Water allocation
-
ఆ జిల్లాలకు అన్యాయం చేస్తే సహించం
కరీంనగర్: కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు నీటి కేటాయింపుల్లో అన్యాయం చేస్తే సహించేది లేదని ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రెండు జిల్లాల్లో మూడు పంటలకు నీరు ఇచ్చిన తర్వాతే మిగతా జిల్లాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం నీటిని పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు కేటాయించడం లేదని.. గోదావరి నీటిని పరివాహక ప్రాంతాలకు ఇవ్వకుండా కొండపోచమ్మకు తరలిస్తున్నారని మండిపడ్డారు. కోవిడ్ నిర్మూలనకు కేంద్రం రూ. 230కోట్లు కేటాయించిందని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రం మూడు లక్షల కోట్ల అప్పుల్లో ఉందని అన్నారు. రెండోసారి లాక్‌డౌన్‌ను కఠినతరం చేయడం వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని కేంద్రంపై నిందలు వేయడం మానుకోవాలని హితవు పలికారు. నీటి వినియోగంపై నిపుణుల సలహాలు తీసుకోవాలని సోమారపు సత్యనారాయణ ప్రభుత్వానికి సూచించారు. -
‘పోలవరం’ వాటాకు కర్ణాటక శ్రీకారం
⇒ కృష్ణాలో 21 టీఎంసీల అదనపు వినియోగం షురూ! ⇒ ఇక దిగువకు వచ్చే నీటికి మరింత కటకటే ⇒ పోలవరం కింది వాటా కావడంతో ఏమీ అనలేని తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిలో తమ వాటాలను సంపూర్ణంగా వినియోగించుకునే ప్రయత్నంలో ఉన్న కర్ణాటక.. ఆ రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన నాలుగు ఎత్తిపోతల పథకాలకు నీటి వినియోగాన్ని మొదలు పెట్టింది. ఈ ప్రాజెక్టులకు ఇటీవలే కేంద్ర పర్యావరణ శాఖ ఓకే చెప్పిన నేపథ్యంలో.. 21 టీఎంసీల నీటిని వాడుకునేందుకు సిద్ధమైంది. ఈ నీరంతా పోలవరం ప్రాజెక్టుతో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలకు సంబంధించినది కావడం గమనార్హం. దాంతో కర్ణాటక నీటి వినియోగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించలేని పరిస్థితి నెలకొంది. నాలుగు కొత్త పథకాలతో.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు కృష్ణా జలాల్లో కర్ణాటకకు 734 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. ఇప్పటికే కర్ణాటక ఆ నీటిని దాదాపు పూర్తిగా వినియోగించుకుం టోంది. అదనంగా నీటిని వినియోగించుకు నేందుకు వీలుగా దాదాపు పదేళ్ల కింద బీజాపూర్ జిల్లా బుధిహాల్–పీరాపూర్, రాయచూర్ జిల్లాలోని నందవాడ్జి, రామత్తల్, భగల్‌కోట్ జిల్లాలోని తిమ్మాపూర్‌ల వద్ద కృష్ణా నదిపై నాలుగు ఎత్తిపోతల పథకాలను ప్రారంభించింది. 21 టీఎంసీల నీటిని తీసుకుని.. 1.29 లక్షల హెక్టార్లకు అందించా లనేది లక్ష్యం. అయితే ఆ ప్రాజెక్టుల పనులు చేపట్టినా.. వాటికి ఎలాంటి అనుమతులు, నీటి కేటాయింపులు లేకపోవడంతో నిర్వహణలోకి తీసుకురాలేకపోయింది. అయితే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అధికారిక అనుమతులు ఇచ్చిన వెంటనే తమ ప్రాజెక్టులకు అనుమతుల ప్రక్రియను వేగిరం చేసింది. ఎందుకంటే గోదావరి జిలాలను కృష్ణాకు తరలిస్తూ పోలవరం ప్రాజెక్టును చేపట్టిన వెంటనే ఎగువ రాష్ట్రాలకు 35 టీఎంసీల మేర వాటాలు దక్కుతాయని బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో స్పష్టంగా ఉంది. ప్రస్తుతం ఏపీ పోలవరం చేపట్టడంతో కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలు దక్కుతాయి. దీంతో కర్ణాటక కీ 21 టీఎంసీల్లోంచే తాము పథకాలను చేపట్టినట్లు చూపి ఇటీవలే అన్ని అనుమతులు తెచ్చుకుంది. తాజాగా నీటి వినియోగాన్నీ మొదలు పెట్టింది. ఈ ఎత్తిపోతల పథకాలు పాలమూరు జిల్లాకు ఎగువనే ఉండటంతో.. ఆ జిల్లా ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే దిగువకు నీళ్లు రాని నేపథ్యంలో.. మరో 21 టీఎంసీలు ఎగువన వినియోగిస్తే తమ పరిస్థితి ఏమిటన్న భయం వెంటాడుతోంది. -
అన్నీ పరిశీలించే నీటి కేటాయింపులు!
