‘అనంత’కు చేరిన కృష్ణాజలాలు
వజ్రకరూరు/గుంతకల్లు: కృష్ణా జలాలు జిల్లాలోకి ప్రవేశించాయి. మూడు రోజుల క్రితం కర్నూలు జిల్లా మాల్యాల ఎత్తిపోతల పథకం నుంచి అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా కాలువకు నీటిని వదిలారు. మంగళవారం తెల్లవారుజామున 3.00 గంటలకు అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతంలోని 144వ కీమీ వద్ద కసాపురం గ్రామం వద్దకు ప్రవేశించాయి. దీంతో గుంతకల్లు పట్టణ వాసుల దాహార్తిని తీర్చే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
మరోవైపు మంగళవారం ఉదయానికి కృష్ణా జలాలు రాగులపాడు లిఫ్ట్ వద్దకు చేరుకోగానే అధికారులు జీడిపల్లి రిజర్వాయర్‌కు నీటిని పంప్ చేస్తున్నారు. ఉదయం ఒక పంపు ద్వారా పంపింగ్ ప్రారంభించారు. కృష్ణా జలాలు హంద్రీనీవా ప్రధాన కాలువలోకి వస్తుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరుగుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాగులపాడుకు వచ్చే నీటిని బట్టి పంపుల సంఖ్య పెంచుతామని లిఫ్ట్ ఇన్‌చార్జ్ వెంకటరాజు ‘సాక్షి’కి తెలిపారు.