గిరిజనులను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తాం.. వారికి అన్ని సదుపాయాలు, సంక్షేమ పథకాలు అందిస్తాం.. ఈ మాటలు అధికారులు, పాలకులు ఎప్పటికప్పుడు వల్లెవేస్తూనే ఉంటారు. కాని వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గిరిజన ప్రాంతంలో వైద్యం, అంగన్‌వాడీ సేవలు అంతంతమాత్రమే. దీంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందడం లేదు. అలాగే వైద్యసేవల తీరు కూడా అంతే. వీటన్నింటికీ తోడు మూఢనమ్మకాల ప్రభావం గిరిపుత్రులపై ఎక్కువగా ఉంటోంది. గర్భిణికి పురిటినొప్పులు వస్తే క్షుద్రపూజలు చేయించి పసర మందు తాగించింది ఓ గిరిజన కుటుంబం. అలాగే మరోచోట పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని చూసి దెయ్యం పట్టిందని ఆమె దగ్గరకే వెళ్లలేదు ఆ కుటుంబ సభ్యులు. ఇలాంటి సంఘటనలు మన్యంలో కోకొల్లలు. మరి వీరిని చైతన్యపరచాల్సిన అధికారుల జాడెక్కడ..? అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటున్న పాలకులేరీ...? ఇలాంటి ప్రశ్నలెన్నో ఉత్పన్నమవుతున్నా సమాధానాలు దొరక్కుండానే మిగిలిపోతున్నాయి.
సాలూరురూరల్: మైదాన ప్రాంతాలతో పోలిస్తే గిరిశిఖర గ్రామాల్లో మాతా,శిశుమరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అమాయక గిరిజనులకు వైద్యంపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం.. గ్రామాలకు రహదారి సౌకర్యం అంతంతమాత్రమే కావడం.. మూఢనమ్మకాలను విశ్వసించడం, తదితర కారణాల వల్ల మన్యంలో మరణాలు సంభవిస్తున్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల సేవలు మన్యంలో అంతంతమాత్రంగా ఉన్నాయి. గిరిశిఖర గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల సేవలు పూర్తిగా కనుమరుగయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే వైద్యసేవలు కూడా సరిగ్గా అందుతున్న దాఖలాలు లేవు. మరోవైపు గిరిజనులు మూఢనమ్మకాలను విశ్వసించడం వల్ల సకాలంలో ఆస్పత్రులను ఆశ్రయించక ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. పౌష్టికాహారం లోపం, వైద్యం అందకపోవడం, తదితర కారణాల వల్ల మన్యంలో ఎంతోమంది మృత్యువాత పడుతున్నా అధికారుల్లో చలనం రావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మూఢనమ్మకాలెక్కువ..
ఏజెన్సీలో పలు మరణాలకు ముఖ్యంగా మూఢనమ్మకాలే కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు 16న సాలూరు మండలం సారిక పంచాయతీ మిర్తిగుడ్డివలస గ్రామానికి చెందిన గర్భిణి మువ్వల శారదకు నొప్పులు రాగా, కుటుంబ సభ్యులు క్షుద్ర గురువును ఆశ్రయించారు. ఆయన సూచనల మేరకు పురిటినొప్పులతో బాధపడుతున్న శారదతో పూజలు చేయించి పసర మందు తాగించారు. దీంతో ఆమె పరిస్థితి మరింత విషమించింది. అలాగే ఈ ఏడాది జనవరి 28న పాచిపెంట మండలంలోని ఆజూరు పంచాయతీ చాకిరేవువలసకు చెందిన అంగన్‌వాడీ టీచర్ బడ్నాన పార్వతి ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లీబిడ్డలిద్దరూ మరణించారు.
అయితే ఈమె ప్రసవ నొప్పులతో తల్లడిల్లుతుంటే పలువురు గ్రామస్తులు ఆమెకు దెయ్యం పట్టిందని భావించి ఎవ్వరు చాలా సమయం దగ్గరకు చేరలేదు. చివరకు ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చి రక్తపుమడుగులో మృతిచెందింది.బిడ్డ కూడా కన్నుమూశాడు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. గిరిజన గ్రామాల్లో వెలుగు చూడని ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి గిరిజన గ్రామాల్లో వైద్య, అంగన్‌వాడీ సేవలు మెరుగ్గా అందించడంతో పాటు మూఢనమ్మకాలు విడనాడేలా చైతన్యపరచాలని పలువురు కోరుతున్నారు.
ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు
ఈ ఏడాది సెప్టెంబర్ 17న సాలూరు మండలం మిర్తిగుడ్డివలసకు చెందిన గర్భిణి మువ్వల శారద (20) జిల్లా కేంద్రంలోని ఘోషాస్పత్రిలో మృతి చెందింది. సకాలంలో వైద్యం అందకపోవడం.. పౌష్టికాహారలోపం వల్ల ఆమె మృత్యువాత పడినట్లు సమాచారం.
► ఈ ఏడాది జూలై 29న సాలూరు మండలంలోని గిరిశిఖర కొదమ పంచాయతీ సిరివర గ్రామానికి చెందిన కొండతామర గిందెకు పురిటినొప్పులు వచ్చాయి. మూడో కాన్పు కావడంతో పాటు నెలలు నిండకపోవడంతో పుట్టిన వెంటనే మగబిడ్డ కన్నుమూశాడు. ఈక్రమంలో గిందెకు తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే భర్త డుంబ్రీ, స్థానికులు డోలి ద్వారా సుమారు 12 కిలోమీటర్లు కొండమార్గం గుండా నడుచుకుంటూ దుగ్గేరు ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యాధికారుల సూచనల మేరకు అక్కడ నుంచి 108లో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా గిందె కోలుకుంది.
► ఈ ఏడాది జనవరి 28న పాచిపెంట మండలంలోని ఆజూరు పంచాయతీ చాకిరేవువలస గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త బడ్నాన పార్వతి (24) ఓ మగబిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది. పుట్టిన బిడ్డ కూడా కొద్ది క్షణాల్లోనే మృతి చెందాడు. పౌష్టికాహారం లోపం వల్లే మరణాలు సంభవించినట్లు సమాచారం.
► 2017 జూలై 24న సాలూరు మండలం బాగువలస గ్రామానికి చెందిన చిన్నమ్మలు సాలూరు సీహెచ్‌సీలో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం రక్తస్రావం కావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆమెను విజయనగరం ఘోషా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రభుత్వ అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఆక్సిజన్ సదుపాయం లేకపోవడంతో చిన్నమ్మలు మార్గమధ్యలోనే కన్నుమూసింది.
► 2017 జూలై 24న కురుపాం మండలం దండుసూర గ్రామానికి చెందిన తోయక అనసూయ సకాలంలో వైద్యం అందక ఓ బిడ్డకు జన్మనిచ్చి, తానూ మృత్యు ఒడిలోకి జారుకుంది.
► గర్భిణి పాలక రమణమ్మకు పురిటినొప్పులు రావడంతో గ్రామస్తులు డోలీ సహాయంతో మైదాన ప్రాంతానికి తీసుకువచ్చి ఓ ప్రైవేట్ వాహనంలో సాలూరు సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చినా బిడ్డ పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరానికి తరలించగా అక్కడ బిడ్డ మృతి చెందాడు. దీంతో ఆ తల్లికి గర్భశోకం మిగిలింది.
Comments
Please login to add a commentAdd a comment