Tribals concern
-
మా ప్రాణాలు తీసి.. భూములు లాక్కోండి
దుద్యాల్/ వికారాబాద్: ‘‘భూములే కావాలంటే.. ముందు మా ప్రాణాలు తీసి, లాక్కొండి. కొన్నాళ్లుగా మా ఆందోళనలను పట్టించుకోకపోవడాన్ని తట్టుకోలేక నిరసన తెలిపాం. ఇప్పుడు మా వాళ్లు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో. కంటి మీద కునుకులేకుండా గడుపుతున్నాం..’’ అని వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఫార్మా విలేజీ బాధిత గిరిజనులు వాపోయారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘లగచర్ల’ ఘటన, గిరిజనుల అరెస్టు నేపథ్యంలో శనివారం ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలన జరిపింది. ఈ కేసులో ఇప్పటికే 21 మందిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు తాజాగా మరో 18 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ చూసినా టెన్షన్ టెన్షన్.. ఫార్మా విలేజీ ప్రతిపాదిత గ్రామాలైన లగచర్ల, పులిచర్లకుంటతండా, రోటిబండతండాలలో ఎక్కడ చూసినా ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామాలకు వెళ్లే మార్గాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గిరిజనులను పరామర్శించేందుకు వెళ్తున్న వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలను అడ్డుకుంటున్నారు. గ్రామాల్లో పోలీసులు మోహరించడంతో మహిళలు, వృద్ధులు భయపడుతున్నారు. వ్యవసాయ పనులకూ వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నలుగురు రిమాండ్‌కు.. లగచర్ల ఘటనలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. శనివారం పులిచర్లకుంటతండాకు చెందిన రూప్లా నాయక్, లగచర్లకు చెందిన మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కానీ పోలీసులు నలుగురిని శనివారం రాత్రి కొడంగల్ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి.. రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురి విషయంలో స్పష్టత రాలేదు. కలెక్టర్‌తో ఏడీజీ భేటీ లగచర్ల ఘటనపై అడిషనల్ డీజీ (ఏడీజీ) మహేశ్ భగవత్ శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో సమావేశమయ్యారు. ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై వారు చర్చించినట్లు తెలిసింది. మరోవైపు పోలీసులు కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు భద్రత పెంచారు. ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా మరో ఇద్దరు ఏఆర్ గన్మన్లను అదనంగా కేటాయించారు. పోలీసుల భయంతో వృద్ధురాలికి గుండెపోటు! ‘లగచర్ల’ ఘటనకు సంబంధించి పోలీసుల భయంతో డాకిడిబాయి అనే వృద్ధురాలు గుండెపోటుకు గురైంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పులిచర్లకుంటతండాకు చెందిన డాకిడిబాయికి గ్రామ పరిధిలో ఆరు ఎకరాల భూమి ఉంది. ఫార్మా విలేజీ భూసేకరణలో ఆ భూమి కూడా పోతోంది. ఆమె కుటుంబం ఈ ఆందోళనతోనే ఉంది. ఈ నెల 11న లగచర్లలో అధికారులపై దాడి ఘటన అనంతరం.. ఆమె కుమారులు ఇద్దరు పోలీసుల భయంతో ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో పోలీసులు తరచూ ఆమె ఇంటికి వెళ్లి.. కుమారుల జాడ చెప్పాలంటూ ఒత్తిడి చేశారని, శుక్రవారం కూడా వచ్చి గట్టిగా బెదిరించారని స్థానికులు చెప్తున్నారు. ఈ భయాందోళనతో డాకిడిబాయి గుండెపోటుకు గురైందని పేర్కొంటున్నారు. తిండికి తిప్పలు వచ్చాయి ఇంట్లో బియ్యం, కారంపొడి తప్ప ఏమీ లేవు. కూరగాయలు అమ్మేందుకు సైతం తండాల్లోకి ఎవరూ రావడం లేదు. తిండికి