రైతన్నల వర్రీ
అనంతపురం టౌన్ : వర్షాభావ పరిస్థితులు, నీటి కేటాయింపుల్లో కోత నేపథ్యంలో తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఆయకట్టు కింద వరి సాగును తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను సమాయత్తం చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే..చాలామంది రైతులు మాత్రం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. హెచ్చెల్సీ కింద 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. జిల్లాలో ప్రతియేటా లక్ష ఎకరాల వరకు సాగునీరు అందించేవారు. కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల ఆయకట్టును భారీగా కుదిస్తున్నారు.
ఈ ఏడాది ఆరు వేల హెక్టార్లలో వరి, 74 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగు నీరు అందించాలని నిర్ణయించారు. రెండు, మూడేళ్ల నుంచి హైలెవల్ మెయిన్ కెనాల్ (హెచ్‌ఎల్‌ఎంసీ), గుంతకల్లు బ్రాంచి కెనాల్ (జీబీసీ), పీఏబీఆర్ సౌత్ కెనాల్, నార్త్ కెనాల్, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్(టీబీసీ), మైలవరం బ్రాంచ్ కెనాల్, పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) కింద 60-80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ ఏడాది మాత్రం నీటి కేటాయింపులు ఆశాజనకంగా ఉండవంటూ వరిని పూర్తిగా తగ్గించాలని నిర్ణయించారు.
ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న, కూరగాయలు, పొద్దుతిరుగుడు, వేరుశనగ లాంటి పంటలను సిఫారసు చేస్తున్నారు. రైతులు మాత్రం హెచ్చెల్సీ ఆయకట్టులో ఎక్కువ శాతం భూములు వరి మినహా వేరే పంటలకు పనికిరావని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా హెచ్‌ఎల్‌ఎంసీ కింద 20 నుంచి 25 వేల ఎకరాలలో వరి మాత్రమే వేస్తారు. అనధికారికంగా మరో 5 -8 వేల ఎకరాల వరకూ సాగు చే స్తారు. దీంతో పాటు హెచ్‌ఎల్‌సీ సౌత్, నార్త్ కెనాల్ కింద మెజార్టీ రైతులు వరినే నమ్ముకుంటున్నారు. దీంతో అధికారులు నిర్ణయించిన విస్తీర్ణానికి మించి సాగులోకి వచ్చే అవకాశముంది.
గతేడాది కంటే విపత్కర పరిస్థితులు
జిల్లాకు సాగు, తాగునీటి విషయానికొస్తే గతేడాది కంటే ఈసారి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతేడాది హెచ్చెల్సీకి తొలుత 22 టీఎంసీలు కేటాయించినా దామాషా ప్రకారం చివరకు 19 టీఎంసీలు వచ్చాయి. దీంతో పాటు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విడుదల చేసిన జీవో ప్రకారం కేసీ కెనాల్ వాటా 10 టీఎంసీలలో రివర్ష్ డైవర్షన్ పద్ధతిపై దామాషా ప్రకారం నాలుగు టీఎంసీలను పీఏబీఆర్‌కు ఇచ్చారు. రాష్ట్ర విభజనతో పీఏబీఆర్‌కు నీరు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ద్వారా గతేడాది ఆరు టీఎంసీలు వచ్చాయి. 1.95 టీఎంసీల సామర్థ్యమున్న జీడిపల్లి జలాశయాన్ని పూర్తిగా నింపడంతో పాటు రెండు నెలల పాటు నిరంతరాయంగా జలాశయం మరువ ద్వారా పీఏబీఆర్‌లోకి నీరు వచ్చాయి. గతేడాది పంటలకు ఇవ్వడంతో పాటు పీఏబీఆర్ కుడికాలువ కింద ఉన్న 49 చెరువుల్లోకి నీటిని తీసుకుపోయారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు తాగునీటి అవసరాలకు పీఏబీఆర్‌తో పాటు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో సమృద్ధిగా నిల్వ చేశారు. ఆ పరిస్థితి ఈ ఏడాది ఉండదని అధికారులు అంటున్నారు. మిగులు జలాలపై ఆధారపడిన హంద్రీ-నీవా ప్రాజెక్టుకు ఈ సారి నీటి విడుదల పూర్తిగా అనుమానమేనని స్పష్టం చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ నిర్ణయంతో గతేడాది శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకున్నారు. విభజన కారణంగా ఈ ఏడాది నుంచి కృష్ణా బోర్డు ఆంగీకారంతోనే హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు నీటి కేటాయింపులు ఉంటాయని వివరిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, రాష్ట్ర విభజన నేపథ్యంలో హెచ్చెల్సీ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌లకు నీటి కేటాయింపులు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని రైతులు వరి సాగు చేయకపోవడమే మంచిదని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆరుతడి పంటలే మేలు
హెచ్చెల్సీ కింద ఈ ఏడాది రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవడమే చాలా మేలు. గతేడాదితో పోలిస్తే వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ఒక్క వర్షం కూడా రాలేదు. హెచ్చెల్సీకి దామాషా ప్రకారం 22 టీఎంసీల నీటిని కేటాయించారు. చివర్లో వర్షాలు రాకపోతే కేటాయింపులు తగ్గుతాయి. కావున రైతులు వరి సాగు చేస్తే తీవ్రంగా నష్టపోతారు.
- వాణినాథ్‌రెడ్డి, ఎస్‌ఈ, హెచ్చెల్సీ