కర్షకుల కలవరం !
మాచర్ల టౌన్ : నాగార్జున సాగర్ నీటి కేటాయింపులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ఏర్పడిన వివాదానికి తాత్కాలికంగా తెరపడినప్పటికీ, పూర్తి స్థాయి నీటి విడు దలపై స్పష్టత లేకపోవడంతో రైతుల్లో కలవరం ప్రారంభమైంది. ఖరీఫ్ పంట పూర్తయ్యే వరకు సాగునీరు విడుదల అవుతుందా? రాబోయే రబీకి నీటిని విడుదల చేస్తారా అనే అనుమానాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ప్రాంతం లో మరో నెల రోజుల వరకు ఖరీఫ్ సీజన్ ఉంటుందనీ, అప్పటి వరకు నీటి విడుదల కొనసాగకపోతే పంటలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు.
రైతుల ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్‌లో 540 అడుగులు, శ్రీశైలం రిజర్వాయర్‌లో 843 అడుగుల నీటిమట్టం ఉంది. రెండు రిజర్వాయర్లలో నీటిమట్టం రోజు రోజుకుతగ్గుతోంది. ప్రతిరోజూ 20,500 క్యూసెక్కుల నీటిని వినియోగించటం జరుగుతుంది. శ్రీశైలం నుంచి కూడా జల విద్యుత్ ఉత్పాదన చేసిన అనంతరం 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి విడుదలవుతున్న నీరు ఇదే విధంగా కొనసాగితే నెలన్నర రోజుల్లో రెండు రిజర్వాయర్లు డెడ్‌స్టోరేజీకి చేరుకునే పరిస్థితి ఉంది. దీని కారణంగా రబీలో ఇతర పంటల సాగుకు రైతులు ఆలోచనలు చేస్తున్నారు.
సాగర్ నీటిమట్టం వివరాలు ...
నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం ఆదివారం 540.20 అడుగుల వద్ద ఉంది. ఇది 188.74400 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 9,339, ఎడమ కాలువకు 10,066, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 370 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 20,480 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శ్రీశైలం జ లాశయం నుంచి సాగర్ జలాశయానికి 5,966 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 843.70 అడుగులు వద్ద ఉంది. ఇది 67.8401టీఎంసీలకు సమానం.
నీళ్లివ్వకపోతే కన్నీళ్లే...
సాగర్ కుడికాలువకు నీటి విడుదలలో సమస్యలు ఎదుర్కొంటున్నాం. తెలంగాణ అధికారులు మా ప్రాంతానికి సక్రమంగా నీటిని విడుదల చేయ డం లేదు. ఈ మధ్య గోల జరిగింది. సాగర్‌లో నీళ్లు అయిపోయినట్లు చెప్పుకుంటున్నారు. మా పంటలు పూర్తిగా పండకపోతే కష్టపడిన మాకు కన్నీళ్లే మిగులుతాయి.
- కొండ, వరి రైతు,కొత్తూరు గ్రామం