Mount Abu
-
ఫ్యామిలీ వెకేషన్స్.. టాప్ 5 డెస్టినేషన్స్ ఇవే
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులంతా కలసి వేసవి సెలవుల్లో గడిపేందుకు వెళ్లాలనుకుంటున్న ప్రాంతాల్లో గోవా, నైనిటాల్, రిషికేశ్, గ్యాంగ్‌టక్, మౌంట్అబూ టాప్–5గా ఉన్నట్టు ఓయో నిర్వహించిన సర్వేలో తెలిసింది. ‘సమ్మర్ వెకేషన్ ఇండెక్స్ – ఫ్యామిలీ ఎడిషన్ 2022’పేరుతో తన సర్వే వివరాలను ఒక నివేదిక రూపంలో ఓయో విడుదల చేసింది. వేసవి సెలవుల్లో పిల్లలను ఆడించడం, వారినే అట్టిపెట్టుకోవడం కష్టమైన టాస్క్‌గా తల్లిదండ్రులు చెప్పారు. దీనికి బదులు కొన్ని రోజుల పాటు కుటుంబమంతా కలసి విహారయాత్రకు వెళ్లి రావాలనుకుంటున్నట్టు తెలిపారు. ‘‘65 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలతో కలసి వేసవి సెలవులకు ట్రిప్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నట్టు చెప్పారు. వరుసగా రెండేళ్లపాటు వేసవిలో లౌక్డౌన్లు ఉండడం కూడా ఈ ధోరణి పెరగడానికి కారణం’’అని ఓయో పేర్కొంది. జూన్ మొదటి రెండు వారాల్లో ఓయో ఈ సర్వే నిర్వహించింది. 1,072 మంది అభిప్రాయాలను సమీకరించింది. పిల్లలకు సదుపాయాలు ఇందులో 41 శాతం మంది తమ ఎంపిక గోవా అని చెప్పారు. పిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి చూడతగ్గ ప్రదేశంగా దీన్ని భావిస్తున్నారు. ఆ తర్వా త నైనిటాల్, రిషికేశ్, గ్యాంగ్‌టక్, మౌంట్అబూ, పుదుచ్చేరి, మెక్లయోడ్ గంజ్, మహాబలేశ్వర్ ఎంపికలుగా ఉన్నాయి. ఈ ఎంపికలను పరిశీలిస్తే తల్లిదండ్రులు ప్రకృతి సహజత్వం ఎక్కువగా ఉన్న పర్వత ప్రాంతాలు, బీచ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్న ట్టు ఓయో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరంగ్ గాడ్ బోల్ పేర్కొన్నారు. హోటళ్లలో ఎంపికలను గమనిస్తే.. 56 శాతం మంది స్విమ్మింగ్ పూల్ ఉన్న హోటళ్లకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. పిల్లల కోసం వారు స్విమ్మింగ్ పూల్, ఆటలాడుకునే ప్లే ఏరియా ను హోటళ్లలో కోరుకుంటున్నారు. ఆ తర్వాత వాటర్ పార్క్‌లు, పెద్ద టెలివిజన్ ఇతర సదుపాయాలు ఉంటే బావుంటుందని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది 1–3 రోజుల పాటు ట్రిప్‌కు వెళ్లొచ్చే ఆలోచనతో ఉన్నట్టు చెబితే.. 38 శాతం మంది ఒక వారం రోజులైనా జాలీగా గడిపి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. -
Mount Abu: దిల్వాడా
