ఉక్కు ఆశలపై నీళ్లు
ఏలేరు నీటి సరఫరాలో కోత
గోదావరి జిల్లాలో సాగునీటికి కేటాయింపు
గోదావరి పంపింగుకూ ఆటంకాలు
రెండు పైపులుమొరాయింపు
కర్మాగారానికి మరిన్ని నీటి కష్టాలు
ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నీటి కష్టాలు తీరేలా లేవు. మొన్నటివరకు ఇచ్చే నీటి కేటాయింపు కూడా తగ్గిపోయింది. స్టీల్‌ప్లాంట్, ఫార్మాసిటీ, జీవీఎంసీ తా గునీటి అవసరాల కోసం ఏలేరు కాలువ నీటిని సరఫరా చేస్తున్నారు. నగరానికి నీటి ఎద్దడి పెరగడంతో రెండు నెలలుగాస్టీల్‌ప్లాంట్‌కు నీటి సరఫరాను 300 నుంచి 200 క్యూసెక్‌లకు తగ్గించేశారు. దీంతో ఉక్కు యాజమాన్యం గతనెలలో రాష్ట్ర ప్రభు త్వ ప్రధానకార్యదర్శి కృష్ణారావుకు పరిస్థితి నివేదించింది. దీంతో ఆయన విస్కోతో సమావేశమై స్టీల్‌ప్లాంట్‌కు నీటిసరఫరా పెంచాలని ఆదేశించారు. నీటి సరఫరా పరుగుతాదని ఆశించిన ఉక్కు యాజమాన్యానికి తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చుక్కెదురయింది.
ఈనెల మొదటివారంలో తూర్పుగోదావరి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఏలేశ్వరం నీటిని మళ్లిస్తే 25వేల ఎకరాలకు పంట లభిస్తుందని చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌కు అత్యవసర నీటిసరఫరా కింద ఉన్న గోదావరి పంపింగ్ పనులు ద్వారా నీటిసరఫరా చేస్తే వారి అవసరాలు తీరుతాయని ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడికి లొంగిన ప్రభుత్వం వెంటనే ధవళేశ్వరం ఏస్‌ఈకు ఏలేశ్వరం నుంచి నీటిసరఫరా తగ్గించాలని ఆదేశించినట్టు సమాచారం. ఈనెల 4వరకు 200 క్యూసెక్కులు సరఫరా జరగగా ఈ ఆదేశాలతో 5 నుంచి 100క్యూసెక్కులకు, 8 నుంచి 50 క్యూసెక్‌లకు సరఫరా తగ్గించేశారు. గతంలో విస్కో ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయంగా గోదావరి పంపింగ్ నిమిత్తం ఏర్పాటుచేసిన మొత్తం ఐదు పంపుల్లో రెండు పంపులు మరమ్మతులకు గురయ్యాయి.
ఏకకాలంలో మూడు పంపులు ఉపయోగించి గరిష్టంగా రోజుకు 150 క్యూసెక్కులు మాత్రమే పం పింగ్ చేయగలుతున్నారు. ఈనెల 8నుంచి ఏలేశ్వరం, గోదావరి పంపింగ్ ద్వారా 200క్యూసెక్‌ల నీరు సరఫరా జరగడం గగనంగా మారింది. ఈ పరిస్థితిలో ఏ ఒక్క పంపు రిపేర్‌కు వచ్చినా నీటిసరఫరా మరింత తగ్గే ప్రమాదం ఉందని ఉక్కు యాజమాన్యం ఆందోళన చెందుతోంది. ఈ అంశంపై ఉక్కు డెరైక్టర్ (ఆపరేషన్స్) డి.ఎన్.రావు సోమవారం జీవీఎంసీ కమిషనర్‌కు లేఖ ద్వారా నీటిసరఫరా పెంచాలని కోరారు.