వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఫార్మా విలేజీ బాధితుల ఆవేదన
భయానక పరిస్థితుల్లో కాలం గడుపుతున్నామంటున్న మహిళలు
తమ వాళ్లు ఎక్కడున్నారో.. ఎలా ఉన్నారోనని ఆందోళన
పోలీసుల అదుపులో మరో 8 మంది గిరిజనులు.. నలుగురికి రిమాండ్
పరారీలో ఉన్నవారి కోసం కొనసాగుతున్న గాలింపు
లగచర్ల, పులిచర్లకుంట, రోటిబండతండాల్లో ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన
దుద్యాల్/ వికారాబాద్: ‘‘భూములే కావాలంటే.. ముందు మా ప్రాణాలు తీసి, లాక్కొండి. కొన్నాళ్లుగా మా ఆందోళనలను పట్టించుకోకపోవడాన్ని తట్టుకోలేక నిరసన తెలిపాం. ఇప్పుడు మా వాళ్లు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో. కంటి మీద కునుకులేకుండా గడుపుతున్నాం..’’ అని వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఫార్మా విలేజీ బాధిత గిరిజనులు వాపోయారు.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘లగచర్ల’ ఘటన, గిరిజనుల అరెస్టు నేపథ్యంలో శనివారం ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలన జరిపింది. ఈ కేసులో ఇప్పటికే 21 మందిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు తాజాగా మరో 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎక్కడ చూసినా టెన్షన్ టెన్షన్..
ఫార్మా విలేజీ ప్రతిపాదిత గ్రామాలైన లగచర్ల, పులిచర్లకుంటతండా, రోటిబండతండాలలో ఎక్కడ చూసినా ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామాలకు వెళ్లే మార్గాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
గిరిజనులను పరామర్శించేందుకు వెళ్తున్న వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలను అడ్డుకుంటున్నారు. గ్రామాల్లో పోలీసులు మోహరించడంతో మహిళలు, వృద్ధులు భయపడుతున్నారు. వ్యవసాయ పనులకూ వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో నలుగురు రిమాండ్‌కు..
లగచర్ల ఘటనలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. శనివారం పులిచర్లకుంటతండాకు చెందిన రూప్లా నాయక్, లగచర్లకు చెందిన మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కానీ పోలీసులు నలుగురిని శనివారం రాత్రి కొడంగల్ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి.. రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురి విషయంలో స్పష్టత రాలేదు.
కలెక్టర్‌తో ఏడీజీ భేటీ
లగచర్ల ఘటనపై అడిషనల్ డీజీ (ఏడీజీ) మహేశ్ భగవత్ శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో సమావేశమయ్యారు. ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై వారు చర్చించినట్లు తెలిసింది. మరోవైపు పోలీసులు కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు భద్రత పెంచారు. ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా మరో ఇద్దరు ఏఆర్ గన్‌మన్లను అదనంగా కేటాయించారు.
పోలీసుల భయంతో వృద్ధురాలికి గుండెపోటు!
‘లగచర్ల’ ఘటనకు సంబంధించి పోలీసుల భయంతో డాకిడిబాయి అనే వృద్ధురాలు గుండెపోటుకు గురైంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పులిచర్లకుంటతండాకు చెందిన డాకిడిబాయికి గ్రామ పరిధిలో ఆరు ఎకరాల భూమి ఉంది. ఫార్మా విలేజీ భూసేకరణలో ఆ భూమి కూడా పోతోంది. ఆమె కుటుంబం ఈ ఆందోళనతోనే ఉంది.
ఈ నెల 11న లగచర్లలో అధికారులపై దాడి ఘటన అనంతరం.. ఆమె కుమారులు ఇద్దరు పోలీసుల భయంతో ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులు తరచూ ఆమె ఇంటికి వెళ్లి.. కుమారుల జాడ చెప్పాలంటూ ఒత్తిడి చేశారని, శుక్రవారం కూడా వచ్చి గట్టిగా బెదిరించారని స్థానికులు చెప్తున్నారు. ఈ భయాందోళనతో డాకిడిబాయి గుండెపోటుకు గురైందని పేర్కొంటున్నారు.
తిండికి తిప్పలు వచ్చాయి
ఇంట్లో బియ్యం, కారంపొడి తప్ప ఏమీ లేవు. కూరగాయలు అమ్మేందుకు సైతం తండాల్లోకి ఎవరూ రావడం లేదు. తిండికి తిప్పలొచ్చాయి. మాకున్న ఐదెకరాల భూమి ఫార్మా విలేజీలో పోతోంది. భూమి లేకపోతే ఏం చేసి బతకాలి. – సోనిబాయి, రోటిబండతండా
పోలీసులమని బెదిరించి మేకలు ఎత్తుకెళ్లారు
అధికారులపై దాడి చేసిన వారి కోసం తండాలకు పోలీసులు తరచూ వస్తున్నారు. వారిలో కొందరు యూనిఫామ్‌లో ఉంటే.. మరికొందరు మామూలు డ్రెస్‌లలో ఉంటున్నారు. వచ్చినవారు ఎవరో తెలియడం లేదు. కొందరు దొంగలు పోలీసులమని బెదిరించి రెండు మేకలు ఎత్తుకెళ్లారు. తండాల్లో మగవాళ్లు ఎవరూ ఉండటం లేదని ఇలా చేస్తున్నారు. మాకు రక్షణ ఏది? – అంబిక, రోటిబండతండా
Comments
Please login to add a commentAdd a comment