► సాగర్ కింద కేటాయింపులపై తెలంగాణకు స్పష్టం చేస్తూ కృష్ణా బోర్డు లేఖ ► ఆంధ్రప్రదేశ్‌కు నీరు విడుదల చేయాలని హితవు ► సరఫరా నష్టాలను వారి వాటాకు జత చేస్తామని వెల్లడి ► శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో ఎండీడీఎల్ దిగువకు వెళ్లి నీటిని పంచిన అంశంపై వివరణ సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీటి లభ్యత వాస్తవ పరిస్థితులు, సరఫరా నష్టాల (సప్లై లాస్)ను దృష్టిలో పెట్టుకుంటూనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేశామని కృష్ణానదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. ఈ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని తక్షణమే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణను ఆదేశించింది. ఈ మేరకు బుధవారం కృష్ణా బోర్డు చీఫ్ ఇంజనీర్ వీకే నాగ్పురే తెలంగాణ రాష్ట్రానికి లేఖ రాశారు. ఈ లేఖ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సాగర్ నుంచి ఏపీకి కుడి కాల్వద్వారా నీటి విడుదల మొదలు పెట్టింది. సాగర్ నుంచి నీటి విడుదలకు సంబంధించి ఏపీ, తెలంగాణల మధ్య మంగళవారం వివాదం రేగిన విషయం తెలిసిందే. ఈ వివాదాన్ని ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు కృష్ణానదీ యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందిస్తూ బోర్డు సీఈ తెలంగాణకు లేఖ రాశారు. ఎండీడీఎల్ కింద సైతం నీటి పంపిణీ.. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలో కనీస నీటి మట్టాలు (ఎండీడీఎల్)కు ఎగువన, దిగువన ఉన్న నీటిని పంచుతూ గత నెల 8న చేసిన నిర్ణయాలను బోర్డు తన లేఖలో ప్రస్తావించింది. ‘శ్రీశైలంలో 834 అడుగులు, సాగర్‌లో 510 అడుగుల కనీస నీటి మట్టాలకు ఎగువన 34 టీఎంసీల మేర నీరు ఉంది. అందులో 18.5 టీఎంసీలు ఏపీకి, 15.5 టీఎంసీలు తెలంగాణకు పంచాం. ఇదే సమయంలో ఇరు రాష్ట్రాల తాగు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో 785 అడుగుల దిగువకు, సాగర్‌లో 503 అడుగుల దిగువకు వెళ్లి నీటిని తీసుకోవాలని బోర్డు సమక్షంలో నిర్ణయం జరిగింది. ఎండీడీఎల్ దిగువన మరో 44 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. దీంతో మొత్తంగా 78 టీఎంసీల నీటి లభ్యత ఉండగా, ఇందులో 47 టీఎంసీలు ఏపీకి, 31 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఈ సమయంలోనే సాగర్‌లో వాస్తవ పరిస్థితులు, సరఫరా నష్టాలను దృష్టిలో పెట్టుకుని నీటిని కేటాయించాం’ అని లేఖలో స్పష్టం చేసింది. అయితే శ్రీశైలం కింది నీటి విడుదలపై మాత్రం నీటి అవసరాలు, ఆవిరి, సరఫరా నష్టాలు, తాగు నీటి అవసరాలు పేర్కొంటూ ఇండెంట్ ఇస్తే దానికి అనుగుణంగా నీటిని కేటాయిస్తామని వెల్లడించింది. ఇదే సమయంలో ఏపీ రాసిన లేఖను ప్రస్తావించింది. సాగర్కింద ఏపీకి 17 టీఎంసీలు కేటాయించినా, తెలంగాణ 13.89 టీఎంసీలు మాత్రమే విడుదల చేసిందని, తమకు సమాచారం లేకుండానే నీటి విడుదల నిలిపివేసిందనే విషయాన్ని ఏపీ తన దృష్టికి తెచ్చిన అంశాన్ని వెల్లడించింది. ఏపీ వినతిపై స్పందించిన బోర్డు వారికి కేటాయించిన మేర నీటిని విడుదల చేయాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. ఆవిరి నష్టాలుగా చూపుతున్న లెక్కలను ఏపీ వాటాల్లో జత చేస్తామని స్పష్టం చేసింది. శ్రీశైలం నుంచి 10 టీఎంసీల విడుదల కోరనున్న తెలంగాణ.. సాగర్‌లో నీటి లభ్యత కనిష్ట నీటి మట్టాలకు చేరుతున్న దృష్ట్యా శ్రీశైలం నుంచి కనిష్టంగా 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్రం కోరనుంది. నాగార్జున సాగర్‌లో కనీస నీటిమట్టం 510 అడుగులు కొనసాగా లంటే ఈ నీటి విడుదల ఎంతైనా అవసరమని తెలంగాణ అంటోంది. -
నీటి కేటాయింపులు సవాలే!
