kasapuram
-
‘అనంత’కు చేరిన కృష్ణాజలాలు
వజ్రకరూరు/గుంతకల్లు: కృష్ణా జలాలు జిల్లాలోకి ప్రవేశించాయి. మూడు రోజుల క్రితం కర్నూలు జిల్లా మాల్యాల ఎత్తిపోతల పథకం నుంచి అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా కాలువకు నీటిని వదిలారు. మంగళవారం తెల్లవారుజామున 3.00 గంటలకు అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతంలోని 144వ కీమీ వద్ద కసాపురం గ్రామం వద్దకు ప్రవేశించాయి. దీంతో గుంతకల్లు పట్టణ వాసుల దాహార్తిని తీర్చే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. మరోవైపు మంగళవారం ఉదయానికి కృష్ణా జలాలు రాగులపాడు లిఫ్ట్ వద్దకు చేరుకోగానే అధికారులు జీడిపల్లి రిజర్వాయర్‌కు నీటిని పంప్ చేస్తున్నారు. ఉదయం ఒక పంపు ద్వారా పంపింగ్ ప్రారంభించారు. కృష్ణా జలాలు హంద్రీనీవా ప్రధాన కాలువలోకి వస్తుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరుగుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాగులపాడుకు వచ్చే నీటిని బట్టి పంపుల సంఖ్య పెంచుతామని లిఫ్ట్ ఇన్చార్జ్ వెంకటరాజు ‘సాక్షి’కి తెలిపారు. -
నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ. 42 లక్షలు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కింపు చేపట్టారు. హుండీ ద్వారా రూ. 42.07 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ముత్యాలరావు తెలిపారు. ఈఓతో పాటు ఆలయ అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈవో మధు ఇతర పాలకవర్గం ఆధ్వర్యంలో 24 హుండీలను లెక్కించారు. 42 రోజులకు గానూ రూ. 42,07,438 నగదుతో పాటు 28 గ్రాముల బంగారం, 1.6 కిలోల వెండిని భక్తులు కానుకల రూపంలో స్వామివారికి సమర్పించినట్లు తెలిపారు. అలాగే అన్నదానం హుండీ ద్వారా రూ. 13,792 నగదును భక్తులు సమర్పించారన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆర్టీసీ సేవాసమితి , సత్యసాయి సేవాసమితి , హనుమాన్ సేవాసమితి సభ్యులు ,ఇతర భక్తులు పాల్గొన్నారు. పాలక మండలి సభ్యులు సతీష్ గుప్త, జగదీష్ ప్రసాద్, గుడిపాటి ఆంజనేయులు, వనగొంది విజయలక్ష్మి, ప్రసాద్‌రెడ్డి తదితరులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. -
భక్తజనంతో పోటెత్తిన కసాపురం
గుంతకల్లు రూరల్: శ్రావణ మాస రెండో శనివారం ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం భక్తజనంతో పోటెత్తింది. ఆంజనేయ నామస్మరణతో ఆలయ పురవీధులు ప్రతిధ్వనించాయి. నెట్టికంటి ఆంజనేయస్వామి గరుడవాహనంపై కొలువుదీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఈవో ముత్యాలరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, పాలకమండలి సభ్యల ఆధ్వర్యంలో సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రాకారోత్సవాన్ని ప్రారంభించారు. ఏఈవో మధు, సూపరింటెండెంట్లు వెంకట్వేర్లు, సీనియర్ అసిస్టెంట్ వేమన్నలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నెట్టికంటుడికి అరకిలో వెండి బహూకరణ : నెట్టికంటి ఆంజనేయస్వామి వెండి రథం నిర్మాణానికి రాయచూరుకు చెందిన శ్రీనివాసులు అనే భక్తుడు తనవంతుగా అరకిలో వెండిని బహూకరించారు. -
భక్తులతో పోటెత్తిన కసాపురం
గుంతకల్లు రూరల్: శ్రావణమాసం మొదటి మంగళవారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం మంగళవారం భక్తులతో పోటెత్తింది. సాయంత్రం స్వామివారు ఒంటె వాహనం పై కొలువదీరి ఆలయ పురవీధుల్లో ఊరేగారు. మంగళవారం వేకువజామునుంచే స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలను నిర్వహించారు. రాత్రి 8 గంటలకు ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తిని ఒంటెవాహనం పై కొలువు దీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో ముత్యాలరావు, అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, పాలకమండలి సభ్యులు నారికేళను సమర్పించి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేలాది మంది భక్తుల మధ్య కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. -
నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ.27 లక్షలు
గుంతకల్లు రూరల్ : కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీ లెక్కింపు ద్వారా రూ. 27.97 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ ముత్యాలరావు తెలిపారు. మంగళవారం ఆలయంలోని 24 హుండీలను లెక్కించగా 63 రోజులకు గానూ రూ. 27,97,954 రూపాయల నగదుతోపాటు ,10 గ్రాముల బంగారం, 1.7 కిలోల వెండి వచ్చినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా అన్నదానం హుండీ ద్వారా రూ. 34,211 నగదును భక్తులు సమర్పించినట్లు తెలిపారు. ఆలయ అణువంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈఓ మధు ఇతర పాలకవర్గం ఆధ్వర్యంలో సాగిన హుండీ లెక్కింపును దేవాదాయశాఖ అనంతపురం అసిస్టెంట్ కమిషనర్ రాణి, పాలకమండలి సభ్యులు సతీష్ గుప్త, జగదీష్ ప్రసాద్, మహేష్, వనగొంది విజయలక్ష్మి, ప్రసాద్‌రెడ్డి, గుడిపాటి ఆంజనేయులు తదితరులు పర్యవేక్షించారు. -
నెట్టికంటుడి సేవలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ
గుంతకల్లు రూరల్ : బీజేపీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్ కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు. బీజేపీ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంతకల్లుకు విచ్చేసిన ఆయన గురువారం నేరుగా కసాపురం చేరుకున్నారు. ఆలయ అధికారులు, ఇతర అర్చక బృందం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను, స్వామివారి పట్టువస్త్రాలను అందజేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి, కసాపురం ఆలయ ట్రస్టు బోర్డు సభ్యురాలు వనగొంది విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. -
పూలంగి సేవలో నెట్టికంటుడు
గుంతకల్లు రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసాపురం శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదురోజులపాటు సాగే ఈ ఉత్సవాలలో మొదటిరోజు స్వామివారు పూలంగి సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం వేకువజామునే స్వామి మూలవిరాట్‌కు అభిషేకాలు నిర్వహించి, పూలమాలలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం 9 గంటలకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యాగశాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో ఆనంద్‌కుమార్, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, పాలకమండలి సభ్యుల చేతుల మీదుగా ఆలయ అర్చకులకు, రుత్వికులకు యాగ వస్త్రాలను అందజేశారు. అనంతరం గణపతిపూజ, పుణ్యాహవాచనం, షోడోష నాందీమాతృకాపూజ, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాసన తదితర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోపూజ చేసి యాగశాల ప్రవేశం గావించారు. సాయంత్రం 5 గంటలకు ఆలయ ముఖమండపంలో స్వామివారి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి తులసి ఆకులతో లక్షార్చన చేశారు. పూజా కార్యాక్రమాల అనంతరం రాత్రి 8గంటలకు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు జగదీష్ ప్రసాద్, తలారి రామలింగప్ప, వనగొంది విజయలక్ష్మి, మహేష్, సతీష్ గుప్త, గుడిపాటి ఆంజనేయులు, ఏఈవో మధు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చూసొద్దాం.. రండి
