కసాపురం (గుంతకల్లురూరల్), న్యూస్‌లైన్: ‘నాడు గొప్పలు చెప్పుకోవడానికి రైతులు నష్టపోతారని తెలిసినా నష్టపరిహారం ఇప్పిస్తామని నమ్మబలికి ఏరు ద్వారా చెరువులకు నీళ్లు వదిలి వందలాది ఎకరాల పంట నీట మునిగి నష్టపోయేందుకు కారణమయ్యావు. నష్ట పరిహారం ఇప్పించాలని మీ నివాస గృహం వద్దకు వచ్చి అడిగితే ‘ నా వద్దకు ఎం దుకు వచ్చారు.. సంబంధిత అధికారులను అడగమని ఉచిత సలహా ఇచ్చి మొహం చాటేశావు.. ఇప్పుడు ఎం మొహం పెట్టుకుని వచ్చావు’ అని కసాపురం గ్రామ రైతులు గుంతకల్లు ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్‌గుప్తాను నిలదీశారు.
కసాపురం గ్రామ సమీపాన హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన ఫీడర్ చానల్ ద్వారా కృష్ణ జలాలను గుంతకల్లు నియోజకవర్గంలోని పాతకొత్తచెరువు, వైటి చెరువు, గుత్తి చెరువులకు మళ్లించే కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు ఆయనపై విరుచుకుపడ్డారు. పది రోజుల కిందట కృష్ణ జలాలను ఏరు ద్వారా విడుదల చేస్తే దాన్ని అడ్డుకొని కాలువ గట్టుపై నిరాహారదీక్షలు చేసినా పట్టించుకోని ఎమ్మెల్యే నీళ్లు వదలడానికి ఎలా వచ్చావని రైతులు ప్రశ్నించారు. రైతులు మాట్లాడుతూ గత ఏడాది కృష్ణ జలాలతో పంటపైర్లు నీట మునిగి తీవ్రంగా నష్టపోయమన్నారు.
అప్పుల బాధతో గ్రామానికి చెందిన కుంటి మల్లి అనే రైతు ఆత్మహత్యాయత్నం చేశాడని వారు గుర్తు చేశారు. ఒక సందర్భంలో పంట నష్టపరిహారం చెల్లించకపోతే హంద్రీనీవా కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు కాలువలోకి దూకేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.ఎమ్మెల్యే కొట్రికే మధుసూదన్‌గుప్తా మాట్లాడుతూ ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద రైతుల ఖాతాల్లో పంట నష్టపరిహారం జమ అయ్యిందని, మిగిలిన మొత్తాన్ని వారంలోపు చెల్లించడానికి చర్యలు చేపడతామని సర్దిచెప్పడానికి యత్నించారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ కల్పించుకొని వారం రోజుల్లోపు పరిహారం మంజూరుకు ప్రయత్నిస్తామనడంతో రైతులు ఆందోళన విరమించారు. గ్రామ సర్పంచ్ కావలి తిక్కస్వామి, రైతులు సోమిరెడ్డి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
ఏం మొహం పెట్టుకుని వచ్చావ్..?
Published Thu, Aug 29 2013 5:04 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM
Advertisement