తిప్పలొచ్చాయి. మాకున్న ఐదెకరాల భూమి ఫార్మా విలేజీలో పోతోంది. భూమి లేకపోతే ఏం చేసి బతకాలి. – సోనిబాయి, రోటిబండతండాపోలీసులమని బెదిరించి మేకలు ఎత్తుకెళ్లారుఅధికారులపై దాడి చేసిన వారి కోసం తండాలకు పోలీసులు తరచూ వస్తున్నారు. వారిలో కొందరు యూనిఫామ్‌లో ఉంటే.. మరికొందరు మామూలు డ్రెస్‌లలో ఉంటున్నారు. వచ్చినవారు ఎవరో తెలియడం లేదు. కొందరు దొంగలు పోలీసులమని బెదిరించి రెండు మేకలు ఎత్తుకెళ్లారు. తండాల్లో మగవాళ్లు ఎవరూ ఉండటం లేదని ఇలా చేస్తున్నారు. మాకు రక్షణ ఏది? – అంబిక, రోటిబండతండా -
బెదిరింపులు.. చిత్రహింసలు
విశాఖ సిటీ: పోలీసులు మారుమూల గిరిజనులు రేషన్, ఆధార్ కార్డులు తీసుకుని స్టేషన్లకు రావా లని వేధిస్తున్నారనీ, స్టేషన్లకు వచ్చిన వారిని ఇన్‌ఫార్మర్లగా పనిచేయాలని ఒత్తిడి తెస్తున్నారని సీపీఐ మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి గోపి ఆరోపించారు. ఈమేరకు బుధవారం ఐదు పేజీల సుదీర్ఘ లేఖను గాలికొండ ఏరియా కమిటీ ఈస్ట్ డివిజన్ పేరుతో విడుదల చేశారు. దేశంలో ఆపరేషన్ హంట్ మూడో దశలో భాగంగా 2017 నుంచి సమాధాన్ అనే దానిని రూపొందించి మన్యంలో పోలీసులు గిరిజనులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని లేఖలో విమర్శించారు. దీనికి అధికార పార్టీ నేతలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.గతంలో పట్టుకుని అరెస్టు చేసిన వారిని, లొంగిపోయిన వారిని కూడా తిరిగి తీసుకెళ్తున్నారన్నారనీ.. సీలేరు ఎస్ఐ విభూషణరావు, కొయ్యూ రు, మంప, గూడెం ఎస్ఐలు, సీఐలు ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారన్నారని వ్యాఖ్యానిం చారు. దేవరాపల్లి పంచాయతీ నక్కబందకు చెందిన పాంగి లక్ష్మణరావును íఫిబ్రవరిలో పట్టుకుని 30 రోజులు నిర్బంధించి తరువాత లొంగుబాటు చూపించారన్నారు. గాలికొండ పంచాయతీ పప్పుకూడకు చెందిన పాంగి కామేశ్‌ను వారం రోజులపాటు నిర్బంధించి ఆ తరువాత లొంగుబాటు చూపించారన్నారు. ఎం.భీమవరం పంచా యతీ పుట్టకోటకు చెందిన జర్త భానుప్రసాద్ (నవీర్)ను 2017లో పట్టుకుని నెల తరువాత లొంగుబాటు చూపించారన్నారని లేఖలో పేర్కొన్నారు. పదే పదే స్టేషన్లకు రావాలని సీలేరు, మంప, గూడెం, కొయ్యూరు పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని గోపీ వ్యాఖ్యానించారు. కిందటి నెలలో నక్కబంద గ్రామంపై దాడి చేసి లక్ష్మణ రావును, సెప్టెంబర్ 26న పుట్టకోటకు చెందిన భానుప్రసాద్‌ను, పాంగి కామేశ్‌ను మరోసారి అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చెయ్య డం అమానుషమన్నారు. 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు కొత్త ఆర్థిక విధానాలకు శ్రీకారం చుట్టినా ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్(ఐఎంఎఫ్)లో రూ.వేల కోట్ల రుణాలు తీసుకుని రూపాయి మారకపు విలువను తగ్గించడంతో పతనం ప్రారంభమైందన్నారు. గిరిజన ఓట్లతో గెలిచి వారికే వెన్నుపోటు పొడుస్తున్న పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరితోపాటు మణికుమారి, బొర్రా నాగరాజు, ఎం.వి.వి.ఎస్ ప్రసాద్, ముక్కల మహేశ్, వెంగలయ్య, బేతా ళుడు, నాజర్‌వల్లి, కొర్రా బలరాం, లోకులగాంధీ లాంటి వారు పదవులు కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. వారెవరూ ఆదివాసీలపై పోలీసులు చేస్తున్న దాడులపై మాట్లాడడం లేదన్నారు. పోలీసు దాడులను ఆపకుంటే ప్రజల చేతిలో టీడీపీ, బీజేపీ నేతలు ఆగ్రహానికి గురికాక తప్పదని గోపి హెచ్చరించారు. -
మూఢనమ్మకాలెక్కువ..
గిరిజనులను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తాం.. వారికి అన్ని సదుపాయాలు, సంక్షేమ పథకాలు అందిస్తాం.. ఈ మాటలు అధికారులు, పాలకులు ఎప్పటికప్పుడు వల్లెవేస్తూనే ఉంటారు. కాని వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గిరిజన ప్రాంతంలో వైద్యం, అంగన్వాడీ సేవలు అంతంతమాత్రమే. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందడం లేదు. అలాగే వైద్యసేవల తీరు కూడా అంతే. వీటన్నింటికీ తోడు మూఢనమ్మకాల ప్రభావం గిరిపుత్రులపై ఎక్కువగా ఉంటోంది. గర్భిణికి పురిటినొప్పులు వస్తే క్షుద్రపూజలు చేయించి పసర మందు తాగించింది ఓ గిరిజన కుటుంబం. అలాగే మరోచోట పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని చూసి దెయ్యం పట్టిందని ఆమె దగ్గరకే వెళ్లలేదు ఆ కుటుంబ సభ్యులు. ఇలాంటి సంఘటనలు మన్యంలో కోకొల్లలు. మరి వీరిని చైతన్యపరచాల్సిన అధికారుల జాడెక్కడ..? అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటున్న పాలకులేరీ...? ఇలాంటి ప్రశ్నలెన్నో ఉత్పన్నమవుతున్నా సమాధానాలు దొరక్కుండానే మిగిలిపోతున్నాయి. సాలూరురూరల్: మైదాన ప్రాంతాలతో పోలిస్తే గిరిశిఖర గ్రామాల్లో మాతా,శిశుమరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అమాయక గిరిజనులకు వైద్యంపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం.. గ్రామాలకు రహదారి సౌకర్యం అంతంతమాత్రమే కావడం.. మూఢనమ్మకాలను విశ్వసించడం, తదితర కారణాల వల్ల మన్యంలో మరణాలు సంభవిస్తున్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల సేవలు మన్యంలో అంతంతమాత్రంగా ఉన్నాయి. గిరిశిఖర గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల సేవలు పూర్తిగా కనుమరుగయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే వైద్యసేవలు కూడా సరిగ్గా అందుతున్న దాఖలాలు లేవు. మరోవైపు గిరిజనులు మూఢనమ్మకాలను విశ్వసించడం వల్ల సకాలంలో ఆస్పత్రులను ఆశ్రయించక ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. పౌష్టికాహారం లోపం, వైద్యం అందకపోవడం, తదితర కారణాల వల్ల మన్యంలో ఎంతోమంది మృత్యువాత పడుతున్నా అధికారుల్లో చలనం రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూఢనమ్మకాలెక్కువ.. ఏజెన్సీలో పలు మరణాలకు ముఖ్యంగా మూఢనమ్మకాలే కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు 16న సాలూరు మండలం సారిక పంచాయతీ మిర్తిగుడ్డివలస గ్రామానికి చెందిన గర్భిణి మువ్వల శారదకు నొప్పులు రాగా, కుటుంబ సభ్యులు క్షుద్ర గురువును ఆశ్రయించారు. ఆయన సూచనల మేరకు పురిటినొప్పులతో బాధపడుతున్న శారదతో పూజలు చేయించి పసర మందు తాగించారు. దీంతో ఆమె పరిస్థితి మరింత విషమించింది. అలాగే ఈ ఏడాది జనవరి 28న పాచిపెంట మండలంలోని ఆజూరు పంచాయతీ చాకిరేవువలసకు చెందిన అంగన్వాడీ టీచర్ బడ్నాన పార్వతి ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లీబిడ్డలిద్దరూ మరణించారు. అయితే ఈమె ప్రసవ నొప్పులతో తల్లడిల్లుతుంటే పలువురు గ్రామస్తులు ఆమెకు దెయ్యం పట్టిందని భావించి ఎవ్వరు చాలా సమయం దగ్గరకు చేరలేదు. చివరకు ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చి రక్తపుమడుగులో మృతిచెందింది.బిడ్డ కూడా కన్నుమూశాడు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. గిరిజన గ్రామాల్లో వెలుగు చూడని ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి గిరిజన గ్రామాల్లో వైద్య, అంగన్వాడీ సేవలు మెరుగ్గా అందించడంతో పాటు మూఢనమ్మకాలు విడనాడేలా చైతన్యపరచాలని పలువురు కోరుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ ఏడాది సెప్టెంబర్ 17న సాలూరు మండలం మిర్తిగుడ్డివలసకు చెందిన గర్భిణి మువ్వల శారద (20) జిల్లా కేంద్రంలోని ఘోషాస్పత్రిలో మృతి చెందింది. సకాలంలో వైద్యం అందకపోవడం.. పౌష్టికాహారలోపం వల్ల ఆమె మృత్యువాత పడినట్లు సమాచారం. ► ఈ ఏడాది జూలై 29న సాలూరు మండలంలోని గిరిశిఖర