నీటి కష్టాలకు చెక్!
ఓఆర్‌ఆర్ పరిధిలోని గ్రామాలకు నీటి కేటాయింపు ఖరారు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఔటర్ రింగురోడ్డు సమీప ప్రాంతవాసులకు శుభవార్త. ఎన్నాళ్లుగానో తాగునీటి ఎద్దడితో సతమతమవుతున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వరం ప్రకటించింది. ప్రతి కుటుంబానికి కనీస నీటి కేటాయింపును ఖరారు చేసింది. దీంతో ఔటర్ రింగురోడ్డు లోపల, బయట ఉన్న 80 గ్రామాలు, 164 హాబిటేషన్లలోని ప్రజలకు త్వరలో శుద్ధమైన తాగునీరు పక్కాగా అందనుంది.
కేటాయింపులు ఇలా..
ప్రస్తుతం కృష్ణా పైపులైన్ ఉన్న గ్రామాల్లో శుద్ధ నీటిని అందిస్తున్నారు. కానీ కుటుంబానికి ప్రత్యేకించి కోటా అనేది లేకుండా ఇష్టానుసారంగా నీటిని కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబాల సంఖ్యకు.. నీటి సరఫరా కోటాకు పొంతన లేకుండాపోతోంది. దీంతో ప్రజల దాహార్తి తీరడం లేదు. ఈ క్రమంలో నీటి కోటా పెంచాలంటూ జిల్లా యంత్రాంగం పలుమార్లు ప్రభుత్వానికి నివేదించింది. దీంతో ప్రభుత్వం 80 గ్రామ పంచాయతీలు, 164 హాబిటేషన్లకు నీటి కేటాయింపు విధానంపై స్పష్టత ఇచ్చింది. గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక్కో కుటుంబానికి రోజుకు వంద లీటర్లు, మున్సిపాలీటీల్లోని ఒక్కో కుటుంబానికి 135 లీటర్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక్కో కుటుంబానికి 150 లీటర్ల చొప్పున కేటాయించింది. ఈమేరకు గురువారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ గ్రామాల్లోని 7.32లక్షల మందికి నిర్దేశించిన కోటాలో తాగునీరు అందించాల్సి ఉంది.
లబ్ధిపొందే గ్రామాలు: 80
నివాస ప్రాంతాలు : 164
గ్రామాల్లో కుటుంబానికి రోజుకు: 100 లీటర్లు
మున్సిపాలిటీల్లో: 135 లీటర్లు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో: 150 లీటర్లు