహ్మ ముహూర్తం నిర్ణయిస్తారు. దేవుడిని స్మరిస్తూ, ధాన్యంతో వస్త్రం మీద ఈ పెయింటింగ్‌ను వేస్తారు. ఈ చిత్రలేఖనం జరిగినన్ని రోజులు ఆ నక్షత్రానికి బలం చేకూర్చేందుకు జరగాల్సిన అన్ని రకాల హోమాలు, యోగాలు, క్రతువులు ఆగమ శాస్త్రం ప్రకారం చిత్రకారుడే పూర్తి చేస్తాడు. నరఘోష నివారణకూ పెయింటింగ్‌ వేస్తుంటారు.

ఎన్ని రోజులు పడుతుందంటే.. 
ఒక పెయింటింగ్‌ పూర్తవడానికి నక్షత్రాన్ని బట్టి 41 నుంచి 108 రోజుల సమయం పడుతుంది. వీటి ధర నక్షత్రాన్ని బట్టి రూ.10 వేల నుంచి ప్రారంభమవుతుంది. యాక్రాలిక్, మిక్స్‌డ్‌ కలర్లను వినియోగిస్తారు. నక్షత్ర బలాన్ని బట్టి వీటిని పూజ గదిలో, హాల్‌లో ఇంటిలోపల పెట్టే చోటును నిర్ణయిస్తారు.

ఇళ్లు, ఆఫీసుల్లో.. 
రాజకీయ నేతలు, ప్రముఖులు, సెలెబ్రిటీల గృహాలు, విల్లాలు, ఫామ్‌ హౌస్‌లలో ఈ వాస్తు పెయింటింగ్‌లను వేయిస్తున్నారు. ఆఫీసులు, హోటళ్ల, కార్పొరేట్‌ కార్యాలయాల్లో కూడా చూపరులను ఆకట్టుకునే ఈ చిత్రలేఖనాలు కనిపిస్తున్నాయి. దక్షిణామూర్తి, అభయ హనుమాన్, యంత్రోద్ధారక హనుమాన్, నందీశ్వర, కలియుగ వేంకటేశ్వర్లు, ఇష్టకామేశ్వరి దేవి, ఆగమనం (పుణ్యపురుషులు), నరదృష్టి నారాయణ యంత్రం, తాండవ గణపతి, నయన దర్శనం, శృంగార దేవి, కొలువు శ్రీనివాసమూర్తి, నర్తకి, అభయ సూర్యనారాయణమూర్తి వంటి దేవుళ్ల పెయింటింగ్స్‌ వేస్తుంటారు.

వాస్తు పెయింటింగ్‌తో మనశ్శాంతి 
వాస్తు పెయింటింగ్‌ ఉన్న ఇళ్లలో సానుకూల భావాలను కలిగిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. చేసే పని మీద ఏకాగ్రత పెరుగుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే వివేకం కలుగుతుంది. – కంభంపాటి, ప్రముఖ వాస్తు చిత్రకారుడు

ఇవి చదవండి: వయనాడ్‌ విలయం : ఆమె సీత కాదు...సివంగి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement