వీఆర్‌పురం, న్యూస్‌లైన్: ఆదివాసీలను జలసమాధి చేసే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ పోచవరం బోట్‌పాయింట్ వద్ద ఆదివాసీలు శనివారం ఆందోళన నిర్వహించారు. పాపికొండల పర్యాటక లాంచీలను నిలిపివేశారు. ఆదివాసీ కొండరెడ్ల సంఘం ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ఆందోళన సుమారు మూడు గంటల పాటు కొనసాగింది. సుదూరప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మూడు గంటల తర్వాత ఆందోళన విరమించి అనుమతించారు.
పోలవరం నిర్మాణం వల్ల గిరిజన సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతాయని, కొండరెడ్ల జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయని సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ముర్ల రమేశ్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకులు సున్నం వెంకటరమణ వాపోయారు. పోలవరం పేరుతో ఆదివాసీలను ముంచేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పూనుకుంటున్నాయన్నారు.
పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ఎటువంటి ప్రాణత్యాగానికైనా సిద్ధమని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడానికే ఆదివాసీలను పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. పాపికొండల పర్యటనను శనివారం అడ్డుకుంటామని ముందుగానే ప్రకటించినప్పటికీ బోట్ నిర్వాహకులు పెడచెవిన పెట్టి పర్యాటకులకు టికెట్లు విక్రయించారని అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆందోళన విరమించి అనుమతించామన్నారు. ఈ కార్యక్రమంలో ముర్ల కనకారెడ్డి, సోడి రామకృష్ణ, వేట్ల ముత్యాలరెడ్డి, మంగిరెడ్డి , సర్పంచ్ కథల వెంక టలక్ష్మి, వాళ్ళ లచ్చిరెడ్డి, రమేష్‌బాబు, జంజర్ల రమేష్, ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆదివాసీల ఆగ్రహం...‘పోలవరం’పై గరంగరం
Published Sun, Feb 16 2014 2:07 AM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM
Advertisement
Advertisement