గుంతకల్లు పేరు వినగానే ఇక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం ఠక్కున గుర్తుకువస్తుంది. ఇక్కడి ఆంజనేయస్వామిని కొలిస్తే సుఖసంతోషాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడి మూలవిరాట్ ఆంజనేయస్వామి స్వయంభూ అని ఆలయ చరిత్ర చెబుతోంది. క్రీ.శ. 1521న వ్యాసరాయలవారు ఆంజేయస్వామి విగ్రహాలను ప్రతిష్టిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నారని, ఆ సమయంలో స్వప్పదర్శనం మిచ్చిన స్వామి ఆదేశాల మేరకు ఓ వేపచెట్టు సమీపంలో తవ్వించగా పది అడుగుల పొడవు, నాలుగున్నర అడుగుల వెడల్పుతో ఆంజనేయస్వామి విగ్రహం బయటపడినట్లు తెలుస్తోంది. తొలుత ఈ ప్రాంతాన్ని నెట్టికల్లు అని పిలుస్తుండేవారు. దీంతో నెట్టికంటి ఆంజనేయస్వామిగా పేరు వచ్చింది. కాలక్రమేణ నెట్టికల్లు కాస్తా కసాపురంగా మారిపోయింది. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది. బస చేసేందుకు ఆలయ నిర్వహణలోని గెస్ట్‌హౌస్‌లతో పాటు ప్రైవేట్ వసతి గృహాలు కూడా ఉన్నాయి. - గుంతకల్లు రూరల్ ఆలయంలో చూడదగ్గవి.. ఆలయ ముఖద్వారం గుండా లోపలకు వెళ్లగానే భక్తులకు ముందుగా కనిపించేంది ధ్వజస్తంభం వద్ద ఉంచిన స్వామివారి పాదుకలు. ప్రతి రోజూ స్వామివారు ఈ పాదుకలను వేసుకుని లోక సంచారం చేస్తుంటారని భక్తుల నమ్మకం. అందుకే మరుసటి రోజు ఈ చెప్పులకు ముళ్లు, రాళ్లు, దుమ్ముధూళీ అంటుకుని అరిగిపోతుంటాయని ప్రతీతి. ఆలయానికి వచ్చే భక్తులు కొంతమంది స్వామివారి పాదుకలను నెత్తిన పెట్టుకొని తమను కష్టాల కడలినుంచి గట్టెక్కించాలని ప్రార్థిస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేస్తుంటారు. రామసేతు శిల తన ధర్మపత్ని సీతాదేవిని రావణుడి చెర నుంచి విడిపించుకుని వచ్చేందుకు లంకకు బయలుదేరిన శ్రీరాముడు.... సముద్రంపై వానరసైన్యం సాయంతో ఓ సేతువు (బ్రిడ్జి) నిర్మించారు. సేతువు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు నీటిలో మునిగిపోకుండా పైకి తేలాడుతుంటాయి. అలాంటి ఓ రాతిని ఇక్కడకు తీసుకువచ్చి ప్రత్యేకంగా అద్దాల పెట్టెలో భక్తుల దర్శనార్థం ఉంచారు. -
కనుల పండువగా లంకాదహనం
గుంతకల్లు రూరల్ : ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో మూడు రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ఉగాది ఉత్సవాలు శుక్రవారం నాటి లంకాదహనం కార్యక్రమంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు లంకాదహనం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం ప్రత్యేక పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన నెట్టికంటి ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని ఒంటెవాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ ఆనంద్‌కుమార్, ధర్మకర్త సుగుణమ్మ, ఇతర పాలకమండలి సభ్యుల చేతులు మీదుగా స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయ వేద పండితులు రామకృష్ణావధాని, అనంత పద్మనాభశర్మ ఆధ్వర్యంలో ముఖ్య అర్చకులు రాఘవచార్యులు, అనంతాచార్యులు, ఇతర అర్చక బృందం ఆధ్వర్యంలో ఉత్సవమూర్తికి విశేష అర్చన, వేద గోష్ఠి పూజలు నిర్వహించారు. అనంతరం నెట్టికంటి ఆంజనేయస్వామి చేతులమీదుగా లంకాదహనం కార్యక్రమం ప్రారంభించారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన లంకాదహనం వేడుకలను వీక్షించేందుకు గ్రామస్తులు, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కార్యక్రమంలో ఆలయ అధికారులతో పాటు గుంతకల్లు జేఎçఫ్సీఎం జడ్జి కె.వాసుదేవరావు, వైఎస్సార్సీపీ సర్పంచ్ తిక్కస్వామి, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి సోమిరెడ్డి, బెస్త మనోహర్, శ్రీరాములు పాల్గొన్నారు. -
కనుల పండువగా నెట్టికంటుడి రథోత్సవం
గుంతకల్లు రూరల్ : ఉగాది ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం గురువారం భక్తులతో పోటెత్తింది. భక్తుల గోవిందనామస్మరణలతో ఆలయ పురవీధులు మార్మోగాయి. హేమలంబి నామ సంవత్సర ఉత్సవాల్లో భాగంగా రెండవరోజు స్వామి వారి రథోత్సవం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. ఆంజనేయ పాహిమాం.. ,పవనపుత్ర రక్షమాం.. అంటూ భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం పొందారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన రథోత్సవంలో వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం వేకువ జాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆకు పూజలు , వడమాలలు ,నివేదనలతో మొక్కులను తీర్చుకున్నారు. ఆలయ వేద పండితులు