నేడు కృష్ణా బోర్డు సమావేశం సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం లో ఇప్పటివరకూ వినియోగించుకున్న నీళ్లు పోనూ.. ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీళ్లన్నీ మావంటే మావని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న 40.45 టీఎంసీ లను తమకే కేటాయించాలంటూ కృష్ణా బోర్డుకు ఇరు రాష్ట్రాలు లేఖలు రాశాయి. నీటి కేటాయింపు లపై ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం సాధిం చడం సవాలేనని బోర్డు వర్గాలు వెల్లడించాయి. నీటి కేటాయింపుల కోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు లేఖలు రాస్తుండటంతో రబీ పంటలకు సాగునీరు, తాగునీటి అవసరాలపై చర్చించేందుకు బుధవారం హైదరా బాద్‌లోని జలసౌధలో బోర్డు సమావేశం నిర్వహించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్ హెచ్‌కే హల్దార్ నిర్ణయించారు. కృష్ణా నదీపై ఉన్న ప్రధాన రిజర్వాయర్లలో కనీస నీటిమట్టానికి ఎగువన 40.45 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. ఇప్పటికే కేటాయించిన నీళ్ల కన్నా తెలంగాణ ప్రభుత్వం 4.34 టీఎంసీలను అధికంగా వినియోగించుకుందని.. తమకు కేటాయించిన నీటి లో ఇంకా 14.46 టీఎంసీలను వినియోగించుకోవా ల్సి ఉందని ఏపీ ప్రభుత్వం బోర్డుకు తెలిపింది. ఆ నీటిని విడుదల చేయడంతో పాటు నాగార్జునసాగర్ కుడి కాలువ కింద పంటలను కాపాడుకోవడానికి 12, ఎడమ కాలువ కింద పంటలను కాపాడుకోవ డానికి, తాగు నీటి అవసరాలకు 4 టీఎంసీలు కేటా యించాలని ఈనెల 3న ఏపీ ఈఎన్సీ ఎం.వెంకటే శ్వరరావు బోర్డుకు లేఖ రాశారు. కేటాయించిన నీటి కన్నా ఏపీ ప్రభుత్వం 25.341 టీఎంసీలు అధికంగా వినియోగించుకుందని.. తమకు కేటాయించి విని యోగించు కుని నీటిని విడుదల చేయడంతోపాటూ అదనంగా 25 టీఎంసీలు కేటాయించాలని ఈనెల 1న తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ బోర్డుకు లేఖ రాశారు. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలపై కసరత్తు చేసిన బోర్డు.. నీటి కేటాయింపులపై ఏకాభిప్రాయం సాధించడానికి సంప్రదింపులు జరిపింది. -
ఎగువ రాష్ట్రాలకు అదనపు కేటాయింపులు వద్దు
ప్రభుత్వానికి రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ హనుమంతరావు సూచన ఈ అంశంపైనే మన వాదనలు ఉండాలి కర్ణాటక, మహారాష్ట్ర 254 టీఎంసీలు వాడితే కిందకు చుక్కనీరు రాదు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో అదనపు నీటి కేటాయింపులు చేయాలని కోరడం కంటే.. ఎగువ రాష్ట్రాలకు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చేసిన అదనపు కేటాయింపులను రద్దు చేయాలన్నదే ప్రధానాం శంగా తెలంగాణ, ఏపీ పోరాడాలని సాగునీటి రంగ నిపుణుడు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు సూచించారు. తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు పెంచినా ఎగువ నుంచి నీరు రాకుంటే చేసేదేమీ ఉండదన్నారు. కృష్ణా జలాల వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితమంటూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పిచ్చిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘బ్రిజేశ్ ట్రిబ్యునల్.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అదనంగా 65 శాతం డిపెండబులిటీ ఆధారంగా కర్ణాటక, మహా రాష్ట్రలకు 254 టీఎంసీల అదనపు జలాలు కేటాయించింది. నీరంతా ఎగువ రాష్ట్రాల నుంచే వస్తుంది కాబట్టి వారికి కేటాయించినవన్నీ నికర జలాలే అవుతాయి. ఈ నీటిని సైతం ఎగువ రాష్ట్రాలు మొదలెడితే కిందికి చుక్క రాదు. ఉమ్మడి ఏపీకి సైతం అదనంగా 190 టీఎంసీల అదనపు జలాలిచ్చినా పై నుంచి రాకుంటే ఆ జలాలన్నీ కాగితాలకే పరిమితమవుతాయి’’ అన్నారు. నిజానికి ఎగువ రాష్ట్రాల నుంచి దిగువకు 447 టీఎం సీల నీరు రావాలి. ప్రస్తుతం మంచి వర్షాలు కురిసినా 250 టీఎంసీలకు మించి రాలేద న్నారు. బ్రిజేశ్ తీర్పు అమల్లోకి వచ్చి ఎగువ రాష్ట్రాలు 254 టీఎంసీల వాడకం మొదలు పెడితే చుక్క నీరు కిందకు రాదన్నారు. -
నీటి కేటాయింపులు మళ్లీ జరపాలి
* కృష్ణా జలాల పంపిణీ నాలుగు రాష్ట్రాల సమస్య * బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలు * తదుపరి విచారణ మే 9, 10, 11కు వాయిదా సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం... కృష్ణా జలాల పంపిణీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం కాదని, నది పరీవాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల ప్రాజెక్ట్‌లకు జలాలను మళ్లీ పంచాలని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదిఏకే గంగూలీ వాదించారు. కృష్ణా జలాల పంపిణీపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు గురువారం కృష్ణా నది పరీవాహక రాష్ట్రాల వాదనలు కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలో కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్ట్‌లకు కొత్తగా నీటి కేటాయింపులు జరగాలని ఏకే గంగూలీ వాదించారు. కృష్ణా నది 4 రాష్ట్రాల్లో ప్రవహిస్తోందని, అందువల్ల ఇది 4 రాష్ట్రాల సమస్య అని వెల్లడించారు. అసంపూర్తిగా ముగిసిన వాదనలు: గతంలో పంజాబ్ విభజన సమయంలో రావి, బియాస్ నదుల జలాల పంపకానికి ట్రిబ్యునల్ ఏర్పాటును విభజన చట్టంలోనే పొందుపర్చారని గంగూలీ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించే సమయానికి కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ పని చేస్తోందని, అందువల్ల ట్రిబ్యునల్ అంశాన్ని చట్టంలో ప్రస్తావించలేదన్నారు. ట్రిబ్యునల్ ముందు గంగూలీ వాదన గురువారం అసంపూర్తిగా ముగిసింది. తదుపరి విచారణను మే 9, 10, 11 తేదీల్లో చేపడతామని ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేష్ కుమార్ ప్రకటించారు. అంతకు ముందు మహారాష్ట్ర తరఫు న్యాయవాది అంధ్యార్జున వాదనలు వినిపించారు. -
బచావత్ కేటాయింపులు ఉమ్మడి ఏపీకే..
