ఎగువ రాష్ట్రాలకు అదనపు కేటాయింపులు వద్దు
ప్రభుత్వానికి రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ హనుమంతరావు సూచన
ఈ అంశంపైనే మన వాదనలు ఉండాలి
కర్ణాటక, మహారాష్ట్ర 254 టీఎంసీలు వాడితే కిందకు చుక్కనీరు రాదు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో అదనపు నీటి కేటాయింపులు చేయాలని కోరడం కంటే.. ఎగువ రాష్ట్రాలకు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చేసిన అదనపు కేటాయింపులను రద్దు చేయాలన్నదే ప్రధానాం శంగా తెలంగాణ, ఏపీ పోరాడాలని సాగునీటి రంగ నిపుణుడు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు సూచించారు. తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు పెంచినా ఎగువ నుంచి నీరు రాకుంటే చేసేదేమీ ఉండదన్నారు.
కృష్ణా జలాల వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితమంటూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పిచ్చిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘బ్రిజేశ్ ట్రిబ్యునల్.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులకు అదనంగా 65 శాతం డిపెండబులిటీ ఆధారంగా కర్ణాటక, మహా రాష్ట్రలకు 254 టీఎంసీల అదనపు జలాలు కేటాయించింది. నీరంతా ఎగువ రాష్ట్రాల నుంచే వస్తుంది కాబట్టి వారికి కేటాయించినవన్నీ నికర జలాలే అవుతాయి.
ఈ నీటిని సైతం ఎగువ రాష్ట్రాలు మొదలెడితే కిందికి చుక్క రాదు. ఉమ్మడి ఏపీకి సైతం అదనంగా 190 టీఎంసీల అదనపు జలాలిచ్చినా పై నుంచి రాకుంటే ఆ జలాలన్నీ కాగితాలకే పరిమితమవుతాయి’’ అన్నారు. నిజానికి ఎగువ రాష్ట్రాల నుంచి దిగువకు 447 టీఎం సీల నీరు రావాలి. ప్రస్తుతం మంచి వర్షాలు కురిసినా 250 టీఎంసీలకు మించి రాలేద న్నారు. బ్రిజేశ్ తీర్పు అమల్లోకి వచ్చి ఎగువ రాష్ట్రాలు 254 టీఎంసీల వాడకం మొదలు పెడితే చుక్క నీరు కిందకు రాదన్నారు.