రామక్రిష్ణావధాని ,అనంతపరద్మనాభశర్మల ఆధ్వర్యంలోని అర్చక బృందం సాయంత్రం 6 గంటలకు రథం ముందు కళశ స్థాపన , రథాంగహోమం, బలిహరణ పూజలు నిర్వహించారు. సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్లను మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి పల్లకీలో ఊరేగింపుగా తీసుకువచ్చి రథంలో కొలువుదీర్చారు. ఆలయ ఈఓ ఆనంద్ కుమార్ ,ఆలయ ధర్మకర్త సుగుణమ్మ ఇతర అధికారులు, పాలకమండలి సభ్యులు కొబ్బరికాయలను సమర్పించి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ తిక్కస్వామి, వైస్ సర్పంచ్ శ్రీరాములు,తహసీల్దార్ హరిప్రసాద్, ఎంపీపీ రాయల్‌రామయ్య తదితరులు పాల్గొన్నారు. కసాపురం ఎస్ఐ సద్గురుడు ఆధ్వర్యంలో దాదాపు 100 మంది పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు చేపట్టారు. భక్తుల కాలక్షేపం కోసం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సాస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. -
వైభవంగా నెట్టికంటుడి శోభాయాత్ర
గుంతకల్లు రూరల్: హనుమాన్ మాలధారుల పాదయాత్ర సందర్భంగా చేపట్టిన నెట్టికంటుడి శోభాయాత్ర ఆద్యంతం అత్యంత వైభవంగా సాగింది. ఆంజనేయ స్వామి నామస్మరణతో గుంతకల్లు పట్టణ పురవీధులు మార్మోగాయి. అశ్వ వాహనంపై కొలువుదీరిన నెట్టికంటుడిని అడుగడుగునా దర్శించుకుంటూ భక్తులు పునీతులయ్యారు. హనుమద్ వ్రతం ఉత్సవాలలో భాగంగా ఆదివారం పట్టణంలోని హనుమాన్ సర్కిల్‌నుండి కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం వరకూ శోభాయాత్రను నిర్వహించారు. ముందుగా విశేష పుష్పాలు, వివిధ రకాల స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని, అంతే అందంగా అలంకరించిన అశ్వవాహనంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ ఈవో ముత్యాలరావు, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ, పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ నారికేâýæను సమర్పించి శోభాయాత్రను ప్రారంభించారు. శోభాయాత్రలో మున్సిపల్ వైస్ చైర్మెన్ శ్రీనాథ్ గౌడ్, మార్కెట్ యార్డు చైర్మెన్ బండారు ఆనంద్, పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రేపటి నుంచి హనుమద్ ఉత్సవాలు
కసాపురం (గుంతకల్లు రూరల్ ) : ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగనున్న హనుమద్ వ్రతం ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు మాలదారుల పాదయాత్ర, అనంతరం ఇరుముడుల సమర్పణ, 12వ తేదీ రెండో రోజు ఆలయ సమీపంలోని గంగా నిలయం ప్రాంగణంలో హనుమద్ వ్రతాన్ని నిర్వహించనున్నారు. 11న మాలదారుల పాదయాత్ర మండలం రోజుల పాటు దీక్షలో ఉండి, ఇరుముడుల సమర్పించే క్రమంలో భాగంగా కసాపురం వచ్చే మాల ధారులు ఈనెల 11న ఉదయం నేరుగా పట్టణంలోని హనుమాన్ సర్కిల్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. వేలాదిమంది దీక్షా స్వాముల ఆధ్వర్యంలో పల్లకీపై కొలువుదీరిన నెట్టికంటుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీక్షా స్వాములు పాదయాత్రను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పట్టణంలోని పొట్టిశ్రీరాములు సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, రామస్వామి దేవాలయం మీదుగా మాలధారుల పాదయాత్ర మధ్యాహ్నానికి నెట్టికంటి ఆంజనేయస్వామి సన్నిధికి చేరుకుంటారు. అనంతరం మాలధారులు ఇరుముడులను స్వామివారికి సమర్పిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఇరుముడలలో తెచ్చిన ద్రవ్యాలతో హోమగుండ ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 12న హనుమద్ వ్రతం ఆలయ సమీపంలోని గంగా నిలయం ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని కొలువు దీర్చి, వేలాది మంది భక్తులు, మాలధారుల ఆంజనేయస్వామి నామస్మరణల మధ్య ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ హనుమద్ వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం మాలధారులు దీక్షా విరమణ గావిస్తారు. ఏర్పాట్లు పూర్తి : ఈఓ హనుమద్ వ్రతం ఉత్సవాలకు దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు, మాలధారులు రానున్న నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టామని ఆలయ ఈఓ ముత్యాలరావు తెలిపారు. పాదయాత్రగా ఆలయానికి చేరుకున్న మాలదారులు ఇరుముడులు సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, వారు విశ్రాంతి తీసుకునేందుకు ఉచిత కాటే జీలు ఏర్పాటుచేశామన్నారు. ఉత్సవాలు నిర్వహించనున్న రెండు రోజుల పాటు మాలధారులకు గంగా నిలయంలో అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గుంతకల్లు మున్సిపాలిటీ నుంచి నిరంతరంగా వాటర్ ట్యాంకర్ల సరఫరా, వైద్య శిబిరాలు, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక విచారణ కేంద్ర ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
'నెట్టికంటి' సన్నిధిలో భన్వర్‌లాల్
కసాపురం (గుంతకల్లు) : కసాపురం శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మలోల, తహసీల్దార్ హరిప్రసాద్, ఆలయ ఈఓ ముత్యాలరావులు, రెవెన్యూ సిబ్బంది భన్వర్‌లాల్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. -
డిసెంబర్ 11, 12 తేదీల్లో హనుమద్వ్రతం
నెల 31 నుంచి మండల దీక్షలు ప్రారంభం గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో డిసెంబర్ 11,12 తేదీల్లో హనుమద్వ్రతాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ముత్యాలరావు తెలిపారు. సోమవారం ఆలయంలో హనుమద్వ్రతం ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈవో, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ మాట్లాడుతూ ఈ నెల 31 నుంచి హనుమద్ వ్రత మండల దీక్షలు , నవంబర్ 21 నుంచి అర్ధమండల దీక్షలు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. డిసెంబర్ 11న స్వామివారి తిరుఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 12 న స్థానిక గంగా నిలయంలో హనుమద్ వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు వసుదరాజాచార్యులు, ఏఈవో మధు, సూపరింటెండెంట్ మల్లయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
శ్రావణమాస ఆదాయం రూ.1.05 కోట్లు
కసాపురం (గుంతకల్లు రూరల్) : శ్రావణమాసం ఉత్సవాల ద్వారా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి కోటీ 55వేల 416 రూపాయల ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం ఆలయంలోని కార్యాలయంలో ఆలయ ఏఈవో మధు, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు ఈ వివరాలను వెల్లడించారు. శ్రావణమాసం నాలుగు శనివారాలు, మంగళవారాలు దాదాపు 5 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఆలయంలో లడ్డు, పులిహోర, కలకండ, అభిషేకం లడ్డు ప్రసాదాల కొనుగోళ్ల ద్వారా భక్తులు రూ.30,74,085 , అద్దెగదుల ద్వారా రూ. 3,63,980 , హనుమాన్ కంకణాల ద్వారా 1,76,810 , రూ. 10 సాధారణ దర్శనం టికెట్లు, రూ.50 శీఘ్ర దర్శనం టికెట్లు, రూ.100 అతిశీఘ్ర దర్శనం టికెట్ల కొనుగోళ్ల ద్వారా రూ.31,02,327 అందాయన్నారు. ఆర్జిత సేవలద్వారా 12,72,915 , కేశఖండన ద్వారా రూ. 2,75,600, అన్నదానానికి భక్తులు అందజేసిన డొనేషన్ల ద్వారా రూ.5,26,017, దుకాణ సముదాయాల ద్వారా 11,22,954 ఆదాయం లభించినట్లు వివరించారు. నెల ఉత్సవాల్లో తమవంతు సహాయసహకారాలు అందజేసిన ప్రభుత్వ వివిధ శాఖలు, సేవాసమితి సభ్యులకు వారు కతజ్ఞతలు తెలిపారు. -
భక్తులతో పోటెత్తిన కసాపురం
గుంతకల్లు రూరల్ : శ్రావణమాసం నాల్గవ శనివారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో పోటెత్తింది. రాత్రి 8 గంటలకు ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని ఒంటెవాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ ఈఓ ముత్యాలరావు ,ఆలయ అణువంశిక ధర్మకర్త సగుణమ్మల ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాకారోత్సవం నిర్వహించారు. బళ్లారి మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి సౌజన్యంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు చెక్కెర పొంగళి ,పులిహోర ప్రసాదాలు పంపిణీ చేశారు. నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ ఏఈఓ మధు , సూపరింటెండెంట్ వెంకటేశులు ఇతర అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఒంటె వాహనంపై నెట్టికంటుడు