సాక్షి, హైదరాబాద్: బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నీటి కేటాయింపులు చేసిందే తప్ప.. తెలంగాణకు చేయలేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి జరిగిన చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను ప్రస్తావించారు. ఉమ్మడి ఏపీలో కృష్ణా వాటా 811 టీఎంసీలకుగాను.. 211 టీఎంసీలు, గోదావరిలో 1,480 టీఎంసీలకు గాను 700 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారని చిన్నారెడ్డి వెల్లడించారు. ఈ దశలో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుంటూ.. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నుంచి 368 టీఎంసీలు, గోదావరి నుంచి 950 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారన్నారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులకు సంబంధించిన వివరాలు తన వద్ద వున్నాయని, సభ నుంచి తప్పుడు వివరాలు వెళ్లకూడదనే ఉద్దేశంతో, సవరణ కోసం జోక్యం చేసుకుంటున్నానని సీఎం వ్యాఖ్యానించారు. ఆ తర్వాత చిన్నారెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. నికర జలాల ఆధారంగానే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని కోరారు. -
ట్యాంకర్ల కేటాయింపులో గోల్మాల్!
గిరాకీ ఉన్న ఫిల్లింగ్ కేంద్రాల కోసం పక్కదారులు... భారీగా ముడుపులు చెల్లిస్తున్న వైనం కొందరికే ‘గిరాకీ కేంద్రాల’ కేటాయింపు చోద్యం చూస్తున్న జలమండలి అధికారులు సిటీబ్యూరో: జలమండలి ట్యాంకర్లకు నీటి ఫిల్లింగ్ కేంద్రాల కేటాయింపు వ్యవహారంలో అవినీతి చోటుచేసుకుంటోంది. చేతులు తడిపిన వారికే గిరాకీ అధికంగా ఉన్న ఫిల్లింగ్ కేంద్రాలను కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహా నగరం పరిధిలో జలమండలికి ఉన్న 53 ఫిల్లింగ్ కేంద్రాల వద్ద సుమారు 900 ట్యాంకర్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మంచినీటి కొరత ఉన్న కాలనీలు, బస్తీల్లో ఉన్న గృహ వినియోగదారులు, వాణిజ్య సముదాయాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఆయా ఫిల్లింగ్ కేంద్రాల వద్ద నీటిని సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన ట్యాంకర్ యజమానులకు కొందరు అధికారులు చుక్కలు చూపుతున్నారు. తమను ప్రసన్నం చేసుకున్నవారికే అధికంగా గిరాకీ(ట్యాంకర్ బుకింగ్‌లు)ఉన్న ఫిల్లింగ్ కేంద్రాలను కేటాయిస్తున్నట్లు పలువురు యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కూకట్పల్లి, మాదాపూర్, భరత్‌నగర్, మియాపూర్, ఎన్టీఆర్నగర్, వైశాలీనగర్ తదితర ఫిల్లింగ్కేంద్రాల వద్ద తిష్టవేసేందుకు కొందరు ట్యాంకర్ యజమానులు ట్యాంకరుకు రూ.25 వేల చొప్పున అధికారులకు ఆమ్యామ్యాలు ఇస్తూ ప్రసన్నం చేసుకుంటున్నారని తెలిసింది. దీంతో వారికే తొలిప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది.ఇటీవల ఆన్లైన్ ద్వారా ట్యాంకర్లకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఫిల్లింగ్ కేంద్రాల కేటాయింపుల్లో మాత్రం పారదర్శకంగా వ్యవహరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదీ అక్రమాల జాతర... అధిక గిరాకీ ఉన్న ఫిల్లింగ్ కేంద్రాల వద్ద తిష్టవేసేందుకు కొందరు ట్యాంకర్ యజమానులు ఉన్నతాధికారుల చేతులు తడుపుతున్నారు. డిమాండ్ అధికంగా ఉండే ఫిల్లింగ్ కేంద్రం వద్ద ఒక్కో ట్యాంకరుకు రోజుకు సగటున 8 నుంచి 10 ట్రిప్పుల గిరాకీ ఉంటుంది. మరోవైపు బహుళ అంతస్తుల భవంతులు, మాల్స్, ఆస్పత్రులు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, మెస్‌లు,సినిమా, ఫంక్షన్‌హాళ్లకు అదనంగా నీటిని సరఫరా చేసి అందినకాడికి దండుకునే వెసులుబాటు ఉంటుంది. అంతగా గిరాకీ లేని ఫిల్లింగ్ కేంద్రం వద్ద గరిష్టంగా ఐదు ట్రిప్పులు మాత్రమే