కృష్ణా జలాల తాత్కాలిక పంపిణీ బాధ్యత అప్పగింత
‘66:34’ కేటాయింపులను వ్యతిరేకించిన తెలంగాణ
ఏపీ ఈ ఏడాది ఇప్పటికే 76% నీళ్లు వాడిందని అభ్యంతరం
వాడీవేడిగా కృష్ణా బోర్డు భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటు బాధ్యతను మళ్లీ త్రిసభ్య కమిటీకే అప్పగిస్తూ కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నిర్ణయం తీసుకుంది. దీనికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు చైర్మన్ అతుల్‌జైన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ తరఫున నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఈఎన్‌సీ జి.అనిల్‌కుమార్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఎస్‌ఈ విజయ్‌కుమార్, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, బోర్డు
సభ్యకార్యదర్శి డీఎం రాయ్‌పురే పాల్గొన్నారు.
కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల వాటా ఉండగా, 66:34 నిష్పత్తిలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలిక సర్దుబాటు పేరుతో 2015 జూన్‌లో కేంద్ర జలశక్తి శాఖ జరిపిన కేటాయింపులను ఇకపై కొనసాగించడానికి అంగీకరించమని రాహుల్ బొజ్జా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే త్రిసభ్య కమిటీ ఈసారి తెలంగాణకు కొంత వరకు కేటాయింపులు పెంచుతుందని బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారని రాహుల్»ొజ్జా తెలిపారు. సమావేశానంతరం ఈఎన్‌సీ జి.అనిల్‌కుమార్‌తో కలిసి ఆయన మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు.
కృష్ణానది 71శాతం తెలంగాణలో విస్తరించి ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి 71శాతం, ఏపీకి 29 శాతం జలాలను కేటాయించాలని తాము కృష్ణా ట్రిబ్యునల్–2లో వాదనలు వినిపించిన అంశాన్ని బోర్డుకు వివరించామన్నారు. ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో తాత్కాలిక పంపిణీ జరపాలని డిమాండ్ చేశామని చెప్పారు. ఏపీ కొత్తగా ప్రతిపాదించిన గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు వివరాలను అందించాలని కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలకు కోరామన్నారు.
ప్రతి చుక్కను లెక్కించాల్సిందే..
పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు తరలించడాన్ని అడ్డుకోవాలని బోర్డును కోరామని రాహుల్‌బొజ్జా తెలిపారు. చెన్నైకి తాగునీరు మాత్రమే సరఫరా చేయాలని, సాగునీటి అవసరాలకు తరలించడం అక్రమమని వాదించామన్నారు. ఏటా 200 టీఎంసీలకు పైగా కృష్ణా జలాలను ఏపీ బేసిన్ వెలపలి ప్రాంతాలకు తరలిస్తోందని అభ్యంతరం తెలిపారు. పోతిరెడ్డిపాడు, బనకచర్లతోపాటు ఏపీలోని మొత్తం 11 అవుట్ లెట్ల ద్వారా తరలిస్తున్న ప్రతీ చుక్కను పక్కాగా లెక్కించడానికి 11 టెలీమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరామని రాహుల్ బొజ్జా తెలిపారు.
పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి అనుమతి లేని ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయగా, ప్రస్తుతం వీటికి నీటి కేటాయింపులు ట్రిబ్యునల్ పరిధిలో ఉందని బదులిచ్చామన్నారు. కృష్ణా ట్రిబ్యునల్–1 ప్రాజెక్టుల వారీగా కాకుండా గంపగుత్తగా నీళ్లు కేటాయించిందని, దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులకు అవసరమైన నీళ్లను కేటాయించుకునే హక్కు తమకు ఉంటుందన్నారు.
సాగర్‌పై సీఆర్‌పీఎఫ్ బలగాల ఉపసంహరణ
నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై ఉన్న సీఆర్‌పీఎఫ్ బలగాలను ఉపసంహరించాలని తాము కోరగా, ఏపీ సైతం అంగీకరించిందని రాహుల్‌బొజ్జా తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పరిశీలించాక 2 నెలల తర్వాత ఉపసంహరిస్తామని బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారన్నారు. కృష్ణా జలాల్లో వాటాలు తేలే వరకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోని తమ కాంపోనెంట్లతోపాటు హైడల్ పవర్ ప్రాజెక్టులను ఇచ్చే ప్రసక్తే లేదన్నారు.
ప్రమాదంలో శ్రీశైలం జలాశయం : తెలంగాణ ఈఎన్‌సీ అనిల్‌కుమార్
శ్రీశైలం జలాశయ ప్లంజ్‌పూల్ (నీళ్లు స్పిల్‌వే గేట్ల నుంచి దూకి కిందకు పడే ప్రాంతం) వద్ద 300–400 మీటర్ల లోతు వరకు భారీ గుంతలు ఏర్పడ్డాయని తెలంగాణ ఈఎన్‌సీ అనిల్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే మరమ్మతులు చేయాలని ఏపీని కోరామన్నారు. టెలీమెట్రీల ఏర్పాటుకు రూ.6 కోట్లను భరిస్తామని తెలియజేశామన్నారు. ఈ ఏడాది 780 టీఎంసీల కృష్ణా జలాల లభ్యత ఉండగా, ఇప్పటికే ఏపీ 500 టీఎంసీలు(76శాతం) వాడుకోగా, తెలంగాణ కేవలం 180 టీఎంసీలు మాత్రమే వాడిందన్నారు. ఏపీ అధిక వినియోగానికి తగ్గట్టూ తెలంగాణకు వాటాలు పెంచాలని కోరామని చెప్పారు.
బచావత్ కేటాయింపులకు రక్షణ కల్పించాలి : ఏపీ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వర్లు
బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–1) కేటాయింపుల ఆధారంగా ఏపీకి 66 శాతం, తెలంగాణకి 34 శాతం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కోరామని ఏపీ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. కృష్ణా ట్రిబ్యునల్–2లో వాటాలు తేలే వరకు ఈ మేరకు కేటాయింపులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చేవరకు త్రిసభ్య కమిటీ పరస్పర అంగీకారంతో నీళ్లను పంచుకుంటామన్నారు.
టెలీమెట్రీల ఏర్పాటుపై తమ ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శ్రీశైలం జలాశయ ప్లంజ్‌పూల్‌కు మరమ్మతుల కోసం సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ఈతో అధ్యయనం చేయిస్తున్నామని, కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) అధికారులతో చర్చించి మరమ్మతులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment