చూసొద్దాం.. రండి
గుంతకల్లు పేరు వినగానే ఇక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం ఠక్కున గుర్తుకువస్తుంది. ఇక్కడి ఆంజనేయస్వామిని కొలిస్తే సుఖసంతోషాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడి మూలవిరాట్ ఆంజనేయస్వామి స్వయంభూ అని ఆలయ చరిత్ర చెబుతోంది. క్రీ.శ. 1521న వ్యాసరాయలవారు ఆంజేయస్వామి విగ్రహాలను ప్రతిష్టిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారని, ఆ సమయంలో స్వప్పదర్శనం మిచ్చిన స్వామి ఆదేశాల మేరకు ఓ వేపచెట్టు సమీపంలో తవ్వించగా పది అడుగుల పొడవు, నాలుగున్నర అడుగుల వెడల్పుతో ఆంజనేయస్వామి విగ్రహం బయటపడినట్లు తెలుస్తోంది. తొలుత ఈ ప్రాంతాన్ని నెట్టికల్లు అని పిలుస్తుండేవారు. దీంతో నెట్టికంటి ఆంజనేయస్వామిగా పేరు వచ్చింది. కాలక్రమేణ నెట్టికల్లు కాస్తా కసాపురంగా మారిపోయింది. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది. బస చేసేందుకు ఆలయ నిర్వహణలోని గెస్ట్‌హౌస్‌లతో పాటు ప్రైవేట్ వసతి గృహాలు కూడా ఉన్నాయి.
- గుంతకల్లు రూరల్
ఆలయంలో చూడదగ్గవి..
ఆలయ ముఖద్వారం గుండా లోపలకు వెళ్లగానే భక్తులకు ముందుగా కనిపించేంది ధ్వజస్తంభం వద్ద ఉంచిన స్వామివారి పాదుకలు. ప్రతి రోజూ స్వామివారు ఈ పాదుకలను వేసుకుని లోక సంచారం చేస్తుంటారని భక్తుల నమ్మకం. అందుకే మరుసటి రోజు ఈ చెప్పులకు ముళ్లు, రాళ్లు, దుమ్ముధూళీ అంటుకుని అరిగిపోతుంటాయని ప్రతీతి. ఆలయానికి వచ్చే భక్తులు కొంతమంది స్వామివారి పాదుకలను నెత్తిన పెట్టుకొని తమను కష్టాల కడలినుంచి గట్టెక్కించాలని ప్రార్థిస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటారు.
రామసేతు శిల
తన ధర్మపత్ని సీతాదేవిని రావణుడి చెర నుంచి విడిపించుకుని వచ్చేందుకు లంకకు బయలుదేరిన శ్రీరాముడు.... సముద్రంపై వానరసైన్యం సాయంతో ఓ సేతువు (బ్రిడ్జి) నిర్మించారు. సేతువు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు నీటిలో మునిగిపోకుండా పైకి తేలాడుతుంటాయి. అలాంటి ఓ రాతిని ఇక్కడకు తీసుకువచ్చి ప్రత్యేకంగా అద్దాల పెట్టెలో భక్తుల దర్శనార్థం ఉంచారు.