దక్కుతాయి. దీంతో ట్యాంకర్ యజమానులు గిరాకీ అధికంగా ఉండే ఫిల్లింగ్ కేంద్రం వద్దే తిష్ట వేసేందుకు ముందుకొస్తారు. ఇదే అదనుగా సదరు యజమానుల నుంచి కొందరు అధికారులు లంచం తీసుకుని సదరు ఫిల్లింగ్ కేంద్రాన్ని కేటాయిస్తున్నట్లు తెలిసింది. ఇక అధికారుల కనుసన్నల్లో మెలిగే ట్యాంకర్ యజమానులు గృహవినియోగానికి సరఫరా చేసే ట్యాంకరు(ఐదువేల లీటర్ల సామర్థ్యం)ను వాణిజ్య అవసరాలకు తరలించి అదనంగా దండుకుంటున్నా అధికారులు చోద్యం చూస్తుండడం గమనార్హం. సాధారణంగా గృహవినియోగానికి ఐదువేల లీటర్ల నీటిని తరలించే ట్యాంకర్‌కు రూ.400, వాణిజ్య అవసరాలకు సరఫరా చేస్తే ప్రతి ట్రిప్పుకు రూ.700 వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ గృహవినియోగ ట్యాంకర్‌ను వాణిజ్య అవసరాలకు తరలిస్తే ఒక్కో ట్రిప్పుపై రూ.500 వరకు యజమానికి గిట్టుబాటవుతుంది. ఇలా సగటున ఐదు ట్రిప్పులను పక్కదారి పట్టిస్తే నిత్యం ఒక్కో ట్యాంకరుకు రూ.2500 అదనంగా దండుకునే అవకాశం ఉంటుంది. మా దృష్టికి రాలేదు జలమండలి పరిధిలో ఉన్న ఫిల్లింగ్ కేంద్రాల వద్ద ఎన్ని ట్యాంకర్లు అవసరమో స్థానిక జనరల్ మేనేజర్లు నిర్ణయిస్తారు. కానీ ట్యాంకర్లకు ఫిల్లింగ్ కేంద్రాలను కేటాయించే ప్రక్రియ ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచే జరుగుతుంది. గిరాకీ లేనందునే కొన్ని ఫిల్లింగ్ కేంద్రాల వద్ద అదనపు ట్యాంకర్లను అనుమతించడంలేదు. ఈవిషయంలో పారదర్శకంగానే వ్యవహరిస్తున్నాం. అక్రమాలు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. ట్యాంకర్ల సంఖ్య అధికంగా ఉండడంతో ప్రస్తుతానికి నూతనంగా ఎవరికీ అవకాశం ఇవ్వడంలేదు. ఆన్లైన్లో స్వీకరించిన పలు దరఖాస్తులు మావద్ద పెండింగ్‌లో ఉన్నాయి. - పీఎస్.సూర్యనారాయణ, జలమండలి రెవెన్యూ విభాగం డెరైక్టర్ -
నీటి కష్టాలకు చెక్!
ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాలకు నీటి కేటాయింపు ఖరారు సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఔటర్ రింగురోడ్డు సమీప ప్రాంతవాసులకు శుభవార్త. ఎన్నాళ్లుగానో తాగునీటి ఎద్దడితో సతమతమవుతున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వరం ప్రకటించింది. ప్రతి కుటుంబానికి కనీస నీటి కేటాయింపును ఖరారు చేసింది. దీంతో ఔటర్ రింగురోడ్డు లోపల, బయట ఉన్న 80 గ్రామాలు, 164 హాబిటేషన్లలోని ప్రజలకు త్వరలో శుద్ధమైన తాగునీరు పక్కాగా అందనుంది. కేటాయింపులు ఇలా.. ప్రస్తుతం కృష్ణా పైపులైన్ ఉన్న గ్రామాల్లో శుద్ధ నీటిని అందిస్తున్నారు. కానీ కుటుంబానికి ప్రత్యేకించి కోటా అనేది లేకుండా ఇష్టానుసారంగా నీటిని కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబాల సంఖ్యకు.. నీటి సరఫరా కోటాకు పొంతన లేకుండాపోతోంది. దీంతో ప్రజల దాహార్తి తీరడం లేదు. ఈ క్రమంలో నీటి కోటా పెంచాలంటూ జిల్లా యంత్రాంగం పలుమార్లు ప్రభుత్వానికి నివేదించింది. దీంతో ప్రభుత్వం 80 గ్రామ పంచాయతీలు, 164 హాబిటేషన్లకు నీటి కేటాయింపు విధానంపై స్పష్టత ఇచ్చింది. గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక్కో కుటుంబానికి రోజుకు వంద లీటర్లు, మున్సిపాలీటీల్లోని ఒక్కో కుటుంబానికి 135 లీటర్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక్కో కుటుంబానికి 150 లీటర్ల చొప్పున కేటాయించింది. ఈమేరకు గురువారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ గ్రామాల్లోని 7.32లక్షల మందికి నిర్దేశించిన కోటాలో తాగునీరు అందించాల్సి ఉంది. లబ్ధిపొందే గ్రామాలు: 80 నివాస ప్రాంతాలు : 164 గ్రామాల్లో కుటుంబానికి రోజుకు: 100 లీటర్లు మున్సిపాలిటీల్లో: 135 లీటర్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో: 150 లీటర్లు -
కర్షకుల కలవరం !
మాచర్ల టౌన్ : నాగార్జున సాగర్ నీటి కేటాయింపులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఏర్పడిన వివాదానికి తాత్కాలికంగా తెరపడినప్పటికీ, పూర్తి స్థాయి నీటి విడు దలపై స్పష్టత లేకపోవడంతో రైతుల్లో కలవరం ప్రారంభమైంది. ఖరీఫ్ పంట పూర్తయ్యే వరకు సాగునీరు విడుదల అవుతుందా? రాబోయే రబీకి నీటిని విడుదల చేస్తారా అనే అనుమానాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ప్రాంతం లో మరో నెల రోజుల వరకు ఖరీఫ్ సీజన్ ఉంటుందనీ, అప్పటి వరకు నీటి విడుదల కొనసాగకపోతే పంటలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. రైతుల ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్‌లో 540 అడుగులు, శ్రీశైలం రిజర్వాయర్‌లో 843 అడుగుల నీటిమట్టం ఉంది. రెండు రిజర్వాయర్లలో నీటిమట్టం రోజు రోజుకుతగ్గుతోంది. ప్రతిరోజూ 20,500 క్యూసెక్కుల నీటిని వినియోగించటం జరుగుతుంది. శ్రీశైలం నుంచి కూడా జల విద్యుత్ ఉత్పాదన చేసిన అనంతరం 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి విడుదలవుతున్న నీరు ఇదే విధంగా కొనసాగితే నెలన్నర రోజుల్లో రెండు రిజర్వాయర్లు డెడ్‌స్టోరేజీకి చేరుకునే పరిస్థితి ఉంది. దీని కారణంగా రబీలో ఇతర పంటల సాగుకు రైతులు ఆలోచనలు చేస్తున్నారు. సాగర్ నీటిమట్టం వివరాలు ... నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం ఆదివారం 540.20 అడుగుల వద్ద ఉంది. ఇది 188.74400 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 9,339, ఎడమ కాలువకు 10,066, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 370 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 20,480 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శ్రీశైలం జ లాశయం నుంచి సాగర్ జలాశయానికి 5,966 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 843.70 అడుగులు వద్ద ఉంది. ఇది 67.8401టీఎంసీలకు సమానం. నీళ్లివ్వకపోతే కన్నీళ్లే... సాగర్ కుడికాలువకు నీటి విడుదలలో సమస్యలు ఎదుర్కొంటున్నాం. తెలంగాణ అధికారులు మా ప్రాంతానికి సక్రమంగా నీటిని విడుదల చేయ డం లేదు. ఈ మధ్య గోల జరిగింది. సాగర్‌లో నీళ్లు అయిపోయినట్లు చెప్పుకుంటున్నారు. మా పంటలు పూర్తిగా పండకపోతే కష్టపడిన మాకు కన్నీళ్లే మిగులుతాయి. - కొండ, వరి రైతు,కొత్తూరు గ్రామం -
వాటర్ ‘గ్రిడ్’గండం!
పరిగి: కొత్త ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ‘వాటర్‌గ్రిడ్’ ప్రతిపాదన కారణంగా పరిగి నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చేందుకు ఉద్దేశించిన నీటి తరలింపు పథకానికి అడ్డంకులు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా పరిగి నియోజకవర్గ ప్రజలకు తాగునీరందించేందుకు గత ప్రభుత్వ హయాంలో నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు 0.5 టీఎంసీల నీటి కేటాయింపు కూడా జరిగిపోయింది. రూ. 50 లక్షలు మంజూరు చేసి సర్వే చేయించారు. రూ. 150 కోట్ల అంచనాలతో టెండర్లకు రంగం సిద్ధం చేసిన సమయంలో ఎన్నికలు రావటంతో.. ప్రాసెస్ నిలిచిపోయింది. ఇప్పుడు తాజాగా జిల్లాలో వాటర్ గ్రిడ్ అమలు చేస్తే... కోయిల్‌సాగర్ కథ కంచికి చేరినట్లేనని అంటున్నారు. గ్రిడ్ ద్వారా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు తాగు నీరందుతుంది కాబట్టి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అటు స్థానిక ప్రజల్లోనూ ఇటు ప్రజాప్రతినిధుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు పథకం ప్రారంభించి పూర్తి చేస్తే 18నెలల్లో పరిగికి తాగునీరు అందుతుంది. కానీ గ్రిడ్ అమలు కావాలంటే కొన్నేళ్లు పడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కోయిల్ సాగర్‌ను గ్రిడ్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. పథకానికి రూపకల్పన ఇలా... పరిగి నియోజకవర్గంలో గత దశాబ్ద కాలంగా వేసవి వచ్చిందంటే తీవ్ర నీటిఎద్దడి ఏర్పడుతూ వస్తోంది. ఇదే క్రమంలో 20కి పైగా గ్రామాల్లో ఫ్లోరైడ్ సమస్య కూడా ఉందని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి గత ఐదారు సంవత్సరాలుగా కోయిల్‌సాగర్ నుంచి నీళ్లందించేందుకు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రులకు , మంత్రులకు వినతి పత్రాలు ఇస్తూ వచ్చారు. దీంతో ప్రభుత్వం కోయిల్‌సాగర్ నుంచి నీరందించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించింది. రంగంలోకి దిగిన అధికారులు నియోజకవర్గ పరిధిలోగల 442 ఆవాసాలకు నీరందించాలంటే 0.5 టీఎంసీల నీరు అవసరమని తేల్చారు. ఇందుకోసం రూ. 300 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. మొదటి విడతగా 243 ఆవాసాలకు నీరందించేందుకు నిర్ణయించి రూ. 