అన్నీ పరిశీలించే నీటి కేటాయింపులు!
► సాగర్ కింద కేటాయింపులపై తెలంగాణకు స్పష్టం చేస్తూ కృష్ణా బోర్డు లేఖ
► ఆంధ్రప్రదేశ్‌కు నీరు విడుదల చేయాలని హితవు
► సరఫరా నష్టాలను వారి వాటాకు జత చేస్తామని వెల్లడి
► శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో ఎండీడీఎల్ దిగువకు వెళ్లి నీటిని పంచిన అంశంపై వివరణ
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఉన్న నీటి లభ్యత వాస్తవ పరిస్థితులు, సరఫరా నష్టాల (సప్లై లాస్)ను దృష్టిలో పెట్టుకుంటూనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేశామని కృష్ణానదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది. ఈ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని తక్షణమే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణను ఆదేశించింది. ఈ మేరకు బుధవారం కృష్ణా బోర్డు చీఫ్ ఇంజనీర్ వీకే నాగ్‌పురే తెలంగాణ రాష్ట్రానికి లేఖ రాశారు. ఈ లేఖ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సాగర్ నుంచి ఏపీకి కుడి కాల్వద్వారా నీటి విడుదల మొదలు పెట్టింది. సాగర్ నుంచి నీటి విడుదలకు సంబంధించి ఏపీ, తెలంగాణల మధ్య మంగళవారం వివాదం రేగిన విషయం తెలిసిందే. ఈ వివాదాన్ని ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు కృష్ణానదీ యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందిస్తూ బోర్డు సీఈ తెలంగాణకు లేఖ రాశారు.
ఎండీడీఎల్ కింద సైతం నీటి పంపిణీ..
సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలో కనీస నీటి మట్టాలు (ఎండీడీఎల్)కు ఎగువన, దిగువన ఉన్న నీటిని పంచుతూ గత నెల 8న చేసిన నిర్ణయాలను బోర్డు తన లేఖలో ప్రస్తావించింది. ‘శ్రీశైలంలో 834 అడుగులు, సాగర్‌లో 510 అడుగుల కనీస నీటి మట్టాలకు ఎగువన 34 టీఎంసీల మేర నీరు ఉంది. అందులో 18.5 టీఎంసీలు ఏపీకి, 15.5 టీఎంసీలు తెలంగాణకు పంచాం. ఇదే సమయంలో ఇరు రాష్ట్రాల తాగు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో 785 అడుగుల దిగువకు, సాగర్‌లో 503 అడుగుల దిగువకు వెళ్లి నీటిని తీసుకోవాలని బోర్డు సమక్షంలో నిర్ణయం జరిగింది. ఎండీడీఎల్ దిగువన మరో 44 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది.
దీంతో మొత్తంగా 78 టీఎంసీల నీటి లభ్యత ఉండగా, ఇందులో 47 టీఎంసీలు ఏపీకి, 31 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఈ సమయంలోనే సాగర్‌లో వాస్తవ పరిస్థితులు, సరఫరా నష్టాలను దృష్టిలో పెట్టుకుని నీటిని కేటాయించాం’ అని లేఖలో స్పష్టం చేసింది. అయితే శ్రీశైలం కింది నీటి విడుదలపై మాత్రం నీటి అవసరాలు, ఆవిరి, సరఫరా నష్టాలు, తాగు నీటి అవసరాలు పేర్కొంటూ ఇండెంట్ ఇస్తే దానికి అనుగుణంగా నీటిని కేటాయిస్తామని వెల్లడించింది.
ఇదే సమయంలో ఏపీ రాసిన లేఖను ప్రస్తావించింది. సాగర్‌కింద ఏపీకి 17 టీఎంసీలు కేటాయించినా, తెలంగాణ 13.89 టీఎంసీలు మాత్రమే విడుదల చేసిందని, తమకు సమాచారం లేకుండానే నీటి విడుదల నిలిపివేసిందనే విషయాన్ని ఏపీ తన దృష్టికి తెచ్చిన అంశాన్ని వెల్లడించింది. ఏపీ వినతిపై స్పందించిన బోర్డు వారికి కేటాయించిన మేర నీటిని విడుదల చేయాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. ఆవిరి నష్టాలుగా చూపుతున్న లెక్కలను ఏపీ వాటాల్లో జత చేస్తామని స్పష్టం చేసింది.
శ్రీశైలం నుంచి 10 టీఎంసీల విడుదల కోరనున్న తెలంగాణ..
సాగర్‌లో నీటి లభ్యత కనిష్ట నీటి మట్టాలకు చేరుతున్న దృష్ట్యా శ్రీశైలం నుంచి కనిష్టంగా 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్రం కోరనుంది. నాగార్జున సాగర్‌లో కనీస నీటిమట్టం 510 అడుగులు కొనసాగా లంటే ఈ నీటి విడుదల ఎంతైనా అవసరమని తెలంగాణ అంటోంది.