గుంతకల్లు రూరల్ : శ్రావణమాస తొలి మంగళవారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురంలో నెట్టికంటి ఆంజనేయస్వామి ఒంటె వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 8 గంటలకు ఉత్సవ మూర్తిని ఒంటెవాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రధానఅర్చకుడు వసుధరాజాచార్యులు, వేద పండితులు అనంతపద్మనాభశర్మ, రామకృష్ణావధానిల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో ముత్యాలరావు, అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ టెంకాయ సమర్పించి ఊరేగింపు ప్రారంభించారు. వేలాదిమంది భక్తుల ఆంజనేయ నామస్మరణల మధ్య ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. -
ఆటో బోల్తా: ముగ్గురికి తీవ్రగాయాలు
మద్దిగర్ర: కర్నూలు జిల్లా మద్దిగర్ర మండల శివారులో గుంతకల్లు వెళ్లే రహదారిపై ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తూ ఓ ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో రాజేష్ (34) అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా.. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కసాపురం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని ఆదోని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఏం మొహం పెట్టుకుని వచ్చావ్..?
కసాపురం (గుంతకల్లురూరల్), న్యూస్‌లైన్: ‘నాడు గొప్పలు చెప్పుకోవడానికి రైతులు నష్టపోతారని తెలిసినా నష్టపరిహారం ఇప్పిస్తామని నమ్మబలికి ఏరు ద్వారా చెరువులకు నీళ్లు వదిలి వందలాది ఎకరాల పంట నీట మునిగి నష్టపోయేందుకు కారణమయ్యావు. నష్ట పరిహారం ఇప్పించాలని మీ నివాస గృహం వద్దకు వచ్చి అడిగితే ‘ నా వద్దకు ఎం దుకు వచ్చారు.. సంబంధిత అధికారులను అడగమని ఉచిత సలహా ఇచ్చి మొహం చాటేశావు.. ఇప్పుడు ఎం మొహం పెట్టుకుని వచ్చావు’ అని కసాపురం గ్రామ రైతులు గుంతకల్లు ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్‌గుప్తాను నిలదీశారు. కసాపురం గ్రామ సమీపాన హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన ఫీడర్ చానల్ ద్వారా కృష్ణ జలాలను గుంతకల్లు నియోజకవర్గంలోని పాతకొత్తచెరువు, వైటి చెరువు, గుత్తి చెరువులకు మళ్లించే కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు ఆయనపై విరుచుకుపడ్డారు. పది రోజుల కిందట కృష్ణ జలాలను ఏరు ద్వారా విడుదల చేస్తే దాన్ని అడ్డుకొని కాలువ గట్టుపై నిరాహారదీక్షలు చేసినా పట్టించుకోని ఎమ్మెల్యే నీళ్లు వదలడానికి ఎలా వచ్చావని రైతులు ప్రశ్నించారు. రైతులు మాట్లాడుతూ గత ఏడాది కృష్ణ జలాలతో పంటపైర్లు నీట మునిగి తీవ్రంగా నష్టపోయమన్నారు. అప్పుల బాధతో గ్రామానికి చెందిన కుంటి మల్లి అనే రైతు ఆత్మహత్యాయత్నం చేశాడని వారు గుర్తు చేశారు. ఒక సందర్భంలో పంట నష్టపరిహారం చెల్లించకపోతే హంద్రీనీవా కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు కాలువలోకి దూకేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్‌గుప్తా మాట్లాడుతూ ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద రైతుల ఖాతాల్లో పంట నష్టపరిహారం జమ అయ్యిందని, మిగిలిన మొత్తాన్ని వారంలోపు చెల్లించడానికి చర్యలు చేపడతామని సర్దిచెప్పడానికి యత్నించారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ కల్పించుకొని వారం రోజుల్లోపు పరిహారం మంజూరుకు ప్రయత్నిస్తామనడంతో రైతులు ఆందోళన విరమించారు. గ్రామ సర్పంచ్ కావలి తిక్కస్వామి, రైతులు సోమిరెడ్డి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.