150 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు తయారు చేశారు. రూ.50 లక్షలు మంజూరు చేయటంతో సర్వే పనులు పూర్తిచేసి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేశారు. ఈదశలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పనులకు బ్రేక్‌పడింది. వాటర్‌గ్రిడ్‌పై కసరత్తుతో... పరిగికి కోయిల్‌సాగర్ నీరందించేపథకానికి త్వరలో టెండర్లు పిలుస్తారని, పనులు ప్రారంభమవుతాయని పరిగి ప్రజలు కలలుగంటున్న తరుణంలో ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌ను తెరపైకి తెచ్చింది. జిల్లా యూనిట్‌గా తీసుకుని వాటర్‌గ్రిడ్‌కు ప్రతిపాదనలు తయారు చేసే పనిలో నిమగ్నమైన అధికారులు జిల్లాలో ఉన్న సుమారు 50 లక్షల మందికి 10 టీఎంసీల నీళ్లు అవసరమవుతాయని అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఇందుకోసం మంజీరా, నాగార్జునసాగర్, జూరాల, సింగూర్ ప్రాజెక్టుల్లో ఎక్కడి నుంచి నీళ్లు తేవటం సులువవుతుందనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీంతో పరిగి నియోజకవర్గానికి కోయిల్ సాగర్ నీరందించే పథకం కథ కంచికి చేరినట్లైంది. -
ఉక్కు ఆశలపై నీళ్లు
ఏలేరు నీటి సరఫరాలో కోత గోదావరి జిల్లాలో సాగునీటికి కేటాయింపు గోదావరి పంపింగుకూ ఆటంకాలు రెండు పైపులుమొరాయింపు కర్మాగారానికి మరిన్ని నీటి కష్టాలు ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నీటి కష్టాలు తీరేలా లేవు. మొన్నటివరకు ఇచ్చే నీటి కేటాయింపు కూడా తగ్గిపోయింది. స్టీల్‌ప్లాంట్, ఫార్మాసిటీ, జీవీఎంసీ తా గునీటి అవసరాల కోసం ఏలేరు కాలువ నీటిని సరఫరా చేస్తున్నారు. నగరానికి నీటి ఎద్దడి పెరగడంతో రెండు నెలలుగాస్టీల్ప్లాంట్కు నీటి సరఫరాను 300 నుంచి 200 క్యూసెక్లకు తగ్గించేశారు. దీంతో ఉక్కు యాజమాన్యం గతనెలలో రాష్ట్ర ప్రభు త్వ ప్రధానకార్యదర్శి కృష్ణారావుకు పరిస్థితి నివేదించింది. దీంతో ఆయన విస్కోతో సమావేశమై స్టీల్‌ప్లాంట్‌కు నీటిసరఫరా పెంచాలని ఆదేశించారు. నీటి సరఫరా పరుగుతాదని ఆశించిన ఉక్కు యాజమాన్యానికి తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చుక్కెదురయింది. ఈనెల మొదటివారంలో తూర్పుగోదావరి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఏలేశ్వరం నీటిని మళ్లిస్తే 25వేల ఎకరాలకు పంట లభిస్తుందని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌కు అత్యవసర నీటిసరఫరా కింద ఉన్న గోదావరి పంపింగ్ పనులు ద్వారా నీటిసరఫరా చేస్తే వారి అవసరాలు తీరుతాయని ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడికి లొంగిన ప్రభుత్వం వెంటనే ధవళేశ్వరం ఏస్ఈకు ఏలేశ్వరం నుంచి నీటిసరఫరా తగ్గించాలని ఆదేశించినట్టు సమాచారం. ఈనెల 4వరకు 200 క్యూసెక్కులు సరఫరా జరగగా ఈ ఆదేశాలతో 5 నుంచి 100క్యూసెక్కులకు, 8 నుంచి 50 క్యూసెక్లకు సరఫరా తగ్గించేశారు. గతంలో విస్కో ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయంగా గోదావరి పంపింగ్ నిమిత్తం ఏర్పాటుచేసిన మొత్తం ఐదు పంపుల్లో రెండు పంపులు మరమ్మతులకు గురయ్యాయి. ఏకకాలంలో మూడు పంపులు ఉపయోగించి గరిష్టంగా రోజుకు 150 క్యూసెక్కులు మాత్రమే పం పింగ్ చేయగలుతున్నారు. ఈనెల 8నుంచి ఏలేశ్వరం, గోదావరి పంపింగ్ ద్వారా 200క్యూసెక్ల నీరు సరఫరా జరగడం గగనంగా మారింది. ఈ పరిస్థితిలో ఏ ఒక్క పంపు రిపేర్‌కు వచ్చినా నీటిసరఫరా మరింత తగ్గే ప్రమాదం ఉందని ఉక్కు యాజమాన్యం ఆందోళన చెందుతోంది. ఈ అంశంపై ఉక్కు డెరైక్టర్ (ఆపరేషన్స్) డి.ఎన్.రావు సోమవారం జీవీఎంసీ కమిషనర్‌కు లేఖ ద్వారా నీటిసరఫరా పెంచాలని కోరారు. -
రైతన్నల వర్రీ
అనంతపురం టౌన్ : వర్షాభావ పరిస్థితులు, నీటి కేటాయింపుల్లో కోత నేపథ్యంలో తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఆయకట్టు కింద వరి సాగును తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను సమాయత్తం చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే..చాలామంది రైతులు మాత్రం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. హెచ్చెల్సీ కింద 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. జిల్లాలో ప్రతియేటా లక్ష ఎకరాల వరకు సాగునీరు అందించేవారు. కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల ఆయకట్టును భారీగా కుదిస్తున్నారు. ఈ ఏడాది ఆరు వేల హెక్టార్లలో వరి, 74 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగు నీరు అందించాలని నిర్ణయించారు. రెండు, మూడేళ్ల నుంచి హైలెవల్ మెయిన్ కెనాల్ (హెచ్‌ఎల్‌ఎంసీ), గుంతకల్లు బ్రాంచి కెనాల్ (జీబీసీ), పీఏబీఆర్ సౌత్ కెనాల్, నార్త్ కెనాల్, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్(టీబీసీ), మైలవరం బ్రాంచ్ కెనాల్, పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) కింద 60-80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ ఏడాది మాత్రం నీటి కేటాయింపులు ఆశాజనకంగా ఉండవంటూ వరిని పూర్తిగా తగ్గించాలని నిర్ణయించారు. ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న, కూరగాయలు, పొద్దుతిరుగుడు, వేరుశనగ లాంటి పంటలను సిఫారసు చేస్తున్నారు. రైతులు మాత్రం హెచ్చెల్సీ ఆయకట్టులో ఎక్కువ శాతం భూములు వరి మినహా వేరే పంటలకు పనికిరావని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా హెచ్‌ఎల్‌ఎంసీ కింద 20 నుంచి 25 వేల ఎకరాలలో వరి మాత్రమే వేస్తారు. అనధికారికంగా మరో 5 -8 వేల ఎకరాల వరకూ సాగు చే స్తారు. దీంతో పాటు హెచ్ఎల్సీ సౌత్, నార్త్ కెనాల్ కింద మెజార్టీ రైతులు వరినే నమ్ముకుంటున్నారు. దీంతో అధికారులు నిర్ణయించిన విస్తీర్ణానికి మించి సాగులోకి వచ్చే అవకాశముంది. గతేడాది కంటే విపత్కర పరిస్థితులు జిల్లాకు సాగు, తాగునీటి విషయానికొస్తే గతేడాది కంటే ఈసారి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతేడాది హెచ్చెల్సీకి తొలుత 22 టీఎంసీలు కేటాయించినా దామాషా ప్రకారం చివరకు 19 టీఎంసీలు వచ్చాయి. దీంతో పాటు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విడుదల చేసిన జీవో ప్రకారం కేసీ కెనాల్ వాటా 10 టీఎంసీలలో రివర్ష్ డైవర్షన్ పద్ధతిపై దామాషా ప్రకారం నాలుగు టీఎంసీలను పీఏబీఆర్‌కు ఇచ్చారు. రాష్ట్ర విభజనతో పీఏబీఆర్‌కు నీరు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ద్వారా గతేడాది ఆరు టీఎంసీలు వచ్చాయి. 1.95 టీఎంసీల సామర్థ్యమున్న జీడిపల్లి జలాశయాన్ని పూర్తిగా నింపడంతో పాటు రెండు నెలల పాటు నిరంతరాయంగా జలాశయం మరువ ద్వారా పీఏబీఆర్‌లోకి నీరు వచ్చాయి. గతేడాది పంటలకు ఇవ్వడంతో పాటు పీఏబీఆర్ కుడికాలువ కింద ఉన్న 49 చెరువుల్లోకి నీటిని తీసుకుపోయారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు తాగునీటి అవసరాలకు పీఏబీఆర్తో పాటు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో సమృద్ధిగా నిల్వ చేశారు. ఆ పరిస్థితి ఈ ఏడాది ఉండదని అధికారులు అంటున్నారు. మిగులు జలాలపై ఆధారపడిన హంద్రీ-నీవా ప్రాజెక్టుకు ఈ సారి నీటి విడుదల పూర్తిగా అనుమానమేనని స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ నిర్ణయంతో గతేడాది శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకున్నారు. విభజన కారణంగా ఈ ఏడాది నుంచి కృష్ణా బోర్డు ఆంగీకారంతోనే హెచ్ఎన్ఎస్ఎస్కు నీటి కేటాయింపులు ఉంటాయని వివరిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, రాష్ట్ర విభజన నేపథ్యంలో హెచ్చెల్సీ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌లకు నీటి కేటాయింపులు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని రైతులు వరి సాగు చేయకపోవడమే మంచిదని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరుతడి పంటలే మేలు హెచ్చెల్సీ కింద ఈ ఏడాది రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవడమే చాలా మేలు. గతేడాదితో పోలిస్తే వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ఒక్క వర్షం కూడా రాలేదు. హెచ్చెల్సీకి దామాషా ప్రకారం 22 టీఎంసీల నీటిని కేటాయించారు. చివర్లో వర్షాలు రాకపోతే కేటాయింపులు తగ్గుతాయి. కావున రైతులు వరి సాగు చేస్తే తీవ్రంగా నష్టపోతారు. - వాణినాథ్రెడ్డి, ఎస్ఈ, హెచ్చెల్సీ -
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారమే నీటి కేటాయింపులు
విజయవాడ : బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం నీటి కేటాయింపులు జరపాల్సిందేనని రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ చెప్పారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణాడెల్టాలో నారు మడులకు నీటిని విడుదల చేయాల్సిందేనన్నారు. 155 ఏళ్ల ఆయకట్టుకు నీటిని విడుదల చేయవద్దనే హక్కు ఎవరికీ లేదన్నారు. కృష్ణాడెల్టాకు నీరు విడుదల చేయొద్దని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. రాష్ట్ర విభజన జరిగితే జల యుద్ధాలు జరుగుతాయని తాము ముందే హెచ్చరించామన్నారు. తాము చెప్పింది నిజమేనని, తాగునీటి విడుదలలోనూ తెలంగాణ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు నీటిని కేటాయించేందుకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. తెలంగాణ రాష్ర్ట వాటాలోనే హైదరాబాద్‌కు నీటిని కేటాయించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేటాయింపులకు మించి నీటిని వాడుకుంటూనే ఎదురుదాడికి దిగుతోందన్నారు. డెల్టాలో తాగునీటి అవసరాలకు 3.5 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారని, దానిలో 2.4 టీఎంసీలే దిగువకు చేరతాయన్నారు. తూర్పు కాలువకు ప్రస్తుతం విడుదల చేస్తున్న 500 క్యూసెక్కుల నీరు ఏమూలకు చాలదన్నారు. రివర్‌బోర్డు సమావేశంలో మన వాదనలు సమర్థంగా వినిపించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయానికి రావాలన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలైన ఏడు మండలాల్లో పర్యటించి నిర్వాసితుల బాధలు, ఇబ్బందులు తెలుసుకుని వారి పునరావాసానికి, ఉపాధికి ప్రాధాన్యత కల్పించేటట్లు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నారు. నీటి విడుదలలో రాజకీయాలకు తావివ్వకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేయాలన్నారు. పీసీసీ కార్యదర్శి కొలనుకొండ శివాజీ, కిసాన్‌సంఘ్ నాయకుడు కుమారస్వామి పాల్గొన్నారు,