శిల శిల్పం కావాలంటే... ఉలిదెబ్బలు తినాలి. పాలరాయిలో కలువలు పూయాలంటే... కరకుదేలిన ఉలితో ఎంత హింస పెట్టి ఉండాలి? పాలరాతిలో రూపుదిద్దుకున్న... సింహాలు... ఏనుగులు... సాలభంజికలు. ఒక ఆదినాథుడు... మరో నేమినాథుడు. ఇది ఊహకే అందని శిల్పనైపుణ్యం. చూసి తీరాల్సిన ఉలి చక్కదనం. మౌంట్ అబూ... ఎడారి ఇసుక తిన్నెకు ప్రకృతి అద్దిన ఆకుపచ్చ బుగ్గచుక్క. రాజస్థాన్‌లో విస్తరించిన ఆరావళి పర్వతశ్రేణులు రాష్ట్రానికి పచ్చదనాన్ని పంచుతున్నాయి. ఈ ఆరావళి శ్రేణులలో ఎత్తైన శిఖరం మౌంట్ అబూ. ఈ కొండ పాదాల దగ్గర విస్తరించిన పట్టణాన్ని అబూరోడ్ అంటారు. రైల్వేస్టేషన్‌కు కూడా ఇదే పేరు. ఈ కొండ మీద అర్బుదాదేవి ఆలయం ఉండడంతో అబూ కొండ అని అనే పేరు వాడుకలోకి వచ్చింది. అబూ పట్టణం 1,200 మీటర్ల ఎత్తులో ఉంది. మన తిరుమల గిరుల కంటే ఎత్తన్నమాట. అబూకి మూడు కి.మీల దూరంలో దిల్వారా టెంపుల్స్ ఉన్నాయి. ఏనుగుల బొమ్మలు మొదటి ఆలయం పేరు దిల్వాడా. చాళుక్య వంశపు రాజు మొదటి భీమదేవుడు నిర్మించాలనుకున్న అసలు ఆలయాలు ఆదినాథ, నేమినాథ, పార్శ్వ నాథ, మహావీర మందిరాలు లోపలున్నాయి. పదకొండవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు కొనసాగింది వీటి నిర్మాణం. మొత్తం పాలరాతి నిర్మాణాలే. పాలరాయిని ఏనుగుల మీద కొండమీదకు తరలించారు. అందుకు గౌరవపూర్వకంగా హస్తిశాలను నిర్మించారు. ఇక ప్రధాన ఆలయాల్లో శిల్పచాతుర్యాన్ని వర్ణించడం కష్టం. దిల్వారా ఆలయాల స్తంభాలు, గోడలు, లోపలి విగ్రహాల కంటే పై కప్పు గురించి ప్రత్యేకం గా చెప్పుకోవాలి. అందమైన, లాలిత్యమైన పనితనం చూస్తే మైనాన్ని కరిగించి మూసలో పోసారేమో అనిపిస్తుంది. తామర పూల రెక్కలు నిజమైన పూలరెక్కల్లాగే కోమలంగా కనిపిస్తాయి. విచ్చుకున్న పద్మాలు, తామరతూడులోని సన్నని ఈనెలు కూడా రాతిలో కనిపిస్తాయి. స్తంభాల మీదున్న రూపాలన్నీ ఒకేరకంగా ఉన్నట్లనిపిస్తాయి. కానీ గైడ్ చెప్పిన తర్వాత పరిశీలనగా చూస్తే ఏ ఒక్కటీ మరొక దానితో పోలి ఉండదు. కృష్ణుడు కూడా ఉన్నాడు ఈ జైనమందిరాల్లో గోడలు, పై కప్పు మీద హిందూ, జైన ధార్మిక సాహిత్యంలోని సన్నివేశాలు ఉంటాయి. సింహాలు, సంగీతకారులు, నాట్యకత్తెలు, యక్షిణులు, సాలభంజికలు, కాళీయమర్దన కృష్ణుడు, గోపికలతో కృష్ణుడు, నరసింహ స్వామి, హిరణ్య కశ్యపుడు, 360 మంది జైన సన్యాసుల విగ్రహాలున్నాయి. ఇక్కడ ఫొటోగ్రఫీ నిషేధం. మన కెమెరాలను బయటే వదిలి వెళ్లాలి. స్మార్ట్‌ఫోన్‌ను కూడా అనుమతించడం లేదు. ఐదు ఆలయాల సమూహం దిల్వాడా టెంపుల్స్ మొత్తం ఐదు. నాలుగు ఆలయాల నిర్మాణం తర్వాత మిగిలిపోయిన పాలరాయి, శిల్పాలు చెక్కినప్పుడు రాలిన పొడితో మరొక ఆలయాన్ని కట్టారు. ఈ ఆలయాల సమూహంలో మొదట కనిపించేది అదే. శిల్పకారులు ఈ ఆలయ నిర్మాణానికి వేతనం తీసుకోలేదట. ప్రేమకొద్దీ చేసిన నిర్మాణం కాబట్టి దిల్వాడా అనే పేరు వచ్చింది. క్రమంగా దిల్వారాగా వ్యవహారంలోకి వచ్చింది. ఐదు జైన మందిరాల సమూహానికి అదే పేరు స్థిరపడిపోయింది. ఈ ఆలయాలలోకి పర్యాటకులను మధ్యాహ్నం పన్నెండు నుంచి అనుమతిస్తారు. పూజలు క్రతువులు జరిగే అంతర మందిరంలోకి జైనులకు మాత్రమే ప్రవేశం. వనంలో విరిసిన చందమామ మూడవ మందిరం కారిడార్ నుంచి బయటకు వచ్చి చుట్టూ చూస్తే పచ్చటి దట్టమైన కొండల మధ్య తెల్లటి చందమామలాగ కనిపిస్తుంది టెంపుల్ కాంప్లెక్స్. ఎండాకాలం కూడా వేడి తీవ్రత ఉండదు. ఇక్కడ గైడ్లు విడిగా ఉండరు. పిల్లలు కంఠతాపట్టిన పాఠాన్ని చదివినట్లు, రెండవ ఎక్కం అప్పచెప్పినట్లు ఆలయ అర్చకులే గుక్కతిప్పుకోకుండా వివరిస్తారు. - వాకా మంజులరెడ్డి -
మౌంట్‌అబూలో చిక్కుకున్న బ్రహ్మకుమారీలు
సాక్షి, అమరావతి బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు వెయ్యి మంది రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో చిక్కుకుపోయారు. వీరిలో ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలతో పాటు తెలంగాణలోని వరంగల్ తదితర ప్రాంతాలకు చెందిన వారున్నారు. వీరు మార్చి 13న బయల్దేరి 17కి మౌంట్ అబూ చేరుకున్నారు. మార్చి 22, 23 తేదీల్లో రైళ్లలో తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్లు చేయించుకున్నారు. ఇంతలో లాక్డౌన్ వల్ల రైళ్లు రద్దవడంతో అక్కడే ఉండిపోయారు. అందులో సగం మంది బ్రహ్మకుమారీలు కాగా మిగిలిన వారు రైతులు. నెల రోజులుగా మౌంట్ అబూలోనే ఉండిపోవడంతో వారు తల్లడిల్లిపోతున్నారు. తమ పంటలు కోతలకు వచ్చాయని, తాము వెళ్లకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చే వేళ తమను త్వరగా స్వస్థలాలకు చేర్చాలని కోరుతున్నారు. మౌంట్ అబూలో బ్రహ్మకుమారీస్ సంస్థ వారే తమకు భోజనం, వసతి సమకూరుస్తున్నారని వీరు చెబుతున్నారు. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని తూర్పుగోదావరి జిల్లా పసలపూడికి చెందిన బ్రహ్మకుమారీస్ ప్రతినిధి మాధవి ‘సాక్షి’కి తెలిపారు. మే 3న లాక్డౌన్ ఎత్తివేశాక తమను ప్రత్యేక రైళ్లలో స్వస్థలాలకు పంపాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభ్యర్థిస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటిస్తామన్నారు. తమకు సాయం చేయాలని రాజస్థాన్ సీఎంకు కూడా బ్రహ్మకుమారీస్ సంస్థ విజ్ఞప్తి చేసింది. -
అబ్బో... అబ్బబ్బో అబూ...
టూర్‌దర్శన్ - సమ్మర్ స్పెషల్ - మౌంట్ అబు ఎడారి రాష్ట్రంలో ఎత్తయిన కొండలతో నిండిన ప్రదేశం... పక్షుల కిలకిలలతో కనువిందు చేసే పచ్చని అడవులు... ఉరకలేసే జలపాతాలు... ప్రశాంతమైన సరోవరాలు... గత వైభవాన్ని చాటి చెప్పే కోట గోడలు.. కొండలపై వెలసిన పురాతన ఆలయాలు... వీటన్నింటినీ తనివితీరా చూసి ఆనందించాలంటే రాజస్థాన్‌లోని మౌంట్ అబు వెళ్లాల్సిందే! రాజస్థాన్‌లోని ఏకైక వేసవి విడిది మౌంట్ అబు. రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో గుజరాత్ సరిహద్దులకు చేరువలో ఆరావళి పర్వతశ్రేణుల్లో సముద్రమట్టానికి దాదాపు 4 వేల అడుగుల ఎత్తులో ఉంది ఈ పట్టణం. దీనికి చుట్టుపక్కల విస్తరించి ఉన్న దట్టమైన అడవిని పురాణాలు అర్బుదారణ్యంగా పేర్కొన్నాయి. నాటి కాలంలో ‘మౌంట్ అబు’ను అర్బుదాచలం అనేవారు. విశ్వామిత్రుడితో విభేదించిన వశిష్టుడు అర్బుదాచలంపై యజ్ఞం చేసినట్లు ప్రతీతి. ఇదేచోట అర్బుదమనే సర్పం శివుడి వాహనమైన నందిని రక్షించడం వల్ల ఈ పర్వతానికి అర్బుదాచలమనే పేరు వచ్చిందని, దీని చుట్టూ విస్తరించిన అరణ్యానికి అర్బుదారణ్యమనే పేరు వచ్చిందని కూడా మరో గాథ ఉంది. ఇక చారిత్రిక నేపథ్యాన్ని గురించి చెప్పుకుంటే, మొఘల్ పాలనకు ముందు ఈ ప్రాంతాన్ని ఎక్కువ కాలం గుర్జరులు, రాజపుత్రులు పాలించారు. ఏం చూడాలి? మౌంట్ అబులో అడుగడుగునా ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. రాజస్థాన్‌లోని మిగిలిన ప్రాంతాల్లో వేసవి తాకిడి భరించలేనంతగా ఉన్నా, మౌంట్ అబులో వాతావరణం చల్లగా ఆహ్లాదభరితంగా ఉంటుంది. మౌంట్ అబు పట్టణంలోను, పరిసరాల్లోనూ పలు చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలు చూసి తీరాల్సినవే. * మేవార్ రాజు రాణా కుంభ 14వ శతాబ్దంలో నిర్మించిన అచలగఢ్ కోట శిథిలావస్థకు చేరుకున్నా, నాటి చారిత్రక వైభవానికి నిదర్శనంగా నిలిచిన ఈ కట్టడం నేటికీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. * అచలగఢ్ కోట సమీపంలోని నక్కీ సరస్సులో ఈదులాడే బాతులను చూస్తూ బోటింగ్ చేయడం ఒక వింత అనుభూతి. ఈ సరస్సుకు సమీపంలోనే కప్ప ఆకారంలో ఉండే సహజమైన భారీ కొండరాతి వద్ద ఫొటోలు దిగుతుంటారు. * మౌంట్ అబు పరిసరాల్లో ధ్రుధియా జలపాతం, గోముఖ జలపాతం వంటి పలు జలపాతాలు వేసవిలో జలకాలాటలకు అనువుగా ఉంటాయి. జలపాతాల వద్దకు పర్యాటకులు పిక్నిక్లకు వస్తుంటారు. * అచలగఢ్ కోటకు అతి చేరువలోనే ఉన్న శైవక్షేత్రమైన అచలేశ్వర ఆలయానికి దూరప్రాంతాల భక్తులు కూడా వస్తూ ఉంటారు. స్థానికులు ‘అధర్‌దేవి’గా పిలుచుకునే అర్బుదాదేవి ఆలయం, గురుశిఖర్ పర్వత శిఖరంపై వెలసిన దత్తాత్రేయ ఆలయం, రఘునాథ ఆలయం, కాంతినాథ్ ఆలయం వంటి పురాతన హిందూ ఆలయాలతో పాటు 11-13 శతాబ్దాల మధ్య నిర్మించిన విమల్ వశాహీ ఆలయం, దిల్వారా ఆలయం వంటి పలు జైన ఆలయాల్లోని శిల్పసౌందర్యం చూసి తీరాల్సిందే. * మౌంట్ అబు చుట్టూ 290 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో ప్రభుత్వం 1960లో మౌంట్ అబు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో చాలా రకాల అరుదైన పక్షులు, జింకలు, దుప్పులు, పులులు, చిరుతలు, సింహాలు వంటి వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. ఇందులో సఫారీ గొప్ప అనుభూతినిస్తుంది. ఏం చేయాలి? * ఔత్సాహిక పర్వతారోహకులకు మౌంట్ అబులోని పర్వతశిఖరాలు సవాలుగా నిలుస్తాయి. ఆరావళి పర్వతశ్రేణుల్లోని అతి ఎత్తయిన శిఖరం ‘గురుశిఖర్’ పైనుంచి తిలకిస్తే మౌంట్ అబు అందాలు అబ్బురపరుస్తాయి. * మౌంట్ అబు పరిసరాల్లో జలపాతాలు గల అటవీ ప్రాంతాలు పిక్నిక్లకు అనువుగా ఉంటాయి. ఆధ్యాత్మిక యాత్రికులకు ఇక్కడి ప్రాచీన ఆలయాలు ఆనందానుభూతిని కలిగిస్తాయి. * బ్రహ్మకుమారీల ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రం ఇక్కడే ఉంది. ఆధ్యాత్మిక చింతన గల పర్యాటకులు తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం ఇది. ఏం కొనాలి? * రాజస్థానీ సంప్రదాయ హస్తకళా వస్తువులు ఇక్కడ విరివిగా దొరుకుతాయి. రాజస్థాన్ ప్రభుత్వం నిర్వహించే దుకాణాల్లో వీటిని తక్కువ ధరలకే కొనుక్కోవచ్చు. * నాణ్యమైన ఖద్దరు వస్త్రాలు, రాజస్థానీ చేనేత వస్త్రాలు, తేలికగా ఉండే దుప్పట్లు, రజాయిలు వంటివి కొనుక్కోవచ్చు. * లెదర్ బెల్టులు, హ్యాండ్‌బ్యాగ్స్, జాకెట్స్, రాజస్థానీ పెయింటింగ్స్ ఇక్కడి బజారులో తక్కువ ధరలకే దొరుకుతాయి. * ఇక్కడి రెస్టారెంట్లు, రోడ్డు పక్క ధాబాల్లో దొరికే రాజస్థానీ సంప్రదాయక వంటకాలను ఆస్వాదించవచ్చు. మీగడ నిండుగా వేసి తయారుచేసే ‘మఖానియా లస్సీ’, గోధుమపిండితో తయారు చేసే మిఠాయి ‘ఘెవార్’ వంటివి భోజనప్రియులకు మంచి అనుభూతినిస్తాయి. ఎలా చేరుకోవాలి? * ఇతర ప్రాంతాల వారు గుజరాత్ మీదుగా ఇక్కడకు చేరుకోవడం తేలిక. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వరకు దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి విమానాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి అబు రోడ్‌కు రైలు ద్వారా చేరుకోవచ్చు. * న్యూఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్, ముంబై వంటి నగరాల నుంచి అబు రోడ్ వరకు నేరుగా రైళ్లు అందుబాటులో ఉంటాయి. * అబు రోడ్ రైల్వేస్టేషన్ నుంచి మౌంట్ అబు 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అబు రోడ్ నుంచి ఇక్కడకు విరివిగా బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. -
ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను!
నిత్యం షూటింగ్స్‌తో బిజీగా ఉండే సినిమా తారలు సేద తీరాలనుకుంటారు. గోపీచంద్ కూడా అలా అనుకున్నారో ఏమో! తన సతీమణి రేష్మాతో కలిసి ఆయన మౌంట్ అబు వెళ్లారు. ఈ నెల 15, 16 తేదీల్లో అక్కడి బ్రహ్మ కుమారీస్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్‌కి వెళ్లారు. ఈ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు జానకీ జీ, గుల్జార్ జీ, రతన్ మోహినీ జీలను గోపీ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘మౌంట్ అబులోని డైమండ్ హాల్లో పాతికవేల మంది బ్రహ్మ కుమారీల ఆధ్వర్యంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆ సమయంలో నాకు కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. బ్రహ్మకుమారీలందరూ స్వచ్ఛమైన ప్రేమతో, నిండైన మనసుతో మమ్మల్ని ఆశీర్వదించారు. ఈ ఆధ్యాత్మిక సంస్థ ప్రతి ఒక్కరికీ సరైన శాంతి మార్గం చూపుతుందనే నమ్మకం కలిగింది’’ అని చెప్పారు.