కొదమ పంచాయతీ సిరివర గ్రామానికి చెందిన కొండతామర గిందెకు పురిటినొప్పులు వచ్చాయి. మూడో కాన్పు కావడంతో పాటు నెలలు నిండకపోవడంతో పుట్టిన వెంటనే మగబిడ్డ కన్నుమూశాడు. ఈక్రమంలో గిందెకు తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే భర్త డుంబ్రీ, స్థానికులు డోలి ద్వారా సుమారు 12 కిలోమీటర్లు కొండమార్గం గుండా నడుచుకుంటూ దుగ్గేరు ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యాధికారుల సూచనల మేరకు అక్కడ నుంచి 108లో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా గిందె కోలుకుంది. ► ఈ ఏడాది జనవరి 28న పాచిపెంట మండలంలోని ఆజూరు పంచాయతీ చాకిరేవువలస గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త బడ్నాన పార్వతి (24) ఓ మగబిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది. పుట్టిన బిడ్డ కూడా కొద్ది క్షణాల్లోనే మృతి చెందాడు. పౌష్టికాహారం లోపం వల్లే మరణాలు సంభవించినట్లు సమాచారం. ► 2017 జూలై 24న సాలూరు మండలం బాగువలస గ్రామానికి చెందిన చిన్నమ్మలు సాలూరు సీహెచ్‌సీలో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం రక్తస్రావం కావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆమెను విజయనగరం ఘోషా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రభుత్వ అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఆక్సిజన్ సదుపాయం లేకపోవడంతో చిన్నమ్మలు మార్గమధ్యలోనే కన్నుమూసింది. ► 2017 జూలై 24న కురుపాం మండలం దండుసూర గ్రామానికి చెందిన తోయక అనసూయ సకాలంలో వైద్యం అందక ఓ బిడ్డకు జన్మనిచ్చి, తానూ మృత్యు ఒడిలోకి జారుకుంది. ► గర్భిణి పాలక రమణమ్మకు పురిటినొప్పులు రావడంతో గ్రామస్తులు డోలీ సహాయంతో మైదాన ప్రాంతానికి తీసుకువచ్చి ఓ ప్రైవేట్ వాహనంలో సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చినా బిడ్డ పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరానికి తరలించగా అక్కడ బిడ్డ మృతి చెందాడు. దీంతో ఆ తల్లికి గర్భశోకం మిగిలింది. -
ఆదివాసీల ఆగ్రహం...‘పోలవరం’పై గరంగరం
వీఆర్‌పురం, న్యూస్‌లైన్: ఆదివాసీలను జలసమాధి చేసే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ పోచవరం బోట్పాయింట్ వద్ద ఆదివాసీలు శనివారం ఆందోళన నిర్వహించారు. పాపికొండల పర్యాటక లాంచీలను నిలిపివేశారు. ఆదివాసీ కొండరెడ్ల సంఘం ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ఆందోళన సుమారు మూడు గంటల పాటు కొనసాగింది. సుదూరప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మూడు గంటల తర్వాత ఆందోళన విరమించి అనుమతించారు. పోలవరం నిర్మాణం వల్ల గిరిజన సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతాయని, కొండరెడ్ల జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయని సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ముర్ల రమేశ్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకులు సున్నం వెంకటరమణ వాపోయారు. పోలవరం పేరుతో ఆదివాసీలను ముంచేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పూనుకుంటున్నాయన్నారు. పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఎటువంటి ప్రాణత్యాగానికైనా సిద్ధమని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడానికే ఆదివాసీలను పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. పాపికొండల పర్యటనను శనివారం అడ్డుకుంటామని ముందుగానే ప్రకటించినప్పటికీ బోట్ నిర్వాహకులు పెడచెవిన పెట్టి పర్యాటకులకు టికెట్లు విక్రయించారని అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆందోళన విరమించి అనుమతించామన్నారు. ఈ కార్యక్రమంలో ముర్ల కనకారెడ్డి, సోడి రామకృష్ణ, వేట్ల ముత్యాలరెడ్డి, మంగిరెడ్డి , సర్పంచ్ కథల వెంక టలక్ష్మి, వాళ్ళ లచ్చిరెడ్డి, రమేష్‌బాబు, జంజర్ల రమేష్, ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.